తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా వృద్ధి చేస్తామని, దేశ జీడీపీకి 10 శాతం కంట్రిబ్యూట్ చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినప్పుడు అది ఆశయమా? లేదా భ్రమా? అనే ప్రశ్న చాలామంది మెదళ్లలో మెదిలింది. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ హయాంలో గ్లోబల్ ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిన ఒక రాష్ట్రం విషయంలో ఇలాంటి ఒక ప్రకటన ఆర్థికపరమైన దృష్టి కంటే రాజకీయ దృష్టితో మభ్యపెట్టే ప్రయత్నంగానే కనిపించింది. ముఖ్యమంత్రి రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక పతనం, రాష్ట్ర వనరుల దోపిడీ,
వేళ్లూనుకుపోయిన వ్యవస్థాగత అవినీతిని కప్పిపుచ్చేందుకు చేస్తున్న మాయాజాలమే ఇది.
కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసినప్పుడు, ప్రపంచస్థాయి ప్రాజెక్టులను నిర్మించినప్పుడు, తెలంగాణను ఒక గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దినప్పుడు.. నాడు కాంగ్రెస్‌తోపాటు ఆ పార్టీ అనుకూల మీడియా ఆరోపణలు చేశాయి. సాగునీటి ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై చేసిన వ్యయాల విషయంలో నిరాధారమైన ఆరోపణలు చేశారు. అయినా ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకుల్లో ఏ ఒక్కరూ తప్పు చేసినట్టు నిరూపితం కాలేదు. అధికారం కోసం వెంపర్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో ప్రస్తుతం రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నది. ఈ నేపథ్యంలో విరోధాబాస స్పష్టంగా కనిపిస్తున్నది. బీఆర్ఎస్పై ఎలాంటి ఆరాధాలు లేకుండా ఆరోపణలు చేశారు. కానీ, కాంగ్రెస్ అవినీతీ మాత్రం ఆధారాలతో సహా నిరూపితమైంది.
రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఆర్థికవ్యవస్థ వేగంగా పతనమవుతున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరం మధ్యలోనే, అంటే 2025 సెప్టెంబర్ నాటికే వార్షిక ఆర్థిక లోటు లక్ష్యంలో 83.58 శాతానికి చేరుకొని, రూ.45,139 కోట్ల ఆర్థిక లోటును రాష్ట్రం నమోదు చేసింది. రాష్ట్ర రెవెన్యూ వసూళ్లు రూ.76,940 కోట్లు మాత్రమే ఉండగా, వ్యయాలు మాత్రం రూ.89,394 కోట్లకు ఎగబాకాయి.
ఈ వ్యయాలన్నీ రాష్ట్ర ప్రగతి కోసం మూలధన పెట్టుబడిగా కాకుండా; రాజకీయ లబ్ధి కోసం, ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టేందుకు తీసుకొచ్చిన పలు పథకాల కోసం ఖర్చు చేయడం గమనార్హం. దాంతో ఆర్థిక సంవత్సరం మధ్యలోనే రెవెన్యూ లోటు రూ.12,452.89 కోట్లకు చేరుకున్నది. తత్ఫలితంగా అప్పులు తీసుకోకపోతే రాష్ట్రంలో కనీస మౌలిక వసతులు కల్పించలేని, ప్రభుత్వాన్ని నడపలేని దుస్థితి ఏర్పడింది. ఇది ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ఉన్న లోపం కాదు, వ్యవస్థీకృత దోపిడీ. రుణమాఫీ, ఉద్యోగ నియామకాలు సహా అనేక హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవన్నీ ఎంతో వ్యయంతో కూడుకున్నవి, ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టేసేవి, రాజకీయంగా ఆ పార్టీకి లబ్ధి చేకూర్చేవి. కాగా, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే ఈ వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమవడమే కాకుండా కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర ఆర్థికస్థితిని పూర్తిగా దెబ్బతీసింది. కాగ్ నివేదిక ప్రకారం.. రాష్ట్ర అప్పులు రూ.4.68 లక్షల కోట్లకు పెరిగి, జీఎస్డీపీలో 35.64 శాతానికి చేరుకున్నాయి. ఇది జీఎస్డీపీలో వాస్తవంగా ఉండాల్సిన 29.70 శాతం పరిమితి కంటే చాలా ఎక్కువ. రానున్న దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రం రూ.2.67 లక్షల కోట్ల అసలు, వడ్డీ కలిపి చెల్లించాల్సి ఉన్నది.
అయితే అసలు అవినీతి అంకెల్లో కాదు, ఈ అవినీతి సొమ్ము ఎక్కడికి వెళ్తున్నదన్న దాంట్లోనే ఉంది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీలో ఇది దాగి ఉన్నది. ఇవే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అవినీతికి మూలకారణాలు. మూసీ సుందరీకరణ కాంగ్రెస్ సర్కార్ అవినీతి ప్రాజెక్టుగా మారిపోయింది. ఈ ప్రాజెక్టులో నిజంగా లాభం పొందుతున్నది తెలంగాణ సాధారణ ప్రజలు కాదు; రేవంత్‌రెడ్డి సన్నిహితులు. అసలు ఈ ప్రాజెక్టు విషయంలో పారదర్శకత ఎక్కడ? వ్యయాలకు సంబంధించిన పబ్లిక్ ఆడిట్లు ఎక్కడ? బీఆర్ఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, నగరంలో మౌలిక సదుపాయాల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు బాధ్యతతో, ప్రజలకు మేలు జరగాలన్న సదుద్దేశంతో జరిగాయి. కానీ, కాంగ్రెస్ మాత్రం అభివృద్ధి పేరిట దోపిడీ చేస్తున్నది.
ఫ్యూచర్ సిటీ మరో మాయాజాలం: ఏఐ, లైఫ్ సైన్సెస్, ఫార్మా హబ్‌లతో 30 వేల ఎకరాల్లో ప్రతిపాదించిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు రేవంత్ ప్రభుత్వానికి మరో స్కామ్‌గా మారింది. రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఇందులో రూ.40 వేల కోట్లు లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించివేనని ప్రభుత్వం చెప్తున్నది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ భూసేకరణ విషయంలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో కంటే ఎక్కువగా పేపర్లలో, ప్రకటనల్లో మాత్రమే కనిపిస్తున్నది. భారీగా వ్యయం చేస్తున్నామని సమర్థించుకోవడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విపత్తు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతున్నది.
అయితే, బీఆర్ఎస్ సర్కార్ ఆర్థికరంగంలో అద్భుత ఫలితాలు సాధించింది. తెలంగాణ జీడీపీ వృద్ధిరేటు జాతీయ సగటును మించి 10.1 శాతం నమోదైంది. తలసరి ఆదాయం రూ.3.79 లక్షలకు ఎగబాకింది. రాష్ట్రం గ్లోబల్ ఐటీ హబ్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ఉపాధిని సృష్టించింది. జీఎస్డీపీలో సేవల రంగం వాటా 66.3 శాతానికి చేరింది. ఇవి యాదృచ్ఛికంగా వచ్చిన ఫలితాలు కావు, బీఆర్ఎస్ విధానాల ఫలితంగా జరిగిన అద్భుతాలు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి పాలన సామర్థ్యం కనిపించడం లేదు. మూలధన వ్యయం అంచనాల కంటే 40 శాతం తగ్గింది. ఇది ప్రభుత్వం ప్రాథమిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై కూడా పెట్టుబడులు పెట్టలేని స్థితిని తెలియజేస్తున్నది. కాగ్ చెప్పినట్టుగా వ్యవసాయ, పరిశ్రమల వంటి రంగాలను నిర్వహించే సంస్థాగత సామర్థ్యం పాలకులకు లేదు. హైదరాబాద్‌లో ఒక్క ప్రాజెక్టు చేపట్టలేని ప్రభుత్వం.. ఫ్యూచర్ సిటీని ఎలా నిర్మిస్తుంది? రాష్ట్రవ్యాప్తంగా మాన్యుఫాక్చరింగ్ హబ్‌లను ఎలా నిర్మిస్తుంది?
సంస్థాగత బలహీనత: సంస్థాగత బలహీనత యాదృచ్ఛికం కాదు. ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనలోనే ఇబ్బందులు పడుతున్నది. ఒక సంవత్సరం బడ్జెట్‌ను కూడా సరిగ్గా నిర్వహించలేని ప్రభుత్వం.. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ వైపు రాష్ర్టాన్ని ఎలా నడిపిస్తుంది? విజన్ 2047 డాక్యుమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ఒక మాయాజాలం మాత్రమే.
హిల్ట్ పాలసీ ఒక పెద్ద భూముల స్కామ్. బహుళ వినియోగ జోన్ల పేరిట రూ.6 లక్షల కోట్ల విలువైన 9,300 ఎకరాల భూమిని కొల్లగొట్టేందుకు రియల్ ఎస్టేట్ దోపిడీకి సర్కార్ తెరలేపింది. పరిశ్రమలను బలపర్చడం, ఉద్యోగాల సృష్టి, తయారీ హబ్‌ల ఏర్పా టు కంటే భూముల ద్వారా లాభాలకు ఇది ప్రాధాన్యం ఇస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మెగా ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల పేరిట దోపిడీ చేస్తున్న ఈ తరుణంలో బీఆర్ఎస్పై నాడు ఆరోపణలు చేసిన మీడియా ఎక్కడికిపోయింది?
పాలనా సంక్షోభం నిజం: తెలంగాణ భవిష్యత్తుకు ప్రాథమిక ముప్పు బయటి నుంచి కాదు; అది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, అవినీతి నుంచే వస్తుంది. కాగ్ ఆడిట్ ఊహాజనితం కాదు; అవి వాస్తవాలు. రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే 25 ఏండ్ల పాటు 11 శాతం వార్షిక స్థిర వృద్ధి అవసరం. దీనికి వార్షికంగా 23 బిలియన్ డాలర్ల నుంచి 1520 బిలియన్ డాలర్ల వరకు విదేశీ పెట్టుబడుల ప్రవాహం, తయారీ రంగంలో మార్పు, నిజమైన రాజకీయ సంకల్పం అవసరం. కాంగ్రెస్ సర్కార్‌కు ఈ లక్షణాలు లేవు. ఈ సర్కార్ కేవలం రుణ సమీకరణ, అవినీతితో కూడిన మెగా ప్రాజెక్టులను మాత్రమే చేపడుతుంది.
జీఎస్డీపీలో తయారీ రంగం 18 శాతం వాటా మాత్రమే కలిగి ఉంది. ఆర్థిక సంక్షోభం, పాలనా సామర్థ్యం లేమితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి జీఎస్డీపీలో తయారీ రంగ వాటాను 3035 శాతానికి పెంచే సామర్థ్యం లేదు. తయారీ విలువలో దేశంలో తెలంగాణ 25వ స్థానంలో ఉంది. కాంగ్రెస్ హయాంలో ఇది మరింతగా దిగజారుతుంది. వ్యవసాయరంగంలో సవాలు కొనసాగుతున్నది. మొత్తం శ్రామికశక్తిలో 42.7 శాతం వ్యవసాయంపై ఆధారపడినప్పటికీ, వ్యవసాయ ఉత్పాదకత తగ్గింది. వ్యవసాయ విధానాలను ఆధునికీకరించడం, ఉత్పాదకతను పెంపొందించడానికి బదులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామంటున్నది. ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే.
రాజకీయ స్థిరత్వ సమస్య: కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తానన్న హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వాటిని నెరవేర్చడంలోనూ విఫలమవుతున్నది. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు, పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం తదితర కారణాల వల్ల రాబోయే రెండేండ్లలో ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో పాలనా స్థిరత్వాన్ని తీసుకొచ్చింది. పెట్టుబడిదారులు పాలనా స్థిరత్వంపై విశ్వాసం చూపడంతో దీర్ఘకాలిక పెట్టుబడులు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పాలనలో పాలసీలలో అనిశ్చితి, పరిపాలనలో గందరగోళం, ఆర్థిక పతనం తదితరాలు 3 ట్రిలియన్ డాలర్ల వృద్ధికి అవసరమైన దీర్ఘకాలిక పెట్టుబడులకు అవరోధంగా మారుతున్నాయి.
కాంగ్రెస్ సర్కార్ 3 ట్రిలియన్ డాలర్ల విజన్ ఒక అపోహే. మూసీ, ఫ్యూచర్ సిటీ ద్వారా చేసే దోపిడీ, ప్రాథమిక మౌలిక సదుపాయ ప్రాజెక్టులను చేపట్టలేని, పాలనాసామర్థ్యం లేని ఈ ప్రభుత్వం ఇలాంటి లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం. కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ ప్రగతికి బలమైన పునాది నిర్మించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వారసత్వాన్ని కొనసాగించడంలో ఒక్క ఏడాదిలోనే విఫలమైంది.
3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ దిశగా మార్పు ఆశించిన తెలంగాణ ప్రజల కండ్లముందు కఠిన వాస్తవాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అసమర్థత ఆ లక్ష్యాన్ని నెరవేర్చదు. మూసీ ప్రాజెక్టు గాయం ఇంకా మానలేదు. ఫ్యూచర్ సిటీ పేపర్‌పైనే కనిపిస్తున్నది. ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవుతున్నది. ఒకప్పుడు అభివృద్ధి, ఆదర్శ పాలనకు మారుపేరైన తెలంగాణ ప్రస్తుతం అంతకంతకు దిగజారుతున్నది. బీఆర్ఎస్ చేస్తున్న హెచ్చరికలు రాజకీయపరమైనవి కావు. బీఆర్ఎస్ ఆరోపణలు పాలనా వైఫల్యం, ఆర్థిక పతనం, వ్యవస్థాగత దోపిడీని ఆధారాలతో సహా చూపుతున్నాయి. తెలంగాణ భవిష్యత్తు కోసం పాలనా సామర్థ్యాన్ని ప్రదర్శించే ప్రభుత్వంగా; పారదర్శకత, బాధ్యతాయుత పాలన విషయంలో కట్టుబడిన సర్కార్‌గా మారితే బాగుంటుంది. అలా జరిగే వరకు 3 ట్రిలియన్ డాలర్ల విజన్ ఒక అపోహ మాత్రమే.
(వ్యాసకర్త: రాష్ట్ర శాసనమండలి సభ్యులు)
-డాక్టర్ దాసోజు శ్రవణ్