ప్రభుత్వాధినేతల మానసిక స్థితి, అవగాహన సామర్థ్యం, చర్యల చొరవ ఆయా కాలమాన పరిస్థితులపైనే కాదు, భావితరాలకూ కీలకమైన ఉదాహరణలుగా మిగిలిపోతాయి. అందువల్లనే పాలకులు భిన్నమైన పేరు ప్రఖ్యాతులతో చరిత్రలో నిలిచిపోతారు. దేశానికి ప్రధానులుగా, ఆయా రాష్ర్టాలకు ముఖ్యమంత్రులుగా ఎంతోమంది నేతలకు పలు కారణాల వల్ల అవకాశాలు దక్కుతాయి. కానీ, అందులో పాలకులందరూ ప్రజల మస్తిష్కంలో మిగిలిపోరు. అయితే మంచి చేసిన నేతలనే జనం గుర్తుంచుకుంటారా అంటే, కీడు చేసిన ఏలికల పేర్లనూ మననం చేసుకుంటూనే ఉంటారు. అందుకే కదా ఔరంగజేబు, తుగ్లక్, ఘోరీ లాంటి కొందరు చక్రవర్తులు మదిలో మెదిలితే, జనానికి ప్రత్యేకమైన భావన కలుగుతుంది.
ఏడాది దాటినా, అనామక సర్కార్‌గా మిగిలిపోవడంతో, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గుర్తింపు రోగంతో విలవిలలాడిపోతున్నది. నా మాటే శాసనం అని శిగమెత్తినా, బుల్డోజర్లు పంపినా, బేడీలు వేసినా ఇంకా ముఖ్యమంత్రిగా గుర్తించరా? ఏ పాలకుడూ ఊహించని ఈ సమస్య పాపం సీఎం రేవంత్‌రెడ్డికి వచ్చిపడింది. అందువల్లనే గుర్తింపు కోసం గద పట్టుకొని అన్ని వర్గాలనూ తరమడం మొదలుపెట్టిండనే అసలు సంగతి అల్లు అర్జున్ అరెస్టుతో తెలిసింది. వాస్తవానికి సంధ్య థియేటర్ దుర్ఘటన రాష్ట్ర ప్రజలను కలచివేసింది. విచారణలో దోషులుగా తేలితే అల్లు అర్జున్‌తో సహా ఆ దుర్ఘటనకు కారణమైనవారికీ తగిన శిక్ష విధించాలనే అందరూ కోరుకుంటారు. అలాగే నివారించగలిగే అవకాశం ఉండి కూడా చేష్టలుడిగి చోద్యం చూసిన సర్కార్ యంత్రాంగం కూడా దోషినే కదా? ప్రజల ధన, ప్రాణ, మానాలకు రక్షణ కల్పించాల్సిన హోంశాఖ మంత్రిత్వ శాఖను వెలగబెడుతున్న రేవంత్‌రెడ్డి కూడా రేవతి మృతికి బాధ్యత వహించక తప్పదు కదా?
ప్రభుత్వం దుర్ఘటన అనంతరం అల్లు అర్జున్ అరెస్టుతో ఎంత హడావుడి చేసినా, సామాన్యులు సామాజిక మాధ్యమాల్లో సర్కార్ వైఫల్యాన్ని కడిగిపారేశారు. పైగా నటులను చులకన చేసి మాట్లాడుతూ, కేవలం ధనార్జన కోసం వెంపర్లాడే వారిగా సీఎం స్థాయిలో రేవంత్ రెడ్డి అభివర్ణించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా ‘నేనే స్టార్‌ను, ఉంటే గింటే అభిమానులు నాకుండి తీరాలి గానీ’ అంటూ అసలు తనలోని జెలసీని రేవంత్ బయట పెట్టుకున్నాడు. ఇప్పటికే హైడ్రా తదితర అనాలోచిత చర్యల కారణంగా రియల్ రంగం అమరావతి వైపు అడుగులు వేసింది. ఇప్పుడు సినిమా రంగం సైతం సర్దేసుకుంటే రాష్ట్ర ఆర్థికవ్యవస్థలో మరింత గందరగోళం అలుముకునే ప్రమాదం ఉన్నది. వివిధ రంగాల్లో జరిగే ఆరోగ్యకర ఆర్థిక లావాదేవీలు కేవలం వాటికే పరిమితమై ఉండవు.
రాష్ట్ర ఆర్థిక చక్ర పరిభ్రమణానికి అన్ని రంగాలూ గొలుసు కట్టులా అమరిపోయి ఉంటాయనే ఆలోచన కాంగ్రెస్ పాలకులకు లేకపోవడం దురదృష్టకరం. సంఘటనలకే పరిమితమై ఉండాల్సిన ప్రభుత్వ చట్టబద్ధ చర్యలు, ఆయా రంగాల మొత్తానికి వక్రదృష్టి కోణంతో ఆపాదిస్తే, పైగా ఆ పనికి సర్కారే పూనుకుంటే, దాని పరిణామాలు సామాజిక నష్టంగా మారుతాయి.
విద్యార్థులు పిట్టల్లా రాలుతున్నా, లగచర్ల గిరిజనులు పోరుబాట పట్టినా, రైతుల చేతులకు బేడీలు వేసినా, దిలావర్పూర్ గుండెలు మండినా ఇలా ఏం జరిగినా కాంగ్రెస్ అగ్రనేతలు కుట్రకోణం కథలు అల్లుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ కథలను చూసే శివసాగర్ ‘దేఖో దేఖో దేఖో దేఖో/ ఇందిరిస్టు గారడీ/ రాజకీయ రసడోలలో/ పసందైన ప్యారడీ’ అని తను రాసిన కవిత్వంలో ఈసడించుకున్నారు.
ఈ విధంగా భయాన్ని సృష్టించి, పాలకుడిగా గుర్తింపు పొందాలనే వింత పోకడతో పాటు, తెలంగాణ చరిత్ర, అస్తిత్వాన్ని అటకెక్కించి, తనే కొంగొత్త దేవుడిగా కనిపించాలనే వికారమైన ధోరణి రేవంత్ రెడ్డి సర్కార్‌లో రోజురోజుకూ పెరిగిపోతున్నది. సినీ నటులపై నోరు పారేసుకున్నట్టే, లగచర్ల ఘటనకు ముందు కూడా సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలోని గిరిజన లంబాడీలపై రేవంత్‌రెడ్డి దురభిప్రాయాన్ని బయటపెట్టాడు. వికారాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో మా ప్రాంతంలో వందల కోట్ల ఆస్తులు కలిగిన స్థితిమంతులైన చాలామంది లంబాడీలున్నారని సెలవిచ్చారు.
కొడంగల్ ప్రాంతంలో పేద గిరిజనులైన లంబాడీలపై ఎవరైనా ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారా? కేవలం రేవంత్ రెడ్డి గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో, లంబాడీల జనసంఖ్య ఆ నియోజకవర్గంలో ఉండటమే రేవంత్‌రెడ్డి అక్కసుకూ, రైతుల అరెస్టులకూ, ఫార్మా పేరిట లగచర్ల చుట్టుపక్కల గిరిజన రైతుల భూముల సేకరణకూ కారణంగా కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతి చర్యకు ముందూ వెనక కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఏదో సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత ద్వేషాన్ని బయటపెడుతూనే ఉన్నారు. ఆ ధోరణిలోనే కాళేశ్వరం నుంచి తెలంగాణ తల్లి ప్రతిమ వరకు ప్రతి చారిత్రక అంశమూ ముఖ్యమంత్రి వక్ర లక్ష్యానికి గురిగా మారిపోయింది. తరాల పాటు తెలంగాణ ఉప్పొంగేలా, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం మధ్యలో అద్భుతమైన సచివాలయాన్ని నిర్మించి కేసీఆర్ చరిత్రను చెక్కితే, దానిముందు రాజీవ్‌గాంధీ విగ్రహ వివాదాన్ని కాంగ్రెస్ సర్కార్ రాజేసింది.
దాన్ని దాచుకునేందుకు తెలంగాణ తల్లి ప్రతిమ గందరగోళాన్ని సృష్టించి ఆనందపడే ప్రభుత్వం, ప్రజల దృష్టిలో ఎంత పొట్టిదిగా, ఉట్టిదిగా మారిపోతుందో ఎవరికైనా అర్థమైపోతుంది కదా! వికాసాన్ని మరిచి, వివాదాలను నమ్ముకొని, విలనిజంతోనే వెలగాలని రేవంత్‌రెడ్డి సర్కార్ విశ్వసిస్తున్నదని ఏడాది పాలన అందరికీ అర్థం చేయించింది. రేవంత్‌రెడ్డి సర్కార్ ఏడాదిగా అనుసరిస్తున్న ప్రతి చర్య వెనక, ఏలుతున్న వారి వ్యక్తిత్వ లోపంతో పాటు మరెన్నో లోతైన కారణాలున్నాయి. అందువల్లనే అదానీతో దోస్తానా, ప్రపంచ బ్యాంకుతో ఒప్పందాలు, ఎన్కౌంటర్లు, అస్తిత్వం, చరిత్రపై మిడతల దండులా దాడి మొదలుపెట్టారు. ఈ విధ్వంసక పాలనా నమూనా కొత్తగా రేవంత్‌రెడ్డి సర్కార్ కనుగొన్నదేం కాదనే వాస్తవం తెలంగాణ సమాజానికి తెలుసు.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణ పద నిషేధమే కాదు, చివరికి సామాజిక శాస్ర్తాలనూ రద్దుచేయాలనే ఎత్తుగడలను సైతం వేసింది. వనరులను కొల్లగొట్టే ప్రపంచ బ్యాంకు ఆర్థిక నమూనాకు ఆశ్రిత వర్గాలుగా మారి, రాజకీయ పబ్బం గడుపుకొంటున్న నేతలకు టూరిజం, టార్చర్ తప్ప టార్చ్ బేరర్‌గా నిలవాలనే దృక్పథం అసలే ఉండదు. ఇలాంటి నాయకగణానికి సర్కార్ ప్రాధాన్యాల్లో సంకెళ్లు, జైళ్లు
సహజంగానే కీలకాంశాలుగా ఉంటాయి.
ఆ ఎజెండాలో భాగంగానే రేవంత్‌రెడ్డి సర్కార్ ఫార్ములా-ఈ రేస్‌ను వివాదాస్పదం చేసి, కేటీఆర్‌ను జైలుకు పంపాలని ఉబలాటపడుతున్నది. దేశంలో పదేండ్ల పాలనా కాలంలో వనరులు, అవకాశాల సృష్టి దృష్టికోణాన్ని పాలనా వ్యవస్థకు కల్పించి, సత్వర, సమతుల్య అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలో సాధ్యం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రపంచబ్యాంకు పాలసీల ప్రేరణతో, జడత్వంలా మారిన పైస్థాయి అధికారిక వ్యవస్థ గీసిన గీతలు, రాసిచ్చిన రాతల్లో తలమునకలయ్యే సర్కార్ల తీరును, నవీన మార్గంలో పరుగులు పెట్టించింది కేసీఆర్ ప్రభుత్వం. అంకెల విన్యాసాలకు దూరంగా, పునాదిలో ఉత్పాదకత సూత్రాన్ని నమ్మి, ఆచరణలో పెట్టి ఫలితాలు రాబట్టింది.
కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లు, ప్రపంచబ్యాంకు లాంటి వ్యవస్థలు అధికారిక వ్యవస్థల్లో ఏర్పర్చుకున్న లాబీల ప్రయత్నాలను కనిపెట్టుకొని, పాలనను రాష్ట్ర అవసరాల కొలమానంలో నడిపించడం అంత సులభంగా జరిగిపోదు. సవాళ్లను స్వీకరించే సహజ స్వభావం కలిగిన కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రిగా అలాంటి అవాంతరాలను ఎన్నింటినో అధిగమించి, ఆరోగ్యకరమైన ఆర్థికవ్యవస్థను నిర్మించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఆ విజయాలనే ఆర్బీఐ హ్యాండ్‌బుక్ కూడా శాస్త్రీయ గణాంకాధారిత వివరాలతో వెల్లడించింది. అయినా సరే, కరెంట్ వెలుగుల్లో, పారిన నీళ్లల్లో, పండిన ప్రగతిలో విషం కుమ్మరించి, కటకటాల్లోకి కేసీఆర్ కుటుంబాన్ని నెట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రలు కొనసాగిస్తుండటం దుర్మార్గపు రాజకీయాలకు నిదర్శనం.
వాస్తవానికి ఏడాది కాలంగా బీఆర్ఎస్ నిర్మాణాత్మక విపక్షంగా ఆందోళన బాటపట్టిన జనానికి అండగా నిలబడింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను గుర్తు చేస్తూ, వాటి అమలు కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఒత్తిడి పెంచుతున్నది. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో, శ్రమించి నిర్మించుకున్న ప్రగతి మొత్తం పలుచబడిపోతుంటే ప్రజల రాజకీయశక్తిగా బీఆర్ఎస్ మౌనంగా ఉండగలదా? ముందే సమాచారం అందించి, వన భోజనాలకు వెళ్లినట్టుగా గురుకులాలకు బైలెల్లి, ఖరీదైన నీళ్ల బాటిళ్లు, రుచికరమైన వంటలతో ఒంటిపూట విందారగించొచ్చిన ముఖ్యమంత్రి, వారి మంత్రి మండలికి తెల్లారేసరికి ఎలుకల కాటుకు గురై అనారోగ్యంతో అల్లాడుతున్న విద్యార్థినుల వార్త ఎలా జీర్ణమై ఉంటుందో? విద్యార్థులు పిట్టల్లా రాలుతున్నా, లగచర్ల గిరిజనులు పోరుబాట పట్టినా, రైతుల చేతులకు బేడీలు వేసినా, దిలావర్పూర్ గుండెలు మండినా ఇలా ఏం జరిగినా కాంగ్రెస్ అగ్రనేతలు కుట్రకోణం కథలు అల్లుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ కథలను చూసే శివసాగర్ ‘దేఖో దేఖో దేఖో దేఖో/ ఇందిరిస్టు గారడీ/ రాజకీయ రసడోలలో/ పసందైన ప్యారడీ’ అని తను రాసిన కవిత్వంలో ఈసడించుకున్నారు.
తాము నమ్ముకున్న సంకెళ్లు.. రాష్ట్రం కోసం బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తున్న సమరాన్ని నిలువరించగలవని రేవంత్‌రెడ్డి సర్కార్ కలగనడం విడ్డూరం. ఆధిపత్యం కోసం దురాశపరులు చేసే రాజకీయాలు, అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం ఉద్యమ శక్తులు నడిచే మార్గాన్ని అడ్డుకోజాలవన్నది చరిత్ర చెప్తున్న సత్యం. ఈ హస్తం సర్కార్ వినిపిస్తున్న సంకెళ్ల సవ్వడికి జడిసేవారెవ్వరూ లేనే లేరు.
ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కలుగజేసుకొని రేవంత్‌రెడ్డి సర్కార్ అరాచకాలను ఆపాలని ఆలోచనపరులంతా గాంధీ కుటుంబంపై ఒత్తిడి తేవాలి. అయినా, అదానీ అంశంలోనే తలోదారిలా వ్యవహరిస్తున్న రేవంత్, రాహుల్‌లు, రాష్ట్రం కోసం మాత్రం ఒకరిమాట మరొకరు వింటారని ఆశించలేం. కాంగ్రెస్ సర్కార్ మనకు వినిపిస్తున్న సంకెళ్ళ సవ్వడి వెనక, దోపిడి శక్తుల పన్నాగముందనే సత్యాన్ని అర్థం చేసుకుందాం. ఆ ప్రజాస్వామిక దృక్పథంతోనే చెరసాలల్లో మగ్గుతున్న లగచర్ల రైతుల కోసం నిలబడదాం. రాలిపోతున్న గురుకులాల విద్యార్థులకు అండగా మాట్లాడుదాం. తెలంగాణ స్వీయ సంస్కృతి, అస్తిత్వం, చరిత్రపై జరుగుతున్న దాడినీ తిప్పికొడదాం. పోరాడుతున్న కేటీఆర్ అరెస్ట్ కోసం, కాంగ్రెస్ సర్కార్ పేనుతున్న కుట్రలనూ ఎదిరిద్దాం.
– (వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
డాక్టర్ ఆంజనేయ గౌడ్