‘కేసీఆర్ ఒక ఎక్స్పైరీ మెడిసిన్. కేటీఆర్‌తోనే కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ముగుస్తుంది. కేసీఆర్‌ను మరిపించడానికే ఇప్పుడు కేటీఆర్‌ను ప్రస్తావిస్తున్నాం. ఆ తర్వాత హరీశ్‌రావును వాడుకొని కేటీఆర్‌కు చెక్ పెడతాం. హరీశ్‌రావును ఎలా ట్యాకిల్ చేయాలో మాకు బాగా తెలుసు’… ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల పలికిన ప్రగల్భాలు ఇవి. అయితే, రేవంత్‌కు తెలియని విషయం ఏమంటే… కేసీఆర్ ఎక్స్పైరీ లీడర్ కాదు, ఆయనొక ఇన్స్పైర్ లీడర్. కేసీఆర్ ఇన్స్పిరేషన్తోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. పదేండ్లలోనే దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగింది. ఒకప్పుడు ఆదర్శ రాష్ట్రంగా నిలిచిన తెలంగా ణ… రేవంత్‌రెడ్డి అనే ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఏలుబడిలో ఇప్పుడు వెనుకపడిపోవడం బాధాకరం.
కేటీఆర్, హరీశ్‌రావులు కేసీఆర్ నాటిన మొక్కలే. ఆ మొక్కలు ఎప్పుడో ఎదిగి పెద్ద పెద్ద మానులుగా మారాయి. ఆ మానులనే అంగుళం కూడా కదిలించలేని మీరు (రేవంత్ రెడ్డి) కేసీఆర్‌ను కదిలిస్తారా? ఆయన పేరును చెరిపేస్తారా? కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు.. ఈ ముగ్గురూ గాలి, నీరు, నిప్పు లాంటివారు. వాళ్లతో పెట్టుకోవడమంటే పంచభూతాలతో తలగోక్కోవడమే. వాళ్లను తక్కువ అంచనా వేస్తే మీ ఉనికికే ప్రమాదం.
కేసీఆర్ ఒక రాజకీయ శక్తి. ఆయనది 40 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయా ణం. రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి లాంటి ఎన్నో పదవులకు ఆయన వన్నె తెచ్చారు. అంతేకాదు, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నోసార్లు పదవులను గడ్డిపోచలా వదిలేశారు. రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పార్టీని స్థాపించి, పద్నాలుగేండ్లు పోరాటం చేసిన యోధుడాయన. కరడుగట్టిన సమైక్యవాదులైన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు, కిరణ్ కుమార్‌రెడ్డి లాంటి ఎందరితో కేసీఆర్ తలపడ్డారు. ‘తెలంగాణ అచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది.
సంక్షేమంలో, అభివృద్ధిలో తెలంగాణను పరుగులు పెట్టించిన కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ తలచుకుంటున్నారు. కానీ, పట్టుమని పది నెలలు కూడా తిరక్కుండానే కాంగ్రెస్ సర్కార్‌ను ‘మాకొద్దీ ప్రభుత్వం’ అని ప్రజలు ఈసడించుకుంటున్నారు. బహిరంగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రాయలేని భాషలో తిట్టిపోస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్‌పై రోజురోజుకు ప్రజా వ్యతిరేకత వెల్లువలా పెరుగుతున్నది. ఇవన్నీ తెలిసి కూడా కేసీఆర్ ఎక్స్పైరీ మెడిసిన్ అని రేవంత్ అంటుండటం ఆయన అవివేకానికి పరాకాష్ఠ.
ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన స్థాయి ఏమిటో తెలుసుకోవాలి. ఆయన ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానానికి ప్రతినిధి మాత్రమే. రాష్ట్ర కాంగ్రెస్‌పై గాని, ప్రభుత్వంపై గాని రేవంత్‌కు పూర్తి పట్టు లేదు. ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి ఆయనకు పూర్తి స్వేచ్ఛ లేదు. ప్రతీ పనికి అధిష్ఠానంపై ఆధారపడాల్సిందే. తుమ్మాలన్నా, దగ్గాలన్నా అధిష్ఠానం అనుమతి కావాల్సిందే. ఒక్కమాటలో చెప్పాలంటే అధిష్ఠానం తుమ్మితే ఊడిపోయే పదవి రేవంత్‌ది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి సుమారు ఏడాది కావస్తున్నా పాలనపై రేవంత్‌రెడ్డి పట్టు సాధించలేకపోయారు. అంతెందుకు, రాష్ట్ర మంత్రులే ఆయనకు మద్దతుగా నిలవడం లేదు. ఆయన వెంటే ఉంటూ వారు గోతులు తవ్వుతున్నారు. సొంత పార్టీ నేతల విశ్వాసాన్ని రేవంత్ ఎప్పుడో కోల్పోయారు. రాష్ట్రంలో ఏం జరిగినా రేవంత్ ఉలిక్కి పడుతుండటమే అందుకు నిదర్శనం.
ప్రజా సమస్యల పట్ల కాంగ్రెస్ సర్కార్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఎప్పుడో అటకెక్కాయి. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ నేతలపై ప్రతీకారం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నట్టుగా ఉన్నది. రేవంత్‌రెడ్డి నోటి వెంట కన్స్ట్రక్షన్ కన్నా డిస్‌స్ట్రక్షన్ అన్న మాటే ఎక్కువగా వినబడుతున్నది. హైడ్రా, మూసీ ప్రక్షాళన అంటూ కనీస అవగాహన లేకుండా, ఒక పద్ధతి పాటించకుండా పేదల ఇండ్లను కూలగొడుతూ వారిని రోడ్డున పడేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అందుకే, రాష్ట్రంలో నిత్యం నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేశామని ఇప్పుడు ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా, కేసీఆర్‌ను ఫినిష్ చేస్తా, ఆయనొక ఎక్స్పైరీ మెడిసిన్ అని ప్రగల్భాలు పలుకుతున్న సీఎం రేవంత్‌ను ప్రజలే ఫినిష్ చేసేందుకు సిద్ధమయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నాలుగో తరం నడుస్తున్నది. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో ఓ వెలుగు వెలిగిన కాం గ్రెస్‌కు ఇప్పుడు రాహుల్‌గాంధీ నాయకత్వంలో చీకటి యుగం నడుస్తున్నది. ఈ చీకటి యుగంలో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారనే విషయాన్ని మర్చిపోవద్దు. 1952-1984 మధ్యకాలంలో దేశంలో కాంగ్రెస్ హవా నడిచింది. అటు కేంద్రంలో, ఇటు మెజారిటీ రాష్ర్టాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. 1989 తర్వాత ప్రాంతీయ పార్టీల రాకతో పరిస్థితి తారుమారైంది. రానురాను కాంగ్రెస్ ఇంకా దారుణ స్థితికి చేరుకున్నది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీయే సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటుచేసేది. ఆ తర్వాత మిత్రపక్షాల సహకారంతో అధికారం చేపట్టేది. కానీ, ఇప్పుడు అనేక రాష్ర్టాల్లో ఆ పార్టీ ఉనికి కోల్పోయింది. రేవంత్ పాలన పర్యవసానంగా త్వరలో తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు అదే గతి పడుతుంది. తాను ఫినిష్ అవ్వడమే కాదు, కాంగ్రెస్‌ను కూడా రేవంత్ ఫినిష్ చేస్తారనే విషయం ముమ్మాటికీ నిజం.
కేసీఆర్ ఎప్పటికీ ఎక్స్పైరీ మెడిసిన్ కాదు, ఆయన తెలంగాణకు ఇన్స్పైర్ మెడిసిన్. రానున్న రోజుల్లో కేసీఆర్ అనే మెడిసిన్‌తో రేవంత్ రెడ్డి ‘నాకౌట్’ అవ్వడం ఖాయం!
– జీవీ రామకృష్ణారావు
(వ్యాసకర్త: కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, సుడా మాజీ చైర్మన్, కరీంనగర్)