ఉమ్మడి పాలనలో తెలంగాణ వెతలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా రైతాంగం పడ్డ బాధలు వర్ణనాతీతం. దగా పడ్డ తెలంగాణలో నాడు పల్లెకో బోర్ల రామిరెడ్డి, ఊరికో ఉరికొయ్యలకు వేలాడే రైతన్న ఉండేవాడు. తెలంగాణలో నాడు పాడువడ్డ ఊర్లు, పడావువడ్డ పొలాలు తప్ప ఇంకేమీ కానరాని దుస్థితి. ఈ ప్రాంతం మరో బోర్ల రామిరెడ్డిని చూడకూడదని, రాష్ట్రంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకూడదని గట్టిగా సంకల్పించుకున్న కేసీఆర్.. తెలంగాణ వచ్చా క అనేక పథకాలను రచించి రైతును రాజును చేశారు. కానీ, ఏడాది తిరగక ముందే కాంగ్రెస్ పాలనలో మళ్లీ ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయి.
మలిదశ ఉద్యమ జెండా ఎత్తుకున్న కేసీఆర్.. ఊరూరా తిరిగి తెలంగాణ గడ్డ ఎదుర్కొంటున్న బాధలు, తెలంగాణ రైతు బిడ్డ గాథలను కండ్లారా చూశారు. అందుకే ప్రజలు ఆయనను తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. రైతన్నకు వెన్నుదన్నుగా నిలవాలన్న సంకల్పంతో స్పష్టమైన ప్రణాళికలతో, విస్పష్టమైన విధివిధానాలతో బృహత్తర ప్రణాళికలు, పథకాలను రచించారు. మేధావులతో మంతనాలు, నిపుణులతో చర్చల తర్వాత ఎంతో మేధోమథనం చేసి రైతన్నకు కావలసినవి సమకూర్చారు. 24 గంటల నిరంతర, నాణ్యమైన విద్యుత్తును అందించారు. ఆ తర్వాత రైతుబంధు పథకాన్ని అమలుచేసి పెట్టుబడి వెతలు తీర్చారు. కేసీఆర్ సర్కార్ అమలుచేసిన పథకాలు, విధానాల ఫలితంగా తెలంగాణ రైతాంగం పుట్లకు పుట్లు వడ్లు పండించింది. ఏ ఇంట చూసినా సిరుల పంట పండింది. తత్ఫలితంగా తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు నిలిచిపోయాయి.
సల్లగా ఉంటే కన్ను కుట్టే కాంగ్రెస్కు తెలంగాణను చూశాక కండ్లు మండాయి. ఎలాగైనా తెలంగాణను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నది. అందుకే, మార్పు పేరిట ఏమార్చింది. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణ రైతుల జీవితాల్లో నిజంగానే మార్పు తీసుకువచ్చింది. అధికారంతో పాటే కరువును వెంట తీసుకొచ్చిన కాంగ్రెస్.. తెలంగాణను శాశ్వత కరువు ప్రాంతంగా మార్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నది. రైతాంగంపై కక్షగట్టిన రేవంత్ సర్కార్ తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరాన్ని ఎండబెట్టి వ్యవసాయాన్ని పండబెట్టింది. కేసీఆర్పై అక్కసుతో కాళేశ్వరం నీటిని సముద్రం పాలు చేసింది. దీంతో ఇప్పుడు నీళ్లు లేక డ్యామ్ లు, ప్రాజెక్టులు అడుగంటాయి. పొలాలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే రైతుబంధు రాక, పెట్టుబడులు లేక ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చుకున్న రైతాంగం తిప్పలు పడుతున్నది. పంట చేతికొచ్చే అవకాశం లేకపోవడంతో దిక్కుతోచక ఉరికొయ్యలకు వేలాడుతున్నది. మట్టిని నమ్ముకొని తాను జీవించడమే కాకుండా, నలుగురికి అన్నం పెట్టే రైతన్న తినడానికి తిండి లేక అలమటించే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పాలనలో రోజుకొకరి చొప్పున ఇప్పటికే 430 మంది రైతులు మరణించారు.
కాంగ్రెస్ సర్కారు విధానాల వల్ల తెలంగాణ మరోసారి ఆత్మహత్యలకు వేదికగా మారుతున్నది. రైతాంగంతో పాటు హస్తం పార్టీ చేతిలో చితికిపోయిన నేతన్నలు కూడా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఉచిత బస్సుల చక్రాల కింద నలిగిపోయిన ఆటో అన్నలు ఆత్మహత్యలే శరణ్యమంటూ తనువు చాలిస్తున్నారు. పంటలు పండక రైతన్నలు, కిరాయిలు లేక ఆటోడ్రైవర్లు, చేతిలో పనులు లేక నేతన్నలు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు, జీతాలు రాక ఉద్యోగులు, స్కాలర్షిప్, ఫీజు రీ యింబర్స్మెంట్ అందక విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్ధత నెలకొనడంతో బిల్డర్లు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు నిత్యం మండుతూనే ఉన్నాయి. రేవంత్రెడ్డి తన ఏడాది పాలనలో రాష్ర్టాన్ని రావణకాష్ఠంలా మార్చారు. ఆత్మహత్యలను మరిచిపోయిన తెలంగాణను మళ్లీ బలిపీఠంగా మార్చా రు. తెలంగాణను ఆత్మహత్యలకు నిలయంగా మార్చడమే తమ విధానంగా, రైతన్నలు ఆత్మబలిదానాలు చేసుకునేలా చేయడమే తమ నినాదంగా, అన్ని వర్గాల ప్రజలు తనువు చాలించేలా ఉరికొయ్యలకు మార్గం చూపడమే తమ ప్రణాళికగా పాలన సాగిస్తున్న కర్కశ ప్రభుత్వం ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటుందో?