ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రభుత్వం కల్పించిన రాయితీలు, మెరుగు పరిచిన మౌలిక సదుపాయాల కారణంగా పెద్దఎత్తున ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. దేశంలో ఐటీ పరిశ్రమల స్థాపనకు , ఐటీ వ్యాపార విస్తరణకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దేశంలోని ఇతర రాష్ర్టాల్లో అననుకూల వాతావరణం వల్ల విసిగిపోయిన ఐటీ పరిశ్రమల యజమానులు తమ తదుపరి విస్తరణ కార్యక్రమాలకు హైదరాబాద్ అనువైనదిగా ఎంచుకుంటున్నారు. ఫలితంగా ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రెట్టింపయ్యాయి.
ఐటీ పరిశ్రమల ఎగుమతుల వృద్ధి లో దేశ సగటును తెలంగాణ రా ష్ట్రం అధిగమించింది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వివిధ దేశాల్లో పర్యటించి, తెలంగాణలోని ఐటీ పాలసీ గురించి దిగ్గజ సంస్థలకు వివరించడం వల్ల పెద్దఎత్తున పెట్టుబడులు తరలివచ్చాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, టీసీఎస్, అమెజాన్, ఒరాకిల్, టెక్ మహీంద్రా, డెలాయిట్, డెల్, క్వాల్కమ్, ఇన్ఫోసిస్ , విప్రో వంటి అనేక బహుళజాతి, దేశీయ సంస్థలు తెలంగాణలో తమ కార్యాలయాలను నడుపుతున్నాయి.
హైదరాబాద్‌లో ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ రూ.1500 కోట్ల పెట్టుబడితో తమ క్యాంపస్‌ను నెలకొల్పింది. అమెరికా బయ ట, అదీ హైదరాబాద్‌లో పెద్దఎత్తున తమ కార్యకలాపాల్ని విస్తరించడం విశేషం. అమెజాన్ రూ.36,300 కోట్ల పెట్టుబడితో తన క్యాంపస్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో యువతకు 48,000 ఉద్యోగాలు కల్పించనున్నారు. అంటే దాని వెనకాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ కృషి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రపంచ ప్రఖ్యాత యాపిల్ కంపెనీ నానక్‌రామ్‌గూడలోని వేవ్‌రాక్‌లో ఏర్పా టు చేసిన మాప్స్ డెవలప్మెంట్ సెంటరును యాపిల్ సీఈవో టిమ్ కుక్ , సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
ప్రపంచ ప్రఖ్యాత ఫాక్స్‌కాన్ సంస్థ హైదరాబాద్‌లో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నది. అంటే వారికి ఇక్కడి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం ఎలాంటిదో తెలుస్తున్నది. ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూలమైన విధానాలతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. ఇదే స్ఫూర్తితో మరింత నిర్మాణాత్మకంగా ముందుకు పోవాలన్నది తెలంగాణ ప్రభుత్వ ఆలోచన.
1998లోనే అప్పటి ప్రధాని వాజపేయి చేతుల మీదుగా ఐటీ రంగం అభివృద్ధికి హైటెక్ సిటీని మాదాపూర్‌లో ప్రారంభించారు. అప్పటినుంచి పదిహేనేండ్లుగా నెమ్మదిగా విస్తరిస్తున్న ఐటీరంగం స్వరాష్ట్రంలో రెట్టింపు స్థాయి వృద్ధి సాధించింది. అందు కు నిదర్శనమే పదుల సంఖ్యలో బహుళజాతి కంపెనీలు పెట్టుబడులు పెట్టటం.
తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో ఐటీ రంగ ముఖచిత్రమే మారిపోయింది. లక్షల మందికి ఉద్యోగ అవకాశాలతో పాటు ఐటీ ఎగుమతులు రెట్టింపయ్యాయి. దేశంలోనే ఐటీరంగంలో పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ నిలిచింది. తొమ్మిదేండ్లలో ఐటీ రంగం జిల్లా కేంద్రాలకు కూడా విస్తరించింది. ఐటీ అంటే బెంగళూరు అనే స్థాయి నుంచి ఐటీ అంటే హైదరాబాద్ అనే స్థాయికి మన ఐటీ రంగం చేరింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లేకపోయినా కరోనా లాంటి విపత్కర పరిణామాలు ఎదుర్కొన్నా హైదరాబాద్‌కు పెట్టుబడుల ప్రవాహం ఆగలేదు. దీనికి కారణం ఇక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ నిబద్ధత, దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి చొరవ.
ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో స్థానం పొందిన 20 కి పైగా బహుళజాతి కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి, ఐటీ రంగ ప్రాధాన్యాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఐదేండ్లకోసారి ఐటీ పాలసీలను రూపొందించి సమర్థవంతంగా అమలు చేస్తున్నది. ఐటీ శాఖ పరిధిలో ఎమర్జింగ్ టెక్నాలజీ విజన్‌ను ఏర్పా టు చేసి ఎనిమిది టెక్నాలజీలను ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగిస్తున్నది.
2013-14లో రూ.52.25 వేల కోట్లు గా ఉన్న ఐటీ ఎగుమతులు 2021-22 నాటికి రూ .7, 78,121 కోట్లకు చేరాయి. జాతీయ ఐటీ ఎగుమతుల వృద్ధి 7.8 శా తం సాధిస్తే, తెలంగాణ ఐటీ ఎగుమతులు 9.3 శాతం సాధించాయి. జాతీయ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ ఐటీ వాటా 11 శాతంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న ఎగుమతుల్లో ఐటీ ఎగుమతులే 50 శాతంగా ఉన్నాయి. అలాగే ఐటీ రంగాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్ళేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఐటీ అంటే ఒక్క హైదరాబాదులోనే కాదు దాని ఉపయోగం ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా అవసరం అనే కోణంలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఈ ఐటీ రంగాన్ని తీసుకెళ్లడం గ్రేట్. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ అభివృద్ధి కేంద్రాలు బీపీఓల ఏర్పాట్లను ప్రభు త్వం ప్రోత్సహిస్తున్నది.
ప్రభుత్వ కృషి కారణంగా సైయింట్ లిమిటెడ్ సంస్థ తన సాఫ్ట్వేర్ అభివృద్ధి కేంద్రాన్ని వరంగల్‌లో ఏర్పాటు చేసింది. హుజురాబాద్, సిద్దిపేట మిగతా నగరాల్లోనూ వాటి కార్యకలాపాలను ప్రారంభించారు. ఏక్లాట్ హెల్త్ సొల్యూషన్ సంస్థ కరీంనగర్లో 100 సీట్లతో బీపీవోను ప్రారంభించగా రూరల్ సోర్స్ సంస్థ ఖమ్మంలో బీపీవో సెంటర్‌ను ప్రారంభించింది. అలాగే మొన్నటికి మొన్న నిజామాబాద్‌లో ఐటీ పార్క్‌ను ప్రారంభించుకొన్నాము.
నేడు అంతర్జాతీయ కంపెనీలు బీపీవోల ఏర్పాటుకు తెలంగాణలోని అన్ని జిల్లాలను సందర్శిస్తున్నాయంటే తెలంగాణ రాష్ట్ర ఔన్నత్యం, గొప్పతనాన్ని ప్రపంచం కీర్తిస్తున్నదని అర్థం. ప్రభుత్వ తొమ్మిదేండ్ల శ్రమ కు ప్రతిఫలం రాష్ట్ర ప్రభుత్వ కృషికి నిదర్శనం కేసీఆర్ మార్గదర్శకానికి కేటీఆర్ ఆచరణకు ప్రతిరూపం ఐటీ రంగ అభివృ ద్ధి. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. ఇప్పుడు ఐటీ రంగంలో సాధిస్తున్న ప్రగ తితో హైదరాబాద్ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నది.
(వ్యాసకర్త :బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి)