భద్రతకు మారుపేరైన తెలంగాణ.. కాంగ్రెస్ పాలనలో నేరాలు-ఘోరాలకు అడ్డాగా మారిపోయింది. బీఆర్ఎస్ హయాంలో పదేండ్లపాటు ప్రశాంతంగా ఉన్న మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్ నేడు క్రైమ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా స్థిరపడుతున్నది. రేవంత్‌రెడ్డి సర్కారు ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులు, అక్రమ కేసులు పెట్టేందుకు పోలీస్ శాఖను వినియోగిస్తుండటంతో తెలంగాణలో హత్యలు, దోపిడీలు, దొంగతనాలు నిత్యకృత్యంగా మారాయి. ఇప్పుడు ఏకంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే రాజ్‌భవన్‌లోనే దొంగతనం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి శాంతిభద్రతల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. పాలనలో ఎంతో కీలకమైన హోం శాఖను తన వద్దనే అంటిపెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఏనాడూ శాంతిభద్రతలపై దృష్టిసారించలేదు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా క్రైమ్ రేట్ అమాంతం పెరిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నేరాల నివేదిక-2024 అందుకు తార్కాణం. ఆ నివేదిక ప్రకారం 2023లో రాష్ట్రవ్యాప్తంగా 1.38 లక్షల కేసులు నమోదవగా.. 2024లో ఆ సంఖ్య 1.69 లక్షలకు చేరుకున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే క్రైమ్ రేట్ 22 శాతం పెరిగింది.
ముఖ్యంగా మహిళలపై నేరాలు 4.8 శాతం పెరిగి 19,922 కేసులు నమోదవడం పరిస్థితికి అద్దం పడుతున్నది. లైంగికదాడుల కేసులు 28 శాతం పెరిగి 2,900కి చేరుకున్నాయి. హైదరాబాద్‌లో 2024లో 35 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇది 2023తో పోలిస్తే 41 శాతం ఎక్కువ. రేవంత్ పాలనలో సామాన్యులకే కాదు, ప్రజాప్రతినిధులకూ రక్షణ లేకుండాపోయింది. రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లోనే గతంలో చోరీ జరిగింది. ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఓ ఆగంతకుడు ప్రవేశించడం అప్పట్లో కలకలం సృష్టించింది.
సీఎం, మంత్రులు సమీక్ష నిర్వహించే కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను అడ్డాగా చేసుకొని ఓ వ్యక్తి వసూళ్లకు తెరలేపాడు. సచివాలయంలో నకిలీ ఉద్యోగులు తిరుగుతున్నారు. రాష్ట్రంలో భద్రతా వైఫల్యానికి మచ్చుతునకల్లాంటి ఇలాంటి ఘటనలు కోకొల్లలు. తెలంగాణ ఏర్పడితే నేరాలకు అడ్డాగా మారుతుందని అప్పట్లో చాలామంది భయపెట్టారు. కానీ, ఉద్యమ నాయకుడే పాలకుడై ఆ అనుమానాలన్నింటిని పటాపంచలు చేశారు.
శాంతిభద్రతలు బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుందని భావించిన కేసీఆర్ పోలీసు శాఖకు అత్యాధునిక వాహనాలు సమకూర్చారు. షీ టీమ్స్ ఏర్పాటు చేసి, భరోసా కేంద్రాలను నెలకొల్పి మహిళల భద్రత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. అందుకే, హైదరాబాద్ సేఫ్ సిటీగా వెలుగొందింది. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నది. కానీ, రేవంత్‌రెడ్డి సర్కార్ వచ్చాక అతి తక్కువ కాలంలోనే అంతా తలకిందులైంది. శాంతిభద్రతలు క్షీణించాయి. తెల్లారితే ఏ ఘోర వార్త వినాల్సి వస్తుందోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నేర వార్తలు లేనిదే పొద్దు పొడవడం లేదు. అతి తక్కువ కాలంలోనే విఫల సీఎంగా గుర్తింపు తెచ్చుకున్న రేవంత్‌రెడ్డి.. హోం మంత్రిగానూ ఘోరంగా విఫలమయ్యారు.
– (వ్యాసకర్త: సీనియర్ రాజకీయ విశ్లేషకులు)
ఓ.నరసింహా రెడ్డి 80080 02927