బీజేపీ, టీడీపీ, టీ కాంగ్రెస్ పార్టీలది ఒకే సమైక్య రాగం. తెరముందు వేరుగా కనిపిస్తున్నా తెర వెనుక కడుతున్నది ఒకటే వేషం. బీఆర్ఎస్పై విషం చిమ్మడమే వాటి ఉమ్మడి లక్ష్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక వివక్షలు, అన్యాయాలు, అవమానాలు, అణచివేతలు, నిర్లక్ష్యాలకు గురైంది తెలంగాణ ప్రాంతం. నిద్రాణంగా ఉన్న తెలంగాణ ప్రజల ప్రబల ఆకాంక్షను భుజానికెత్తుకుని రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ముందుకువచ్చారు. టీడీపీ ద్వారా సంక్రమించిన అన్ని పదవులను గడ్డిపోచలుగా త్యజించి వజ్ర సంకల్పంతో ఉద్యమ నాయకత్వాన్ని చేతబూనారు. సకల జనులను ఏకతాటిపైకి తీసుకొచ్చి, అన్ని వర్గాల మన్ననలు, మద్దతు కూడగట్టుకుని అకుంఠిత దీక్షతో ఆయన అలుపెరుగని సుదీర్ఘ పోరాటం చేసి దశాబ్దాల కలను సాకారం చేశారు.
కేసీఆర్ పోరాట ఫలితంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీర్వాదంతో ఆయనే ఎన్నికవడం ప్రజాస్వామ్య విజయానికి, ప్రజలు చూపిన కృతజ్ఞతకు తార్కాణం. తొమ్మిదిన్నరేండ్ల పరిపాలనతో విలక్షణమైన, విస్తృతమైన, సమగ్రమైన అభివృద్ధిని సాధించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని కేసీఆర్ తనవైపు తిప్పుకోగలిగారు. ప్రజాస్వామ్యంలో అధికార మార్పు సహజం. అంతే సహజంగా ప్రజలు పునస్సమీక్ష చేసుకొని ప్రభుత్వ తప్పిదాలను ఎండగడతారు. ప్రతిపక్షం తన పని తాను చేసుకుపోతూ ప్రజలపక్షాన నిలబడుతుంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ర్టాల్లోని అధికార పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లతోపాటు టీడీపీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ, తెలంగాణపై పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడుతుండటం శోచనీయం.
తెలంగాణేతర రాజకీయ నేతలతోపాటు దేశ అత్యున్నత స్థాయి నుంచి కూడా తెలంగాణపై కుట్రలు సాగుతున్నాయి. ప్రధాని మోదీ, అతని మంత్రివర్గ సహచరులు కొందరు పలు సందర్భాల్లో పార్లమెంట్ వేదికపైనా, బహిరంగ సభల్లోనూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వంపై విషం చిమ్మడమే తమ రాజకీయ పరమావధిగా వారు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల దేశ ప్రధాని వ్యక్తపరిచిన ఆవేదన, ఆక్రోశం ఆయనలో తెలంగాణ పట్ల ఉన్న నిరసనకు, అసహనానికి, వివక్షకు ప్రతీక. అనేక సందర్భాల్లో ఆయన ఇదే విధంగా మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటును ఒక రాజకీయ కుట్రగా, దిశాహీనంగా ముందుకు సాగుతున్న రాష్ట్రంగా తెలంగాణను చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ, వాస్తవం ఏమిటంటే.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎవరూ ఊహించని విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. విద్యుత్తు, వ్యవసాయం, మౌలిక వసతులు, పట్టణాభివృద్ధి, మహిళా సంక్షేమం, ఐటీ రంగం, సాగునీటి ప్రాజెక్టులు వంటి అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందనేది చెరగని సత్యం. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేని ఈర్ష్య, అసూయలతో పసికూన అని కూడా చూడకుండా, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణకు రావాల్సిన నిధులను ప్రధాని మోదీ విడుదల చేయలేదు.
అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం తన రాజ్యాంగపరమైన బాధ్యతలను విస్మరించింది. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధులతోపాటు ఉద్యోగుల హక్కులు, విభజన హామీలను నిర్లక్ష్యం చేసింది. ప్రాజెక్టులకు అనుమతులు, సంస్థల విభజన, ఐఏఎస్ అధికారుల బదిలీలు వంటి అనేక అంశాల్లో తెలంగాణకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం వ్యవహరించింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి చంద్రబాబు అనేకసార్లు కుట్రలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించకముందే, ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆయన ప్రధాని మోదీతో కలసి తెలంగాణపై కుట్రలకు తెరలేపారు. తత్ఫలితంగా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు, భద్రాద్రి రామాలయానికి చెందిన పవిత్ర భూములు, యూనిట్‌కు కేవలం 13 పైసల ఖర్చుతో విద్యుత్తును అందించే సీలేరు జలవిద్యుత్తు ప్రాజెక్టులను ఒక్క ఆర్డినెన్స్ ద్వారా ఏపీకి అప్పనంగా అప్పగించేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైన కేసీఆర్‌ను కనీసం సంప్రదించకుండా, ఆయన అభిప్రాయం తీసుకోకుండా మోదీ ప్రభుత్వం పన్నిన పెద్ద కుట్ర ఇది. ఆ తర్వాత కూడా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి చంద్రబాబు అనేక కుట్రలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుతంత్రం చేశారు. కానీ, తన కుట్ర విఫలమవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఏపీకి వెళ్లిపోయారు.
చంద్రబాబు మద్దతుతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నడుస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు మెప్పు పొందేందుకు అతని అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. తెలంగాణ రాష్ర్టానికి మరోసారి ద్రోహం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ సమాజం జాగ్రత్తతో వ్యవహరించి వారి కుట్రలను తిప్పికొట్టాలి. కేసీఆర్ పోరాటాలతో సాధించిన తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఒక్కటై అణచివేయాలని ప్రయత్నిస్తున్నాయన్నది స్పష్టమవుతున్నది. ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఇంటి దొంగల ముప్పును ఎదుర్కొంటున్నది. కాకతీయ కళాతోరణాన్ని రాష్ట్ర రాజముద్ర నుంచి తొలగించజూడటం, తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చడం, అలంకరణలను, బతుకమ్మను తొలగించి భాగ్యవంతంగా విరాజిల్లుతున్న తెలంగాణ తల్లిని అనామక తెలంగాణ తల్లిగా చూపించే ప్రయత్నాలు చేయడం, తలసరి ఆదాయంలో నెంబర్ వన్‌గా కొనసాగిన తెలంగాణ రాష్ర్టాన్ని అప్పుల రాష్ట్రంగా చూపేందుకు ప్రయత్నించడం, చిప్ప- చెప్పు ఉపమానాలతో పోలుస్తూ ఉమ్మడి రాష్ట్రంలోనే పాలన బాగుందని.. ఏనాడూ ‘జై తెలంగాణ’ అనని ముఖ్యమంత్రి మాట్లాడటం వెనుక ఉన్న హేతువు ఏమై ఉంటుంది? కేసీఆర్ సాధించిన అజేయమైన అభివృద్ధి పట్ల అక్కసు తప్ప. ‘జై తెలంగాణ’ అని నినదించినవారిని కొందరు నేతలు తప్పుబడుతున్నారు. ఇదంతా తెలంగాణ ప్రజల అస్తిత్వ భావజాలంపై జరుగుతున్న దాడి, కుట్ర కాకపోతే మరేమిటి?
అటు రాజకీయంగా, ఇటు సంస్కృతి పరంగా తెలంగాణను విలీనం చేసే కుట్రలు నడుస్తున్న ఈ వేళ, ప్రజలు మేల్కొని ఈ కుట్రలను భగ్నం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక పార్టీ, నాయకుడి పోరాటం కాదు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకునే యుద్ధం.
తెలంగాణ ఉద్యమం ద్వారా సమైక్యాంధ్ర తాలూకు రాజకీయ పీడనం నుంచి విముక్తి పొందాం. ఇప్పుడు సామూహిక కుట్రల పీడనం నుంచి కూడా విముక్తి పొందే సమయం వచ్చేసింది. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నగరంగా మార్చిన ఘనత ఐటీ, పురపాలక శాఖల మాజీ మంత్రి కేటీఆర్‌దే. హైదరాబాద్ ప్రగతి ఆయన దార్శనిక నాయకత్వాన్ని బలంగా ప్రతిబింబిస్తున్నది. అనేక భాషలపై పట్టుతో, అర్థవంతమైన సంభాషణా సామర్థ్యంతో, ప్రతిభావంతమైన మేధస్సుతో ఆయన అహర్నిశలు శ్రమించి నగర ప్రతిష్టను గణనీయంగా పెంచారు. కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ఆదాయం ఐదు రెట్లు పెరిగింది. నగర పరిసర ప్రాంతాలు అనేక రంగాల్లో ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందాయి.
ఈ విజయమే కేటీఆర్ పట్ల ప్రజలకు అపార విశ్వాసాన్ని కలిగించింది. అందుకే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్కు అఖండ మెజారిటీతో విజయాన్ని అందించారు. అయితే, ఈ ఘన విజయాన్ని జీర్ణించుకోలేని రాజకీయ శక్తులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, బీజేపీ కలిసి కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్రకు తెరలేపారు. కేటీఆర్ స్థాయిలో ప్రజాదరణ కలిగిన, ప్రజలను ప్రభావితం చేయగల నాయకుడు ఎవరూ, ఏ పార్టీలో లేకపోవడంతో వ్యక్తిగత దూషణలకు, వ్యక్తిత్వ హనన రాజకీయాలకు దిగజారారు. కేటీఆర్‌ను ప్రజల దృష్టిలో చులకన చేయడానికి ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ద్వారా కుట్రలు చేస్తున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదు, తెలంగాణ అభివృద్ధి, దశ, దిశలపై దాడి. ప్రజాపోరాటాలు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎప్పటికప్పడు ఎండగడుతున్న బీఆర్ఎస్ వైపు నిలుస్తున్న ప్రజల దృష్టిని మరల్చే కుతంత్రం ఇది.
ఇకపై ‘జై తెలంగాణ’ అనాల్సిన అవసరం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి అంటున్నారు. భారతదేశ పటంలో నుంచి తెలంగాణను తొలగించి, తిరిగి సమైక్యాంధ్ర పటాన్ని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ పెట్టారు. ఈ కుట్రలతోపాటు ఏపీకి చెందిన పత్రికలు, టీవీ చానళ్లు తమ కుత్సిత కుతంత్రాలతో తెలంగాణ అస్తిత్వంపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మన నేతల వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వార్తలు రాస్తూ, ప్రసారం చేస్తూ తమ అభిప్రాయాలను ప్రజల అభిప్రాయాలుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ కుట్రలు, కుతంత్రాలను భగ్నం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజం ఇప్పటికైనా మేల్కొని, వారి పీచమణచడం అత్యంత అవసరం. తెలంగాణ ఉనికికి, అస్తిత్వానికి విఘాతం కలిగించే ప్రతి కుట్రను ఎదుర్కొనాలి. తెగువ చూపిస్తేనే నిలబడుతుంది తెలంగాణ అస్తిత్వం! తెగించి కొట్లాడితేనే నిలబెట్టుకోగలం తెలంగాణ రాష్ట్రం.