ఊహించని ఉషోదయం హైడ్రా తుఫానులా విరుచుకుపడుతుందని అనుకోలేదుకలలు గని కట్టుకున్న మా ఇళ్ల ఉనికి చెరువు శిఖం గాల్లో శూన్యమని అనుకోలేదు మా కళ్ల ‘ఊసు’ అన్నీ ‘అశాశ్వతమ’ను వేదాంతం వల్లించే రోజు నేడే వస్తుందని అనుకోలేదు మేము నిరాశల పురా మనుషుల ఆనవాళ్లమా?కన్నీళ్లు మాకు వారసత్వమా?దుఃఖించడమే మా జీవితమా?
మమ్ములను పగబట్టిన శత్రువు ఎవడురా! ఈ హైడ్రా?
నిన్నటిదాక నిశ్చింత బస్తీ జీవులమై నేడేమో చెరువుల్ని కబ్జా చేసిన నేరస్థులమవుతామని అనుకోలేదు కన్నీటి నది కన్నుల నగర వాసులమై కట్టుబట్టలే ఆస్తులైన నిరుపేద పుర వారసులమవుతామని అనుకోలేదు చెరువు చట్టాలు ముంపు రహస్యాలు
దళారు దాదాల పద్మవ్యూహాలు తెల్వక జప్ఫా గాళ్లచే హలాల్ చేయబడిన బలి పశువులమై నేడు నగరంలో ప్రవహిస్తున్న నెత్తురు కాల్వలమవుతామని అనుకోలేదు.
మురికి అలల ముసి నవ్వుల మూసీ చూసినావా?
మమ్ములను నిర్వాసితులను చేసి నిండా ముంచేసినావా?
మా ముందరి అలల అందాల చెరువే
గుణపాఠం నేర్పే గురువు అవుతుందని కలలో కూడా అనుకోలేదు
హైడ్రా చూడగలదా
మా కళ్లలోని కన్నీటి చెరువులు
మా గుండెలోతు బాధల బరువులు
మార్పు మార్పని ఆశించిన మాకు
కూల్చివేతల ‘రెడ్‌మార్కు’లే కనిపిస్తున్నాయి
పడగలెత్తిన హైడ్రా బుల్డోజర్లు మా కలలోకి వస్తున్నాయి
హైద్రాబాద్ ‘హైడ్రా’బాద్ అవుతుందని అనుకోలేదు
సమున్నత లక్ష్యాల కోసం సాధించుకున్న తెలంగాణ
నేడు మా సామూహిక శోకాల పాట పాడుతున్న గాయాల వీణ అవుతుందని అస్సలు అనుకోలేదు
చెరువుల సంరక్షణ, ముంపుల నివారణ
ఆవశ్యక రాగమే, అభివృద్ధి గీతమే పల్లవించనీ
చెరువు, చెరువు గట్టే కాదు నిరుపేదల ‘కన్నీటి బొట్టు’ గురించి
మా ‘బతుకు బఫర్‌జోన్’ గురించి
మా రాజులకు సోయి ఉండదని మాత్రం అనుకోలేదు
కూలిపోయిన మా బతుకుల ఆవేదన కనడానికి
మా రోదన వినడానికి
మా కష్టాలకు, కన్నీళ్లకు స్పందించడానికి
వీలుదొరకని అధినాయకుడు ఏ విదేశీ
పర్యటనలో తలమునకలై ఉంటాడనీ అనుకోలేదు
ఈ బుల్డోజర్ సర్పం బుసలు ఆగాలంటే
మరో అంబేద్కర్ రావాలో.. మరో రాజ్యాంగం రాయాలో
రాష్ట్రమంతా అలుముకున్న నిరాశల పొగమంచు
అరుణ భాస్కరుడు ఉదయించకుంటే పోతుందా?
రమేశ్ నల్లగొండ
83094 52179