ప్రజలను రాజకీయంగా వశం చేసుకోవడం కోసం, ఆర్థిక దోపిడీ కొనసాగించడం కోసం, ప్రజల భాషా సంస్కృతుల మీద, అస్తిత్వం మీద, ఆత్మగౌరవం మీద వలసవాదులు దాడి చేస్తూనే ఉంటారు. తద్వారా ప్రజలను ఆత్మన్యూనతా భావనలోకి నెట్టివేస్తారు. ఆ తర్వాత రాజకీయ ఆధిపత్యం, సాంస్కృతిక అణచివేత, ఆర్థిక దోపిడీ, అన్ని రంగాల్లో వివక్షలు కొనసాగిస్తారు. ఇది చరిత్ర నిరూపించిన సత్యం. ఎందుకంటే ఒక వ్యక్తి అస్తిత్వం కానీ, ఆత్మగౌరవం కానీ, ఆ వ్యక్తి నివసించే ప్రాంతం మీద, అతడు మాట్లాడే భాష మీద, ఆ వ్యక్తి ఆచరించే సంస్కృతీ సాంప్రదాయాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి.
నాటి ఆంగ్లేయులు భారతదేశ సంస్కృతిని అవమానించినట్టే, నిన్నటి సీమాంధ్ర పాలకులు తెలంగాణ సంస్కృతిని కించపరిచారు. తెలంగాణ ఉద్యమానికి ప్రబలమైన సాంస్కృతిక కోణం ఉన్నది. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవం కనుమరుగు చేసేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన కొనసాగింది. తెలంగాణ భాషను అడుగడుగునా అవమానపరిచారు. తెలంగాణ సాంస్కృతిక సందర్భాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. తెలంగాణ సాహిత్యాన్ని అనాదరణకు గురిచేశారు. తెలంగాణ మహనీయులు, సాహితీవేత్తలు, ప్రముఖులను విస్మరణకు గురిచేశారు. తెలంగాణ చరిత్రను అవహేళన చేశారు. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు ‘అయ్యా బాంచెన్ కాల్మొక్తా’ అని బతికారని ప్రజల సామాజిక జీవనాన్ని అపహాస్యం చేశారు. తెలంగాణ ప్రతిభా సామర్థ్యాలను అణచివేతకు గురిచేశారు. ఈ విధంగా పలు కోణాల్లో జరిగిన సాంస్కృతిక దాడి తెలంగాణ ప్రజల హృదయాలను రగిలించింది. గుండెలను దహించివేసింది.
మానవజాతి చరిత్రలో జరిగిన పోరాటాలన్నింటికీ రెండే కారణాలు. ఒకటి అస్తిత్వ ఆకాంక్ష అయితే రెండవది, ఆత్మగౌరవ ఆకాంక్ష. అస్తిత్వ ఆకాంక్ష భారత స్వాతంత్య్రోద్యమానికి దారితీస్తే, ఆత్మగౌరవ ఆకాంక్ష తెలంగాణ ఉద్యమానికి నాంది అయింది. సీత శోకం లంకా దహనానికి దారి తీసినట్టు, ద్రౌపది వస్ర్తాపహరణమే కురుక్షేత్ర యుద్ధానికి నాంది అయినట్టు, తెలంగాణ ప్రజల యాస, భాషా, సంస్కృతుల అవమాన ఫలితమే తెలంగాణ ఉద్యమానికి కారణమైంది. ప్రజల ఆవేదన మాటలై, పాటలై, కవితలై, కథలై, వ్యాసాలై, నినాదాలై, నిరసనలై, ప్రతిఘటనయై, విగ్రహ విధ్వంసమై ఎగిసిపడింది.
సంస్కృతి అంటే ప్రజల జీవనసారం. కట్టూ బొట్టూ, మాటా పాటా, పండుగలు, జాతరలు, ఆచారాలు, సాంప్రదాయాలు, ఆహారపుటలవాట్లు, చరిత్ర, సాహిత్యం, అలంకరణ అన్నీ సాంస్కృతిక వ్యక్తీకరణలే! తెలంగాణది సుసంపన్నమైన సంస్కృతి. కృష్ణా గోదావరీ పావన నదీజలాలతో పునీతమైన ఈ గడ్డ మీద అతిప్రాచీన కాలం నుంచి సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, శిల్పం.. ఇలా అన్ని కళలూ అమోఘంగా వికసించాయి. భారతదేశంలో అతి సువిశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించిన కాకతీయులు తెలంగాణ కేంద్రంగానే పరిపాలన గావించారు. రామప్ప గుడిలోని రమణీయ శిల్పాలు నాటి తెలంగాణ కళా ప్రాభవానికి ప్రతీకలు. దక్కన్ పీఠభూమి అయిన తెలంగాణ, భౌగోళిక, చారిత్రక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మహోన్నత సంస్కృతినీ రూపుదిద్దుకున్నది.
తొలి తెలుగు రాజులు శాతవాహనులు, సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన కాకతీయులు, చాళుక్యులు, మత సామరస్యాన్ని పెంపొందించి పరిపాలించిన కుతుబ్‌షాహీలు, హైదరాబాద్‌ను ఆధునిక నగరంగా తీర్చిదిద్దిన అసఫ్జాహీలు తెలంగాణ కేంద్రంగా పరిపాలన గావించారు.
స్వరాష్ట్రం కోసం, స్వాభిమానం కోసం, పోరాడి విజయం సాధించి, స్వపరిపాలనను స్థాపించుకున్న నేటి సందర్భంలో తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి బలమైన చర్యలు చేపట్టడం, ప్రతి ఒక్కరికీ అస్తిత్వ ఆత్మగౌరవ స్పృహ కలిగించడం ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం. లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రాజకీయ వలసవాదం నుంచి విముక్తి పొందినప్పటికీ, సాంస్కృతిక వలసవాదం మరో రూపంలో ప్రజల మస్తిష్కంలోకి వారికి తెలియకుండానే పాదరసంలా ప్రసరించే ప్రమాదం పొంచి ఉన్నది. ప్రజాకవి కాళోజీ చెప్పినట్టు ప్రజలు ఆర్థికంగా దెబ్బతిన్నా కోలుకోవచ్చు, అధికారం కో ల్పోయినా తిరిగి సాధించుకోవచ్చు.
రాజాశ్రయాన్ని తిరస్కరించి భాగవతాన్ని రామాంకితం చేసిన బమ్మెర పోతన, జాను తెనుగులో కవిత్వం రచించిన పాల్కుర్కి సోమన, తొలి ద్విపద కావ్యం రచించిన గోన బుద్ధారెడ్డి, తొలి యక్షగానం రచించిన కందుకూరి రుద్రకవి, ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని గర్జించిన దాశరథి, ప్రజల గొడవను తన గొడవగా కవిత్వం చెప్పిన కాళోజీ, తెలంగాణ సాహిత్య వైభవానికి చెరగని గురుతులు.
‘జల్ జంగల్ జమీన్’ నినాదంతో అడవి మీద హక్కుల కోసం ఆదివాసీల పక్షాన పోరాడిన కుమ్రం భీమ్, ఆదివాసీలలో ఆత్మగౌరవ చైతన్యం సాధించిన సమ్మక్క-సారక్కలు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపించిన రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, భీంరెడ్డి నరసింహారెడ్డి, చాకలి ఐలమ్మలు ఈ నేల సాహసానికి, పోరాటానికి నిలువెత్తు నిదర్శనాలు. భారత ప్రధాని పీఠాన్ని అధిష్టించిన పీవీ నరసింహారావు తెలంగాణ రాజకీయ పటిమను చాటిచెప్పిన ఆధునిక చాణక్యుడు. తెలంగాణ ఉద్యమానికి తాత్విక భూమికను రూపొందించిన ప్రొఫెసర్ జయశంకర్ సదా అభినందనీయులు. తొలి తెలుగు రాజులు శాతవాహనుల రాజధాని కోటిలింగాల, బౌద్ధం విరాజిల్లిన ధూళికట్ట, నాగార్జున కొండలు, కాకతీయుల వేయి స్తంభాల గుడి, కుతుబ్ షాహీలు నిర్మించిన చార్మినార్, గోల్కొండలు తెలంగాణ మహోన్నత చరిత్రకు ఆనవాళ్లు.
దేశ ప్రధాని అయిన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు జన్మదినాన్ని కూడా జరుపని దౌర్భాగ్యం ఆంధ్ర వలసవాద పరిపాలనలో కొనసాగింది. కేసీఆర్ నేతృత్వంలో ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం పీవీ జయంతిని ఘనంగా నిర్వహించింది. అంతేకాకుండా హైదరాబాద్‌లోని వెటర్నరీ యూనివర్సిటీకి ‘పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ’గా నామకరణం చేసి గౌరవించింది. మహాకవి దాశరథిని ఆస్థాన కవి పదవి నుంచి తప్పించి, నాటి ఆంధ్ర పాలకులు దారుణంగా అవమానించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తన కవిత్వంతో ప్రజలను ఉత్తేజపరిచిన దాశరథి జైలు గోడల మీద ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని రాసిన సాహసికుడు. అటువంటి మహాకవి ఔన్నత్యం ప్రపంచానికి చాటేవిధంగా ఆయన జయంతిని కేసీఆర్ ప్రభుత్వం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించింది. దాశరథి పేరిట ఫౌండేషన్‌ను ఏర్పాటుచేసి లక్ష వెయ్యి నూట పదహార్లు దాశరథి పేరిట అవార్డులు ప్రదానం చేసింది.
కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినంగా ప్రకటించి, ఏటా అధికారికంగా ఉత్సవాలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో కాళోజీ సాహిత్య అవార్డును ఏర్పాటుచేసి ఏటా ఒక సాహితీవేత్తకు బహూకరించారు. హన్మకొండలో కాళోజీ పేర కళాక్షేత్రం నిర్మించారు. వరంగల్‌లో ఉన్న తెలంగాణ హెల్త్ యూనివర్సిటీకి ‘కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్’గా నామకరణం చేశారు.
తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీకి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీగా పేరు మార్చారు. తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి ‘ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ’గా నామకరణం చేశారు.
తెలంగాణకు తలమానికం బతుకమ్మ పండుగ. ఈ పండుగ సందర్భంగా పేర్చే బతుకమ్మను దేవతగా భావించడం తెలంగాణ సంస్కృతిలోని ప్రత్యేకత. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు ఈ పండుగను కనీసం గుర్తించడానికి కూడా నిరాకరించాయి. ఇటువంటి బతుకమ్మను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పండుగగా ప్రకటించి, ట్యాంక్‌బండ్‌పై ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. బోనాల పండుగ తెలంగాణకే ప్రత్యేకమైనది. గోల్కొండ రాజుల కాలం నుంచి బోనాల పండుగకు విశేష ప్రాధాన్యం ఉన్నది. అందుకే కేసీఆర్ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఉత్సవాలు నిర్వహించింది. రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర పువ్వుగా తంగేడు, రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు, రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర నదిగా కృష్ణా గోదావరీ, రాష్ట్ర పండుగా మామిడి, రాష్ట్ర క్రీడగా కబడ్డీ, రాష్ట్ర చేపగా కొరమీను మొదలైన వాటిని తెలంగాణ రాష్ట్ర అస్తిత్వ చిహ్నాలుగా ప్రకటించారు. అన్ని విషయాల్లో కేసీఆర్ అస్తిత్వ స్పృహతో పరిపాలన గావించారు.
స్వరాష్ట్రం కోసం, స్వాభిమానం కోసం, పోరాడి విజయం సాధించి, స్వపరిపాలనను స్థాపించుకున్న నేటి సందర్భంలో తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి బలమైన చర్యలు చేపట్టడం, ప్రతి ఒక్కరికీ అస్తిత్వ ఆత్మగౌరవ స్పృహ కలిగించడం ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం. లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రాజకీయ వలసవాదం నుంచి విముక్తి పొందినప్పటికీ, సాంస్కృతిక వలసవాదం మరో రూపంలో ప్రజల మస్తిష్కంలోకి వారికి తెలియకుండానే పాదరసంలా ప్రసరించే ప్రమాదం పొంచి ఉన్నది. ప్రజాకవి కాళోజీ చెప్పినట్టు ప్రజలు ఆర్థికంగా దెబ్బతిన్నా కోలుకోవచ్చు, అధికారం కో ల్పోయినా తిరిగి సాధించుకోవచ్చు. కానీ, అస్తి త్వం కోల్పోతే, సాంస్కృతికంగా తన మూలాలను తానే మరిచిపోతే ఆ జాతి మనుగడ సాగించలేదు.
ఒక జాతికి ప్రాణం సంస్కృతి, సాహి త్యం, కళలు. సంస్కృతికి ప్రాణం సామాజిక జీవనం. ఆత్మగౌరవం లేని జాతికి అభివృద్ధి లేదు. ఆత్మగౌరవానికి అభివృద్ధి ప్రత్యామ్నాయం కాదు. అందుకే, తెలంగాణ ఉద్యమం కేవలం నీళ్లు, నిధులు, నియామకాలు ఎజెండాతో ఆర్థికపరమైన ఉద్యమంగా కాకుండా, అస్తిత్వ ఆత్మగౌరవ పోరాటంగా రూపుదాల్చింది. తెలంగాణ ప్రజల అస్తిత్వ ఆత్మగౌరవ పరిరక్షణకు, వికాసమయ జీవితానికి మరో సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం చేపట్టవలసిన అవసరం ఆసన్నమైంది. అదే తెలంగాణ ప్రాంత ఉనికికి, ప్రజల అస్తిత్వ ఆత్మగౌరవ మనుగడకు శ్రీరామరక్ష అవుతుంది.
– (వ్యాసకర్త: రాష్ట్ర శాసనమండలి మాజీ సభ్యులు)
నారదాసు లక్ష్మణ్‌రావు