ఎన్నో ఆశలతో బడ్జెట్ కోసం ఎదురుచూసిన మధ్యతరగతికి నిరాశే ఎదురైంది. వికసిత్ భారత్ అంటూనే ‘డల్’ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కర్తవ్య పథ్ అంటూనే ఖర్చుల విషయంలో కన్నెర్రజేసింది. ఈ బడ్జెట్లో మిడిల్ క్లాస్‌కు ఎటువంటి పెద్ద ట్యాక్స్ ఊరట లేదు. పెద్దపాటి ఆదాయ పన్ను స్లాబుల్లో సందర్భీకృతమైన ఊరట కూడా కనిపించలేదు. అటు స్టాక్ మార్కెట్లో సంస్కరణలు తెస్తామని ప్రకటిస్తూనే స్టాక్ మార్కెట్ కుప్పకూలే విధంగా బడ్జెట్ ప్రతిపాదనలు సాగాయి. వికసిత్ భారత్ లక్ష్యంగా గ్రామీణ ఆర్థికాన్ని బలోపేతం చేస్తూ యువత, మహిళ, అన్నదాతలకు అత్యధిక నిధులు కేటాయిస్తారని ఆశించగా నిరాశే ఎదురైంది.. ఆర్థిక సర్వేలో పేర్కొన్నట్టు 6.8-7.2 మధ్య వాస్తవ వృద్ధిని సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా నిధుల కేటాయింపు జరగలేదు.
ఆర్థిక వ్యవస్థలో ప్రజల వినియోగం పెరిగితేనే డిమాండ్ పెరుగుతుంది. మార్కెట్లో డిమాండ్ పెరిగితేనే ఉత్పత్తి పెరుగుతుంది, తద్వారా జీడీపీ పెరిగి ఉద్యోగావకాశాలు కూడా పెరిగి, నిరుద్యోగం తగ్గి పేదరికం మరింత తగ్గుతుంది. ఇది సింపుల్ సూత్రం. మరి వినియోగం పెరగాలంటే పన్నుల విధింపులో ఉపశమనం ఉండాలి. పన్నులు తగ్గాలి. పన్నుల హేతుబద్ధీకరణ జరగాలి. కానీ పన్ను స్లాబుల్లో ఎలాంటి ఊరట లభించలేదు. తగ్గకపోగా పెట్టుబడులను ప్రోత్సహించే మూలధన మార్కెట్లో ఆశలకు కొత్త బడ్జెట్ పూర్తి విరుద్ధంగా ఉంటూ వినియోగదారులలో నిరాశను కలిగించింది. ఈ బడ్జెట్ మదుపర్ల ఆశలను పూర్తిగా తుంచి వేసి మార్కెట్ సెంటిమెంట్లను మరింత దెబ్బతీసింది. అంటే బడ్జెట్ ప్రతిపాదనలు మార్కెట్‌కు నచ్చలేదు అని అర్థం. పన్నుల నుండి తప్పించుకునే వారిని పన్ను పరిధిలోకి తేవడం, పన్ను వసూళ్లలో సాంకేతికత, హేతుబద్ధీకరణ తీసుకురావడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలి తప్ప అధిక పన్నులు వేసి కాదు.
తెలంగాణ రాష్ర్టానికి గుండు సున్నా మిగిలింది. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ది… వికసిత్ భారత్‌కు వెన్నుదన్నుగా నిలుస్తామని రాష్ర్టానికి ప్రగతి రెక్కలు తొడిగి లక్ష్యాన్ని సాధించడానికి తమకూ అవకాశమివ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రతిపాదనలు చేసింది. వాటిపై సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో 2026-27 బడ్జెట్‌పై తెలంగాణకు భారీ ఆశలు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రతిపాదనలను కేంద్రం పెడచెవిన పెట్టింది. దాదాపు 1.2 లక్షల కోట్ల విలువతో తెలంగాణ రాష్ట్రం ఈ నూతన బడ్జెట్ కోసం కేంద్రానికి చేసిన ప్రతిపాదనలలో ముఖ్యమైనవి ఇవి.
హైదరాబాద్ చుట్టూ 350 కి.మీ పక్కా రోడ్ల అభివృద్ధికి రూ.45,000 కోట్లు, గ్రీన్‌ఫీల్డ్ రహదారుల అభివృద్ధి కోసం రూ.45,000 కోట్లు, 4 విమానాశ్రయాలు (మామునూరు, ఆదిలాబాద్, పాల్వంచ, బసంత్‌నగర్) నిర్మించడానికి రూ.1,100 కోట్లు, 350 కి.మీ పొడవు రైల్వే మార్గాలకు నిధులు, హైదరాబాద్‌లో మెట్రో ఫేజ్-2 విస్తరణకు రూ.2,426 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ.17 వేల కోట్ల మంజూరును కోరింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏప్రాజెక్టును కూడా పరిగణించకుండా కేంద్రం మొండిచేయి చూపింది. అయితే, కేంద్రం కేవలం హైదరాబాద్-బెంగళూర్, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-పుణె మధ్య మూడు హైస్పీడ్ రైలు మార్గాలపై ముక్తసరి ప్రకటన తప్ప తెలంగాణకు ఈ బడ్జెట్లో ఏ కేటాయింపులూ చేయలేదు. 8 మంది ఎంపీలను కేంద్రానికి ఇచ్చిన తెలంగాణకు ఇచ్చింది మాత్రం సున్నా. 16వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ర్టానికి నిధులు తగ్గబోతున్నాయి.
అలాగే పన్ను రేట్ల హేతుబద్ధీకరణ వలన కూడా రాష్ట్రం రూ.7 వేల కోట్లకు పైగా నష్టాలను చూడబోతున్నది. ఆ దిశగా ఆలోచించి కొన్ని గ్రాంట్లను విడుదల చేయాలని తెలంగాణ కోరింది. కానీ ఆ దిశగా కూడా బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఆరెంజ్ ఎకానమీలో హైదరాబాద్ హబ్‌గా ఉంది. కానీ, దానిని కూడా ముంబయికి తరలించారు. రీజినల్ మెడికల్ హబ్ అని మెన్షన్ చేసినా అందులో కూడా తెలంగాణ లేదు. మూసీ ప్రక్షాళన కోసం ప్రధాని, పలువురు కేంద్ర మంత్రులను కలిసినా సాయం అందలేదు. రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తించినా టూరిజం విషయంలో కూడా రాష్ర్టానికి నిధులు కేటాయింపు జరగలేదు. రూ.57.47 లక్షల కోట్ల బడ్జెట్లో తెలంగాణకు కొంతమేర నిధులు ఇచ్చినా వికసిత్ భారత్‌కు మరింత సాయం అందించలేదు. పలు రంగాలకు అరకొర నిధుల కేటాయింపు వలన వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం అవుతుంది.