కేంద్ర ప్రభుత్వం జూలై 16న ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి తమ ఎజెండా అంశాలను సూచించాలని ఆయా రాష్ర్టాలను కోరింది. సహజంగానే ఆంధ్రప్రదేశ్ పోలవరం-బనకచర్ల (పీబీ)లింకు ప్రాజెక్టును తమ ఏకైక ఎజెండాగా కేంద్రానికి సూచించింది. అయితే, ఈ సమావేశం ఏర్పాటయ్యే నాటికే నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు.. పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (ఈఏసీ), కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) చాలా స్పష్టమైన వ్యాఖ్యలతో, అభ్యంతరాలతో కేంద్రానికి ఏపీ సర్కారు పంపించిన పోలవరం-బనకచర్ల పథకం ప్రాథమిక నివేదికను (Pre Feasibility Report) తిరస్కరించాయి.
ఈ సంస్థలు లేవనెత్తిన అభ్యంతరాలపై ఇప్పటికే పత్రికల్లో విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రుల సమావేశానికి ఎజెండా విషయమై జూలై 14న మన రాష్ట్రం రెండు లేఖలు రాసింది. ఒకటి, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సెక్రెటరీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాసిన లేఖ. అందులో పైన పేర్కొన్న నాలుగు కేంద్ర సంస్థల వ్యాఖ్యలను, అభ్యంతరాలను ఉటంకించారు. ఆ సంస్థల వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు సదరు ప్రాజెక్టుపై చర్చించడం అకాల (Premature) చర్యగా భావిస్తున్నామని, కాబట్టి చట్టపరమైన అన్ని అనుమతులు వచ్చే దాకా, అంతర్రాష్ట్ర ఒప్పందాలపై చర్చలు ఒక కొలిక్కి వచ్చేదాకా పీబీ లింకు ప్రాజెక్టును ఎజెండా నుంచి తొలగించాలని కేంద్ర జలవనరుల శాఖ సెక్రటరీని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ కోరారు. ఈ లేఖను తెలంగాణ ప్రజలు స్వాగతించారు.
ఇక రెండవ లేఖ. అదే రోజు కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాసినది. ఈ లేఖలో తెలంగాణ తరఫున చేర్చవలసిన ఎజెండా అంశాలను పొందుపరిచారు. వీటిలో పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు అనుమతులు, శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ అక్రమంగా తరలిస్తున్న కృష్ణా నీటి సంబంధిత వివాదాలు, కృష్ణా ట్రిబ్యునల్-2లో సెక్షన్ 3 కింద జరుగుతున్న వాదనలు, కృష్ణా బోర్డు, తుంగభద్రా బోర్డు సమస్యలు, ఏపీ అక్రమంగా, అనుమతులు లేకుండా ఏకపక్షంగా చేస్తున్న ప్రాజెక్టుల విస్తరణ సంబంధిత వివాదాలు, జల విద్యుత్తు ఉత్పత్తిలో సమస్యలు, తెలంగాణ ప్రాజెక్టులకు ప్రధాన్ మంత్రి కిసాన్ సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద ఆర్థిక సహాయం, గోదావరి (ఇచ్చంపల్లి)-కావేరి లింకు ప్రాజెక్టు.. ఇట్లా బోలెడు పెండింగ్ అంశాలను ప్రతిపాదించారు. అయితే మంత్రి తన లేఖలో ఎక్కడా పీబీ లింకు ప్రాజెక్టుపై ఏ రకమైన అభిప్రాయాలను వెల్లడించలేదు. కనీసం ఆ ప్రాజెక్టును ఎజెండా నుంచి తొలగించాలని కూడా కోరలేదు. కేంద్రం మాత్రం ఏపీ ప్రతిపాదించిన పీబీ లింకు ప్రాజెక్టును మొదటి అంశంగా, తెలంగాణ రాష్ట్రం ప్రతిపాదించిన అంశాలను రెండవ ప్రాధాన్య అంశాలుగా చేర్చి ఎజెండా ను రూపొందించి రెండు రాష్ర్టాలకు పంపించింది. విచిత్రం ఏమంటే.. కేంద్రం ఈ సమావేశాన్ని ముఖ్యమంత్రుల సమావేశమని అన్న ది కానీ, అపెక్స్ కౌన్సిల్ సమావేశమని చెప్పలేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా అపెక్స్ కౌన్సిల్ సమావేశంగా మార్చాలని అడగలేదు.
ఈ నేపథ్యంలో జూలై 16న ఢిల్లీ శ్రమ్శక్తి భవన్లో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, సాగునీటి శాఖ మంత్రులు, అధికారులు, ఇంజినీర్లు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశం మినిట్స్ ఇంకా విడుదల కాలేదు. కాబట్టి, అక్కడ ఏం చర్చలు జరిగాయో తెలుసుకోవడానికి ఏపీ తరఫున మీడియాతో మాట్లాడిన ఆ రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలు, తెలంగాణ తరఫున మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలే ఆధారం.
వాటి ఆధారంగానే కొన్ని పత్రికలు మరుసటి రోజు ఆంధ్ర ఎడిషన్లలో ఒక తీరుగా, తెలంగాణ ఎడిషన్లలో మరొక తీరుగా వార్తలు రాశాయి. నిమ్మల మాటల ప్రకారం.. పీబీ లింకు సహా రెండు రాష్ర్టాల ప్రాజెక్టులకు సంబంధించి అన్ని అంశాలను చర్చించడానికి ఇరు రాష్ర్టాల అధికారులు, ఇంజినీర్లతో ఒక కమిటీ నియమించడానికి అంగీకారం కుదిరింది. ఈ కమిటీ చర్చించి ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత తిరిగి ముఖ్యమంత్రుల సమావేశంలో తుది నిర్ణయం జరుగుతుంది. ఇకపొతే రేవంత్‌రెడ్డి మాటల ప్రకారం.. ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ అంశాలపై చర్చించడానికి కమిటీ ఏర్పాటు చేయాలని ఒక అంగీకారం కుదిరింది. పీబీ లింకు ప్రాజెక్టును కడతామని వారు అనలేదు కాబట్టి, వీరికి వ్యతిరేకించే అవసరమే రాలేదు. తాము ఏర్పాటు చేసిన కమిటీ కాబట్టి, ఆ కమిటీ చేసిన సిఫారసులను అంగీకరిస్తామని కూడా స్పష్టం చేశారు. పీబీ లింకుపై చర్చ జరిగిందని నిమ్మల, జరగలేదని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు. మొత్తం మీద కమిటీ వేయడానికి అంగీకారం కుదిరిందని మాత్రం ఇద్దరూ ధ్రువీకరించారు.
జూలై 16న జరిగిన సమావేశం అనంతరం తెలంగాణలో చర్చ వేడెక్కింది. ఆ చర్చలు ఎట్లున్నా.. సీఎస్ రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం విలువ ఇస్తున్నట్టా, లేనట్టా? అవి రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలా, కావా? అన్నది ప్రధాన చర్చనీయాంశమని నా అభిప్రాయం. ఆయన రాసిన లేఖలోని పేజీ 6లో ఇట్లా ఉంది.
3. Prematurity of Discussions : Given the unresolved and substantive objections of the PPA, CWC and EAC, the lack of statutory clearances, and the ongoing violations of binding legal provisions and tribunal awards, it is unequivocally premature and procedurally untenable to discuss the Godavari-Banakacharla Link Project at this stage. Proceeding otherwise would undermine the authority of the Government of India’s own regulatory mechanisms and set a precedent contrary to the rule of law.
ఈ అద్భుతమైన మాటలు రాస్తూ చివరలో మరో గొప్ప పేరాను చేర్చారు. 4. Formal Request: The agenda for the meeting be revised to defer any discussion on the Godavari-Banakacharla Link Project until all statutory requirements, interstate consultations and clearances are fully complied with and all objections resolved.
ఈ లేఖలో చీఫ్ సెక్రెటరీ ప్రస్తావించిన, వెలిబుచ్చిన అభిప్రాయాలే తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలైతే, తెలంగాణ ఇక ముందు పీబీ లింకు ప్రాజెక్టుపై ఎటువంటి చర్చల్లో పాల్గొనకూడదు. అటువంటి చర్చలను బహిష్కరించి తీరాల్సిందే.
పీబీ లింకు ప్రాజెక్టు ఇప్పుడు కేంద్రం, ఏపీ ప్రభుత్వాల మధ్య వివాదంగా మారింది. వారిద్దరి వివాదంలో మనమెందుకు తలదూర్చాలి? మనం జాగ్రత్తగా, అప్రమత్తంగా ముందు ముందు జరిగే పరిణామాలను గమనిస్తూ పోవాలి. వ్యవహారం పక్కదారి పడుతున్నదని అనిపించినప్పుడు కేంద్రానికి మన అభ్యంతరాలను తెలియజేస్తూ లేఖలు రాయాలి. అంతేతప్ప, చీఫ్ సెక్రెటరీ అభిప్రాయాలకు భిన్నంగా పోవలసిన అవసరం కనిపించడం లేదు. ఇరు రాష్ర్టాల అధికారులు, ఇంజినీర్ల కమిటీ ఏర్పాటులో పీబీ లింకు ప్రాజెక్టుపై చర్చకు తెలంగాణ సిద్ధంగా లేదని ప్రకటించాలి. తెలంగాణ సూచించిన పెండింగ్ అంశాలు తప్ప మరేవీ చర్చించబోమని స్పష్టం చేయాలి. కమిటీ ఏర్పాటుతో పాటు కమిటీకి టీవోఆర్ కూడా రూపొందించాలి. ఇవి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రెటరీ కేంద్రానికి రాసిన లేఖలో వ్యక్తమైన అభిప్రాయాలు కాబట్టి, వీటికి భిన్నంగా వ్యవహరించడమంటే తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడుతున్నట్టు అనుకోవలసి వస్తుంది.
ముఖ్యమంత్రుల సమావేశానికి ముందు జరిగిన చర్చలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సమాజం కొన్ని డిమాండ్లను కేంద్రం, ఏపీ ప్రభుత్వం ముందుంచాయి.
1. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన 968 టీఎంసీల గోదావరి జలాల హక్కుల పత్రంపై ఏపీ ప్రభుత్వం బేషరతుగా సంతకం చేయాలి.
2. 75 శాతం నీరు పోగా మిగులు ఎంతైనా కానీ, వాటిలో కూడా తెలంగాణ వాటా అదే నిష్పత్తిలో ఎంతో తేలాలి. కేంద్ర జలసంఘం గేజ్ రీడింగ్స్ ప్రకారం ఏటా సరాసరి 3 వేల టీఎంసీల జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి. ఈ జలాల్లో తెలంగాణ వాటా 1,950 టీఎంసీలు అని ఒక లెక్క ఉంది. గోదావరి బేసిన్ రాష్ర్టాలు ఇంకా తమ వాటాను పూర్తిగా వినియోగించకోక పోవడంతో 3 వేల టీఎంసీల మిగులు కనబడుతున్నదని, ఆ రాష్ర్టాలు పూర్తిగా వినియోగించుకుంటే మిగులు ఇంత ఎక్కువగా ఉండకపోవచ్చని ఇంజినీరింగ్ మేధావుల్లో ఒక అభిప్రాయం ఉన్నది. సీడబ్ల్యూసీ గోదావరి అవార్డు ప్రకారం మదిం పు చేసి ఈ మిగులు ఎంతో తేల్చవలసిన అవసరం ఉన్నది. ఈ మిగులు నీటిపై కూడా తెలంగాణ హక్కులు స్థిరపడాలి.
3. గోదావరి, కృష్ణా అవార్డుల ప్రకారం పోలవరం నుంచి కృష్ణా బేసిన్‌కు నీటిని మళ్లించినందుకు ప్రతిఫలంగా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా పెరగాలి. 80 టీఎంసీలు మళ్లించినందుకు గాను 45 టీఎంసీలు, దీనికి అదనంగా పీబీ లింకు ద్వారా మళ్లించదలచిన 200 టీఎంసీల్లో అదే నిష్పత్తిలో 112.5 టీఎంసీలు.. మొత్తం 157.5 టీఎంసీలు కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటా దక్కాలి.
ఈ డిమాండ్లపై చర్చ జరిగే ముందు 4 కేంద్ర సంస్థలు లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణలు, పరిష్కారాలు వెల్లడి కావాలి. రెండు రాష్ర్టాల మధ్య అంతర్రాష్ట్ర చర్చలు ఇరు రాష్ర్టాలకు ఆమోదయోగ్యంగా కొలిక్కి రావలసి ఉన్నది. అంతవరకు సీఎస్ అభిప్రాయాలే రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలుగా ఉండాలి. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ చర్యలు ఉండాలి. అందుకు భిన్నంగా ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వదని, ఇవ్వకూడదని నేను గాని, మరెవ్వరైనా గాని ఆశించడంలో తప్పు లేదు.