కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో ఉపాధ్యాయ, ఉద్యోగులకు ‘చూపుల కన్నా ఎదురుచూపులు మిన్న’ అనే పాట సరిగ్గా సరిపోతుంది. ఆ పార్టీ అధికారంలోకి రావడానికన్నా ముందు అన్నివర్గాలకు అలవిగాని హామీలు ఇచ్చినట్టుగానే వీరికి కూడా ఎన్నో హామీలిచ్చింది. కానీ, ఏడాది దాటినా ఆ హామీలు అమలుకావడం లేదు. మచ్చుకు ఒక్క ఉదాహరణను తీసుకుంటే అధికారంలోకి రాగానే పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాలు విడుదల చేస్తామని చెప్పిన ఆ పార్టీ నాయకులు, ఒక విడుత కరువు భత్యం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. మిగతా నాలుగింటి సంగతి ఇక దేవుడే ఎరుగు.
గత కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా పీఆర్సీ ఏర్పాటుతో పాటు 5 శాతం ఇంటరిమ్ రిలీఫ్ ప్రకటించి అమలుచేసింది. ఆరు నెలల్లో పీఆర్సీని అమలుచేస్తామని చెప్పిన కాంగ్రెస్ మాత్రం గడువును పెంచుతూ పోతున్నది. గత కేసీఆర్ ప్రభుత్వం రెండు సార్లు పీఆర్సీ కమిషన్ సిఫారసులకు ఆమోదం తెలిపి 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. దీంతో ఉద్యోగుల వేతనాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. జీతం పెరుగుదల విషయంలో దేశంలోనే తెలంగాణ ఉద్యోగులు ముందువరుసలో నిలిచారు.
2023, జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలుకావాలి. కానీ, ఇప్పటికీ అతీగతీ లేదు. ఎప్పుడిస్తారో కూడా తెలియదు. అంతేకాదు, ఈ నాలుగేండ్లలో అమలవుతుందో, లేదోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పీఆర్సీ మాట దేవుడెరుగు, పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు ఇచ్చినా చాలనే స్థితిలో ఉద్యోగులున్నారు.
2004 తర్వాత నియామకమైన ఉద్యోగులకు కాంట్రిబ్యూషన్ పింఛన్ స్కీంను అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాలని, లేకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో రాష్ర్టాలకు కోత విధిస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అన్ని రాష్ర్టాలు అమలుచేసే విధంగా ఒత్తిడి చేసింది. సీపీఎం పార్టీ అధికారంలో ఉన్న అప్పటి పశ్చిమబెంగాల్, త్రిపుర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ బెదిరింపులకు లొంగకుండా పాత పింఛన్ విధానాన్నే అమలుచేశాయి. ఇటీవలి కాలంలో త్రిపురలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీపీఎస్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిది. రేవంత్‌రెడ్డి కూడా అధికారంలోకి రాగానే తెలంగాణలో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి ఏడాది తర్వాత కూడా ఒక్కడుగు ముందుకు వేయలేదు. ఇతర రాష్ర్టాలలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలోకి రాగానే, ఉద్యోగులను మోసం చేస్తూ కుంటి సాకులతో కేంద్రంపైకి నెడుతూ తప్పించుకున్నది.
జాతీయ పింఛన్ విధానంలో ఉద్యోగులు చెల్లించిన 10 శాతం తిరిగి రాష్ర్టాలకు జమచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా కేంద్రం ఇచ్చేదే లేదని తేల్చిచెప్పింది. దీన్ని సాకుగా చూపించి అన్ని రాష్ర్టాలు సీపీఎస్‌ను కొనసాగిస్తున్నాయి. సీపీఎస్ అమలులో కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందే అనేవిధంగా వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్ యూపీఏ హయాంలో సీపీఎస్ పురుడు పోసుకున్నది. భాగస్వామ్యంగా ఉన్న వామపక్ష పార్టీలు వ్యతిరేకంగా ఉండటం వల్ల వెనకడుగు వేసింది. కానీ, ఎన్డీయే అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ విధానాలను సమర్థవంతంగా అమలుచేసింది. బీజేపీ ప్రభుత్వం 4/25 నుంచి అమలుచేయనున్న ఏకీకృత పింఛన్ పథకాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉద్యోగి కుటుంబానికి సామాజిక భద్రత ఇవ్వని యూపీఎస్ మాకు వద్దని ఉద్యమాలు చేస్తున్నారు. పైగా, ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని కేంద్రం అనుమతివ్వడం వల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నది. ఉద్యోగుల పనితీరును ప్రతి నెల సమీక్షించి అవసరమైతే నిర్బంధ పదవీ విరమణ చేస్తామంటూ ఉత్తర్వులు ఇచ్చారు.
కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడాన్ని ఉద్యోగులు గమనిస్తున్నారు. జీవో నంబర్ 317ను సమీక్షించి పరిష్కారిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం క్యాబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేసింది. 10 నెలల తర్వాత ఆ నివేదిక మేరకు జీవో 243, 244, 245 విడుదల చేసింది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉద్యోగులు స్థానికత విషయం ప్రస్తావన లేకుండా కేవలం స్పౌజ్, అనారోగ్య కారణాలతో బదిలీలకు అవకాశం కల్పించారు. ఈ జీవోల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. బాధితులను, ఉద్యోగ సంఘాలను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం అన్యాయమని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీవో రాగానే ప్రభు త్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్న మాజీ ఉపాధ్యాయ సంఘాల నాయకుడు తీవ్రంగా వ్యతిరేకించారు. 317 జీవోపై గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని భావించిన ఉద్యోగులకు నిరాశే మిగిలింది.
ఇదిలా ఉంటే పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. 31/3/24 నుంచి 7,346 ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. వీరికి ఏ ఒక్క బెనిఫిట్ ఇవ్వకుండా వేధిస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. అనేక ఆర్థిక ఇబ్బందులతో అనివార్యంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. 24 శాతం వడ్డీతో ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా అమలు కావడం లేదు. ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ, జీపీఎఫ్‌ల ద్వారా వచ్చే మొత్తం ఎప్పుడిస్తారో కూడా చెప్పడం లేదు. దాదాపు రూ.3,500 కోట్ల మేర చెల్లించాల్సిన ప్రభుత్వం నోరు విప్పడం లేదు. కొత్త ఆరోగ్య కార్డులు ఇచ్చి ఉద్యోగుల ఆరోగ్య సమస్యలు పరిష్కారిస్తామన్న కాంగ్రెస్ ఇప్పటివరకు ఈ విషయమై కనీసం సమీక్ష కూడా చేయలేదు. ఉద్యోగులు ప్రభుత్వానికి 500 నుంచి 1000 వరకు కాంట్రిబ్యూషన్ చెల్లిస్తామని చెప్పినా ఒక్కడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి వేస్తున్నది. ఏడాదిగా ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తుండటంతో ఉద్యోగుల పట్ల ప్రభుత్వ ప్రేమ ఉత్తదేనని తేలిపోతున్నది.
ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఆశా వర్కర్లకు, ఇందిరాక్రాంతి పథకం, గ్రామీణ ఉపాధి హామీ, అంగన్వాడీ టీచర్లకు, ఇతర చిన్న తరగతి ఉద్యోగులకు తక్షణ వేతన హెచ్చింపు చేస్తామని చెప్పి కనీసం వేతనాలు కూడా రెగ్యులర్‌గా ఇవ్వకుండా ప్రభుత్వం వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నది. గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇచ్చిన ఉద్యోగ భద్రత కనీస వేతన హామీ మరిచి పోయింది. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పి మోసం చేసింది. 1వ తేదీన వేతనం చెల్లిస్తున్నామని గొప్పగా ప్రకటిస్తున్నా కేవలం ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ ద్వారా వేతనాలు పొందే వారికే చెల్లిస్తూ, లక్షకు పైగా ఉన్న ఉద్యోగులకు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం కాలయాపన చేస్తున్నది.
రెగ్యులర్ ఉద్యోగులకు వేతనాలు మాత్రమే ఇస్తూ ఎలాంటి ఇతర భత్యాలు, సరెండర్ లీవ్, రవాణా ఛార్జీలు, దిన భత్యం లాంటివి కూడా ఇవ్వడం లేదు. పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పారిశుధ్య నిధులు విడుదల చేయకపోవడం వల్ల అప్పులు చేసి మరీ వారు పనులు చేయిస్తున్నారు. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.
ఉద్యోగ సంఘాల నేతలను కలిసి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని, ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఓపిక పట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభ్యర్థించారు. వచ్చే సంవత్సరం మే నెల తర్వాత ఉద్యోగ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీని వేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులను కలిసి చర్చించాలని కోరారు. ఉద్యోగులు అడుగుతున్న కోరికలు కొత్తగా వచ్చినవి కావు. మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలనే వాళ్లు గుర్తుచేస్తున్నారు. మళ్లీ కమిటీల పేర కాలయాపన ఎందుకో అర్థం కావడం లేదు. గతంలో ఉద్యోగులకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న ఎమ్మెల్సీ కోదండరాంకు ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్నో సార్లు సమస్యలు వివరించారు. అయినా ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాలేదు. ఇప్పుడు కొత్తగా కేశవరావును నియమించి ఏడాది తర్వాత విషయం మొదటికి తెచ్చారు.
అన్నివర్గాల ప్రజలను వంచించినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులనూ మోసం చేస్తున్నది. దీంతో కాంగ్రెస్‌కు ఓటు వేసిన ఉద్యోగుల ఆశలు అడియాసలు అయ్యాయి. కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీల గురించి ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేవిధంగా ఉద్యోగ సంఘాలు దృష్టిసారించాలి. అప్పుడే ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయి. మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీల గూర్చి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కార్యాచరణ వైపు ఉద్యోగ సంఘాలు దృష్టి సారించాలి.