MK Stalin : తమిళనాడు (Tamil Nadu) లో రాష్ట్రపతి పాలనను నివారించేందుకే నటుడు విజయ్ (Actor Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వ ఏర్పాటుకు తమ మిత్రపక్షాలు మద్దతివ్వడానికి అనుమతించామని డీఎంకే అధినేత (DMK Chief), మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ద్వారా బీజేపీ జోక్యాన్ని అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టంచేశారు. డీఎంకే దయాదాక్షిణ్యాలపైననే టీవీకే ప్రభుత్వం ఆధారపడి ఉందని వ్యాఖ్యానించారు. శనివారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు.
కాగా, 2026 ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకుగాను టీవీకే 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మెజారిటీని ఆ పార్టీ సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో డీఎంకే కూటమిలోని సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి పార్టీలతోపాటు, కూటమి నుంచి విడిపోయిన కాంగ్రెస్ మద్దతుతో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మిత్రపక్షాలు టీవీకేకు మద్దతిస్తామని తనను సంప్రదించినప్పుడు, అది వారి ప్రజాస్వామ్య హక్కు అని భావించి తాను అడ్డుకోలేదని స్టాలిన్ వివరించారు.
డీఎంకే అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో గెలిచిన తమ మిత్రపక్షాల మద్దతుతోనే ప్రస్తుతం టీవీకే ప్రభుత్వం నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమ పార్టీని నిరుత్సాహపరచలేదని, ప్రతిపక్షంలో ఉంటూనే ప్రజలకు సేవ చేస్తామని ఆయన స్పష్టంచేశారు.