రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయటం అభినందనీయం. భూస్వామ్య వ్యవస్థకు, ఫ్యూడల్ అవశేషాలకు చిహ్నంగా కొనసాగుతున్న వీఆర్ఏ వ్యవస్థను రద్దుచేసి వేలాది కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించడం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం.
మన పరాయిపాలనలో టీఎన్జీవో అధ్యక్షునిగా వీఆర్ఏలకు సమస్యలున్నాయని ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్లి వినతిపత్రాలు ఇచ్చినా, నిరసనలు తెలిపినా పరిష్కారం కాలేదు. కానీ స్వరాష్ట్రంలోని తెలంగా ణ ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలను అర్థం చేసుకున్నది. పరిష్కారం కోసం కేటీఆర్ నాయకత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీని నియమించింది. అంతేకాదు, స్వయంగా సీఎం కేసీఆరే వీఆర్ఏ ప్రతినిధులను పిలిపించుకున్నారు. వీఆర్ఏల ఆకాంక్షల మేరకు, వారి మనోభావాలకనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దశాబ్దాల కాలంగా గ్రామీణ వ్యవస్థలో గౌరవ వేతనం తీసుకుంటూ అగౌరవంగా వేతనాలు తీసుకున్న సేతుసింది, నీరడి, సుంకరి అనే అమానవీయ పేర్లతో పిలువబడే దుర్మార్గ వ్యవస్థకు మంగళం పలకడాన్ని రాష్ట్రంలోని ప్రతి పౌరుడు స్వాగతిస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా కేవలం నెలకు రూ.3,000లతో కంసాలిడేటెడ్ వేతనంతో నియమించబడిన వీఆర్ఏల క్రమబద్ధీకరణ దేశ చరిత్రలో నిలిచిపోతుంది.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు కనీస వేతనాలు కలిగి ఉంటాయనే నమ్మకాన్ని వ మ్ముచేశారు పరాయి పాలకులు. ఆ పాలన ఆనవాళ్లకు చరమగీతం పాడి బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఏల కుటుంబాల్లో వెలుగులు విరజిమ్మిం ది. చదువుకొనే ఆర్థికస్తోమత లేని బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారిని వీఆర్ఏ వ్యవస్థలో వెట్టిచాకిరి చేయించుకోవడం రెవెన్యూ వ్యవస్థలో సర్వసాధారణమైంది. సమాజం మారుతున్న కొద్దీ ఉన్నత విద్య కలిగినవారి వేతనాల్లో, పనుల్లో మార్పు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వృత్తిపరమైన బాధ్యతతో పనిచేసినా వారికి కనీస వేతనం కరువైంది.
తరాల తరబడి తాత నుంచి మనవడి వర కు సమాజానికి వారందించిన త్యాగపూరిత సేవలు అనన్యసామాన్యమైనవి. వాటిని గుర్తించిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. విద్యార్హతతో నిమిత్తం లేకుండా అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించడం మానవీయ విలువలకు అద్దం పడుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రభుత్వం అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
రెవెన్యూ వ్యవస్థలో పెను మార్పులు తెచ్చి అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకున్నది. సాంకేతిక పరిజ్ఞానంతో భూముల వివరాలను భద్రపరిచింది. తెలంగాణ రైతాంగానికి భూమిపై భరోసానిచ్చిన నేపథ్యంలో గతంలో ఉన్న వ్యవస్థల్లో మార్పులు తీసుకురావడం అనివార్యమైంది. ఏ ప్రభుత్వమైనా పాత వ్యవస్థల రద్దు వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ, ఉద్యోగ భద్రత మా విధానమని ప్రకటించి బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో, వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని మరోసారి చాటుకున్నది.
కేంద్రం ఇటీవల అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించి ఉద్యోగులను తీసేసి వారిని రోడ్డున పడేసింది. కానీ, తెలంగాణలో ఇలాం టి అమానవీయ ఘటనలకు తావు లేదని నిరూపించారు కేసీఆర్. 61 ఏండ్లు నిండిన వారిని తొలగించడం తప్ప ఎలాంటి అవకాశాలు నిబంధనలు లేని వ్యవస్థలో ముఖ్యమంత్రి కేసీఆర్ 61 ఏండ్లు దాటిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇచ్చి వారు తరతరాలుగా చేస్తున్న సేవను గౌరవించారు. ఇది ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన నిర్ణయం.
గత తొమ్మిదేండ్లలో ఉద్యోగుల వేతనాలను 73 శాతం ఫిట్మెంట్ ద్వారా పెంచి మెరుగైన వేతనాలు ఇచ్చే రాష్ట్రంగా దేశంలోనే తెలంగా ణ అగ్రభాగాన నిలిచింది. దీంతోపాటు రెండు లక్షల 70 వేల మంది పింఛనర్లకు తమ వయసు పెరుగుతున్న కొద్దీ అనేక ఆర్థిక అవసరాలు పెరుగుతాయని ఆలోచించి ‘క్వాంటం ఆఫ్ పింఛన్’ను పెంచి నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు. పింఛనర్ల ఆత్మగౌరవాన్ని నిలిపే ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలపడం అందరికీ గర్వకారణం. కేసీఆర్ తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని స్వాగతిస్తూనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వాన్ని, ఆయన ఆలోచనా విధానాన్ని బలపరిచే బలమైన గొంతుగా ఉద్యోగులు, కార్మికులు నిలబడాలని నిర్ణయించుకుంటున్నారు.
(వ్యాసకర్త: తెలంగాణ ఉద్యోగ సంఘాల మాజీ జేఏసీ చైర్మన్)
దేవీప్రసాద్
90006 33404