హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ప్రబలిన లంపీస్కిన్ వ్యాధితో మృత్యువాత పడుతున్న పశువులకు తెలంగాణ రాష్ట్రం సంజీవనిగా మారింది. ఈ వ్యాధిని నిరోధించడంలో అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తున్న గోట్ప్యాక్ వ్యాక్సిన్‌ను తెలంగాణలోని ప్రభుత్వరంగ సంస్థ వెటర్నరీ బయోలాజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (వీబీఆర్ఐ) తయారు చేస్తుండటం విశేషం. ఈ పశువుల టీకా తెలంగాణ రాష్ర్టానికే గర్వకారణంగా నిలుస్తున్నది. లక్షలాది పశువుల ప్రాణాలను కాపాడుతున్న ఈ వ్యాక్సిన్‌ను తయారుచేస్తున్న ఏకైక ప్రభుత్వరంగ సంస్థ దేశం మొత్తం మీద తెలంగాణలోనే ఉండటం గర్వించదగ్గ విషయం.
రెండు నెలలుగా విజృంభిస్తున్న లంపీస్కిన్ వ్యాధి పశువుల పాలిట శాపంగా మారింది. ఇప్పటికే ఈ వ్యాధి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, పంజాబ్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో 67 వేల పశువులను పొట్టబెట్టుకొన్నది. మరికొన్ని రాష్ర్టాలనూ గడగడలాడిస్తున్నది. తెలంగాణ పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో తయారవుతున్న ఈ వ్యాక్సిన్ వల్ల వ్యాధి సోకిన పశువులకు ప్రాణపాయం తప్పడంతోపాటు ముందుగానే టీకా వేసిన పశువులకు వ్యాధి సోకే ప్రమాదం చాలా వరకు తగ్గుతున్నదని గుర్తించారు. తెలంగాణలోని అన్ని పశువులకు ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్లే రాష్ట్రంలో లంపీస్కిన్ వ్యాధి ప్రభావం తక్కువగా ఉన్నదని అధికారులు చెప్తున్నారు.
వ్యాక్సిన్ కోసం ఇతర రాష్ర్టాల క్యూ
ఉత్తరాదిలో లంపీస్కిన్ వ్యాధి తీవ్రత పెరుగుతుండటం, పశువులు మృత్యువాత పడుతుండటంతో ఆయా రాష్ర్టాలు గోట్పా క్స్ వ్యాక్సిన్ కోసం తెలంగాణను సంప్రదిస్తున్నాయి. ఇప్పటికే ఏపీకి 33 లక్షల డోసులు, ఛత్తీస్‌గఢ్‌కు 7.5 లక్షల డోసులు, ఒడిశాకు 5 లక్షల డోసులను తెలంగాణ పశు సంవర్ధకశాఖ సరఫరా చేసింది. గుజరాత్, రాజస్థాన్, హర్యా నా తదితర రాష్ర్టాలు వ్యాక్సిన్ కావాలని కోరుతున్నాయి. లంపీస్కిన్ వ్యాధి నివారణకు తీ సుకోవాల్సిన చర్యలపై రెండు రోజుల క్రితం ఆన్లైన్ సమావేశం నిర్వహించిన కేంద్ర పశుసంవర్ధకశాఖ అన్ని రాష్ర్టాలకు వ్యాక్సిన్‌ను ఇ వ్వాలని తెలంగాణను కోరడం గమనార్హం. తెలంగాణ పశుసంవర్ధకశాఖ వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచింది. 15 రోజుల్లో 60 లక్షల డోసు లు సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
గోట్‌పాక్స్ వ్యాక్సిన్‌తో నివారణ
లంపీస్కిన్ వ్యాధి నివారణకు గోట్‌పాక్స్ వ్యాక్సిన్ బాగా పని చేస్తున్నది. రాష్ట్రంలో ఈ వ్యాధి తీవ్రత తగ్గడానికి కారణం.. ముందుగానే పశువులకు గోట్‌పాక్స్ వ్యాక్సిన్ ఇవ్వడమే. దీని ప్రభావాన్ని గమనించిన ఇతర రాష్ర్టాలు వ్యాక్సిన్ కావాలని అడుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ర్టాలకు అందించాం. – రాంచందర్, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్