ఆరు దశాబ్దాల పాటు అరిగోస పడ్డ తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని పన్నేండ్లు కావొస్తున్నది. పదేండ్లపాటు స్వపరిపాలనలో ఆత్మగౌరవంతో బతికినం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఎందుకు కోరుకున్నామో యావత్తు ప్రపంచానికి చూపించేలా అద్భుతమైన ప్రగతి సాధించినం. తెలంగాణ వ్యతిరేక శక్తుల అసత్య ప్రచారం అబద్ధమని నిరూపించినం. సబ్బండ వర్ణాలు సుభిక్షంగా వర్ధిల్లినయి. తెలంగాణపై దుష్ప్రచారం చేసిన ఆంధ్రా రాజకీయశక్తులు ప్రగతిని చూసి అబ్బురపడ్డరు. కానీ నేడు అవే శక్తులు రెచ్చిపోతున్నయి. తెలంగాణ ఉద్యమాన్ని, రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజలు సాగించిన పోరాటాన్ని హేళన చేస్తున్నయి. ఇది ముమ్మాటికీ అభ్యంతరకరం, ఆవేదనభరితం.
తెలంగాణ ఉద్యమం పట్ల ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ పాక వెంకట సత్యనారాయణ తాజాగా పార్లమెంటు సాక్షిగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, ఆనాటి ఉద్యమ నాయకత్వాన్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అత్యంత దురదృష్టకరం, హేయం. తెలంగాణ రాష్ట్రం ఎవరో విద్వేషాలు రెచ్చగొడితే వచ్చినది కాదు, అది ఆరు దశాబ్దాల పాటు సాగిన రక్తాశ్రువుల పోరాటం. ఒక తెలంగాణ రాష్ట్ర ఉద్యోగిగా, తెలంగాణ గడ్డపై జరిగిన అన్యాయాలను కడ్లారా చూసిన వ్యక్తిగా, ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకత గురించి మా పెద్దల నుంచి, గురువుల నుంచి చరిత్ర నేర్చుకున్న వ్యక్తిగా, చరిత్రను వక్రీకరించే వారికి వాస్తవాలను గుర్తు చేయడం నా బాధ్యత.
తెలంగాణ ప్రజలు ఎప్పుడూ వేర్పాటువాదులు కాదు. 1956లో పెద్దమనుషుల ఒప్పందానికి లోబడి, నమ్మకంతో ఆంధ్రరాష్ట్రంతో కలిశారు. కానీ, ఆ నమ్మకం అడుగడుగునా వంచనకు గురైంది. ముల్కీ నిబంధనల ఉల్లంఘన, ఉద్యోగాల్లో వివక్షకు వ్యతిరేకంగా 1969లో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం ‘విద్వేషం’ కాదు, అది తమ పొట్టగొడుతున్న అన్యాయంపై చేసిన ధిక్కారం. పోలీసుల తూటాలకు 369 మంది విద్యార్థులు బలైపోయారు. ‘గెలుపు కోసం చచ్చేవాడు వీరుడు.. హక్కు కోసం పోరాడి చచ్చేవాడు అమరవీరుడు. ఆనాడు చిందిన రక్తానికి సాక్షిగా తెలంగాణ ఆకాంక్ష బలపడింది తప్ప, ఎవరి మీదో ద్వేషంతో పుట్టినది కాదు.
1970 నుంచి 2000 వరకు తెలంగాణ ప్రాంతం నీళ్లు లేక ఎండిపోయింది, నిధులు లేక వెనుకబడింది, నియామకాలు లేక యువత వలసల బాట పట్టింది. మా ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించుకుపోతుంటే, మా భూములు బీడువారితే చూస్తూ భరించలేక పోరుబాట పట్టడం విద్వేషమా? మా ఉద్యోగాలను స్థానికేతరులు తన్నుకుపోతుంటే ప్రశ్నించడం విద్వేషమా?
‘అడిగేవాడు లేకపోతే అడ్డగోలు పాలన సాగుతుంది‘ అన్నట్టుగా, ఆనాడు తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం జరిగింది. 610 జీవో వంటి అనేక హామీలు బుట్టదాఖలయ్యాయి. ఒక ఉద్యోగిగా మా కండ్ల ముందే మా తోటి తెలంగాణ బిడ్డల పదోన్నతులు అన్యాయంగా ఆగిపోతుంటే కలిగిన వేదన ఈనాడు విద్వేషంగా కనిపిస్తున్నదా?
2001లో తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని కేసీఆర్ ప్రారంభించినప్పుడు అది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ కాదు, అది తెలంగాణ ఆత్మగౌరవ పునరుజ్జీవనం. ‘సింహం రెండు అడుగులు వెనక్కి వేసింది అంటే భయపడి కాదు, గర్జించి వేటాడటానికి’ అన్నట్టుగా, తెలంగాణ సమాజం మొత్తం ఏకతాటిపైకి వచ్చింది. సకల జనుల సమ్మెలో లక్షలాది మంది ఉద్యోగులు జీతాలు వదులుకొని రోడ్ల మీదకు కదిలారు. మాకు ఎవరి మీదో ద్వేషం ఉంటే, ఆ సమ్మెలో శాంతియుతంగా ఎందుకు పాల్గొనేవాళ్లం? వంటా-వార్పు కార్యక్రమాలతో మా నిరసనను ప్రపంచానికి చాటామే తప్ప, ఎక్కడా ప్రాంతీయ హింసకు తావు ఇవ్వలేదు.
తెలంగాణ చరిత్రలో 2009లో జరిగిన పరిణామాలు కీలక మైలురాళ్లు. ఆ సమయంలో తెలంగాణ కోసం ఆవేదన చెంది శ్రీకాంతాచారి వంటి యువకులు తమను తాము దహనం చేసుకున్నది ఎవరిపైనో విద్వేషంతో కాదు, ‘నా తెలంగాణ నాకు కావాలి’ అన్న ఆవేదనతో. వందలాది మంది విద్యార్థులు ఉరితాళ్లకు వేలాడారు. కానిస్టేబుల్ కిష్టయ్య సర్వీస్ రివాల్వార్తో ఆత్మార్పణ చేసుకున్నారు. మరికొందరు విషం తాగారు. 160 కిలో మీటర్ల వేగంతో వెళ్తున్న రైళ్లను ముద్దాడారు. ఈ బలిదానాలను ‘అనాలోచితం‘ అనడానికి నోరెలా వస్తుంది? ఒక తల్లి తన బిడ్డను కోల్పోయినప్పుడు కలిగే దుఃఖం విద్వేషమా? లేక ఆవేదననా?
2014లో తెలంగాణ రావడం అనేది ఏదో చీకటి గదిలో జరిగిన ఒప్పందం కాదు. అఖిలపక్ష సమావేశాలు, శ్రీకృష్ణ కమిటీ నివేదిక, పార్లమెంటులో సుదీర్ఘ చర్చల ఫలితం. అప్పటి యూ పీఏ ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం కోరినప్పుడు, ఇదే బీజేపీ కూడా మద్దతు ప్రకటించింది అనే విషయం ఏపీ నేతలు, బీజేపీ ఎంపీ పాక వెంకట సత్యనారాయణ మర్చిపోయారా? ‘చెప్పేవాడికి వినేవాడు లోకువ‘ అన్నట్టుగా, ఇప్పుడు రాజకీయలబ్ధి కోసం ఆనాటి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుబట్టడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమే.
1. 1969లో అమరులైన 360 మంది విద్యార్థుల బలిదానాలు మీకు అనాలోచితంగా కనిపిస్తున్నాయా?
2. నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం విద్వేషమా?
3. పార్లమెంటులో బీజేపీ మద్దతుతో చేసిన చట్టాన్ని కూడా ఇప్పుడు తప్పు పడుతున్నారంటే, మీ పార్టీ నిర్ణయాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తున్నారా?
తెలంగాణ రాష్ట్రం అనేది ఒక భావోద్వేగాల శిఖరం. ఇది గంగా జమునా తెహజీబ్ లాంటి సోదరభావంతో కూడిన ప్రాంతం. ఇక్కడ ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎప్పుడూ అన్నదమ్ములుగానే ఉన్నారు, ఉంటారు. ‘చరిత్రను చదవని వారు, చరిత్రను సృష్టించలేరు. కనీసం గౌరవించలేరు.‘ఇప్పటికైనా బీజేపీ ఎంపీ సత్యనారాయణ, ఆంధ్రా నేతలు అటువంటి ఆలోచనలు కలిగిన ఇతర నాయకులు ఎవరైనా ఉన్నా తెలంగాణ ఉద్యమ వీరుల త్యాగాలను, ఆరు దశాబ్దాల ఆవేదనను అర్థం చేసుకోవాలి. లేనిపక్షంలో, తెలంగాణ సమాజం తగిన రీతిలో స్పందించడం ఖాయం. ఆనాడు ఆంధ్రా పాలకుల అహంకారాన్ని ఎలాగైతే అణచివేశామో, ఈనాడు విద్వేషపు మాటలను కూడా అలాగే ఎండగడతాం. జై తెలంగాణ, జై భారత్,
– (వ్యాసకర్త: టీఎన్జీవో నాయకుడు)
కంచర్ల సాయి భార్గవ్ చైతన్య 9676228184