దేశంలోనే యువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు యువ నేత కల్వకుంట్ల తారక రామారావు లాంటి అత్యంత ఆధునిక ఆలోచనలతో కూడిన నాయకత్వం…బంగారు తెలంగాణ భవిష్యత్తుకు భరోసానిస్తున్నది.
ఐటీ, పరిశ్రమల రంగంలో ప్రముఖ రాష్ర్టాలుగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ర్టాలకు దీటుగా తెలంగాణ ముందు వరుసలోకి వచ్చిందంటే ప్రధాన కారణం యువ నేత కేటీఆర్ డైనమిక్ లీడర్షిప్. ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖలలో సరికొత్త నాయకత్వ రీతులను అందించి హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో మరింత కొత్తగా ఆవిష్కరిస్తున్నారు.
దార్శనికుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో ఇప్పుడు హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా రూపాంతరం చెందుతూ లైఫ్ సైన్సెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, ఏవియేషన్, మొబిలిటీ రంగాలలో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నదంటే అందుకు కేటీఆర్ ఆధునిక దార్శనిక నాయకత్వమే కారణం. దేశంలోనే ఐటీ రంగ ఎగుమతులలో ముందు వరుసలో ఉన్న తెలంగాణ ఇప్పుడు దేశానికి కొత్త దిక్సూచిగా నిల్చింది. ‘చాలెంజెస్ ఆఫ్ బీయింగ్ ఏ యంగ్ స్టేట్’ అనే భావంతో దేశం ఆశ్చర్యపడేలా, గ్లోబల్ స్థాయిలో తీర్చిదిద్దిన టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్ లాంటి ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్లు ఇప్పుడు దేశంలో సరికొత్త సంచలనం. దేశంలో, గ్లోబల్ స్థాయిలో కేటీఆర్ సాధించిన విజయాలతో, తాను చేపడుతున్న కార్యక్రమాలతో ఒక సెలబ్రిటీగా ఎదిగారనడంలో అతిశయోక్తి లేదు.
ఇప్పుడు కేటీఆర్ అంటే కేవలం తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమే కాదు. ఇప్పుడాయన తెలంగాణకు తిరుగులేని బ్రాండ్ అంబాసిడర్. భారతదేశ యువ నాయకత్వానికి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఒక అద్భుతమైన దార్శనిక లీడర్. కేటీఆర్ ప్రపంచ స్థాయి బిజినెస్ లీడర్లతో ఎంత అద్భుతమైన ప్రజెంటేషన్ ఇస్తారో..తెలంగాణ గ్రామీ ణ ప్రాంతాల్లోని ప్రజలతో అంతే సులభంగా కలిసి పోతారు. అభివృద్ధి, సంక్షేమాలకు సమ ప్రాధాన్యమిస్తున్న కేటీఆర్ అడుగులో తెలంగాణ సమాజం అడుగులు వేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
డాక్టర్ సంగని మల్లేశ్వర్
98662 55355