1924 డిసెంబర్ 26-28 తేదీల్లో బెల్గాంలో (ఇప్పటి బెళగావి, కర్ణాటక) జరిగిన 39వ కాంగ్రెస్ మహాసభలకు అధ్యక్షత వహించిన మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ ఆ సందర్భంగా ఓ సందేశమిచ్చారు. ‘మనకు అతి త్వరలో స్వాతంత్య్రం రాబోతున్నది. కాంగ్రెస్ నాయకులంతా ఏకతాటిపై ఉండాలి. అట్టడుగువర్గాలను పైకి తీసుకురావడం మన ప్రాధాన్యం కావాలి. కుల-వర్ణ వివక్ష లేని సమాజం మన లక్ష్యం కావాలి’ అని ఆయన అన్నరు. మహాత్మాగాంధీ ఆ మాటలు చెప్పి వందేళ్లు దాటినయి. ఇప్పటి కాంగ్రెస్ నేతృత్వంలో ఆ విలువలకు నూరేళ్లు నిండినయి. ఆ మహనీయుడిని గాడ్సే భౌతికంగా నిర్మూలిస్తే, కాంగ్రెస్ పార్టీ ఆయన స్ఫూర్తిని చెరిపివేసింది.
మహాత్మాగాంధీ కోరుకున్న స్వరాజ్యాన్ని సాధించి చూపిండు కేసీఆర్. ప్రాతఃస్మరణీయులైన స్వాతంత్య్ర యోధుల స్వప్నాలెన్నో తన పదేండ్ల పాలనలో చేసి దేశం ముందు ఒక సగర్వ మోడల్ నిలబెట్టిండు. తాజాగా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి కూడా చెప్పింది.. దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని!
రేవంత్ రెడ్డి మొన్న చెప్పిన ‘గాంధీల గొప్పతనం’.. మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ గురించి కాదు, రేవంత్ రెడ్డి స్కూలులో తాజాగా చేరిన అరికెపూడి గాంధీ గురించి! తాను ఏ పార్టీలో ఉన్నదీ గర్వంగా చెప్పుకోలేని దుస్థితిలో ఒక ఎమ్మెల్యే ఉండటం బహుశా మనం ఇంతకుముందు విని ఎరుగం. అదీ ఈ గాంధీ, వారి నాయకుని గొప్పతనం! రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీని నిలువునా ముంచేదాకా ఆయన ఆగరేమోనని అనిపిస్తున్నది. ‘స్వాతంత్య్రం రాగానే కాంగ్రెస్ పార్టీని రద్దు చేద్దాం’ అని ప్రతిపాదించిన నాటి గాంధీ మాటను రేవంత్ మరోలా సాధిస్తున్నరేమో!
ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేసేందుకు బలమైన రాజకీయ పార్టీలు అవసరం. రోడ్డు రోలర్ మెజారిటీ వచ్చిన పార్టీలు బుల్డోజర్ పాలన చేస్తాయి. వాటికి ముకుతాడు వేసే ప్రతిపక్షాలు అవసరం. తన పదేండ్ల పాలనలో నరేంద్ర మోదీ అన్ని వ్యవస్థలను ఎట్లా చెరబట్టిందీ, దానికి ప్రతిఫలంగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మౌన విప్లవ ఫలితాలు ఎట్లా బీజేపీని కట్టడి చేసిందీ మనమంతా చూసినం.
ఇండీ కూటమిలో ప్రధాన పాత్రధారి రాహుల్‌గాంధీకి భవిష్యత్తుపై దృష్టి ఉంటే తన పార్టీలోకి వస్తున్న కొత్త మురికినీటిని ఆయన గుర్తించాలి. పార్లమెంట్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన పాంచ్‌న్యాయ్ నుంచి పార్టీ దూరం జరిగిందని ఆ మధ్య కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి బహిరంగంగానే విరుచుకుపడ్డారు. ఆ తర్వాత మెత్తబడటం ఆయన సమస్య. కానీ, ఆయన లేవనెత్తిన అంశాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ తనను తాను నిలబెట్టుకునేందుకు పనికివచ్చేవే.
పాంచ్న్యాయ్లో సామాజిక, ఆర్థిక కులగణన హామీతో పాటు యువత, మహిళలు, రైతులు, కార్మికులు తదితర వర్గాలకు వరాలు కురిపించింది కాంగ్రెస్ పార్టీ. ఈ పాంచ్న్యాయ్లోనే రాజ్యాంగ సమర్థన అనే ప్రత్యేక అంశాన్ని జోడించిన కాంగ్రెస్.. అందులో 13వ అంశంగా ఫిరాయింపుదారులపై వేటుకు సంబంధించి ప్రత్యేక హామీనిచ్చింది. ‘ఒక పార్టీ టికెట్‌పై గెలిచిన సభ్యులు మరో పార్టీలోకి మారితే, ఆ సభ్యుల చట్టసభ సభ్యత్వం ఆటోమేటిక్‌గా రద్దయ్యేలా చట్టం తెస్తాం. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో అవసరమైన సవరణలు చేస్తాం’ అని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. హిమాచల్‌ప్రదేశ్‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు జీతభత్యాలు రద్దు చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నది అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతవరకు బాగానే ఉంది.
కానీ, తెలంగాణలో వీటన్నింటినీ అటకెక్కించింది. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి దేశమంతా ఒకే విధానం ఉండాలి. రాష్ర్టానికో రీతి, పూటకో నీతి కాదు. ఇప్పటికీ బీజేపీ ఒక బలమైన శక్తే. వారిని ఎదుర్కోవాలంటే వారికి లేని యూఎస్పీ (యూనిక్ సెల్లింగ్ పాయింట్) కాంగ్రెస్‌కు ఉండాలి. లేకపోతే ఏ కేజ్రీవాలో, ఏ మమతనో ఇండీ బ్లాక్ నుంచి కాంగ్రెస్‌ను తరిమివేయగలవు రాబోయే కాలంలో. 140 ఏండ్ల పురాతన పార్టీ ఆనాటి గొప్ప విలువలకు ఇప్పుడు నూతన విలువలను జోడిస్తూ బలపడాలి. కానీ, ఎటుపడితే అటు దొర్లే పచ్చి అవకాశవాదిలా మిగిలితే ప్రత్యర్థిని ఎదుర్కోలేదు.
తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టు తలంటుపోసిన రోజే.. అరెకపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చి రేవంత్‌రెడ్డి న్యాయవ్యవస్థను పరిహసించిండు. హైడ్రా బుల్డోజర్ అన్యాయాన్ని కోర్టు ప్రశ్నించిన రోజే.. దాని కమిషనర్ రంగనాథ్ ఆర్డినెన్స్ గురించి మాట్లాడిండు. ముఖ్యమంత్రికి గాని, అధికార గణానికి గాని న్యాయవ్యవస్థపై అగౌరవం మాత్రమే కాదు, ధిక్కారం కూడా ఉన్నదని పదే పదే రుజువు అవుతున్నా కాంగ్రెస్ అధిష్ఠానం పట్టించుకోవడం లేదు.
ఒకే కేసులో కేజ్రీవాల్ పట్ల ఒక రకంగా, కల్వకుంట్ల కవిత పట్ల ఒక రకంగా వ్యవహరిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నుంచి గుణాత్మక రాజకీయాలు కోరుకోవడమంటేనే నవ్వులాటగా అనిపిస్తున్నది.
కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డి రూపంలో పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. నరేంద్ర మోదీ ప్రస్తుత భాగస్వామి చంద్రబాబు అనుంగు అనుచరుడైన రేవంత్‌రెడ్డిపై సోషల్ మీడియాలో సత్యమైన విమర్శ చేసినా.. వెంటనే కొట్లాటకు వచ్చేది తెలంగాణ కాంగ్రెస్ అభిమానులు కాదు, టీడీపీ కార్యకర్తలు! వారు ఆంధ్రాలో, తెలంగాణలో, బెంగళూరులో, అమెరికాలో, మరే చోటున్నా డేగ కళ్లతో టీపీసీసీని చూస్తూ ఉంటరు. గాంధీభవన్లోనైనా, ప్రజాక్షేత్రంలోనైనా, సోషల్ మీడియాలోనైనా తమ నాయకుడు రేవంత్‌కు ఎల్లవేళలా కాపు కాస్తూ ఉంటరు. ఎప్పటికైనా టీడీపీకి రేవంత్‌రెడ్డియే పునర్ వైభవం తేగలడని వారి మిషన్, విజన్! టీడీపీ-బీజేపీ కాపురం ఢిల్లీ, అమరావతి సహా హైదరాబాద్‌లోనూ ప్రతిష్ఠించే లక్ష్య ప్రకటన వారి మాటల్లో, చేతల్లో కనిపిస్తూ ఉంటుంది. దురదృష్టవశాత్తూ అంధ అధిష్ఠానానికి చాపకిందికి నీరు వచ్చేదాకా తెలియదు. తెలంగాణ కాంగ్రెస్‌లోని వీహెచ్, పొన్నం, శ్రీధర్‌బాబు లాంటివారు కరివేపాకులు. తన క్యాబినెట్ సహచరుడు శ్రీధర్‌బాబును మేనేజ్మెంట్ కోటా అని చెప్పే సాహసం రేవంత్‌రెడ్డి చేయడానికి కారణం ఆయన వెకిలి క్యారెక్టర్ మాత్రమే కాదు, ఎవరూ ఏమీ చేయలేరన్న ధైర్యం!
సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టడం ద్వారా తెలంగాణతనంతో (సెంటిమెంట్ అనే పదం సరైనది కాదు) ఆడుకోవాలని రేవంత్‌రెడ్డి పూనుకున్నడు. ‘మేము నికార్సైన తెలంగాణవాళ్లం’ అంటున్న కొందరు టీడీపీ మిత్రులతో తెలంగాణ తల్లి విగ్రహమా, రాజీవ్‌గాంధీ విగ్రహమా? అని అంటే రాజీవ్ విగ్రహమేనని వారు అన్నరు. వీరి ఆత్మ, రేవంత్‌రెడ్డి ఆత్మ ఒక్కటే. బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించే పాత్రికేయులు కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి, రాజీవ్‌గాంధీ విగ్రహానికి పోటీ పెట్టడం సహించలేకపోతున్నరు. ‘రాజీవ్‌గాంధీ ప్రాసంగికత ఆయన తెలంగాణ ఇచ్చిన సోనియా భర్తగానే’ అనే తీవ్రమైన వ్యాఖ్య చేసిన్రు ప్రముఖ సంపాదకులు కె.శ్రీనివాస్! జాతీయ పార్టీకి ప్రాంతీయ అస్తిత్వాలు అర్థం కావు అంటున్నరు. జాతీయ పార్టీలకే కాదు, రేవంత్‌రెడ్డి లాంటి కొందరు ప్రాంతీయ దుష్ట పుత్రులకు కూడా ఈ నేల అర్థం కాదు, తెలంగాణ సోయి రాదు.
శ్రీకృష్ణుడు, భీష్ముడు, విదురుడు లాంటి మహామహుల మాటలను దుర్యోధనుడే పెడచెవిన పెడితే, కర్ణుడు మాత్రం (క్యారెక్టర్ ఎంత మంచిది అయినా) ఎందుకు ఊరుకుంటడు? ద్రౌపదిని అవమానిస్తడు, అభిమన్యుడిని అన్యాయంగా చంపుతడు కూడా. నేటిఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల పరిస్థితి కర్ణుడి లాంటిదే. ఆయన చావుకు ఆరు కారణాలు ఉన్నట్టు.. వీరి నాయకత్వంలో కాంగ్రెస్ నిర్యాణానికి ఆరు గ్యారెంటీలు, అక్కరకు రాని పరాయి నేతృత్వమూపని చేస్తున్నయి!
‘కేసీఆర్ ఫాంహౌస్‌లో జిల్లేళ్లు మొలిపిస్తా’ అనే రోగ్ మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి, నిజానికి తెలంగాణ అంతా జిల్లేళ్లు, బ్రహ్మజెముళ్లు మొలిపిస్తున్నడు. బ్రహ్మచెముడు అధిష్ఠానానికి జనం ఆక్రందనలు మాత్రం వినపడటం లేదు. ‘కాసుకు లోనై అల్లుని తలచుకు ఆనందించెను అయ్యొకడే’ అని గురజాడ అన్నట్టు.. ఈయన మోస్తున్న సూట్‌కేసుల కాసులకు లోనైనట్టుంది ఢిల్లీ లాబీ! కాబట్టి, రాష్ట్రంలోని సిసలైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కదిలి అధిష్ఠానం మొద్దునిద్ర వదలగొడితే వారికే మంచిది.
ఈ వ్యాసానికి భూమిక అయిన మహాత్మా గాంధీ కోరుకున్న స్వరాజ్యాన్ని సాధించి చూపిండు కేసీఆర్. ప్రాతఃస్మరణీయులైన స్వాతంత్య్ర యోధుల స్వప్నాలెన్నో తన పదేండ్ల పాలనలో చేసి దేశం ముందు ఒక సగర్వ మోడల్ నిలబెట్టిండు. తాజాగా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి కూడా చెప్పింది.. దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని! ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దేశంలో, విదేశాల్లో ఘనంగా ప్రదర్శించుకుంటున్న విజయాలన్నీ కేసీఆర్ మానస పుత్రికలే, ఆయన దిద్దిన ఒరవడులే, ఆయన అద్దిన తిలకాలే, ఆయన రూపుకట్టిన ఫలకాలే, ఆయన ఈనగాచిన మాగాణాలే. ఇప్పుడు అది నక్కల పాలు అవుతున్నదని జీడీపీ లెక్కలు కూడా తెలియని గ్రామీణ జనం వాపోతున్నరు.
కరెంటు పోతే కేసీఆర్ గుర్తొస్తున్నడు; పెండ్లి ముహూర్తం పెట్టుకుంటే కేసీఆర్ గుర్తొస్తున్నడు; అకాల మరణాలు సంభవిస్తే కేసీఆర్ సాయం గుర్తొస్తున్నది; పేదల ఇండ్లు కూలితే కేసీఆర్ గుర్తొస్తున్నడు; హాస్టళ్లలో కలుషితాహారానికి, వీధుల్లో కుక్కల దాడులకు చిన్నారులు విగతజీవులవుతుంటే కేసీఆర్ గుర్తొస్తున్నడు; రైతు బంధు రాక ప్రైవేట్ అప్పులు చేసే రైతన్నలకు కేసీఆర్ గుర్తొస్తున్నడు; పాత్రికేయులను, మేధావులను జేసీబీలు, బుల్డోజర్లు ఆలోచనలో పడవేస్తున్నయి; జేఏసీలు గొంతు సవరించుకుంటున్నయి!
రైతులు రోడ్లు ఎక్కుతున్నరు; నిరుద్యోగులు జైలు ఊచలను లెక్కచేయక నిరసనలకు దిగుతున్నరు; కాంగ్రెస్ నాయకుల భూదందాలు, బెదిరింపులు, గూండాగిరీ ఇష్టారీతిన సాగుతున్నయి; ‘వైఎస్, చంద్రబాబు కూడా చేయనట్లు రేవంత్ రెడ్డి మమ్ముల బజారు పాలు చేసిండు’ అని మహిళలు బూతులు తిడుతున్నరు; వైద్యం, పారిశుద్ధ్యం పడకేశాయి; ప్రభుత్వం ఇచ్చే చెక్కులు బౌన్స్ అవుతున్నయి. స్థూలంగా ‘మార్పు’ కోసం కాంగ్రెస్‌కు ఓటేసిన జనం సంతోషంగా లేరు. ‘తప్పు చేసినం, బుద్ధి వచ్చి ంది, మల్లా కేసీఆరే రావాలె’ అంటున్న వీడియోలు సోషల్ మీడియాలో కోకొల్లలుగా చక్కర్లు కొడుతున్నయి.
దీనంతటికీ కారణం ఒక్క రేవంత్‌రెడ్డియే. మరో మాట లేదు. ఆయన తన స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణతో పాటు కాంగ్రెస్ పార్టీతోనూ ఓ ఆట ఆడుకుంటున్నడు. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఒకరు చెప్పినట్టు.. ‘రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోనే కాదు, రాజకీయాల్లోనే ఉండకూడదు. అత్యంత ప్రమాదకారి ఆయన’!
కాంగ్రెస్ అధిష్ఠానమా, వింటారా?
పూర్తిగా పుట్టి మునిగే దాకా ఆగుతారా? కేసీఆర్ నేతృత్వంలో మేమైతే గాంధీ చెప్పిన మాటలు మననం చేసుకుంటున్నం. ‘మనకు (తెలంగాణకు) అతి త్వరలో స్వాతంత్య్రం (తిరిగి) రాబోతున్నది. ప్రజలంతా ఏకతాటిపై ఉండాలి. అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావడం మన ప్రాధాన్యం కావాలి. కుల-వర్ణ వివక్ష లేని సమాజం మన లక్ష్యం కావాలి’.. అని ఆ మహనీయుడి ఉద్బోధలను స్ఫూర్తిగా తీసుకోవడానికి అక్టోబర్ 2 దాకా మేం ఆగబోవడం లేదు. పది నెలల కిందటి బంగారు తెలంగాణ సాధించి తీరుతం!జై తెలంగాణ! జై భారత్!!
శ్రీ శైల్ రెడ్డి పంజుగుల
90309 97371