ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి గారికి…
2024, జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేండ్లు పూర్తయ్యాయి. అదే సమయంలో పునర్విభజన చట్టంలోని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే నిబంధన తొలగిపోయింది. దీంతో హైదరాబాద్‌పై సర్వహక్కులు తెలంగాణకు దఖలు పడ్డాయి. ఈ సందర్భంగా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి తెలుగు వైతాళికుడు ‘సురవరం ప్రతాపరెడ్డి’ పేరు పెట్టినట్టయితే అది తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి తోడ్పడుతుంది.
‘అన్నిపక్షాలు కోరుకున్నట్టయితే సురవరం పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేద’ని 2024 ఆగస్టు 2న ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో మీరు తెలిపినందుకు ధన్యవాదాలు. ఈ పేరు మార్పు ప్రతిపాదనను సీపీఐ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు చేశారు. వారికీ ధన్యవాదాలు. అట్లాగే ఈ ప్రతిపాదనకు మద్దతు పలికిన బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు కూడా ధన్యవాదాలు. బీజేపీ సైతం ఈ విషయంలో సానుకూలంగా ఉన్నది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పేరును ‘సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం’గా మార్చాలని కవులు, రచయితలు, తెలంగాణవాదులుగా మేమందరం మరొక్కమారు మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ సాహిత్యం, కళలు, కళారూపాలు, వారసత్వ సంపదను కాపాడుకునేందుకు, ఉన్నతస్థాయి పరిశోధనకు ఇది అత్యావశ్యకం.
తెలంగాణ ప్రజల ఔన్నత్యాన్ని, ప్రతిభను దశదిశలా వ్యాపింపజేసిన దార్శనికుడు, నడుస్తున్న విజ్ఞాన సర్వ స్వం సురవరం ప్రతాపరెడ్డి. విరామమెరుగకుండా మూడు దశాబ్దాల పాటు ప్రతిరోజు రచయితగా, జర్నలిస్టుగా తాను సృజించిన రచనలన్నీ ఆణిముత్యాలే. మద్రాసులో వేదము వెంకటరాయశాస్త్రి వద్ద ఆయన విద్యాభ్యాసం చేశారు. తెలుగు సాహిత్యంలో పండితునిగా ఎదిగిన సురవరం ప్రతాపరెడ్డి న్యాయశాస్ర్తాన్ని కూడా చదివారు. రెడ్డి హాస్టల్ నిర్మాతగా విద్యావ్యాప్తికి తోడ్పడ్డారు. గోలకొండ పత్రిక స్థాపక సంపాదకులుగా, ఆంధ్రమహాసభ తొలి అధ్యక్షుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా, పౌరహక్కుల ఉద్యమకారుడిగా, రచయితగా, పరిశోధకుడిగా, గ్రంథమాల నిర్వాహకుడిగా, సారస్వత పరిషత్తు స్థాపకుల్లో ఒకరిగా, ఆంధ్ర విద్యాలయ నిర్మాతగా, ప్రచురణకర్తగా, తెలంగాణ అస్తిత్వ పతాకం ‘గోలకొండ కవుల సంచిక’ సంపాదకులుగా, ఆంధ్రుల సాంఘిక చరిత్రను నిర్మించిన చరిత్రకారుడిగా, అరుంధతీయ సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరించిన సామాజిక సం స్కర్త సురవరం. ఇట్లా బహుముఖాలుగా తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచిన సురవరం ప్రతాపరెడ్డి పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టడం చాలా సమంజసనీయమైన నిర్ణయం.
ముఖ్యమంత్రిగా మీరు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవాడే కాకుండా హైదరాబాద్ రాష్ట్ర తొలి అసెంబ్లీ లో వనపర్తి నియోజకవర్గం నుంచి శాసనసభకు సురవరం ప్రతాపరెడ్డి ప్రాతినిధ్యం వహించారు. అట్లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలిని శాశ్వతంగా చరిత్రపుటల్లోకి ఎక్కించేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం పేరు పెట్టాలి. అంతేకాకుండా కాళోజీ, దాశరథిల మాదిరిగానే ‘సురవరం’ పేరిట కూడా ఏటా ఉత్తమ పత్రికా సం పాదకులు/ జర్నలిస్టులు, చరిత్రకారులు, సాహితీవేత్త, సామాజిక సంస్కర్త/ హక్కుల కార్యకర్తలకు అవార్డు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కవులు, రచయితలుగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇట్లు
డాక్టర్ నాళేశ్వరం శంకరం, ఆనందాచారి, రంగన్న, వనపట్ల సుబ్బయ్య, డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ పసునూరి రవీందర్, మువ్వా శ్రీనివాసరావు, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, ఘనపురం దేవేందర్, దేశపతి శ్రీనివాస్, స్కైబాబ, డాక్టర్ పల్లెర్ల వీరస్వామి, వఝ్జల శివకుమార్, కొల్లాపురం విమల, కందుకూరి శ్రీరాములు, ముచ్చర్ల దినకర్, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, బండారు శంకర్, గుడిపల్లి నిరంజన్, బోలా యాదయ్య, పలుస శంకర్‌గౌడ్, రావూరి వనజ, జ్వలిత, అనిశెట్టి రజిత, డాక్టర్ అంబటి భానుప్రకాశ్, ఇల్లూరి వెంకట్రామయ్య శెట్టి, డాక్టర్ వేణు సంకోజు, ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్, డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్‌రావు, తులసి వెంకటరమణాచార్యులు, జయహన్మంత్ నాయక్, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ నలిమెల భాస్కర్, అన్నవరం దేవేందర్, ఉదారి నారాయణ, వల్లభాపురం జనార్దన, కె.లక్ష్మణ్‌గౌడ్, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, వేముగంటి మురళి, ఎదిరెపల్లి కాశన్న, డాక్టర్ సీతామహాలక్ష్మి తదితరులు.