బీజేపీ పరిస్థితి తెలంగాణలో యథాతథంగానే ఏమీ బాగాలేదు. కానీ మే నెల మొదటి వారంలో బెంగాల్‌ను గెలవడం ఉన్నట్టుండి కొత్త ఆశలు తెచ్చింది. వెంటనే ఇక్కడ ప్రతీవారం ఏదో కార్యక్రమంతో హడావుడి మొదలుపెట్టారు. వారి దురదృష్టవశాత్తు అంతే హడావుడిగా వరుస ఎదురుదెబ్బలు తగలసాగాయి. వాటి ఫలితంగా ఇప్పుడు వారి మొహాల్లో నిర్వేదం ఆవరించి కనిపిస్తున్నది. తెలంగాణపై ఇంకా ఆశలున్నట్టా? అంతా దైవాధీనంగా మారినట్టున్నది. అయినా ఆశలు ఉన్నట్టు నటనలు ఏవో చేస్తున్నారు.
కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వం బెంగాల్‌ను జీవన్మరణ సమస్య అన్నట్టు తీసుకున్నది. టక్కుటమార విద్యలన్నీ ప్రయోగించి ఎట్టకేలకు కబ్జా చేసింది. అంతటితో సంతృప్తి చెందక అవే విద్యలను కొనసాగించి తృణమూల్ కాంగ్రెస్‌ను ఛిన్నాభిన్నం చేసేందుకు పూనుకున్నది. అటువంటి ‘మహా విజయాలు’ తెలంగాణ బీజేపీ నాయకులకు సమరోత్సాహాన్ని తెచ్చిపెట్టాయి. ఆ పార్టీ జాతీయస్థాయి నాయకులు, కేంద్రమంత్రులు హైదరాబాద్‌కు వరుస కట్టారు. ఈ సారి తెలంగాణలో విజయం తమదేనని గతంలో ఎన్నడూ లేనంత ధీమాను ప్రదర్శించసాగారు. ఇక్కడి నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వంటి వారైతే, తెలంగాణలో గెలిచేందుకు తమ వద్ద బెంగాల్‌ను మించిన ‘పక్కా ప్రణాళికలు’ ఉన్నాయన్నారు.
ఈ చివరి మాట విని ఇతర పార్టీలకు, మామూలు ప్రజలకు కూడా కొంత ఉలికిపాటు కలిగిన మాట నిజం. ఎందుకంటే, ఒకవైపు బెంగాల్ ఎన్నికల సమయంలో జరిగిన ‘సర్’ ప్రక్రియలో లక్షలాది ఓట్లు గల్లంతు కాగా, అదే ప్రక్రియను తెలంగాణలో చేపట్టనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. బీజేపీ నాయకులు తమ వద్ద అక్కడి కన్నా ఇక్కడ ఇంకా పక్కా ప్రణాళిక ఉన్నదని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. వారు పార్టీని సవ్యమైన విధంగా శక్తిమంతం చేసుకుని అధికారం సంపాదిస్తే అందులో ఎవరూ భయపడేది ఏమీ ఉండదు. కానీ బెంగాల్‌తో పోలిక తేవటం తీవ్రమైన సందేహాలను సహజంగానే కలిగించింది.
ఆ ప్రకటనల తర్వాత, పైన చెప్పిన విధంగా హడావుడి మొదలైనప్పుడు వారు చేసిందేమిటి? ఇక్కడి ఇతర పార్టీలపై రకరకాల విమర్శలను తీవ్రం చేశారు. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పార్టీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్, సీనియర్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వంటి హేమాహేమీలు రాష్ర్టాన్ని సందర్శించారు. చేయవలసిన ఉబ్బోధనలు చేశారు. ప్రధాని అయితే, అప్పుడు హైదరాబాద్ నగరంలోనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో ప్రత్యేక సమావేశాలు జరుపగా, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో వారి ఉమ్మడి వ్యూహం ప్రస్తావనకు వచ్చిందనే ఊహాగానాలు మొదలయ్యాయి. మోదీ అంతకుముందే ఒక సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తనతో చేరవలసిందిగా బహిరంగంగా ఆహ్వానించడం కూడా ఈ సందర్భంలో చర్చకు వచ్చింది. ఎవరికీ తెలియని ఒక విశేషాన్ని చెప్పాలి. రేవంత్‌రెడ్డి కొందరితోపాటు బీజేపీలో చేరగలరని విదేశాల్లో భారత దౌత్యవర్గాలు సైతం మాట్లాడుతున్నాయి.
ఇదంతా జరిగిన వెనుక, ‘సర్’ మంత్రాంగాల మాట అట్లుంచి, తెలంగాణ నాయకత్వం పార్టీని వచ్చే ఎన్నికల సమయానికి ఏ విధంగా బలోపేతం చేయవచ్చునని గమనించిన వారికి కొన్ని అంశాలు కనిపించాయి. గత లోక్‌సభ ఎన్నికల సమయం నాటి ‘ఆపరేషన్ ఆకర్ష్’ వల్ల మంచి ఫలితాలు వచ్చినందున తిరిగి అదే వ్యూహాన్ని అనుసరించాలనే నిర్ణయం. పార్టీ శ్రేణులకు అవసరమైన దిశానిర్దేశాలు చేయడం. పరిస్థితులపై వేర్వేరు సంస్థలతో సర్వేలు. వివిధ సమస్యలపై ఉద్యమాలు చేయాలనడం వంటివి. మునుముందు ఇంకా ఏమి నిర్ణయాలు జరిగేవో తెలియదు. ఇంతవరకు బాగానే ఉన్నదిగానీ, ఈ నిర్ణయాలన్నీ స్థూలంగా పాతవే. వీటితోపాటు ఇంకా అనేకం తాము కేంద్రస్థాయి నుంచి పలుమార్లు సూచించినప్పటికీ రాష్ట్ర నాయకత్వం అమలు చేయలేకపోయిందని ఢిల్లీ నాయకులు పలుమార్లు విమర్శించారు. అయినా జరిగింది లేదు. వాజపేయి-ఆద్వానీ కాలం నుంచి ఇక్కడ ఉనికిలోకి వచ్చిన కొత్త నాయకత్వాల పరిస్థితి ఎల్లప్పుడూ ఇదే తీరున ఉన్నది. ఇప్పుడు మోదీ-షా హయాంలోనూ మారలేదు. వారి దృష్టి ఎప్పుడూ పదవులు, పైరవీలు, సంపాదనలు, గ్రూపు రాజకీయాలు, హైదరాబాద్‌లో సుఖజీవనం మాత్రమే.
పైన పేర్కొన్న దానిలో ‘ఆపరేషన్ ఆకర్ష్’ అన్నది గమనించవలసిన మాట. నిజానికి సైద్ధాంతిక బలం, కార్యకర్తల బలంపై ఆధారపడుతాయనుకునే బీజేపీ, కమ్యూనిస్టుల వంటి పార్టీలు ఆ బలాన్ని బట్టి పార్టీ నిర్మాణాలు చేసుకోవాలి తప్ప, ఇతర పార్టీల వారిని వారి వారి రంగు, రుచి, వాసనలతోపాటు ఆకర్షించి పెరుగాలనుకోవడం ఆశ్చర్యకరం, సిగ్గుచేటు కూడా అవుతుంది. అటువైపు చూస్తే కమ్యూనిస్టులు తమ వైఫల్యాలతో నానాటికీ శిథిలమవుతుండవచ్చుగాక. కానీ ఈ తరహా ఆపరేషన్లు వారి ఊహలోకైనా రావు. మంచి అయినా, చెడు అయినా వారికి సిద్ధాంతం ప్రధానం. ఇతరులతో పొత్తులు ఉండవచ్చు గాక. ఆపరేషన్ ఆకర్ష్ మాత్రం మనమెప్పుడూ వినలేదు. అటువంటి పని బీజేపీలో వాజపేయి-ఆద్వానీ తరంలోనూ అరుదుగా తప్ప జరగలేదు. అటువంటి స్థితిలో ఇప్పుడు, పార్టీ సోకాల్డ్ నిర్మాణానికి ఆపరేషన్ అన్నదే ప్రధాన సాధనంగా మారిపోయింది. ఒకసారి అధికారం చేజారడం మొదలైతే, ఈ కృత్రిమ నిర్మాణం ఎంతకాలం నిలబడేదీ ఎవరైనా ఊహించుకోవచ్చు. నేను ఒకసారి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడిని ఈ విషయం అడిగితే తను ఇచ్చిన వివరణ- పార్టీని ఒకప్పటి వలె నిర్మించే ఓపిక, శ్రమ ఇప్పుడెవరికీ లేదని. ప్రస్తుత జాతీయ నాయకత్వ సారథ్యంలో అంతా బేరసారాలేనని.
తిరిగి తెలంగాణ బీజేపీ విషయానికి వస్తే, బెంగాల్ విజయంతో ఉప్పొంగిన ఇక్కడి నాయకత్వానికి వరుసగా ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. నిజానికి అవి జాతీయ స్థాయిలో తగిలినవి కూడా. వాటిలో మొదటిది, కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించిన భూకంపం. అది దేశవ్యాప్తంగా యువతలో, వారి కుటుంబాల్లో, సమాజంలో, చివరకు స్కూలు పిల్లల్లో కూడా తెచ్చిన కదలిక. ప్రధాని మోదీ పట్ల ఉండిన భ్రమలు, తన ప్రభుత్వమంటే ఉండిన భయాలు అకస్మాత్తుగా తొలగిపోతుండటం.
వారు మొదటి నుంచి సాగించిన హిందూ-ముస్లిం విద్వేష ప్రచారాలు, ఆందోళనకారులకు వేసే ఇతరముద్రలు, ఓట్ల కోసం నడిపిన ఎత్తుగడ తప్ప అందుకు తగిన కారణాలు లేవని, సమాజానికి గానీ, దేశానికి గానీ మేలు ఏమీ లేదన్న గుర్తింపు కలుగుతుండటం. ఈ వరుసలో తాజాది, స్వాతంత్య్ర దినోత్సవం నాడు మోదీ పలికిన దిమాగీ నక్సల్ మాటను అందరూ అపహాస్యం చేస్తుండటం. బీజేపీ ఎంతగానో అధికారం కోసం ఆధారపడి రాగల కాలం కోసం కూడా ఆశలు పెట్టుకున్న యువతీ యువకుల్లోనూ ఇది స్పష్టమైన ప్రభావం చూపుతుండటం. చివరకు, మొదటి నుంచి బీజేపీ మద్దతుదారులుగా ఉండిన తాము ఇక అటు చూడబోమంటున్న పిల్లలు, పెద్దలు.
ఇవన్నీ చాలవన్నట్టు కాక్రోచ్ నాయకత్వం తాము సృష్టించిన భూకంపాన్ని మరింత తీవ్రం చేసే పనిలో పడింది. సెప్టెంబర్ నుంచి దేశమంతటా పర్యటించడం, ప్రజలు వేర్వేరు విషయాలపై ఏమంటున్నారో, ఏమి జరగాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడం, ఆ ప్రచారం భవిష్యత్తు అజెండాను రూపొందించుకోవడం ఒకటి. దేనికైనా పునాది స్కూలు విద్య గనుక, ప్రతీ గ్రామంలోని ప్రభుత్వ స్కూళ్లను సర్వేచేసి, వాటిని బాగుపరిచే బాధ్యతను అక్కడి ప్రజల సమక్షంలో గ్రామ సర్పంచ్‌కు అప్పగించడం. ఇవన్నీ గమనిస్తున్న బీజేపీ నాయకత్వానికి, జంతర్ మంతర్ తర్వాత ఆందోళన ఇంకా పెరుగుతున్నది. కాక్రోచ్‌ను నియంత్రించి అణచివేసేందుకు ప్రయత్నించని రోజంటూ నేటికీ ఉండటంలేదు. గమనించదగినదేమంటే, ప్రభుత్వం పార్టీ ఆ పని చేసినాకొద్దీ ఈ కొత్త చైతన్యాలు దేశంలో మరింతగా వ్యాపిస్తున్నాయి. ఇవే ప్రభావాలు తెలంగాణలోనూ కనిపిస్తున్నాయి. భయాల స్థానంలో ధిక్కారాలు తలెత్తుతున్నాయి.
బెంగాల్ విజయం తర్వాత కాక్రోచ్ ఆందోళన మొదటి ఎదురుదెబ్బ కాగా, రామమందిర నిధులు, వెండి, బంగారాల లూటీ దేశవ్యాప్తంగా కలిగించిన దిగ్భ్రాంతి రెండవ ఎదురుదెబ్బ అయింది. అయోధ్యలోనే గాక ఇతర ప్రముఖ దేవాలయాల్లోనూ ఇదే తంతు జరుగుతున్న వార్తలు ఆ వెంటనే వెలువడటం మొదలైంది. దీని ప్రతికూల ప్రభావాలు రెండు విధాలుగా ఉండటం విశేషం. ఒకటి వయస్కులైన సాధారణ భక్తులపై కాగా, రెండవది తిరిగి అదే యువతరంపై. పెద్దవారు ఆయా అవినీతిపరులను నిందిస్తుండగా, యువతరం కేంద్ర ప్రభుత్వ నాయకత్వాన్ని వేలెత్తి నిలదీస్తున్నది. అయోధ్య నిర్మాణాలు తదితరాల బాధ్యతనంతా నిర్వహించింది వారే గనుక. ఇప్పుడు కాక్రోచ్ ఉద్యమంతో మోదీ నాయకత్వంపై గౌరవం ఎట్లాగూ నశించింది గనుక. అందువల్లనే జంతర్‌మంతర్, జార్ఖండ్ సందర్భాల్లో, అయోధ్య చందాచోరీ అనే మాటలు, నినాదాలు, పాటలు కూడా విరివిగా వినిపించాయి. ఇవే చర్చలు తెలంగాణలోనూ వినవస్తున్నాయి.
మరొక ఎదురుదెబ్బ అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు. బిహార్‌లోని బాంకీపూర్‌లో ఘోరమైన పరాజయం సంభవించగా, తాము పాలిస్తున్న మధ్యప్రదేశ్‌లోని దాలియా స్థానాన్ని కాంగ్రెస్ నుంచి వశపరుచుకోలేకపోగా, గుజరాత్ వంటి అరివీర భయంకరమైన దుర్గంలో మంజల్పూర్ మెజారిటీ లక్ష చిల్లర నుంచి ముప్పయివేల చిల్లరకు పడిపోయింది. అన్ని చోట్లా కాక్రోచ్లు, చందాచోరీలు గణనీయమైన ప్రభావాలు చూపాయి. ఈ ఫలితాలను తెలంగాణ జాగ్రత్తగానే గమనిస్తున్నది. బీజేపీకి భవిష్యత్తుపై భయాన్ని కలిగిస్తున్నది.
చివరగా చెప్పుకోవలసింది దుష్టచతుష్టయం గురించి. బీజేపీ అదృష్టచక్రం ఈ విధంగా వెనుకకు తిరుగుతుండగా, వారికి తెలంగాణలో కూటమి మిత్రులైన చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ సరిగ్గా ఇవే రెండు నెలల కాలంలో, తామెంత తెలంగాణ వ్యతిరేకులో మరింతగా బహిర్గతమై అసహ్యానికి గురవుతుండటం. వారి తెలంగాణ ద్రోహాన్ని ఖండించకపోగా వారికి ప్రత్యక్ష, పరోక్ష మద్దతు ప్రకటిస్తున్న ఇక్కడి బీజేపీ నాయకత్వం, తెలంగాణ ప్రజల ఎదుట తమకు ఈ రాష్ట్ర ప్రయోజనాల కన్నా ఆ దుష్ట కూటమితో కలిసి అధికారం సంపాదనే ముఖ్యమని వెల్లడి చేసుకోవడం. ఇక, ఒక కాలు కాంగ్రెస్‌లో, రెండవది బీజేపీలో గల రేవంత్‌రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను బీజేపీ సైతం దాచలేని పరిస్థితి వస్తున్నది. ఇవన్నీ చూసినప్పుడు ఆ పార్టీ తెలంగాణపై ఇంకా ఆశలు పెట్టుకుంటే అది దుస్సాహసమే అవుతుంది.
టంకశాల అశోక్