ఈ వారంలో తెలంగాణ ముఖ్యమంత్రి దారి మళ్లింపు రాజకీయ చర్యల్లో (Diversion Politics) ముఖ్యాంశం తెలంగాణ జాతిపిత ఎవరు? అనేది. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో కొందరికి కనువిప్పు కలిగి, తెలంగాణ రాష్ట్రం సాధించిన మనిషికే ఆ బిరుదునివ్వాలని నినదిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి మనసులో వేరే వ్యక్తి ఉన్నారు. తెలంగాణకే కాకుండా, మహాత్మా గాంధీ పేరు చెరిపేసి, మొత్తం భారతదేశానికే జాతిపితగా పిలువగలిగిన వారు ఆయన. అంతేకాదు.. యూఎన్వో గుర్తించిన 195 దేశాల్లో.. ఆ వ్యక్తి కనుక్కొన్న కంప్యూటర్, ఇంటర్నెట్ సాయంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టి, విస్తరింపజేసిన వ్యక్తికి ప్రపంచ పిత బిరుదునివ్వడం సరైన చర్య. బిల్‌గేట్స్, ఎలాన్ మస్క్ లాంటి వారికి ఆ కంప్యూటర్ శాస్ర్తాలు ఎలా కనుక్కోవాలో, ఎలా వాడాలో చెప్పి, అటువంటి వారికి సాయం చేయడం కోసం సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల వంటి వారిని తయారు చేసి, అమెరికాకు పంపిన వ్యక్తి ఏ బిరుదు పొందటానికైనా అర్హుడే కదా మరి!
ఇంత గొప్ప వ్యక్తి అటు శాస్త్రవిజ్ఞానం, ఇటు పాడిపంటలు, పశుశాస్ర్తాలు తెలిసిన మనిషి రాజకీయ నాయకుడు అవటం ఈ 2, 3 తరాల ప్రజలు ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం! మరి ఈ వ్యక్తిని ప్రత్యేకంగా తెలంగాణ జాతిపిత అని ఎందుకు పరిగణించాలో విశ్లేషిద్దాం. శాసనసభ్యుడిగా గెలిచి కేవలం ఐదేండ్లు మాత్రమే మంత్రిగా పనిచేసిన వ్యక్తి, 45 ఏండ్ల చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పదవిని పొందడం అంత సులువైన పనికాదు. ఇది వారి మొదటి విజయం. అంతేకాదు కేంద్ర పార్టీలను ఎదుర్కొని ఐదేండ్లు, ఆ తర్వాత బీజేపీతో పొత్తుతో గెలిచి కేంద్రంలో కూడా చక్రం గిరగిరా తిప్పిన రాజకీయ దురంధరుడు ఆయన. ఇక తెలంగాణకు వారు చేసిన సేవల మీద ఒక పెద్ద గ్రంథం రాయవచ్చు. ఈ వ్యాసంలో క్లుప్తంగా తెలుసుకుందాం.
1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో (తెలంగాణ అనే పదం ఎక్కడా లేదు, గనించండి) ప్రభంజనం సృష్టించి గెలిచిన కొత్త పార్టీ తెలుగుదేశం (నిజానికి ఆంధ్రదేశం) అధికారం చేపట్టింది. మన వ్యక్తి అంతకుముందే 1978లో శాసన సభ్యత్వం పొంది, ఎమర్జెన్సీని బలపరిచినందుకు కేంద్ర కాంగ్రెస్ నుంచి బహుమానంగా సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పదవిని పొందాడు.
అయితే దేవేంద్రుడంత తెలివి మానవుల్లో చాలా తక్కువ మందికి ఉంటుంది. అత్యద్భుత రాజకీయ నైపుణ్యాలు కలిగిన చంద్రబాబు.. సినిమా రంగం నుంచి వచ్చి, పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించిన ఎన్టీఆర్‌కు దగ్గరయ్యాడు. పైగా ఇద్దరూ ఒకే వర్గానికి చెందినవారు కూడా! ప్రజాభిమానం పుష్కలంగా ఉన్న ఎన్టీ రామారావు చాలా సంపన్నుడు కూడా. అధికార బలం, అంగబలం, అర్థ బలం ఉన్న నాయకుడి నీడలో ఉంటే రాజకీయ ప్రగతి బాగుంటుందన్న సత్యం తెలిసిన నాయకుడు కావటం వల్ల, ఈయన కాంగ్రెస్‌ను వదిలి తెలుగుదేశంలో చేరటం అంత విస్మయం కలిగించే విషయమేమీ కాదు. ఆ తర్వాత 1995 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చేసిన చర్యల వల్లనే వారిని తెలంగాణ జాతిపిత అని అనుకోవచ్చు. ఆ నాయకుడు తెలంగాణకు ఏమేమి ఘనత వహించిన కార్యాలు చేశారో పరిశీలిద్దాం.
విద్యారంగం: 1995 వరకు తెలంగాణలో అరకొర చదువులే ఉన్నాయని గ్రహించిన నాటి ముఖ్యమంత్రి తన వర్గం వారిని బుజ్జగించి, తెలంగాణకు రప్పించి విద్యా సంస్థలు (పాఠాశాలలు, కళాశాలలు) అనేకం తెరిపించాడు. అంతవరకు అజ్ఞాన తిమిరంలో కొట్టు మిట్టాడిన తెలంగాణ ప్రజలు మొట్టమొదటిగా చదువు విలువ, గురువు విలువ తెలుసుకున్నారు.
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మైశ్రీ గురవే నమఃఅంటే అజ్ఞానమనే అంధకారంలో దృష్టి లోపం ఉన్నట్టు బతుకుతున్న వారికి విద్య అనే దీపాన్ని ప్రకాశింపజేసి కండ్లు తెరిపించే గురువుకు నమస్కారం అని అర్థం. ఆ రకంగా తెలంగాణను చైతన్య పరిచినవాడు జాతిపిత కాక మరేమవుతాడు? అయితే ఈ విషయాన్ని శంకించేవారు కూడా లేకపోలేదు. వారి ప్రకారం, నిజాముల పాలనలో (క్రీస్తు శకం 1869-1948) వరకు అనేక విద్యా సంస్థలు ప్రభుత్వమే ఆధునిక పాఠ్యాంశాలతో, పిల్లలకు వ్యక్తిత్వ వికాసం కలిగించే మార్గంలో నడిపేది. మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో 1865లోనే సిటీ హైస్కూల్‌ను ప్రారంభించారు. అలాగే ఉన్నత విద్య కోసం నిజాం కాలేజీని 1887లో స్థాపించారు. ఆ తర్వాత 1918లో స్థాపించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశంలోనే మొట్టమొదటి స్థానిక భాషా మాధ్యమ (ఉర్దూ) యూనివర్సిటీ. ఈ విద్యా సంస్థల్లో ఇంగ్లిష్, పర్షియన్ భాషలు కూడా బోధించేవారు. అంతేకాదు, ఇక్కడి ప్రజల్లో కూడా తెలుగు, మరాఠీ, కన్నడవారు 30% చొప్పున, ముస్లింలు 10% ఉండటంతో తెలుగు, కన్నడ, మరాఠీ మాధ్యమాల్లో కూడా విద్యా బోధన జరిగేది. తమ మాతృభాషలే కాక ఇంగ్లిష్, పర్షియన్ భాషా సాహిత్యాలు చదవడంతో వ్యక్తిత్వ వికాసం బాగా జరిగేది. అందరికీ అన్ని భాషల మీద పట్టు ఉండేది.
నిజాము రాష్ట్రం అంటారు కానీ ఆ కాలంలో (1948 వరకు) మహారాష్ట్రలో, కర్నాటకలో కొన్ని భాగాలు కలిసి తెలంగాణ వేరే దేశంగా ఉండేది. నిజాములకు పశ్చిమ, మధ్యతూర్పు దేశాలతో సంబంధ బాంధవ్యాలు ఉండేవి. ఇంగ్లాండ్ నుంచి ఇంగ్లిష్ ఉపాధ్యాయులు, పర్షియన్, అరబిక్ బోధించేవారు ఇరాన్, ఇరాక్ నుంచి వచ్చి నిజాముల విద్యా సంస్థల్లో పనిచేసే వారు. వీరేకాకుండా క్రిస్టియన్ మిషనరీలు స్థాపించిన సంస్థలు కూడా 19 శతాబ్దంలోనే ఉండేవి. ఇప్పుడు గొప్ప పేరున్న సెయింట్ జార్జెన్ గ్రామర్ స్కూల్ 1834లో స్థాపించారు.
ఎవరెన్ని చెప్పినా ఆధునిక కాలంలో తన పూర్వీకులైన వలసవాదుల పాలనలో 1956 నుంచీ 1995 వరకు జరగని విద్యావ్యాప్తి చంద్రబాబే చేశాడు. ఆంధ్ర నుంచి ఆయన వర్గం వారు తమ మాతృభూమిని వదిలి హైదరాబాద్‌లో ఇబ్బడి ముబ్బడిగా పాఠశాలలు, కళాశాలలు, సాంకేతిక విద్యాశాలలు స్థాపించి చంద్రబాబును విశ్వమానవుడిని చేశారు. మరి అంతటి ఘనత వహించిన బాబుగారిని తెలంగాణ జాతిపిత అనుకోవడం మనకెంత గర్వకారణం!
వైద్యరంగం: ఇక వైద్యరంగంలో కూడా చంద్రబాబు గారి ముద్ర గంభీరంగా నిలుస్తుంది. 1995 నుంచి ఆంధ్ర నుంచి వారి వర్గం వారు వచ్చి దవాఖానలు స్థాపించి, మెరుగైన చికిత్స అందిస్తున్నారు కదా! మరి ఇవి తెలంగాణ ప్రజలకు అందించినది చంద్రబాబే కదా! అందువల్ల ఆయనే ఈ రాష్ర్టానికి జాతిపిత! అయితే కొందరు నిజాముల పాలన చూసినవారు ఒక విషయం చెప్తారు. పర్షియన్, ఉర్దూ మాధ్యమాల్లో మెడిసిన్ చదివిన డాక్టర్లు.. వైద్యరంగంలో ప్రపంచ స్థాయి నిపుణులుగా గుర్తింపు పొందారు. మధ్యతూర్పు దేశాల నుంచి కూడా రోగులు మాములు వైద్యం కోసమే కాకుండా శస్త్రచికిత్సల కోసం హైదరాబాద్ వచ్చేవారు. అలా వచ్చిన వారిలో కొందరి ఇక్కడే స్థిరపడి పోయాయి.
మంచి అలవాట్లు: హైదరాబాద్ వారు, తెలంగాణ జిల్లాల వారు బద్ధకస్తులై తెల్లవారుజామున నిద్రలేచే అలవాటు చేసుకోలేదు. మరి తెలుగుదేశం పాలన వచ్చాకే వారు పొద్దున లేవటం, వరి పండించి బియ్యపు అన్నం తినటం మొదలు పెట్టారు కదా! అది గొప్ప సంస్కరణ కదా! అయితే మద్రాసుతో పరిచయం లేకపోవడంతో వారు ఉమ్మడిగా కలిసి ఉన్నప్పుడు తమిళులు వీరి పట్ల ఎలా ఉండేవారో చంద్రబాబుకు తెలియదు. ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి. అప్పుడు మద్రాసు హోటళ్లలో రసం బాగా కుదిరితే మైసూరు రసం అని బయట బోర్డు పెట్టేవారట. ఎప్పుడైనా రసం బాగా కుదరక, రుచి లేకపోతే ఆంధ్రా రసం అని బోర్డు పెట్టేవారుట. ఇలాంటివి చాలా విషయాలే ఉన్నాయి. అందుకే హైదరాబాద్‌లో వారి ఉలవచారును ఆకాశానికెత్తి పొగుడుతారు కొందరు వలసవాదులు.
పరిపాలన: ఇక పరిపాలన, రాజకీయాలకు వస్తే, ఆంధ్ర ముఖ్యమంత్రులందరిలో తెలంగాణకు ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబే! ఆయన నిద్రపోలేదు, అధికారులను నిద్రపోనీయలేదు. ఇండ్ల స్థలాలు, పరిశ్రమల స్థాపన, అధిక సంఖ్యలో ఆంధ్ర, రాయలసీమ నుంచి వలసలు ఆయన కాలంలోనే జరిగాయి. అంటే హైదరాబాద్ నగరం నిర్మించిన కులీ కుతుబ్‌షా అల్లా.. నా ఈ నగరం చేపలతో నిండిన చెరువులాగా కళకళలాడాలి అంటూ చేసిన ప్రార్థన ఫలింపచేసింది చంద్రబాబే. అందుకే ఆయన మన తెలంగాణకు జాతిపిత, సందేహమే లేదు. అంధ్రా ప్రాంతాన్ని పట్టించుకోకుండా, తెలంగాణ మీదనే తన దృష్టిని నిలిపిన చంద్రబాబు ఈ రాష్ర్టానికి జాతిపిత కాకుండా ఏమౌతాడు?
సంపద సృష్టి: ఎక్కడున్నదో తెలియకుండా మూలన బడిన హైదరాబాద్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో పెట్టిన వాడే కదా జాతిపిత అనే బిరుదుకు తగిన మనిషి! ఇక సంపద సృష్టించడంలో ఆయనను మించిన వారెవరైనా ఉన్నారా? కేవలం నాలుగేండ్లు ముఖ్యమంత్రిగా ఉండి, సింగపూర్, మలేషియా లాంటి పేద నగరాల అభివృద్ధికి తోడ్పడగలిగినంత సంపద సృష్టించుకున్నవాడు జాతిపితే కదా! ఇంకా తర్వాత ఐదేండ్ల కాలంలో తెలుగు, ఆంధ్ర రాష్ర్టాల ముఖ్యమంత్రులందరితో అత్యధిక ధనవంతుడైన నాయకుడవటం సామాన్య విషయమా? ఏమైనా చంద్రబాబు అనుబంధం హైదరాబాద్‌తో విడదీయరానిది.
అందుకే ఆంధ్రకు ముఖ్యమంత్రయినా హైదరాబాద్‌లోనే ఎక్కువ కాలం గడుపుతాడు, విదేశాలకెళ్లినప్పుడు తప్ప! కోహినూర్ రత్నం చూడటానికి ఆయన ఇంగ్లండ్ వెళ్లినప్పుడు అక్కడి వాళ్లు భయపడిపోయారు.. ఎక్కడ ఈయన దాన్ని డిమాండ్ చేస్తాడో అని! తన రాజధానికి 2 లక్షల ఎకరాలు కావాలనుకునే నిబద్ధత కలిగిన నాయకుడు ఇంకెవరైనా ఉన్నారా? నాకు తెలిసినంత వరకు లేరు. విభజన తర్వాత మూడో టర్మ్‌లో రెండోసారి అధికారంలోకి వచ్చి, 18 నెలల కాలంలో రూ.23 లక్షల కోట్ల నిధులను పెట్టుబడులుగా తేగలిగినవాడిని, ఆ పెట్టుబడులతో 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇవ్వొచ్చని చెప్పేవాడిని మనం కూడా మన రాష్ట్ర జాతిపితగా చేసుకుంటే కొంచెమైనా బాగుపడతాం కదా! మన ముఖ్యమంత్రి ఆలోచించాలి!
-కనకదుర్గ దంటు