ప్రధాని మోదీ ఇంటి పేరును అవమాన పరిచేవిధంగా మాట్లాడిన ఎంపీ రాహుల్‌గాంధీకి గుజరాత్ కోర్టు రెండేండ్ల జైలుశిక్ష విధించి, ఎంపీ పదవిని రద్దుచేసింది. ప్రభుత్వ నివాస గృహాన్ని కూడా ఖాళీ చేయించింది. ఇది సరే తెలంగాణలో ఒక ఎంపీగా, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను కించపరిచేలా బూతుపురాణం చదువుతూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాడు. మరి ఆయనకు ఎలాంటి శిక్ష వేయాలో ప్రజలు నిర్ణయించాలి.
పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి గతంలో కూడా సంచారజాతుల కులాలను ఇలాగే తిట్టి అవమానించాడు. అయితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చిన తర్వాత ఆయా కులాల తిట్టు పదాలు దాదాపుగా కనుమరుగయ్యాయి. కానీ, బీసీల్లోని సంచారజాతుల కులాల తిట్టుపదాలు అలాగే కొనసాగుతున్నాయి. రాజకీయ నాయకులు సభా వేదికలుగా కులాల పేరును తిట్టుగా వాడుతున్నారు. ఆయా కులాలన్నీ బీసీలే అయినా ఏ ఒక్క బీసీ సంఘం ప్రశ్నించకపోవడం శోచనీయం. బాధిత కులాల ప్రజలు తగిన జనాభా లేకపోవడం, సామాజికంగా అవగాహనాలోపం వల్ల ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతున్నారు. ఇదే అదనుగా తీసుకొని రేవంత్‌రెడ్డి లాంటి నాయకులు ఆయా కులాల పేరును తిట్టుగా వాడుతుండటం బాధాకరం.
బీసీల్లోని కొన్ని కులాలు అసలు అవి కులాలే కావన్నట్టుగా కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు తీసుకున్నట్టయితే మాజీ ఎంపీ రాజగోపాల్‌రెడ్డి ‘బుడబుక్కలోడి వేషాలేస్తున్నాడని’, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ‘బుడబుక్కలోడు, మాయల మరాఠి, పిట్ట కథలు చెప్పేటోడు’ అని, మాజీ డిప్యూటీ సీఎం దామోదర నర్సింహా ‘మాయల ఫకీర్‌ను మించిపోయాడని’ రాష్ర్టానికి చెందిన ప్రముఖ నాయకుడిని పట్టుకొని కులాలను అవమానించేలా తిట్టారు. ఇదిలా ఉంటే మోదీ, వెంకయ్యనాయుడు, పవన్‌కల్యాణ్‌లను ఉద్దేశించి వైఎస్ షర్మిల ‘ఆ ముగ్గురూ జోగులే, జోగి జోగి రాసుకుంటే రాలేది బూడిదే’ అని కించపరిచింది. ఇలా పలువురు నాయకులు కొన్ని కులాల పేర్లను తిట్టుగా వాడటం సిగ్గుచేటు.
కొందరు రాజకీయ నాయకులకు బహురూపుల వేషాలు, దొమ్మరాట, దొమ్మరి గుడిసెలు, మందులోళ్లు, మాయలోళ్లు, దాసరి, గంగిరెద్దు, మొండి, వీరముష్ఠి, ఎల్లాపి, బండి వడ్డెర, ఆరెమరాఠి, బట్రాజు, సాతాని, భోగం, గారడి, హజామ్ మొదలైన బీసీ కులాల పేర్లను తిట్టుపదాలుగా వాడటం పరిపాటిగా మారింది. ఒకపక్క బీసీ కులాలను అవమానంగా మాట్లాడటం హేయం. దీంతో ఆయా కులాల మనోభావాలు దెబ్బతింటున్నాయి. వ్యక్తులు చేసే తప్పిదాలను, నేరాలను కులాలకు ఆపాదించటం క్షమించరాని నేరం. ఇలా కులాలను కించపరిచేవిధంగా ఏ నాయకుడు మాట్లాడినా, అతను ఏ హోదాలో ఉన్నా వెనుకడుగు వేయకుండా అతనిపై చట్టరీత్యా శిక్ష వేయాలి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 15, 21 ప్రకారం.. వ్యక్తి గౌరవం కోసం, సౌభ్రాతృత్వాన్ని, జాతి ఐక్యతను పెంపొందించటం అవసరం అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టులు స్పందించాలి. వారిపై సుమోటోగా కేసు స్వీకరించి తగిన చర్యలు తీసుకోవాలి.
(వ్యాసకర్త: సంచారజాతుల సంఘం అధ్యయన కమిటీ చైర్మన్)
వై.వెంకటనారాయణ
96402 74949