మలేషియాలోని కౌలాలంపూర్‌లో గల ప్రముఖ మ్యాట్రేడ్ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్లో జూన్ 6న జరుగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఇప్పుడు సాధారణ కమ్యూనిటీ కార్యక్రమం కాదు. ఇది ఒక గ్లోబల్ తెలంగాణ శక్తి ప్రదర్శనగా మారుతున్నది. బీఆర్ఎస్ మలేషియా-మైటా, ఇతర అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరుగనున్న ఈ ఉత్సవాలు ప్రవాస తెలంగాణలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇక్కడ విషయం కేవలం సంబురాలు కాదు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పేందుకు ఒక పెద్ద వేదికగా మారనున్నది.
మలేషియా లాంటి దేశంలో బీఆర్ఎస్ ఆవిర్భావోత్సవం జరగడం చాలా ప్రత్యేకం. అక్కడ ఉన్న తెలుగు, భారతీయ కమ్యూనిటీలు ఎప్పటినుంచో తమ మూలాలను కాపాడుకొంటూ, కొత్త దేశంలో కూడా బలమైన స్థానం సంపాదించుకున్నాయి. ఇప్పుడు అదే కమ్యూనిటీ తెలంగాణ ఆవిర్భావ వేడుకల ద్వారా ఒక్కటవుతున్నది. ఇది కేవలం పండగ కాదు, ఒక కనెక్ట్, ఒక ఎమోషన్, ఒక ఐడెంటిటీ రీయూనియన్ లాంటిది. మలేషియాలో తెలుగు సమాజానికి దీర్ఘ చరిత్ర ఉన్నది. 1955 నుంచే తెలుగు సంఘాలు అక్కడ స్థిరపడుతూ వచ్చాయి. ప్రస్తుతం అక్కడ సుమారు 5 లక్షల మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారని అంచనా. ఈ సమాజం ఇప్పుడు 4 నుంచి 5 తరాలుగా విస్తరించింది. అయినప్పటికీ భాష, సంస్కృ తి, సంప్రదాయాలను కాపాడుకొంటూ ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు వారికి ఒక ఐడెంటిటీ రీయూనియన్‌లా మారుతున్నాయి. ఈ ప్రత్యేక సందర్భంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మలేషియా తెలుగు సంఘం ఆహ్వానించింది.
ఈ మొత్తం ఉత్సవాల మధ్యలో ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. తెలంగాణ డయాస్పోరా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నది? అనే ప్రశ్న. సమాధానం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది ఇక విడివిడిగా ఉన్న సంఘాల సమాహారం కాదు. ఇది ఒక గ్లోబల్ నెట్‌వర్క్‌గా మారుతున్నది. అమెరికా నుంచి ఆసియా వరకు, గల్ఫ్ నుంచి ఆఫ్రికా వరకు తెలంగాణ పేరు వినిపించే ప్రతీ చోట ఒకే ఎనర్జీ కనిపిస్తున్నది. నిరుడు అమెరికాలోని డాలస్‌లో జరిగిన కార్యక్రమాలు ఈ మార్పునకు బలమైన పునాది వేశాయి.
ప్రత్యేకంగా డాలస్ ఈవెంట్ అయితే వేలాది మంది ప్రవాసుల సమక్షంలో తెలంగాణ అభివృద్ధిని ప్రత్యక్షంగా చర్చించే ఒక హిస్టారికల్ మీటింగ్‌లా నిలిచింది. అక్కడ చర్చలు కేవలం సాంస్కృతికంగా ఆగలేదు. పెట్టుబడులు, స్టార్టప్‌లు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, గ్లోబల్ అవకాశాల వరకు వెళ్లాయి.
సింగపూర్‌లోని బీఆర్ఎస్ అనుబంధ సం ఘాలు మాత్రమే కాకుండా, అక్కడ ఉన్న తెలుగు కమ్యూనిటీలు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఇది కేవలం రాజకీయ అనుబంధం కాకుండా ఒక సాంస్కృతిక ఐక్యత ఉద్యమంగా మారుతున్నది. ఈ మొత్తం గ్లోబల్ కనెక్ట్ వెనుక బలంగా వినిపిస్తున్న పేరు కేటీఆర్. ఆయన రాజకీయ నాయకుడిగా మాత్రమే కాదు, ఒక గ్లోబల్ లీడర్‌గా కూడా ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు. ఆయన వెళ్లిన ప్రతీ వేదికలో తెలంగాణ గురించి మాట్లాడటం అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ ప్రెజెంటేషన్లాగా మారింది. ప్రత్యేకంగా ప్రపంచ ఆర్థిక వేదిక వంటి అంతర్జాతీయ కార్యక్రమాల్లో కేటీఆర్ ప్రసంగాలు తెలంగాణను ఒక ఆవిష్కరణల రంగంలో అభివృద్ధి చెందుతున్న కేంద్రంగా చూపించాయి.
అక్కడ ఆయన చెప్పిన మాటలు, చేసిన చర్చలు, పెట్టుబడిదారులతో జరిగిన సమావేశాలు ఇవన్నీ తెలంగాణకు కొత్త అవకాశాల ద్వారాలు తెరిచాయి. ఇక ఈ మొత్తం ప్రయా ణం వెనుక మరో బలమైన దృష్టి ఉన్నది. అదే కేసీఆర్ వ్యూహాత్మక ఆలోచన. బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా జరపాలని తీసుకున్న నిర్ణయం వల్లే ఈ డయాస్పోరా ఉద్య మం ఇలా విస్తరించింది. తెలంగాణను కేవలం రా ష్ట్రంగా కాకుండా ఒక గ్లోబల్ ఐడెంటిటీగా నిలబెట్టాలన్న ఆలోచన ఇప్పుడు వాస్తవంగా మారుతున్నది.
మలేషియా వేడుక ఇప్పుడు కేవలం స్టేజ్ ప్రోగ్రామ్ కాదు. ఇది ఒక నెట్వర్కింగ్ హబ్. ఒకవైపు కుటుంబాలు, సంస్కృతి, ఆనందం, బిజినెస్, స్టార్టప్స్, ఇన్వెస్ట్మెంట్స్. యువతకు ఇది ఒక అవకాశాల వేదిక. పెద్దవాళ్లకు ఇది ఒక కనెక్ట్ ప్లాట్‌ఫాం. ఇదే ఈ ఈవెంట్ స్పెషల్. ఈ వేదిక మీద మాట్లాడేది ఒక్క మాటే, అదే తెలంగాణ ఇప్పుడు లోకల్ కాదు, గ్లోబల్. ప్రతీ దేశంలో ఒక చిన్న తెలంగాణ తయారవుతున్నది. ప్రతీ నగరంలో ఒక కమ్యూనిటీ ఎనర్జీ ఏర్పడుతున్నది. భవిష్యత్తులో ఈ తరహా కార్యక్రమాలు లండన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అలాగే గల్ఫ్‌లో కూడా జరుగనున్నాయి. అంటే ఇది ఒక ఈవెంట్ కాదు, ఇది ఒక మూవ్మెంట్. ఈ మొత్తం ప్రయాణం చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తున్నది. తెలంగాణ ఇప్పుడు ఒక రాష్ట్రం మాత్రమే కాదు. అది ఒక భావం, ఒక గ్లోబల్ నెట్వర్క్, ఒక ఐడెంటిటీ. ఆ దిశగా మలేషియా వేదిక మరో కీలక మైలురాయి.
– (వ్యాసకర్త:బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్)
మహేశ్ బిగాల