ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాల అవసరం ఎంత ముఖ్యమో, ఆ చట్టాల వినియోగంలో వివేకం అంతకన్నా ముఖ్యం. ‘ప్రశ్న’ అనే యూట్యూబ్ నడిపే జర్నలిస్టు రావణ్ అలియాస్ బీ జోసెఫ్‌ను ఇటీవల ఏపీ పోలీసులు యూఏపీఏ (అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) కింద అరెస్టు చేయడం మౌలిక ప్రశ్నను ముందుకు తెచ్చింది. అసలు ప్రశ్న ఏమిటంటే.. తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు రూపొందించిన చట్టాన్ని వ్యాఖ్యలు చేసిన వారిపై ప్రయోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి సరైందేనా?
రావణ్ వ్యాఖ్యల్లో పాలకులకు అభ్యంతరకమైనవి ఉండొచ్చు. కానీ వాటిని ఎదుర్కొనేందుకు భారతీయ న్యాయవ్యవస్థలో ఇప్పటికే అనేక చట్టాలు ఉన్నాయి. అలాంటప్పుడు నేరుగా యూఏపీఏ వంటి చట్టాన్ని ఆశ్రయించడం సహజంగానే ఆందోళన కలిగిస్తున్నది. చట్టాల ప్రయోగం నేర తీవ్రతకు అనుగుణంగా తులనాత్మకంగా ఉండనవసరం లేదా? అనేదే అసలు ప్రశ్న. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత కేంద్ర ప్రభుత్వం యూఏపీఏను మరింత కఠినతరం చేసింది. దేశ భద్రత కోసం అవసరమని చెప్పింది. చట్టం ఎంత కఠినమో, దాని వినియోగం అంత జాగ్రత్తగా ఉండాలి. లేనిపక్షంలో అది ఉగ్రవాదులను మాత్రమే కాదు, పాలక పక్షంతో విభేదించే స్వరాలను కూడా లక్ష్యంగా చేసుకొనే ప్రమాదం ఉంటుంది. 2014 తర్వాత యూఏపీఏ వినియోగంపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ ప్రారంభమైంది. ఎంతోమంది విద్యార్థి నేతలు, రచయితలు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, సామాజిక ఉద్యమకారులపై కూడా ఈ చట్టాన్ని ప్రయోగించారు. కోర్టు తీర్పు ఇవ్వకముందే ఏండ్ల తరబడి స్వేచ్ఛను హరించడం న్యాయమా? చివరకు నిర్దోషిగా బయటకు వచ్చిన వారికి కోల్పోయిన జీవితకాలాన్ని ఎవరు ఇవ్వగలరు?
భారతీయ సమాజంలో జరిగిన ప్రతి ప్రధాన సంస్కరణ వెనుక ప్రశ్నించిన తర్కం ఉన్నది. ఒక ఆలోచనను సమర్థించే హక్కు ఎంత ముఖ్యమో, దానిని విమర్శించే హక్కు కూడా అంతే ముఖ్యం. ప్రజాస్వామ్యం బలం ఒక అభిప్రాయాన్ని రక్షించడంలో కాదు; పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలకు ఒకే వేదికపై చోటుకల్పించడంలో ఉన్నది. సంస్కరణల చరిత్రను పరిశీలిస్తే, సమాజాన్ని ప్రశ్నించిన మహనీయులు వ్యక్తిగత దూషణలను, కుల-మత విద్వేషాలను, అసభ్య పదజాలాన్ని ఆశ్రయించలేదనే వాస్తవం కనబడుతుంది. తమ వాదనలు, ఆలోచనలు, తర్కంతో మాత్రమే సమాజాన్ని వారు ప్రభావితం చేశారు. అందువల్ల భావ ప్రకటన స్వేచ్ఛను సమర్థించడమంటే అసభ్యతను సమర్థించడం కాదు. విమర్శను సమర్థించడం అంటే విద్వేషాన్ని ప్రోత్సహించడం కాదు. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు, రాజకీయ వేదికలు, ప్రజా చర్చల్లో విభేదాలను తర్కంతో కాకుండా దూషణలతో ఎదుర్కొనే ధోరణి పెరుగుతున్నది. ఇది ప్రజాస్వామ్య సంస్కృతికి మంచిది కాదు.
ఆయన వ్యాఖ్యలు తప్పని భావిస్తే, ఆ తప్పును నిర్దిష్టంగా చూపించాలి. ఎక్కడ హద్దు దాటారో చెప్పాలి. చట్టపరంగా ప్రశ్నించాలి. కానీ ఆ ప్రక్రియలోనే చర్చను, విమర్శను, భావవ్యక్తీకరణను, ఆలోచనను, మేధో స్వేచ్ఛను భయభ్రాంతులకు గురిచేసే విధంగా యూఏపీఏ వంటి అసాధారణ చట్టాలను ప్రయోగించడం ప్రమాదకరమైన ధోరణి. ఈ రోజు రావణ్‌పై ప్రయోగించిన చట్టం రేపు మరొక జర్నలిస్టుపై, ఎల్లుండి ఒక రచయితపై, ఆ తర్వాత ఒక అధ్యాపకుడిపై లేదా ప్రతిపక్ష నాయకుడిపై ప్రయోగించబోరని ఎవరూ హామీ ఇవ్వలేరు.
ఒక దేశం బలాన్ని దాని జైళ్లు నిర్ణయించవు. భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన స్వేచ్ఛ కేవలం అనుకూల అభిప్రాయాల కోసం కాదు; అసమ్మతి వ్యక్తం చేసే హక్కు కోసం కూడా. ఎందుకంటే ప్రశ్నలు లేకుండా సంస్కరణ లేదు. విభేదం లేకుండా పరిణామం లేదు. విమర్శ లేకుండా ప్రజాస్వామ్యం లేదు. భయాన్ని చట్టం సృష్టించవచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది భయం కాదు, స్వేచ్ఛ. మౌనం కాదు, ప్రశ్న.
– టి. కొండబాబు
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)