Ex MLA : సైబరాబాద్ పరిధిలోని గండిపేటలో వెలుగుచూసిన రూ.1,500 కోట్ల భూకుంభకోణం కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. తమిళనాడులో అరెస్టయిన ఆయనను పోలీసులు శనివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ కోర్టులో హాజరుపర్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో, పోలీసులు ఆయనను చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు.
ఈ కేసు వెలుగుచూసినప్పటి నుంచి పరారీలో ఉన్న బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు శుక్రవారం తమిళనాడులోని కాంచీపురంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించి, నార్సింగి పోలీస్ స్టేషన్లో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఆయన అనుచరులు, వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో అక్కడ కొంత సమయంపాటు ఉద్రిక్తత నెలకొంది. దాంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత నడుమ బ్రహ్మనాయుడిని కోర్టుకు తరలించారు.
రంగారెడ్డి జిల్లా గండిపేటలోని సర్వే నంబర్ 18 లో గల సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు బ్రహ్మనాయుడు మరికొందరితో కలిసి కుట్ర పన్నారని గండిపేట తహసీల్దార్ ఎన్ శ్రీనివాస్ రెడ్డి మే 23న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు), రెవెన్యూ రికార్డులను సృష్టించి, ఆ భూమిని ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో రూ.1,500 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే అయిన బ్రహ్మనాయుడు ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కుంభకోణానికి సంబంధించి పోలీసులు ఇప్పటివరకు మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.