మన దేశంలో ఏ మంత్రయినా బాధ్యతలు స్వీకరించేటప్పుడు ఎలాంటి ఆశ్రిత పక్షపాతం చూపనని రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేస్తారు. అంతేకాదు, భారత ప్రభుత్వ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి పదవిలో ఉన్నంతకాలం తన కుటుంబ సభ్యులు ప్రభుత్వంతో ఎలాంటి వ్యాపారాలు చేయకుండా చూడాలి. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి ఈ నిబంధనలు వర్తించవా? అన్నది అసలు ప్రశ్న.
conflict of interest కేసులో ఇందిరాగాంధీని కోర్టు అనర్హురాలిగా ప్రకటించినప్పుడు ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేశారు. విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించి ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ కూడా గతంలో తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి చట్టానికి అతీతుడేమీ కాదు.
Swachh Bio | ఈ పదేండ్లలో తెలంగాణ నుంచి అమెరికాకు వెళ్లిన అతిపెద్ద బృందం ఇదే కావచ్చు. గతంలో ఐటీ మంత్రి, ఐటీ శాఖకు చెందిన అధికారులే పర్యటనకు వెళ్లేవారు. కానీ, ఈసారి మాత్రం ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక, పరిశ్రమలు, ఐటీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యమంత్రి సిబ్బంది, ఇద్దరు మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక పత్రిక ఎడిటర్ కూడా ఆ బృందంలో ఉండటం ఆశ్చర్యకరం.
రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడమే కాదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే మరింత మెరుగైన పనితీరును కనబరిచారని రుజువు చేయడం ఈ బృందం ముందున్న టాస్క్. రాష్ర్టానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తీసుకువస్తారని ఆశిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ వారికి శుభాకాంక్షలు కూడా తెలిపారు.
గత ప్రభుత్వ కృషిని, పనితీరును మెచ్చుకుంటూ కాగ్నిజెంట్ కంపెనీ విస్తరణతో సీఎం మొదటిరోజు పర్యటన ప్రారంభమవడం ఆహ్వానించదగిన విషయం. ఏదేమైనప్పటికీ వాల్ష్ కర్రా హోల్డింగ్స్ కంపెనీతో ఒప్పందంతో మొదటి రోజు అస్పష్టతతో ముగిసింది. ఆ కంపెనీ డైరెక్టర్లు సందేహాస్పదంగా ఉన్నారు. సదరు కంపెనీ ఆర్థిక స్థితిగతులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు, ఆ కంపెనీ మునుపటి వ్యాపారాలు మూతబడ్డాయి. సదరు కంపెనీ తెలంగాణలో రూ.839 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్టు రేవంత్‌రెడ్డితో కలిసి ప్రకటించడం సంచలనం రేపింది. అసలు ఇలాంటి మోసపూరిత కంపెనీలను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తున్నట్టు?
ఈ ఏడాది మొదట్లో రేవంత్ దావోస్ పర్యటన సందర్భంగా గోదీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ రూ.8 వేల కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. రూ.కోటి మాత్రమే పెయిడ్ అప్ క్యాపిటల్ ఉన్న కంపెనీ, వార్షిక స్టేట్మెంట్ను రూ.27 లక్షలుగా చూపిన కంపెనీ అసలు రూ.8 వేల కోట్ల పెట్టుబడులు పెట్టగలదా? ఈ ఒప్పందాన్ని ప్రకటించిన నాటి నుంచి గత ఆరు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో విఫలమైంది.
రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ మూసీ పునరుజ్జీవ పథకాన్ని తమ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా చేపట్టింది. అయితే ఈ పథకానికి సంబంధించి ఎలాంటి వివరణాత్మక నివేదికలు లేవు. ఈ ప్రాజెక్టుకు రూ.50 వేల కోట్ల అంచనా వ్యయం అవుతుందని మొదట కాంగ్రెస్ పాలకులు ప్రకటించారు. ఆ తర్వాత రూ.70 వేల కోట్లకు పెంచారు. తాజాగా రూ.1.50 లక్షల కోట్లకు సవరించారు.
ఈ భారీ ప్రాజెక్టును చేపట్టేందుకు సింగపూర్‌కు చెందిన మెయిన్‌హార్డ్ కంపెనీ ప్రతినిధులతో సీఎం కార్యాలయంలో చర్చలు జరిగాయి. అయితే ఆ కంపెనీ యజమానులు నసీమ్ షహజాద్, ఒమర్ షహజాద్ ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. రూ.3 వేల కోట్ల మనీ లాండరింగ్‌కు సంబంధించి వారిపై లుకౌట్ నోటీసులు ఉన్నాయి. అంతేకాదు, వారు దేశం విడిచి పారిపోయారని పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అభియోగాలు మోపింది. అలాంటి కంపెనీ ప్రతినిధులతో మూసీ పునరుజ్జీవ పథకం గురించి సీఎం రేవంత్ చర్చించడం ఆశ్చర్యం కలిగించింది.
తెలంగాణలో బీర్లు విక్రయించేందుకు సోమ్ డిస్టిలరీస్‌కు కాంగ్రెస్ సర్కార్ అనుమతులు ఇవ్వడంపై ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. సదరు కంపెనీ నకిలీ మద్యానికి పేరుగాంచింది. కోట్లాది రూపాయల బ్యాంకు రుణాలు స్వాహా చేయడం, పన్ను ఎగవేతల కేసులో అరెస్టులు, బాల కార్మికులతో పని చేయించినందుకు గానూ బ్లాక్‌లిస్టులో చేరడం వంటి వాటికి ఆ కంపెనీ పేరుగాంచింది. అలాంటి కంపెనీకి అనుమతులు ఇవ్వడంపై ప్రతిపక్షాలు నిలదీశాయి. మీడియా, సోషల్‌మీడియాలోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో అనుమతులను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం మీడియాకు లీకులిచ్చింది. ఈ కంపెనీ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల విరాళం సమర్పించినదే కావడం గమనార్హం. ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ద్వారా ఈ విషయం వెల్లడైంది.
కేవలం ఆరు నెలల కాలంలోనే కాంగ్రెస్ సర్కార్ చేసుకున్న లోపభూయిష్ట చీకటి ఒప్పందాలివీ. ఇవన్నీ ఓవైపు ఉండగానే.. రేవంత్ అమెరికా పర్యటనలో రెండో రోజు స్వచ్ఛ్ బయో కంపెనీ తెలంగాణలో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెడుతుందని ప్రకటించడం షాక్‌కు గురిచేసింది. అసలు వాస్తవమేమిటంటే.. ఈ కంపెనీ స్థాపించింది 15 రోజుల కిందటనే. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ కంపెనీకి ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు. లక్నోలోని మెజ్జె బార్ మెడిటెరేనియన్ యజమాని శివానంద వారిలో ఒకరు. రెండో డైరెక్టర్ మరెవరో కాదు, స్వయానా సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు ఎనుముల జగదీశ్వర్‌రెడ్డి. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. అతని చిరునామా ఫిలడెల్పియా. కానీ, స్వచ్ఛ్ బయో కంపెనీ అధికారిక చిరునామా మాత్రం జూబ్లీహిల్స్‌లోని నవనిర్మాణ్ నగర్. ఈ చిరునామాలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఉన్నది.
ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అసలు అక్కడ ఆ కంపెనీ పేరిట బోర్డే లేదు. కానీ, ఆ కంపెనీ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. కంపెనీ డైరెక్టర్లు ఎంవోయూపై సంతకం చేయకపోవడం ఆశ్చర్యకరం. ఎనుముల జగదీశ్వర్‌రెడ్డి సహచరుడు హర్ష పసునూరితో అందులో సంతకం చేయించారు. అంతేకాదు, సీఎం రేవంత్, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులతో ఆయనే ఫొటోలకు ఫోజులిచ్చారు.
శాస్త్రవేత్త ప్రవీణ్ పరిపాటి నేతృత్వంలోని సుగనిత్ కంపెనీతోనూ స్వచ్ఛ్ బయో ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత తమ్ముడితో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందం చేసుకున్నారని ప్రతిపక్షం బయటపెట్టడంతో రేవంత్‌రెడ్డి మొదటిసారి ఆత్మరక్షణలో పడిపోయారు. దీంతో ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావులతో వీడియోలు విడుదల చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌ను రక్షించేందుకు రామకృష్ణరావు తన విశ్వసనీయత, అనుభవాన్ని ఉపయోగించవలసి వ చ్చింది. అమెరికా పర్యటన, తాము కంపెనీలతో చేసుకుంటున్న ఒప్పందాలకు సంబంధించి తమను విశ్వసించాలని జయేశ్ రంజన్ ప్రార్థిస్తున్నట్టు వీడియోలో చూడవచ్చు. మీడియాలో విస్తృతంగా వ్యాప్తిచెందిన ఈ వీడియోలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారా యి. దీంతో కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నష్టనివారణ చర్యలకు దిగారు. అయితే వాళ్ల ప్రయత్నం ఏ మాత్రం ఫలించలేదు.
ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు సుగనిత్ కంపెనీ, శాస్త్రవేత్త సాంకేతిక అనుభవాన్ని సమర్థించారు. కానీ, స్వచ్ఛ్ బయో గురించి గాని, సీఎం సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి ఆ కంపెనీకి డైరెక్టర్‌గా ఉండటం గురించి గాని ఆయన ఒక్కమాట కూడా ప్రస్తావించలేదు. సాధారణంగా అమెరికా పర్యటన, డెలిగేట్స్‌తో సమావేశాలు, ఎంవోయూల గురించి ప్రతి విషయాన్ని తన అధికారిక, సీఎంవో ఎక్స్ ఖాతాల్లో షేర్ చేసే ఐటీ మంత్రి.. వాల్ష్ కర్రా, స్వచ్ఛ్ బయో లాంటి ఒప్పందాల గురించి పోస్టు చేయలేదనే విషయాన్ని నెటిజన్లు గుర్తించారు.
చామల కిరణ్ లాంటి కొందరు ఎంపీలు సీఎంను సమర్థించే క్రమంలో అయోమయానికి గురయ్యారు. ఆ కంపెనీ సీఎం తమ్ముడి సొంతం కాదని, ఆయన కంపెనీకి డైరెక్టర్‌గా మాత్రమే ఉన్నారని, ప్రమోటర్‌కు సన్నిహితుడని చెప్పారు. సీఎం రేవంత్ కుటుంబసభ్యులు వ్యాపారాలు చేస్తే తప్పేంటని కిరణ్‌తో పాటు ఏఐసీసీ కార్యదర్శి ప్రశ్నించారు. తెలంగాణకు అమెరికా నుంచి వేల కోట్ల పెట్టుబడులను తీసుకొస్తున్నట్టు వారు సమర్థించారు. సీఎం రేవంత్ నేతృత్వంలోని మంత్రులు, అధికారుల బృందం ఎంవోయూపై సంతకాలు చేసి, బహిరంగంగా ఒప్పందాల గురించి ప్రకటించిన విషయాన్ని మరిచిపోయి.. రేవంత్‌ను సమర్థించే క్రమంలో ఒప్పందంలోని పని ఇంకా ప్రారంభం కాలేదని కొందరు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన రేవంత్ కాంగ్రెస్ నేతల వాదనలతో మరింత ఇరకాటంలో పడ్డారు.
ఈ మొత్తం వ్యవహారం రాజ్యాంగబద్ధమైన కార్యాలయాన్ని, ఎవరి పట్ల ఆశ్రిత పక్షపాతం చూపనని అతను చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించినందున సీఎం పదవికి ఎసరు తేవచ్చు. అంతేకాదు, సీఎం తాను పేద కుటుంబానికి చెందినవాడినని పదే పదే చెప్తున్నందున.. పెట్టుబడి పెట్టేందుకు రూ.వెయ్యి కోట్లు ఎలా సంపాదించారనే విషయాన్ని అతని సోదరుడు వివరించాలి. మనీ లాండరింగ్ ఏమైనా ఉందా?
అనే విషయంపై స్పష్టత ఇవ్వాలి.
ఒకవేళ కంపెనీ డైరెక్టర్లు ఆదాయ వనరులను వివరించడంలో విఫలమైతే, బ్రాండ్ విలువను పెంచే ఉద్దేశంతో షెల్ కంపెనీ లాగా ఆ ప్రకటన వెనుక నేరపూరితమైన ఉద్దేశం ఉండి ఉంటే అది Conflict of interest కింద సీఎం రేవంత్‌కు తీవ్ర సమస్యగా మారవచ్చు. కంపెనీ డైరెక్టర్ ఎనుముల జగదీశ్వర్‌రెడ్డి తన చిరునామా ఫిలడెల్పియా అని ప్రకటించినందున వ్యాపార లావాదేవీలు, పన్నులకు సంబంధించి ఫెడరల్ ఏజెన్సీలు అతన్ని ప్రశ్నించవచ్చు. అదేవిధంగా మన దేశంలోని కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా స్వచ్ఛ్ బయో ద్వారా రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి, అతని సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి, మరో డైరెక్టర్ శివానంద, హర్ష పసునూరిలను ప్రశ్నించవచ్చు. అంతేకాదు, సీఎం రేవంత్‌రెడ్డి కుర్చీని కాపాడే విషయంలో కంపెనీకి సంబంధించి తమ వ్యక్తిగత ప్రయోజనాలు ఏమిటనే విషయమూ ఆరా తీయవచ్చు. అదే కనుక జరిగితే సీఎం రేవంత్ సీటుకే గండం.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ నాయకులు)
– క్రిశాంక్ మన్నె