MLC Kavitha | ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు జోక్యంతో బెయిలు లభించడం న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత బలోపేతం చేసే అంశమని చెప్పాలి. అయితే అందుకు ఆమె అలుపులేని పోరాటం సాగించారనేది మరువరాదు. దిగువ కోర్టుల్లో బెయిలు కోసం జరిపిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో కవిత సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టారు. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం కవితకు బెయిలు మంజూరు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఢిల్లీ హైకోర్టు బెయిలు నిరాకరణకు చూపిన కారణాలను సుప్రీంకోర్టు తిరస్కరించడం. బెయిల్‌కు కవిత అన్ని విధాలా అర్హురాలని ధర్మాసనం గట్టిగా సమర్థించింది. సీబీఐ చార్జిషీట్ దాఖలైంది. ఈడీ దర్యాప్తు పూర్తయింది. దర్యాప్తు సంస్థల నుంచి కేసు విచారణ కోర్టుకు వచ్చింది. విచారణ ప్రారంభమయ్యాక నిందితులను ఇంకా జైలులో ఉంచడం ఏమిటి? దీంతో పాటు మహిళలకు ఉండే ప్రత్యేక వెసులుబాటును గుర్తిస్తూ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇదంతా ఒకెత్తు అయితే ఢిల్లీ మద్యం కేసును జాతీయ దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ నడిపిస్తున్న తీరును సర్వోన్నత న్యాయస్థానం ఎండగట్టడం ఒకెత్తు అని చెప్పాలి. ఆ రెండు సంస్థలపై అసాధారణమైన రీతిలో సుప్రీంకోర్టు విరుచుకుపడటం గమనార్హం. వాటి తీరుతెన్నులను ఎండగడుతూ తలవాచేలా చీవాట్లు పెట్టింది. న్యాయం పేరిట నడిపిస్తున్న కేసులో న్యాయమెంత? అనేది ప్రధాన చర్చనీయాంశమైంది. ఈ మొత్తం దర్యాప్తు వ్యవహారంలో ‘న్యాయబద్ధత’ ఉన్నదా? అనే నిలదీత ధర్మాసనం తీర్పులో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఎడతెగని దర్యాప్తు, ఎటూ తేలని సాక్ష్యంతో సాగదీస్తున్న కేసులో నిందితులను నిరవధికంగా జైలులో మగ్గబెట్టడం ఎలా కుదురుతుందని ప్రశ్నించింది. ‘కేవలం అప్రూవర్‌గా మారిన నిందితుల వాంగ్మూలమే సాక్ష్యంగా చూపుతూ దర్యాప్తు నడిపించడం సబబేనా?’ అని ధర్మాసనం నిలదీసింది.
ఒక నిందితుడు చేసే ఆరోపణలతో ఎవరినైనా నిందితులను చేయడమనేది ఇక్కడ ప్రధాన సమస్య. కేంద్ర దర్యాప్తు సంస్థలు అనుసరిస్తున్న ఈ ప్రక్రియ సర్వదా విమర్శలకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఆధారాలు లేని అభియోగాలతో రోజులు, నెలలు, సంవత్సరాలు అన్నట్టుగా గడిపేస్తున్న తీరు దర్యాప్తు సంస్థల ప్రావీణ్యాన్ని సందేహాస్పదం చేస్తున్నది. 50 వేల పేజీల డాటా సేకరించామని అంటున్నారు. కానీ, ఒక్క రూపాయి కూడా స్వాధీనం చేసుకోలేదు. ఆరోపణలు కాకుండా కనీసం ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని చూపలేకపోయారనేది సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థలకు శరపరంపరగా సంధించిన ప్రశ్నల్లో ఒకటి. ఈ సందర్భంగా సెల్‌ఫోన్ డాటాను కవిత ధ్వంసం చేశారన్న ఆరోపణను కూడా ధర్మాసనం తిరస్కరించింది. ఫోన్లో చాటింగ్‌ను తొలగించడం నేరం కాదని.. ఫోన్ ఫార్మాటింగ్, ఫోన్ ట్యాంపరింగ్ ఒకటి కాదని తేల్చిచెప్పింది. ఈ విచారణ ఎప్పుడు ముగుస్తుందో తెలియదని అయోమయాన్ని వ్యక్తం చేయడం మరో హైలైట్. అయితే ఈ కేసులో కోర్టు చేసిన వ్యాఖ్యలు భవిష్యత్తులో మార్గదర్శకంగా ఉంటాయని చెప్పవచ్చు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన తరుణమిది. ఎడాపెడా కేసులు పెట్టి, ఇష్టారాజ్యంగా అరెస్టులు సాగించే ధోరణిని ఇకనైనా ఆపితే మంచిది.