రాష్ట్రంలో నదులు, చెరువులు, కాలువలు నిండుకుండలా కనబడుతున్నాయి. కాకతీయులు, రెడ్డిరాజులు తవ్వించిన చెరువులు, మధ్యతరహా రిజర్వాయర్ల ఆసరాతో తెలంగాణ రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతున్నది. దీంతో మత్స్యకారుల్లో ఆనందం వెళ్లివిరుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా 11 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో రూ.5 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించే కీలక ఆదాయ వనరుగా మత్స్య పరిశ్రమను తీర్చిదిద్దింది.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నది. రాష్ట్రంలో మత్స్య సంపద అభివృద్ధికి అద్భుత అవకాశాలున్నాయని గ్రహించారు సీఎం కేసీఆర్. దానికి తగినట్టుగా మత్స్యకార కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా, ఫిషరీస్ కార్పొరేషన్ ద్వారా చేపపిల్లల పెంపకం, అమ్మకాలు జరిపి నిర్వహణ ఖర్చు పోగా మిగిలిన ఆదాయాన్ని మత్స్యకారులకే అందజేస్తున్నారు. దేశీయంగా ఆహారభద్రతలో మత్స్యపరిశ్రమ కీలక పాత్ర పోషిస్తూ, ప్రపంచ చేపల ఉత్పత్తిలో భారత్ వాటా 7.6 శాతంగా ఉన్నది. ప్రపంచ మత్స్య ఉత్పత్తిలో భారత్ రెం డో స్థానంలో ఉన్నది. ప్రపంచంలోనే ఇండియా నాలుగో అతిపెద్ద చేపల ఎగుమతిదారుగా ఉన్నది. భారత్‌లో దాదాపు మూడు కోట్ల మంది మత్స్యపరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు.
చేపలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం, ప్రకృతి విపత్తుల వంటి సమస్యలు మత్స్యకారులకు శాపంగా మారాయి. తెలంగాణ రాష్ట్రం మత్స్య కార్మిక సొసైటీలో సభ్యులుగా ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తూ, ఎటువంటి వివాదాలకు తావులేకుండా పటిష్ఠమైన ప్రణాళికతో, పకడ్బందీగా మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేస్తున్నది. ఇందుకోసం సీనియర్ అధికారులు, బ్యూరోక్రాట్లు, ఆర్థిక శాస్త్రవేత్తలతో చర్చలు జరిపి, సాధ్యాసాధ్యాలు ఆలోచించి మనకున్న ఆర్థిక వనరులను అర్థం చేసుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకువెళ్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నది తెలంగాణ రాష్ట్రం.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఒక భాగంగా ఉన్నప్పుడు సముద్రం తీరం వెంట ఉన్నవారే మత్స్యకారులు అన్నట్టుగా ఉండేది. నాటి పాలకులు తెలంగాణపై దృష్టి సారించకపోగా ఇక్కడి మత్స్యరంగాన్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని భూగర్భ జలాలు పెరిగి, ఏ ఊరు చూసినా చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. సముద్రతీరం లేకపోయినా కాకతీయులు, రెడ్డిరాజుల కాలంలో నిర్మించిన మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ గొప్ప వరంగా ఉన్నది. తద్వారా చేపల పెంపకానికి అద్భుత అవకాశాలున్నాయి. అప్పట్లో 75 వేల చెరువులుం టే అవన్నీ నాశనమై, చివరికి ఇప్పుడు 46,500 చెరువులు మిగిలాయి. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇన్ని చెరువులు లే వు. మిషన్ కాకతీయ ద్వారా ఈ చెరువులను బాగు చేయడం ద్వారా మత్స్య పరిశ్రమ అద్భుత ప్రగతిని సాధిస్తున్నది.
నాలుగున్నర నుంచి ఐదున్నర వేల కోట్ల రూపాయల విలువ చేసే చేపలను తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నట్టు ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఆ లక్ష్యాన్ని కూడా మనం అతి త్వరలోనే చేరుతామంటున్నారు. దక్షిణ తెలంగాణలోని జూరాల దగ్గర మొదలు పెడితే రామన్‌పాడు, శ్రీశైలం, నాగార్జునసాగర్, టెయిల్‌పాండ్, పులిచింతల, నల్గొండ జిల్లా మూసీ ప్రాజెక్టు, మహబూబ్‌నగర్ కోయిల్‌సాగర్, కొత్తగా వచ్చిన సంఘం బండ రిజర్వాయర్, ఉత్తర తెలంగాణ వైపు చూస్తే సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టు, ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, కడెం రిజర్వాయర్, అదిలాబాద్‌లో ఉండే అన్ని ప్రాజెక్టులు, ఎల్లంపల్లి, లోయర్ మానేరు, మిడ్‌మానేర్, అప్పర్ మానేరు డ్యాంలు, వరంగల్‌లో పాకాల, గణపురం, రామప్ప, లక్నవరం, ఖమ్మంలో లంకసాగర్, వైరా, పాలేరు రిజర్వాయర్లు ఇలా మనకు చాలా ఉన్నాయి. మనకున్న వనరులను సద్వినియోగం చేసుకొని అనుకున్న లక్ష్యాలను చేరవచ్చు. చేప పిల్లలను ఉచితంగా ఇవ్వడం ద్వారా కూడా మత్స్య పరిశ్రమ అభివృద్ధి జరుగుతున్నది. మన రాష్ట్రంలో మామూలుగా వచ్చే సాధారణ చేపల దిగుబడి ఏడాదికి లక్ష టన్నుల వరకు ఉంటుంది. చేప విత్తనం వేసి పెంచడం ద్వారా మరో లక్ష టన్నుల ఉత్పత్తి అదనంగా వస్తుంది. భారత్‌లో గత పదేండ్లలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా అంతర్గత జలాల నుంచి సమకూరుతున్న మత్స్య సంపద 55 శాతాన్ని మించింది. ఆక్వాకల్చర్ విశ్వవ్యాప్తం కావడం దీనికి ప్రధాన కారణం. చేపల్లో క్యాల్షియం, మినరల్స్, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల ఆహారంలో వాటి వినియోగం పెరిగింది. వినియోగదారుల అభిరుచి మేరకు చేపలను వివిధ రూపాల్లో విక్రయిస్తున్నారు.
మత్స్యకారుల్లో అధిక శాతం మంది నిరక్షరాస్యులే. ఒకప్పుడు మన రాష్ట్ర మత్స్యకారులు ఇక్కడ ఉపాధి లేక పక్క రాష్ర్టాలకు వలసవెళ్లి ఉపాధి పొందేవారు. దేశీయంగా చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన నిలుస్తున్నది. పశ్చిమబెంగాల్, గుజరాత్, కేరళ, తమిళనాడు తర్వాత స్థానాల్లో నిలుస్తాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా తక్కువేమీ కాదన్నట్టుగా చేపల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రభాగంలో ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల కోసం చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నది. చేపల విక్రయానికి ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటుచేసింది. గతంలో మత్స్యకారులు ప్రకృతి ఆటుపోట్లను తట్టుకుంటూ చేపలు పడితేనే ఆదాయం లేకుంటే వారి కుటుంబాలకు ఆర్థికంగా ఇబ్బందే. మత్స్యకార మహిళల్లో చాలామంది వీధుల్లో తిరుగుతూ చేపలను ఇండ్ల ముంగిటకు తెచ్చి విక్రయిస్తుంటారు. అందుకుగాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి టూ వీలర్స్ సబ్సిడీగా ఇచ్చి ఆదుకుంటున్నది. మరోవైపు వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కులవృత్తుల వారికి రూ.లక్ష ఆర్థికసాయం అందించడానికి ముందుకువచ్చింది. తద్వా రా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడానికి తెలంగాణ ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నది.
(వ్యాసకర్త: తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
– మోటె చిరంజీవి 99491 94327