భారత కొత్త ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నాయకత్వంలో న్యాయవ్యవస్థ కార్య నిర్వాహక వ్యవస్థ ప్రభావం నుంచి బయటపడినట్లు కనిపిస్తున్నది. న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నెలకొల్పే అవసరాన్ని క్రమంగా గుర్తిస్తున్నది.
రాజకీయంగా అంతగా ప్రాధాన్యమంటూ లేని కిరణ్ రిజిజు అత్యున్నత న్యాయస్థానంపై అహంకారపూరితంగా అవాకులు, చెవాకులు పేలటాన్ని ఏ విధంగానూ అర్థం చేసుకోలేం. ఇటీవల ఒక టీవీ కార్యక్రమంలో రిజిజు కొలిజీయంపై ఎంతో అగౌరవంగా మాట్లాడారు. మనకు జ్ఞాపకం ఉన్నంతవరకూ గతంలో ఏ కేంద్ర న్యాయమంత్రి కూడా ఇటువంటి మాటలు మాట్లాడలేదు. దీనికి ఒకే ఒక్క కారణం కనిపిస్తున్నది.. తమ నుంచి జవాబుదారీతనాన్ని, బాధ్యతాయుత ప్రవర్తనను దేశంలోని ఏ రాజ్యాంగబద్ధ సంస్థ కూడా డిమాండ్ చేయవద్దని దేశంలోని కొత్త పాలకవర్గం భావిస్తున్నది. దానినే రిజిజు ప్రతిబింబిస్తున్నారు. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియంపై ఆక్షేపణ వ్యక్తం చేస్తూ, కొలీజియం ఏర్పాటుకు రాజ్యాంగంలో ఎక్కడ ఆమోదం ఉన్నదని రిజిజు ప్రశ్నిస్తున్నారు. కానీ, 1990లలోనే కొలీజియంను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పులను ఆయన కావాలనే మర్చిపోయినట్టున్నారు. ప్రధానమంత్రిని ‘అవమానించిన’ నేరం కింద, పాకిస్థాన్‌కు జిందాబాద్‌లు కొట్టిన నేరం కింద, దేశ గౌరవాన్ని ‘తగ్గించిన’ నేరం కింద లెక్కలేనంత మందిని జైళ్లలో పెట్టారు కదా! మరి, వాటన్నింటికీ రాజ్యాంగంలో ఏ నిబంధన ఆమోదం తెలుపుతున్నది?
కార్యనిర్వాహక వ్యవస్థ దూకుడుతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తన స్వతంత్రతకు భంగం వాటిల్లకుండా తనవైన నిబంధనలను రూపొందించుకునే అధికారాన్ని రాజ్యాంగం న్యాయవ్యవస్థకు అప్పగించింది. కాస్తంత పేరు ప్రఖ్యాతులున్న ఏ లా కాలేజీకి చెందిన ఫస్టియర్ స్టూడెంట్ను అడిగినా ఈ విషయం చెబుతాడు. ఒక వ్యవస్థలో ఎటువంటి వ్యక్తులు నియమితు లు అవుతున్నారు అన్నదానిని బట్టే ఆ వ్యవస్థ పనితీరు ఉంటుందని ఏ థర్డ్ ఇయర్ హిస్టరీ స్టూ డెంట్ అయినా చెప్పగలడు. ఇదేమైనా రాకెట్ సైన్సా? రాజ్యాంగం ఆవిష్కరణ సందర్భంగా దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పిన హితవును ఒకసారి న్యాయశాఖ మంత్రికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ‘ఇప్పుడు మన ముందు రాజ్యాంగం ఉంది. దాని అర్థం ఏమిటంటే.. కార్యనిర్వాహక వ్యవస్థ జరిపే ప్రతి చర్యకూ న్యాయవ్యవస్థ ఆమోదనీయత, చట్టబద్ధత తప్పనిసరి’. ఈ పాఠాన్ని పటేల్ నాటి ప్రధాని నెహ్రూకు చెప్పారు. నెహ్రూ రాజకీయ జీవితంలో నిరంకుశంగా వ్యవహరించిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. అయినప్పటికీ, పటేల్ హితవును ఆయన ఎంతో వినమ్రంగా స్వీకరించారు.
ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్‌ను కేంద్రప్రభుత్వం ఇటీవల ఆగమేఘాల మీద నియమించటాన్ని సుప్రీంకోర్టు జస్టిస్ కేఎం జోసెఫ్ ప్రశ్నించారు. దీంతో మోదీ కోటరీ కొంత తడబాటుకు గురైంది. ఈ రోజు మోదీకి ప్రధానిగా అధికారం లభించింది అంటే అది మన దేశంలోని ఎన్నికల వ్యవస్థ వల్ల. అంత కీలకమైన ఎన్నికల వ్యవస్థ పవిత్రత పట్ల గౌరవం ఉన్న ఏ వ్యక్తి అయినా అరుణ్‌గోయల్ నియామకాన్ని తప్పుబడతారు. ఇతర రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచినట్టుగా, ప్రాధాన్యం లేకుండా చేసినట్టుగానే న్యాయవ్యవస్థను కూడా అదే స్థితికి తీసుకురావాలని మోదీ ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తున్నది. అసలు విషయమేమిటంటే, తన ప్రజాదరణను ఉన్నదాని కన్నా ఎక్కువగా ఊహించుకోవటమనే రుగ్మతతో మోదీ సర్కార్ బాధపడుతున్నది. ప్రజల ఆలోచనలపై మోదీకి ఎవరికీ లేనంత స్పష్టత ఉన్నదని అనుకోవటం కూడా దీంట్లో భాగమే. ఈ ఊహలు వాస్తవమే అని మాటవరసకు అంగీకరించినా.. రాజ్యాంగం నిర్దేశించిన పరిమితుల మధ్య పని చేయటమే కార్యనిర్వాహక వ్యవస్థ (ప్రభుత్వం) విధి. దాని నుంచి అది తప్పించుకోలేదు. ఆ పరిమితుల పరిధిని నిర్వచించటం, నిర్ణయించటం సుప్రీంకోర్టు బాధ్యత.
గత ప్రధాన న్యాయమూర్తులైన ఎస్ ఏ బోబ్డే, రంజన్ గొగోయ్ వదిలి వెళ్లిన రాజీ సంప్రదాయాన్ని చూసి ఇప్పటి సుప్రీంకోర్టు నిరాశ పడాల్సిన పని లేదు. ఈ ఇద్దరు సీజేఐలు ప్రభుత్వానికి ఇచ్చిన మినహాయింపులు.. రాజ్యాంగ నిర్మాణానికి సంరక్షకురాలిగా వ్యవహరించాల్సిన ఉన్నత న్యాయవ్యవస్థకు ఎనలేని నష్టం కలిగించాయి. అంతేకాదు, అధికార వ్యవస్థకు ధైర్యాన్నిచ్చాయి. దీనివల్లే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తమ అధికారిక హోదాలను దుర్వినియోగపరుస్తూ గుజరాత్లో యథేచ్ఛగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సంఘంతోపాటు మరే ఇతర సంస్థగానీ, వ్యవస్థగానీ ఎన్నికల నిబంధనలను పాటించాలని తమను నిర్దేశించలేవనే ధైర్యంతోనే వారు ఆ పని చేయగలిగారు.
ఏదో ఒక ఎన్నికలోగానీ, కొన్ని ఎన్నికల్లోగానీ విజయం లభించినంత మాత్రాన రాజ్యాంగబద్ధమైన దాదాగిరికి లైసెన్సు లభించినట్లు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేయాలి. ఇదే న్యాయ వ్యవస్థ ధర్మం. న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నెలకొల్పే అవసరాన్ని క్రమంగా గుర్తిస్తున్నది. కానీ న్యాయమంత్రి రిజిజు, ఆయన రాజకీయ బాసులు.. ప్రజలు తమకు అందించిన అధికారాన్ని చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు. న్యాయ వ్యవస్థ సర్దార్ పటేల్ హితవును అమలు చేస్తుందా? లేక షా, షహెన్షా ద్వయం న్యాయవ్యవస్థనే తడబాటుకు గురి చేస్తుందా? అని యావత్ భారత రిపబ్లిక్ ఒకింత ఆదుర్దాతో గమనిస్తున్నది.
(వ్యాసకర్త: హరీశ్ ఖరే, ట్రిబ్యూన్ మాజీ ఎడిటర్) (‘ది వైర్’ సౌజన్యంతో)