తాము అధికారంలోకి వస్తే తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు మాట తప్పింది. ఆ పార్టీ గద్దెనెక్కి ఏడాది దాటినా ఇచ్చిన వాగ్దానాల అమలు దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఏడాది కాలంలో విద్యారంగం పూర్తిగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. కనీసం విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవటంతో సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. విద్యా కమిషన్‌ను నియమించి, తూతూ మంత్రం గా సమీక్షలు చేసిన సర్కార్ ప్రకటనలకే పరిమితమైంది.
ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో ఫీజులను నియంత్రిస్తామని కాంగ్రెస్ చెప్పింది. కానీ, నేడు రాష్ట్రంలో ఎల్కేజీ విద్యార్థులకు కొన్ని కార్పొరేట్ పాఠశాలలు రూ.6 లక్షల వరకు ఫీజు దండుకుంటున్నాయి. విద్యను వ్యాపారంగా మారుస్తున్న ఇలాంటి కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలపై చర్యలు చేపట్టకపోగా వారి దోపిడీకి పరోక్షంగా సహకరిస్తుండటం శోచనీయం.
తొలి ఏడాదిలో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ ఆ హామీని నిలబెట్టుకోలేదు. విద్యారంగానికి 7.75 శాతం నిధులను మాత్రమే కేటాయించిన పాలకులు.. బడ్జెట్ పెంచకుండా తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్‌గా ఎలా మారుస్తారో సమాధానం చెప్పాలి. ప్రతి మండలంలో అధునాతన సౌకర్యాలతో కూడిన ఇంటర్నేషనల్ స్థాయి పాఠశాలలను నెలకొల్పుతామని కూడా హామీ ఇచ్చారు. కానీ, తొలి ఏడాదిలో కొన్ని నియోజకవర్గాల్లో పాఠశాలల నిర్మాణానికి భూమి పూజ చేసి చేతులు దులుపుకొన్నారు.
మండలానికో పాఠశాలను ఏర్పాటుచేస్తామని చెప్పి నేడు కొన్నిచోట్ల ప్రచార ఆర్భాటంతో భూమి పూజలు చేయడం విడ్డూరం. కొడంగల్, మధిర నియోజకవర్గాల పరిధిలో ఇంటిగ్రేటెడ్ గురుకులాలను పైలట్ ప్రాజెక్టులుగా ప్రారంభించి, ఈ తరహాలోనే అన్ని మండలాల్లో విద్యాసంస్థలను ఏర్పాటుచేస్తామని పాలకులు చెప్పారు. కానీ, ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పాత గురుకులాలనే ఇంటిగ్రేటెడ్ గురుకులాలుగా పేరు మారుస్తుండటం ఖండనీయం. రాష్ట్రంలోని 662 గురుకులాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వాటికి సొంత భవనాలు నిర్మించకపోగా, అద్దె చెల్లించకపోవడంతో కొన్నిచోట్ల యజమానులు తాళాలు వేసిన ఉదంతాలను మనం చూశాం.
స్కాలర్షిప్లు పెంచుతామని చెప్పి అసలే ఇవ్వడం లేదు. ప్రైవేట్ కళాశాలలు మూతబడే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ పథకంపై ఆధారపడి 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు చదువుతున్నారు. రూ.8 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోవడంతో వారి చదువులు అగమ్యగోచరంగా మారాయి. విద్యాసంస్థల్లో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేస్తామన్న హామీ కూడా అటకెక్కింది. విద్యార్థులకు ఇస్తామన్న రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ప్రస్తావనే లేదు. ఉచిత ఇంటర్నెట్, ఫైబర్ నెట్ ఏర్పాటుపై చర్చే జరగడం లేదు.
మూతబడిన పాఠశాలలను తిరిగి తెరుస్తామని చెప్పి అందుకు భిన్నంగా పాఠశాలలను మూసివేయడం శోచనీయం. జీరో స్కూల్ పేరుతో 1,899, పది మందిలోపు విద్యార్థులున్నారని 4,314.. ఇలా మొత్తం 6,213 పాఠశాలలు శాశ్వతంగా మూసివేసే కుట్రలు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ప్రైమరీ పాఠశాల, రెవెన్యూ గ్రామాల్లో అప్పర్ (ప్రైమరీ పాఠశాల, హైస్కూల్, మండలానికో జూనియర్ కళాశాల, నియోజకవర్గానికో డిగ్రీ కళాశాల, జిల్లా కేంద్రాల్లో పీజీ కళాశాలల ఏర్పాటుచేస్తామన్న వాగ్దానం నెరవేరలేదు. ఆంగ్ల మీడి యం అమలుచేస్తామన్న హామీని రేవంత్ సర్కార్ మర్చిపోయింది.
మరో వైపు కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకువచ్చిన నూతన విధానాన్ని రాష్ట్ర సర్కార్ పరోక్షంగా అమలుచేస్తున్నది. స్కూల్ కాంప్లెక్స్‌ల తరహాలో ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థల ఏర్పాటు, ప్రాథమిక విద్యలో అంగన్వాడీల విలీనం, అప్పర్ ప్రైమరీ పాఠశాలల మూసివేత, స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీల ఏర్పాటు తదితర అంశాలను పరీశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. స్కిల్ వర్సిటీకి పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రను చైర్మన్‌గా నియమించడం, అదానీ, కృష్ణారెడ్డి లాంటివారి నుంచి వందల కోట్లు విరాళాలు తీసుకోవడాన్ని చూస్తుంటే కార్పొరేట్ శక్తులకు విద్యను అప్పజెప్పే కుట్రలు జరుగుతున్నట్టు అనిపిస్తున్నది.
పరిశోధనలు చేసే విద్యార్థులకు నెలకు రూ.10 వేల ఫెలోషిప్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు ఆ మాట కూడా తప్పారు. ఇదిలా ఉంటే ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో యూనివర్సిటీల ఏర్పాటు ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు. విద్యారంగం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఇచ్చిన 24 హామీల్లో ఒక్కటి కూడా అమలుకాకపోవడం దారుణం. భవిష్యత్తు ప్రణాళికలు లేకపోవడం, విద్యాశాఖకు కనీసం మంత్రిని కూడా నియమించకపోవడం ఆందోళనకరం.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని నిలిపివేయడం మూర్ఖపు ఆలోచన. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం హామీ అమలుకావడం లేదు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన నాటి నుంచీ విద్యార్థులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. జీతాలు ఇవ్వకపోవడంతో వంటకార్మికులు ఆందోళనలు చేశారు. అగ్రికల్చర్, ఉద్యానవన యూనివర్సిటీల భూములను హైకోర్టుకు కేటాయించడాన్ని తప్పుబడుతూ విద్యార్థులు రోడ్డెక్కారు.
గురుకులాల్లో అశాస్త్రీయ సమయపాలన నిర్ణయాన్ని విరమించుకోవాలని, సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో అతిథి అధ్యాపకుల తొలగింపును వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. అంతేకాదు, ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు మరణించడం బాధాకరం. నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు చేపట్టకపోవడంతో ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. ఇలా అనేకరకాలుగా రాష్ట్రం లో విద్యార్థులు నిత్యం పోరాడుతూనే ఉన్నారు. ప్రజాపాలన అని పదే పదే చెప్పుకొనే కాంగ్రెస్ సర్కార్ విద్యారంగానికి ఎలాంటి భరోసా ఇవ్వలేదు. రాష్ర్టాభివృద్ధిలో అత్యంత ప్రాధాన్యం ఉన్న ఈ రంగాన్ని హస్తం సర్కార్ విస్మరించింది. ఇదిలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు.
– (వ్యాసకర్త: ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి)
టి.నాగరాజు 94900 98292