మలిదశ తెలంగాణ ఉద్యమానికి మూలాలు నీళ్లలోనే ఉన్నాయి. తలాపున గోదావరి పారుతున్నా మడి తడవని తండ్లాట, పక్కన కృష్ణమ్మ పరుగులు తీస్తున్నా పంటపొలాలు నెర్రెలు బారి బీళ్లుగా మారుతున్న దయనీయ పరిస్థితులను చూసి ‘మా నీళ్లు మాకేనని’ మర్లబడిన జనం ఉద్యమ రాగాన్ని ఎత్తుకొని తెలంగాణ రాష్ట్రం కోసం పోరుబాట పట్టారు.
‘గోదావరి, కృష్ణమ్మలు మన బీళ్లను తడపాలి- పచ్చని మాగాణంలో పసిడి సిరులు పండాలి, సుఖసంతోషాలతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి’ అని ఆకాంక్షించారు. అందుకు రాష్ట్ర ఏర్పాటే పరిష్కారమనుకున్నారు. ప్రజల ఆకాంక్ష ఫలించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. కేసీఆర్ దార్శనిక నాయకత్వంలో జలకళ సాధించుకున్నాం. నీటి హక్కుల కోసం నిరంతరం జాగరూకతతో పోరాడుతున్నాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం మార్పుతో అంతా తారుమారు అవుతున్నది.
గడిచిన తొమ్మిదిన్నరేండ్లు సస్యశ్యామల తెలంగాణ కోసం ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో భగీరథ ప్రయత్నం జరిగింది. తెలంగాణలోని సాగునీటి రంగంతో పాటు సకల రంగాలపై పట్టున్న కేసీఆర్.. జల జగడాలను తనదైన పద్ధతిలో పరిష్కరించారు. లక్షలాది ఎకరాలకు అదనంగా సాగునీటి వసతిని పెంచి పల్లెపల్లెనా ధాన్యరాశులను సృష్టించారు. ‘కోటి ఎకరాల మాగాణం నా స్వప్నం’ అని ప్రకటించి సాగునీటి ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ చేసి, పెండింగ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసి లక్ష్య సాధన దిశగా ముందుకుసాగారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పాలకుల ఎడతెగని కుట్రలను ఛేదిస్తూ, మరోపక్కన రాష్ర్టాల హక్కులను తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే దుర్బుద్ధితో రాజ్యాంగ, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ కుట్రలను ఎదుర్కొంటూ రాజీలేని పోరాటం చేశారు కేసీఆర్.
అబద్ధాలు, అసత్యాలను సోషల్‌మీడియాలో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులకు ఈ ప్రాంత అవసరాల పట్ల అవగాహన గానీ, ప్రజల పట్ల ప్రేమ గానీ ఉన్నట్టు కనిపించటం లేదు. మరోసారి కృష్ణా జలాల పరిరక్షణకు కేసీఆర్ నాయకత్వంలోనే ఉద్యమానికి సన్నద్ధం కావాలి.
ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు). ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 9వ విభాగంలో ఇరు రాష్ర్టాల మధ్య జలవనరుల నిర్వహణ, అభివృద్ధికి సంబంధించిన అంశాలను పొందుపరిచారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246, ఏడో షెడ్యూల్లోని రెండో (రాష్ర్టాల) జాబితాలో ఉన్న 17వ అంశం ప్రకారం నదీ జలాలపై పూర్తి హక్కులు రాష్ర్టాలకే ఉంటాయి. కానీ, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అంతర్రాష్ట్ర నదుల నిర్వహణకు సంబంధించి పార్లమెంట్లో చట్టం చేసే అధికారం, తద్వారా రాష్ర్టాల హక్కులను నియంత్రించే అవకాశం కేంద్రానికి ఉన్నట్టు.. మొదటి (కేంద్రం) జాబితాలోని 56వ అంశంగా ఏడో షెడ్యూల్లో ప్రస్తావించారు రాజ్యాంగ నిర్మాతలు. దీన్ని ఆధారంగా చేసుకొని 1956లో ‘ది ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్’ను రూపొందించారు.
కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి పరీవాహక రాష్ర్టాల అభ్యర్థనపై 1969లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ‘బచావత్ ట్రిబ్యునల్’ను ఏర్పాటు చేసింది. 1973లో ఈ ట్రిబ్యునల్ నివేదిక ఇచ్చింది. ఒకపక్కన కృష్ణా పరీవాహక రాష్ర్టాల జలవివాదాలు కొనసాగుతుండటం, మరోపక్కన కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని కేసీఆర్ జలసాధన ఉద్యమాన్ని నిర్వహించడం, రాయలసీమలో అనేక ప్రాజెక్టులు నిర్మిస్తూ కృష్ణా నదినే మళ్లించే ప్రయత్నాలు చేయడం, తదితర ఒత్తిళ్ల ఫలితంగా 2004లో వాజపేయి ప్రభుత్వం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది.
ఈ ట్రిబ్యునల్ 2010 డిసెంబర్ 30న తన తీర్పు కాపీని ప్రభుత్వానికి అందజేయగా, ఉమ్మడి ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. తదనంతరం కృష్ణా జలాల పునఃపంపిణీపై తెలంగాణ ప్రభుత్వం పట్టుబట్టడంతో ట్రిబ్యునల్ కాలపరిమితిని కేంద్రం పలుమార్లు పొడిగించింది. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం సెక్షన్-3 కింద ఉమ్మడి ఏపీకి కేటాయించిన కృష్ణా జలాలను పరీవాహక ప్రాంత నిష్పత్తి (68:32) ప్రకారం పునఃపంపిణీ చేయడానికి కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ 2014 నుంచి డిమాండ్ చేస్తూ వచ్చారు. సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించడంతో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జలశక్తి శాఖ మంత్రి షెకావత్‌ను కేసీఆర్ నిలదీశారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ ఉపసంహరించుకుంటే, ఈ విషయమై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని షెకావత్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కానీ, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ర్టాల మధ్య జల వివాదాలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి మోదీ ప్రభుత్వానికి లేదు. అందుకే కాలయాపన చేసిచేసి గత ఎన్నికలకు కొద్దిరోజుల ముందు అక్టోబర్ 6న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీ కోసం తెలంగాణ చేసుకున్న అభ్యర్థనను నివేదించింది.
ఈ ట్రిబ్యునల్ తీర్పు కోసం ఇంకా ఎన్నేండ్లు వేచిచూడాలో తెలియదు. ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా కృష్ణా జలాల దోపిడీకి ఆంధ్రా పాలకులు దొడ్డిదారులు వెదుకుతూ కుట్రలను కొనసాగిస్తూనే ఉంటారు. కాంగ్రెస్, బీజేపీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రా కుట్రలకు మద్దతిస్తూనే ఉంటాయి. స్వరాష్ట్రం కోసం రాజీలేని పోరాటం చేసిన బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం గట్టిగా నిలబడతారు.
కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ద్వారా తెలంగాణ నీటి హక్కులను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని గత పదేండ్లుగా విఫలయత్నం చేస్తూ వస్తున్నది. రాష్ర్టాల నీటి హక్కులను తమ ఆధీనంలో పెట్టుకుంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను శాసించవచ్చని మోదీ-షా ద్వయం భావిస్తున్నది.
ఏపీ పునర్విభజన చట్టాన్ని 2014లో రూపొందించి, ఆమోదించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే (యూపీఏ-2). ఈ చట్టంలో నదీ జలాల నిర్వహణకు సంబంధించి రాష్ర్టాల హక్కులను లాక్కునేలా కేంద్రప్రభుత్వానికి అధికారం కట్టబెట్టింది కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ చట్టంలో పేర్కొన్న కేఆర్ఎంబీ, జీఆర్‌ఎంబీలను పూర్తిగా కేంద్ర జలసంఘం అధికారులతో నింపారు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధుల సంఖ్య, వారి పాత్రను నామమాత్రం చేశారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా 2021 జూలై 15న రెండు తెలుగు రాష్ర్టాల్లోని కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంత ప్రాజెక్టులన్నింటినీ బోర్డుల నియంత్రణ కిందికి తెస్తూ రెండు వేర్వేరు గెజిట్లను జారీ చేసింది. ఈ విధంగా గెజిట్ జారీ చేయడానికి అవకాశం ఇచ్చింది ఏపీ పునర్విభజన చట్టమే.
ఇక రెండు తెలుగు రాష్ర్టాలు నీటి పారుదల శాఖ సిబ్బందిని, వర్క్‌షాప్స్‌ను, వాహనాలను, నిధులను బోర్డులకు అప్పగించి చోద్యం చూస్తూ కూర్చోవాలి. ఏ ఒక్క ప్రాజెక్టునూ బోర్డులకు అప్పగించేది లేదని, గతంలో కేసీఆర్ తేల్చిచెప్పారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం రెండు నెలలైనా గడవకముందే ఈ రెండు ప్రాజెక్టులను, అన్ని ఔట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగిస్తున్నట్టు కేంద్ర జల్‌శక్తి శాఖ మినిట్స్ ద్వారా స్పష్టమైంది.
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేలకుండా శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను, అన్ని ఔట్లెట్లను, కాల్వలను కేఆర్ఎంబీకి అప్పగిస్తే నికర జలాలపై ఆధారపడిన నాగార్జునసాగర్ ఎడమకాల్వకు మాత్రమే సాగర్ నిండిన సందర్భంగా నీటిని విడుదల చేస్తారు. వరద జలాలపై ఆధారపడి నిర్మించిన శ్రీశైలం ఎడమ కాల్వ (ఏఎంఆర్ ప్రాజెక్టు), కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు, డిండి-విద్యాసాగర్‌రావు తదితర ప్రాజెక్టులకు బోర్డు సాగు నీరు ఇవ్వదు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ జల విద్యుత్తు ప్రాజెక్టులకు అవసరమైన నీటిని విడుదల చేయదు. టెయిల్‌పాండ్ వద్ద రివర్స్ పంపింగ్ జరగదు. గత తొమ్మిదిన్నరేండ్లుగా కేఆర్ఎంబీ పనితీరును గమనించే వారికి బోర్డు ఆంధ్రాకు అనుకూలంగా, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని స్పష్టమవుతుంది. ఆంధ్రాలో చంద్రబాబు లేదా వైఎస్ జగన్‌లలో ఎవరు అధికారంలో ఉన్నా మోదీ చెప్పుచేతల్లో ఉండటమే దీనికి ప్రధాన కారణం.
2015లో తప్పనిసరి పరిస్థితుల్లో కేవలం ఒక ఏడాది కోసమే 34:66 నిష్పత్తిలో కృష్ణా జలాల వినియోగానికి తెలంగాణ అంగీకరించినట్టు స్పష్టంగా రాసుకున్నారు. కృష్ణా జలాల్లో వాటా తేలేదాకా 50:50 నిష్పత్తిలో పంచాలని ఎంత మొత్తుకున్నా, వాకౌట్ చేసినా బోర్డు అంగీకరించలేదు. ఏటా పోతిరెడ్డిపాడు నుంచి వందలాది టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్నా బేసిన్‌కు, అక్రమ ప్రాజెక్టులకు మళ్లిస్తున్నా కేఆర్ఎంబీ ప్రేక్షకపాత్ర వహిస్తున్నది. రాయలసీమ ఎత్తిపోతల అక్రమ ప్రాజెక్టుకు తొలి తట్ట మట్టి ఎత్తిన నాటినుంచి నేటిదాకా కేఆర్ఎంబీ ఆంధ్రప్రదేశ్‌ను అడ్డుకోలేదు.
అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ ఫిర్యాదు చేసినా కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. కేఆర్ఎంబీకి ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను సైతం బోర్డు పట్టించుకోలేదు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పనులు తిరిగి ప్రారంభించి, కొనసాగిస్తున్నా కేఆర్ఎంబీ వాటిని ఆపలేదు. ఇదీ కేఆర్ఎంబీ నిర్వాకం!
కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీలో ఇద్దరు ఒక్కటైతే తెలంగాణ ప్రతినిధి పరిస్థితి అరణ్యరోదనే అవుతుంది. తాగునీటికి, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అత్యవసర పరిస్థితుల్లో కేఆర్ఎంబీకి విన్నవించి, బోర్డు మీటింగ్ పెట్టి మెజారిటీ నిర్ణయంతో నీళ్లు విడుదల చేయించుకోవడం సాధ్యమయ్యే పనేనా? శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ చేతుల్లో ఉన్నది. నాగార్జునసాగర్ డ్యాం మాత్రం కేంద్ర రిజర్వ్ బలగాల స్వాధీనంలోకి రావడం వెనుక మోదీ-జగన్‌ల కుట్ర లేదా? ఈ పరిస్థితుల్లో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను అప్పగించడం వెనుక ఎలాంటి కుట్రలు దాగి ఉన్నాయో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి.
(వ్యాసకర్త: మాజీ చైర్మన్, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ)
– వి.ప్రకాశ్ 90009 50400