నేడు తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం దేశచరిత్రలో ఒక మైలురాయి. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ళు, నిధులు, నియామకాల్లో నెలకొన్న వివక్షపై సాగింది ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం. దార్శనికుడు, పోరాట యోధుడు, జననేత కేసీఆర్ మార్గదర్శనంలో ఈ పోరాటం కొనసాగింది. మరో స్వాతంత్య్ర సంగ్రామాన్ని తలపించింది. పోరాడి సాధించుకున్న రాష్ట్రం నేడు ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నింపుతూ దశాబ్ది సంబరాలు జరుపుకొంటున్నది.
ఉద్యమ నాయకుడే పాలనాపీఠాన్ని అధిరోహించిన నేపథ్యంలో వినూత్న అభివృద్ధి నమూనాలతో ముందుకు సాగుతున్నది. రాష్ట్ర సాధన ఉద్యమంలో కదం తొక్కిన మహిళలకు స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. స్త్రీ సాధికారతకు పెద్దపీట వేస్తూ వివిధసంక్షేమ పథకాలు, కార్యక్రమాలను రూపొందించారు. అవి మహిళల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. మహిళాభివృద్ధితోపాటు బంగారు తెలంగాణ సాకారం దిశగా సీఎం కేసీఆర్ రూపకల్పన చేసిన పథకాల్లో ఆసరా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్యలక్ష్మి, షీటీమ్స్, షీ క్యాబ్స్, వీ-హాబ్, కేసీఆర్ కిట్, భోజనామృతం వంటి ఎన్నో పథకాలు ఉన్నాయి.
ఊతం లేని బతుకులకు చేయూతనిచ్చిన ఆసరా
ఆధారం లేని బతుకులకు భరోసాను అందించి న పథకం ఆసరా. 2014 నవంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు గ్రామంలో ఈ పథకం పురుడు పోసుకున్నది. లబ్ధిదారులకు రూ.2016 ఆర్థిక సాయం నెలవారీగా అం దుతున్నది. ఆసరా లేని వారికి, భద్రత కరువైన వారికి ఆపన్నహస్తం లా ఆదుకునే పథకంగా దేశవ్యాప్త కీర్తిని సొంతం చేసుకున్నది. తెలంగాణ ఏర్పడక ముందు అర్హులకు దక్కేసాయం అంతంతమాత్రంగానే ఉండేది. అనేక మందికి సాయం అందేదే కాదు.
అటువంటి పరిస్థితి నుంచి శాశ్వత విముక్తి కలిగించాలని సంకల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. రెక్కాడితే గాని డొక్కాడని పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, గీత, చేనేత, బీడీ కార్మికులు, హెచ్ఐవీ రోగుల పాలిట పెన్నిధిగా, పెద్దకొడుకు సాయంగా నిలుస్తున్న పథకమిది. ఇందులో అధికభాగం మహిళలే లబ్ధిదారులు. వితంతువులు, వికలాంగులు, వృద్ధ స్త్రీలు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు ఈ పథకం వరంలా మారింది.
కన్నీళ్ళు తుడిచిన కళ్యాణలక్ష్మి
నిరుపేద తల్లిదండ్రుల కడుపున పుట్టిన ఆడపిల్లల కన్నీళ్ళు తుడుస్తున్నది కళ్యాణలక్ష్మి పథకం. ఆడపిల్ల పుట్టిందనగానే భారమనుకునే రోజులు అప్పుడుండేవి. పురిట్లోనే చంపెయ్యడమో, లేదా పుట్టిన తర్వాత అమ్మేయడమో వంటి దారుణ పరిస్థితులు సమాజంలో కనిపించేవి. ఆడపిల్ల పెండ్లి జెయ్యాలంటే తల్లిదండ్రులకు ఎంతో కష్టంగా అనిపించేది. సంపాదించినదంతా కు టుంబం నడపడానికే పోతే పెండ్లి ఖర్చులకు అప్పులు చేసే పరిస్థితి ఉండేది. నేడు కళ్యాణలక్ష్మి/ షాదీముబారక్‌తో అది మాయమైంది. ఈ పథకం రూపకల్పన వెనుక ఒక హృదయ విదారకరమైన సంఘటన ఉన్నది. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తెలంగాణ మొత్తం పర్యటిస్తున్న ఒకానొక సందర్భంలో ఒక బంజారా తండాలో విశ్రమించారు. ఆ తండాలో ఆనాడే పెండ్లి పెట్టుకున్న ఒకరి గుడిసెకు నిప్పంటుకొని పెండ్లి బట్టలు, సామాన్లు కాలిపోయాయి. బిడ్డ తల్లిదండ్రులు విలపిస్తుంటే కేసీఆర్ చలించిపోయారు. ఇటువంటి సమస్య రాబోయే తెలంగాణలో ఉండకూడదని ఆనాడే నిర్ణయం తీసుకున్నారు. దీని ఫలితంగానే 2015లో కళ్యాణలక్ష్మి పథకం ప్రారంభం. ఎందరో వధువుల పెండ్లికి మేనమామ బహుమానంగా నిలిచిన కళ్యాణలక్ష్మి తెలంగాణకే తలమానికంగా మారింది. పేద మైనారిటీల జీవితాల్లో పండుగను తీసుకొచ్చిన పథకంగా షాదీముబారక్ ప్రఖ్యాతి గాంచింది.
ఆదర్శ పథకం ఆరోగ్యలక్ష్మి
ఆరోగ్యమే మహాభాగ్యం. తన రాష్ట్రంలో ఏ తల్లి గర్భిణిగా, బాలింతగా పౌష్టికాహారలోపంతో ఇబ్బందులు ఎదుర్కొనకూడదని భావించి, కన్నబిడ్డల ఆరోగ్యాన్ని, శ్రేయస్సును కోరే ఒక తండ్రిలాగ అధినాయకుడు తెచ్చిన పథకం ఆరోగ్యలక్ష్మి. తల్లుల ఆరోగ్యమే రాబోయే తరాల ఆరోగ్యంగా భావించి, తల్లీ బిడ్డల సంక్షేమం కోసం ఈ పథకాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలకు పాలపొడి, గోధుమలు, రెండున్నర కిలోల నూనె, కోడిగుడ్లు, మూడు కిలోల బియ్యంతోపాటు రోజు ఒకపూట భోజనం, 200 మిల్లీలీటర్ల పాలను అంగన్వాడి కేంద్రంగా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు.
బాలింతలతో పాటు, శిశువులకుఅదనంగా మూడేళ్ళ పాటు ఈ పౌష్టికాహారాన్ని అందించడం విశేషం. 2015 నుంచి నేటి వరకు నిరంతరాయంగా ఈ పథకం కొనసాగుతూ మాతృమూర్తుల ముఖంపై చిరునవ్వుల పువ్వుల్ని పూయిస్తున్నది.
పాలబుగ్గల పాపాయిలకు పసిడి కానుక కేసీఆర్ కిట్
మాతృత్వం ఒక వరం. అపురూపమైన అనుభవం. అది స్త్రీని పరిపూర్ణురాలిని చేస్తుంది. స్త్రీల ఆరోగ్యంతోపాటు బిడ్డ ఆరోగ్యం, ఆలనా పాలనా కూడా అంతే అవసరం. గర్భిణీ స్త్రీలు ప్రసవించేవరకు ఆరోగ్యలక్ష్మి పథకం, ప్రసవించిన తర్వాత తల్లి బిడ్డల ఆరోగ్యానికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చే పథకంగా కేసీఆర్ కిట్ చరిత్ర సృష్టించింది. పువ్వుల్లాంటి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకునే విధంగా కిట్‌లో బిడ్డల సంరక్షణకు కావాల్సిన వస్తువులను ఇస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవించిన స్త్రీలకు రూ.12 వేల మొత్తాన్ని మూడు విడతల్లో అందించటం విశేషం. ఆడబిడ్డ పుడితే మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తున్నారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నదో తెలియజేస్తాయి ఇవన్నీ.
వనితలకు వరదాయిని ఆరోగ్య మహిళ
మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది. ఇంటినే కాదు వ్యవస్థను నడపడంలో సమర్థులు వనితలు. ఆకాశంలో సగంగా వాళ్ళ కృషి నేటి అభివృద్ధికి దోహదం చేస్తున్నది. అందుకే మహిళల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య మహిళ పథకాన్ని తీసుకొచ్చింది. దీని కింద మహిళలకు ఎనిమిది రకాల వ్యాధుల నివారణకు ప్రభుత్వం అండగా నిలబడుతుంది. షుగర్, రక్తహీనత, బీపీ, సర్వైకల్, నోరు, రొమ్ము క్యాన్సర్లకు స్క్రీనింగ్ టెస్టులను ఉచితంగా నిర్వహిస్తారు. థైరాయిడ్, అయోడిన్, ఐరన్ సంబంధిత వ్యాధులకు మందులు ఇస్తారు. నెలసరి, సంతాన, మూత్రకోశ సమస్యలు, మెనోపాజ్ వంటి అనేక స్త్రీ సంబంధిత వ్యాధుల నివారణకు పెద్దాసుపత్రుల్లో చికిత్సలు అందజేస్తారు.
మహిళా సాధికార బలం షీ టీమ్స్
మహిళలు అబలలు కాదు సబలలు. వారు స్వీయ శక్తి సామర్థ్యాలతో అనేక రంగాలలో రాణిస్తున్నారు. కానీ, ఇంటి బయటకు వెళ్లినప్పుడు పోకిరీల వేధింపులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల రక్షణే ధ్యేయంగా రూపొందించిన పథకం షీ టీమ్స్. చదువుకునే ఆడపిల్లలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగినుల సంరక్షణకు షీ టీమ్స్‌ను అమలులోకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మహిళలకు కొండంత భరోసాను ఇస్తున్నాయి షీ టీమ్స్. ఈ వినూత్న పథకం అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా మారింది. ఆయా రాష్ర్టాల్లో షీ టీమ్స్ వంటి పోలీసు బృందాలు ఏర్పాటయ్యాయి.
ఆత్మవిశ్వాసం నింపుతున్న షీ క్యాబ్స్
అవకాశాలు కల్పిస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారనటానికి షీ క్యాబ్స్ ఒక ఉదాహరణ. డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకునేందుకు ఆసక్తి చూపే గ్రామీణ, పట్టణ మహిళలకు వెన్నుదన్నుగా నిలబడుతున్నది ‘షీ క్యాబ్స్’ పథకం. 2015 హైదరాబాద్‌లో ఆరంభమైన ఈ పథకం కింద 35% సబ్సిడీ మీద మహిళా డ్రైవర్లకు ట్యాక్సీని ఇప్పిస్తున్నది సర్కారు. కుటుంబం కోసం కష్టపడే ఆడపడుచులకు ఒక సదవకాశం కల్పించి, ఆత్మవిశ్వాసాన్ని నింపి, వారిని సేవారంగం వైపునకు నడిపిస్తున్నది షీ క్యాబ్స్ పథకం.
పరిశ్రమల్లో హవా.. వీ హబ్
పరిశ్రమల స్థాపనకు ఎంతోమంది మహిళలు ముందుకొస్తున్నారు. వారిని ప్రోత్సహించి, వారి కలలకు వాస్తవరూపం కల్పించే పథకం వీ హబ్. ఇంక్యుబేటర్ పద్ధతిలో మహిళలకు ఆర్థికంగా అం డగా నిలబడి, వారికి సామాజిక, వ్యవస్థీకృతమైన అడ్డంకులను అధిగమించేలా చేయూతనిస్తున్నది.
సమాజంలో సగ భాగం మహిళలు. కాబట్టి మహిళాభివృద్ధిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో వినూత్న పథకాలను రూపొందించి అమలు పరుస్తున్నారు. అవి మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. స్త్రీలు అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించే దిశగా ప్రభుత్వం నడుస్తున్న తీరు అభినందనీయం. రాష్ట్ర రథసారథి గొప్ప మానవీయ భావాలున్న రాజనీతిజ్ఞుడు కావడం చేత ఈ సంక్షేమ భావనకు మరింత బలం చేకూరింది.
నేడు తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి పథకాల వల్ల స్త్రీలు ఆత్మగౌరవంతో మనగలుగుతున్నారు. ప్రభుత్వం సమర్థవంతంగా రాష్ట్ర ప్రజల ఉజ్వలమైన భవిష్యత్తును తీర్చిదిద్దుతూ, గడప గడపకు సంక్షేమాన్ని అందిస్తున్నది.తద్వారా రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరుతున్నాయి. బంగారు తెలంగాణ దిశగా బాటలు పడుతున్నాయి.
(వ్యాసకర్త: ప్రొఫెసర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం)
డాక్టర్ సూర్యాధనంజయ్
98491 04187