భారతదేశం అనే మహావృక్షానికి రాష్ట్రాలే వేళ్లు. వేళ్లు బలంగా ఉంటేనే వృక్షం వర్ధిల్లుతుంది. కానీ, నేడు ఆ వేళ్లకు అందాల్సిన పోషకాలను కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకుంటూ, రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని నీరుగారుస్తున్నది. దేశాభివృద్ధిలో ఇంజిన్లుగా పని చేస్తున్న రాష్ర్టాలకు బాసటగా నిలువాల్సిన కేంద్రం.. కన్నతల్లే దయ్యమైనట్టు రాష్ట్రాల వాటాను కబళించాలని చూడటం రాజ్యాంగబద్ధమైన సమాఖ్య స్ఫూర్తికే గొడ్డలిపెట్టు. ఇది కేవలం నిధుల పంపిణీకి సంబంధించిన సాంకేతిక అంశం కాదు; ప్రగతిని కాంక్షించే ప్రతి పౌరుడి ఆత్మగౌరవానికీ సంబంధించిన సమస్య.
కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ బీజేపీ ఉన్నా దక్షిణాది రాష్ట్రాల పట్ల అనుసరిస్తున్న వివక్షాపూరిత వైఖరి మాత్రం ఒక్కటే. గడిచిన ఆరు ఆర్థిక సంఘాల కాలపరిమితిని విశ్లేషిస్తే, నాలుగు పర్యాయాలు బీజేపీ ప్రాతినిధ్యం ఉంటే, మరో మూడు పర్యాయాలు కాంగ్రెస్ భాగస్వామ్యం ఉన్నది. అంటే ఢిల్లీ పీఠంపై ఏ జెండా ఉన్నా, దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మూలాలను దెబ్బతీసి, నిధులను దారి మళ్లించడంలో మాత్రం ఆ రెండు పార్టీలది ఒకే బాట. పార్టీలు మారినా, రాష్ట్రాల హక్కులను హరించి అధికారాన్ని కేంద్రంలో కుప్పబోసుకోవాలనే వారి ఆలోచనా ధోరణిలో ఏమాత్రం మార్పు లేదు.
దక్షిణాది రాష్ర్టాలు గడిచిన నాలుగు దశాబ్దాలుగా మానవాభివృద్ధి సూచికల్లో దేశానికే దిక్సూచిగా నిలిచాయి. జనాభా నియంత్రణ, అక్షరాస్యత, ఆరోగ్య రంగాల్లో ఈ రాష్ర్టాలు సాధించిన అద్భుత ప్రగతి నేడు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నది. దేశ జీడీపీలో దాదాపు 30 శాతానికి పైగా వాటాను అందిస్తూ, కేంద్ర ఖజానాకు సింహభాగం ఆదాయాన్ని సమకూరుస్తున్న ఈ రాష్ట్రాల పట్ల కేంద్రం అమానవీయమైన పద్ధతిలో వ్యవహరిస్తున్నది. 11వ ఆర్థిక సంఘం కాలంలో దక్షిణాది రాష్ర్టాల పన్నుల వాటా 21.1 శాతం. అది 15వ ఆర్థిక సంఘం నాటికి 15.8 శాతానికి పడిపోయింది. ఇటీవల 16వ ఆర్థిక సంఘం స్వల్ప సర్దుబాటు, గత దశాబ్దకాలంగా జరిగిన భారీ నష్టాన్ని ఏమాత్రం పూడ్చలేని నామమాత్రపు ఓదార్పు. రాష్ట్రాలకు ఊతమివ్వకుండా నిధుల్లో కోత కోయడం ప్రగతిశీలతకు వేస్తున్న జరిమానా తప్ప మరొకటి కాదు.
కేంద్ర ప్రభుత్వం ’సెస్సులు, సర్చార్జీల’ పేరుతో రాష్ట్రాల రాజ్యాంగబద్ధమైన వాటాను అత్యంత చాకచక్యంగా తప్పిస్తున్నది. పన్నుల ఆదాయంలో రాష్ర్టాలకు వాటా ఇవ్వాలి కానీ, సెస్సుల రూపంలో వసూలు చేసే నిధులను రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేదనే రాజ్యాంగ లొసుగును కేంద్రం అస్త్రంగా వాడుకుంటున్నది. ఫలితంగా, రాష్ర్టాలకు పంచాల్సిన నిధుల రాశి క్రమంగా కుంచించుకుపోతున్నది. ‘నానాటికి తీసికట్టు నాగంభొట్లు‘ అన్న చందంగా రాష్ర్టాల అధికారాలు, నిధులు తగ్గిపోతుంటే.. అవి కేవలం సాధారణ పరిపాలనకు మాత్రమే తప్ప, మరే గొప్ప ప్రజాహిత కార్యక్రమం చేపట్టలేని నిస్సహాయతలోకి జారిపోతున్నాయి.
కేంద్రం చేసే ఈ లోపాయికారి దోపిడీ వల్ల నిధులు లేక రాష్ట్రాలు విలవిల్లాడుతుంటే, క్షేత్రస్థాయిలో ప్రజల అసంతృప్తికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలే మొదటి లక్ష్యం (టార్గెట్)గా మారుతున్నాయి. సామాన్య ప్రజలకు ఈ సంక్లిష్ట ఆర్థిక సమీకరణాలు అర్థం కావు కనుక కేంద్రం తెలివిగా బాధ్యత నుంచి తప్పించుకుంటున్నది. జాతీయ స్థాయి ఎన్నికలు వచ్చినప్పుడు అసలైన ఆర్థిక సమస్యలు చర్చకు రాకుండా, భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రజల దృష్టిని మళ్లించి ఓట్లు కొల్లగొడుతున్నది. ప్రజల అవసరాలు తీర్చలేని నేరానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ముందు దోషులుగా నిలబడి బలి అయిపోతుంటే, ఆ నిస్సహాయతకు అసలు కారణమైన కేంద్రం మాత్రం తెరచాటున పబ్బం గడుపుకొంటున్నది.
కేంద్రం చేస్తున్న ఈ దాడి.. ఇంద్రజిత్తు మేఘాల చాటున దాగి చేసే యుద్ధంలా ఉన్నది. బాణం విడిచిన వాడు కనపడడు కానీ, ఆ బాణం రాష్ట్రాల గుండెలకు తగిలి ప్రాణం పోతున్నది. ఒక ప్రాంతం కష్టపడి సంపాదించి పెడుతున్నా, తమ న్యాయబద్ధమైన వాటాను కేంద్రం కాలరాస్తున్నదన్న భావన బలపడితే, అది దేశ సమగ్రతకు ఏమాత్రం క్షేమకరం కాదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని ఎవరూ కాదనరు, కానీ అది ప్రగతిశీల రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీస్తూ జరగకూడదు. రాష్ట్రాలు కేంద్రంపై ఆధారపడే యాచకులుగా కాకుండా, దేశ నిర్మాణంలో సమాన భాగస్వాములుగా గుర్తింపు పొందినప్పుడే నిజమైన సమాఖ్య వ్యవస్థ వర్ధిల్లుతుంది.
-వ్యాసకర్త: శాసనమండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్