– ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
రామగిరి, జూన్ 06 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత ఆలోచనలతో తెలంగాణలో ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో నిర్లక్ష్యంగా ఉండడంతో ఒకటి, అర తప్ప మిగిలినవి పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదని, రైతాంగం, ధాన్యం కొనుగోళ్లు, ఇతర పలు సమస్యల పరిష్కారం అసంపూర్తిగానే ఉండడంతో ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లిందని, దీంతో వీటిని నిరసిస్తూ ఈ నెల 10న నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించే ఆందోళనకు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. నల్లగొండలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై పెనుభారం మోపిందన్నారు. ఈ ప్రభావం అన్ని రంగాలపై పడిందన్నారు. మరో వైపు ఎరువుల ధరలు పెరగడంతో వ్యవసాయంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. అదానీ, అంబానీలకు రూ.వేల కోట్లు రాయితీలు ఇస్తూ సామాన్యుల నడ్డి విరుస్తూ కేంద్రం సహితం ప్రజలపై చిత్తశుద్ధి లేకుండా వ్యవరిస్తుందని దుయ్యబట్టారు. తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంలో బీజేపీ సర్కార్ విఫలమైందన్నారు.
అదే విధంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తాము మిత్రపక్షం అయినప్పటికీ ప్రజల సమస్య పరిష్కారంలో ముందుండి పోరాడుతామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు అవుతుంది. అయితే ప్రకటించిన పథకాల్లో ఒకటి అర మినహా మిగతావి ఏవీ సంపూర్ణంగా ప్రజలకు అందడం లేదు. రుణమాఫీ, రైతు భరోసా కూడా అరకొరగానే ఇచ్చారని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్స్, కల్యాణలక్ష్మీ లాంటి పథకాలు పెంచలేదని, ధాన్యం కొనుగోళ్లలో ప్రత్యేక ప్రణాళిక లేకపోవడంతో యాదాద్రి భువనగిరి లాంటి జిల్లాలో ఇంకా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున్నధాన్యం మార్కెట్లో ఉందన్నారు. రైతుల నుండి 5 నుంచి 8 కిలోల వరకు తరుగు తీశారన్నారు. కొనుగోళ్లపై ప్రభుత్వానికి ముందుచూపు, చిత్తశుద్ది పూర్తిగా కొరవడడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
గత ప్రభుత్వం మీద నెపంతో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్ధానాలను విస్మరించడం తగదన్నారు. అదేవిధంగా నల్లగొండ జిల్లాలోని తాగు, సాగునీటి ప్రాజెక్టులైన ఎస్ఎల్బీసీ సోరంగ మార్గం, డిండి ఎత్తిపోతల, ఉదయ సముద్రం ప్రాజెక్టుల పనులు ముందుకు సాగుతలేవన్నారు. ప్రాజెక్టుల వారిగా టార్గెట్ పెట్టుకుని పూర్తి చేస్తే తప్ప ఫలితం ఉండదన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కమిటీ పెత్తనంతో అర్హులకు న్యాయం జరగడం లేదని, ఇంకా పూర్తి అయినప్పటికీ బిల్లులు చెల్లిస్తలేరన్నారు. దీంతో రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందన్నారు. సింగిల్ విండో ఎన్నికలు నామినేషన్ పద్ధతిలో కాకుండా గతంలో మాదిరిగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. రైతు డిస్కంను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మాట్లాడుతూ రెచ్చగొట్టడు తగదని హితవు పలికారు. వీటన్నింటిని నిరసిస్తూ ఈ నెల 10 నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో రైతులు, కార్మికులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం నాయకుడు ఉజ్జిని యాదగిరిరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా నర్సింహ్మరెడ్డి, సీనియర్ నాయకుడు మల్లేపల్లి ఆదిరెడ్డి, పార్టీ నేతలు పల్లా దేవేందర్‌రెడ్డి, లొడంగి శ్రవణ్ కుమార్, బంటు వెంకటేశ్వర్లు, తూము బుచ్చిరెడ్డి, టి.వెంకటేశ్వర్లు, కర్ర సైదిరెడ్డి పాల్గొన్నారు.