పాలన భవనాలు ప్రభుత్వ కార్యక్రమాల అమలు కేంద్రాలు మాత్రమే కాదు, అవి ప్రజల సాంస్కృతిక వారసత్వ చిహ్నలు. నిబద్ధులైన పాలకులు తమ పాలనా నిర్వాహక కేంద్రాలను ఆ సంస్కృతి కొనసాగింపులో భాగంగానే చూస్తారు. నేడు మన ముందు రూపుదాల్చిన నూతన తెలంగాణ సచివాలయ భవనం కూడా అటువంటిదే.
ఉమ్మడి ఏపీలో సచివాలయ భవనం అరకొర సౌకర్యాలతో ఉండేది. అప్పటి ప్రభుత్వాలు ఎప్పటి అవసరాలకు అనుగుణంగా అప్పుడు పాత భవనాలను కూల్చివేస్తూ కొత్త భవనాలను కడుతూ వచ్చారే తప్ప భవిష్యత్ అవసరాలను గుర్తించలేదు. నాడు ముఖ్యమంత్రి కార్యాలయంగా ఉపయోగించిన సమత బ్లాక్ (సి బ్లాక్)ను 1978లో నిర్మించారు. అది ప్రస్తుత అవసరాలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేకపోగా, భద్రతపరంగా అనేక సవాళ్లు ఉన్నాయని పలు నివేదికలు వెల్లడించాయి. 2004లో పూర్తయిన డి-బ్లాక్‌ను కొత్త సౌకర్యాలతో నిర్మించినా, ప్రారంభమైన తొలిరోజు నుంచే ఎన్నో లోపాలు బయటపడ్డాయి. సచివాలయంలోని వివిధ భవనాల ఆధునికీకరణ, అంతర్గత డిజైనింగ్ పేరుతో ఏటా లక్షల రూపాయలు ఖర్చు చేసేవారు. అంతేగానీ, రాష్ట్ర పాలనకు కేంద్రమైన సచివాలయాన్ని దాని ప్రాధాన్యానికి తగిన స్థాయిలో పునర్నిర్మించటంపై అప్పటి పాలకులు దృష్టి పెట్టలేదు. సచివాలయంలో వేర్వేరుగా ఉన్న అనేక భవనాలలో హెచ్ బ్లాక్ ఒకటి. దానిని కూల్చివేసి కొత్తగా రెండు (నార్త్, సౌత్) హెచ్ బ్లాక్ భవనాలను నిర్మించారు. వాటిలో కూడా ప్రారంభం నుంచే అనేక రిపేర్లు, అంతర్గత మార్పులు జరుగుతుండేవి. ఇక జే, కే, ఎల్, ఏ, బీ బ్లాకు భవనాలను వినియోగించడంలో కూడా ఎన్నో అవాంతరాలు, భద్రతపరమైన సమస్యలు ఎదురయ్యేవి.
గత 20 ఏండ్లలో పరిపాలనలో అనేక కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. టైప్ మెషిన్ల కాలం పోయి కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్, ఓఎఫ్సీ, వై-ఫై వాడకం పెరిగింది. వాటికి తగినట్లు సర్వర్ల ఏర్పాటు, నిరంతర విద్యుత్ సరఫరా, ఏసీల వినియోగం తప్పనిసరి అయింది. డాటా స్టోరేజీ, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త సవాళ్లు తలెత్తాయి. వాటికి తగిన పరిష్కారాలు చూడాల్సి వచ్చింది. అదేవిధంగా ప్రజల ముందుకు పాలనను తీసుకు రావటం కోసం ఆధునిక కమ్యూనికేషన్స్ వ్యవస్థలను విరివిగా వాడుతూ మారుమూల ప్రాంతాలను పరిపాలనతో అనుసంధానించాల్సి వచ్చింది. ఈ అవసరాలకు పాత భవనాల్లో సౌకర్యాలు ఏర్పాటు చేసే క్రమంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం కొత్తగా అభివృద్ధి చెందుతున్న ఈ-ఫైలింగ్, ఈ-ఆఫీస్ వంటి వాటిని పల్లె, పట్నం మొదలుకొని రాష్ట్ర రాజధాని వరకు విరివిగా ఉపయోగించాలంటే ఆధునిక సౌకర్యాలు, కొత్త హంగులతో కూడిన నూతన భవనం ఆవశ్యకత అనివార్యమైంది.
తెలంగాణను సాధించిన తొలినాళ్లలోనే ఈ అవసరాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రహించారు. భవిష్యత్ తెలంగాణ పరిపాలనకు, సుస్థిర అభివృద్ధికి భరోసా ఇచ్చే భవనం నిర్మించాలని సంకల్పించారు. కొత్త రాష్ట్రం సాధించుకున్న తర్వాత వేగంగా చోటు చేసుకుంటున్న అభివృద్ధి కార్యకలాపాలు, పాలన వికేంద్రీకరణలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు, సమీకృత జిల్లా పరిపాలనా కార్యాలయాలు, పోలీసు కార్యాలయాలు, రాజధానిలో నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ వంటివి పరిపాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న ప్రగాఢ సంకల్పాన్ని తెలియజేస్తున్నాయి. దీంట్లో భాగంగానే నూతన సచివాలయం కూడా నిర్మాణమైంది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఇవ్వాళ దేశానికే రోల్ మోడల్. రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి ఇచ్చిన ఒక కానుక. కొత్త సచివాలయం వేదికగా తెలంగాణ సచివాలయ ఉద్యోగులు మరింత ఉత్సాహంతో పని చేసి, అంబేద్కర్ కలలుగన్న ప్రజాసంక్షేమం కోసం నిబద్ధతతో కృషి చేయాలి. దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని ఒక దిక్సూచిగా, ఆదర్శంగా నిలబెట్టాల్సిన తరుణమిది. తెలంగాణ ప్రజలందరి సంబురమిది.
(వ్యాసకర్త: కోశాధికారి, తెలంగాణ సచివాలయ సంఘం)
రేండ్ల రాజేశ్
99126 61170