మనిషి మాటలు నేర్చినప్పుడే కథ పుట్టింది. అక్షరాలతో పెరిగింది. అమ్మ చెప్పింది కథ. ఊహాశక్తికి రెక్కలు తొడిగింది కథ. బతుకుకు అద్దం పట్టింది కథ. ఇంతకూ కథాక్రమం బెట్టిదనిన..
సాహిత్యాన్ని కాలం, రచనా విధానాల ఆధారంగా చూసినప్పుడు అది ప్రాచీన, ఆధునిక సాహిత్యంగా విభజించబడుతుంది. కథా సాహిత్యంపై పూర్తి అవగాహన లేనివారు కథను ఆధునిక సాహిత్యంగానే పరిగణిస్తారు. అలా కథా పరిధిని, సాహిత్యంలో దాని స్థాయిని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒక అంశం/ విషయం గురించి వివరించాలంటే దానిగురించి కొంత తెలిస్తే సరిపోతుంది. కానీ, ఒక అంశాన్ని విమర్శించాలంటే మాత్రం దాని పుట్టుక, పరిధి, విస్తృతి గురించి క్షుణ్ణంగా తెలుసుకోగలగాలి. అప్పుడే ఆ విమర్శకు విలువ ఉంటుంది.
కథ గురించి పూర్తి అవగాహన రావాలంటే మొదట దాని పుట్టుక గురించి తెలుసుకోవాలి. అందరూ అనుకుంటున్నట్టుగా కథ అనేది ఆధునిక సాహిత్యం కాలంలో పుట్టిన పసిపాప కాదు. సాహిత్యం ఊపిరి పోసుకోవటానికి ముందే పుట్టి, ప్రపంచాన్ని, ప్రజల మనో సామ్రాజ్యాన్ని పాలించిన నిత్యనూతన అమర చక్రవర్తి. కథ గురించిన మొదటి ప్రస్తావన మనకు అగ్ని పురాణంలో కనపడుతుంది. అందులో సహజమనిపించే అసహజమే కథ అని వర్ణించబడింది. దీన్నిబట్టి చూస్తే కథ అనేది లిఖిత పురాణేతిహాస సాహిత్యం కంటే ప్రాచీనమైనదని తెలుస్తుంది. అంతేకాకుండా అందులో కథను ఏడు రకాలుగా వర్గీకరించారు. అవి కథ, ఆఖ్యాయిక, పరికథ, ఖండ కథ, ఉప కథ… మొదలైనవి. ఇందులో ఆఖ్యాయిక వాస్తవిక ఇతివృత్తం గలది అని, కథ అంటే కల్పిత ఇతివృత్తం కలది అని వర్ణించబడింది.
అక్షరయుత భాష సైతం నేర్వకమునుపే భావప్రసారమే సాధనంగా ఉండే కాలంలో మానవుడు తనలోని కళాత్మకతను వ్యక్తీకరించడానికి ఎన్నుకున్న సాధనమే కథ. తను చూసిన విడివిడి పూసల వంటి సన్నివేశాలు, సంఘటనలకు తనలోని ఊహాశక్తి సూత్రాన్ని జోడించి దాన్ని ఒక మంచి హృదయాకర్షణీయమైన రూపంగా సృష్టించగలిగాడు. ఆ ఊహాశక్తి కథుకుడి ఆలోచనలకు సంతృప్తి ఇచ్చినప్పటికీ, ఎక్కువ కాలం శ్రోతల మనసును ఆకట్టుకోలేకపోయింది. అందువల్ల అతడు కథను మరింత రసవత్తరంగా తీర్చిదిద్దేందుకు అందులో సందర్భోచితంగా అందమైన, మనసును ఆకట్టుకునే అల్లికలను, వర్ణనలను మిళితం చేయసాగాడు.
అలా కథకు రూపం ఇచ్చే అల్లికలు ‘రచయిత మెదడుకు సానపడుతూ, శ్రోత మనసును మరింతగా ఆకట్టుకోసాగాయి’. కథకు ప్రాణం పోసే వర్ణనలు ‘రచయిత మనసులోని అనుభూతులకు ఒక సజీవ రూపాన్ని కల్పిస్తే, శ్రోతను ఊహా లోకంలోకి ఎత్తుకెళ్లి, మధుర జ్ఞాపకాలను అందించసాగాయి.’ అంతేకాక కథ ప్రసరణ ముఖ్యంగా ఆశురూపంలోనే సాగుతుంది. అలా కథ సారాంశాన్ని గుర్తుంచుకొని, తమదైన ఊహల్ని, అనుభూతులను, తమలోని చిలిపి ప్రణయ భావాలను కొత్తగా జత చేస్తూ, దానిని నిరంతరం సరికొత్తగా ముస్తాబు చేస్తుంటారు. అందుకే కథ అనేది ‘మనసు (అనుభూతులు) – మెదడు (ఆలోచనలు)ల మేలిమలుపుగా’ అభివర్ణించబడుతుంది.
మొదట్లో వచనం రూపేణా మాత్రమే ప్రసరణ జరిగిన కథ తదనంతర కాలంలో క్రమబద్ధమైన పదవిరుపుల చేత లయను పొంది, మధురమైన గాత్రరూపేణా పాటలుగా తన ఉనికిని మెరుగుపరుచుకుంది. అలా కథ జనాకర్షణకు అవసరమైన మార్పులను అందిపుచ్చుకుంటూ, తన అస్తిత్వాన్ని పదిలపరుచుకున్నది. ఇదంతా అక్షర రూపం పొందని భాషా ప్రయోగం కంటే ముందే జరిగింది. అంటే కథ అనేది లిఖిత సాహిత్యం కంటే ప్రాచీనమైనది, సంఘ మానవుని తొలి కళాభివ్యక్తి రూపంగానూ ప్రసిద్ధమైనది.
కథ అంటే వర్ణనలు, కథనం కూర్చటమే కాదు, కాలాతీతంగా మనసులను హత్తుకోగలిగి ఉండాలి. బృహత్కథ, చందమామ, పేదరాశి పెద్దమ్మ, భట్టి విక్రమార్క కథలే అందుకు ఉదాహరణ. నిర్మాణాత్మకత దృష్ట్యా మరికొన్ని కథలు కథకు నిదర్శనంగా గుర్తుండిపోతాయి. అందులో తొలి వరసలో నిలువదగినది బృహత్కథ. తెలుగువాడైన గుణాఢ్యుడు రాసిన బృహత్కథ ప్రపంచ కథా సాహిత్యానికే నడకలు నేర్పిన సూత్రప్రాయ ఉద్గ్రంథం.
లిఖిత అక్షర జ్ఞానం పొందిన తర్వాత పురాణేతిహాసాలు కావ్యాదులు వెలువడ్డాయి. పురాణేతిహాసాలలో దైవత్వ అంశాలు, ఆముష్మిక జీవితాంశాలు ప్రధాన ఇతివృత్తాలుగా, కారణజన్ములు, చక్రవర్తుల జీవితాలు, ప్రణయ తత్వాలు ఇతివృత్తాలుగా కావ్యాదులు వెలువడ్డాయి. అంతేకాక ఈ సాహిత్యం జఠిల గ్రాంథిక భాషలో ఉండటం, సామాన్యుల ప్రజల జీవితాలను స్పర్శించకపోవడం వల్ల ఇవి సామాన్య జన బాహుళ్యంపై అంతగా ప్రభావం చూపలేకపోయాయి. దాంతో సామాన్యుల జీవితాలను, వారి సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడానికి, లిఖిత సాహిత్య జ్ఞానాన్ని సామాన్యులకు పరిచయం చేయడానికి సాహిత్యకారులకు కనపడిన ఒకే ఒక్క మార్గం కథ. అలా మొదటగా కథలు కావ్య ప్రక్రియలో ప్రవేశించి, కథా కావ్యాలుగా పరిణతి చెందాయి. ఆ పరంపరలో తొలిసారి కేతన దశ కుమార చరిత్ర అనే కావ్యంను కథా రూపేణా అనువదించారు.
కథలను కావ్యాలలో ప్రవేశపెట్టి కథా కావ్యాలుగా మార్చే క్రమంలో ఒక పెద్ద సవాలు ఎదురైంది. అదే అటు లిఖిత సాహిత్యకారులను, ఇటు నిరక్షరాస్యులను ఆకట్టుకోవాల్సి రావటం. అందుకోసం రచనా ప్రకారం అందులో సాహిత్య నియమాలను జొప్పించి అటు శిష్ట సాహిత్యవేత్తలను, ఇతివృత్తంలో సామా న్య జీవన విధానాలను, వారి సంస్కృతి సంప్రాదాయాలను మిళితం చేస్తూ, ఇటు జానపదులను మెప్పించటంలో కథా కావ్యాలు మరింత సఫలమయ్యాయనే చెప్పవచ్చు. అందుకు జక్కన రాసిన విక్రమార్క చరిత్రను సజీవసాక్షంగా చూపించవచ్చు. విక్రమార్కుడి జీవితాన్ని అద్భుతమైన వర్ణనలతో వివరిస్తూనే, అతడి సాహస గాథలను, అద్భుతమైన మానవాతీత శక్తులను సామాన్య జీవన విధానం, సంస్కృతులతో సందర్భోచితంగా ముడిపెడుతూ ఎంత గొప్ప కథాకావ్యంగా తీర్చిదిద్దారంటే ఎన్ని శతాబ్దాలు గడిచినప్పటికీ విక్రమార్కుని పేరు తెలియనివారు ఉండరనటం అతిశయోక్తి కాదు అనేంతలా. అలా ప్రజాదరణ కోసం, తమ అస్తిత్వాన్ని పదిలపరుచుకోవడం కోసం అనేక ప్రక్రియలు, రచనలు కథారూపంలోకి మార్చబడినాయి. ఉదాహరణకు రాజశేఖరుడి విద్దసాల భంజిక అనే నాటకం తర్వాతి కాలంలో మంచన కేయూరబాహు చరిత్రగా, భాగవత పురాణం జన వ్యవహారంలో హరికథలుగా మారడమే.
తొలినాళ్లలో పురాణేతిహాస కావ్య ప్రబంధాల వలనే కథలో కూడా కొన్ని రసాలు నిబద్ధం చేయబడ్డాయి. అవి ఆది- భయానక, మధ్య-కరుణ, అంత్యంలో – అద్భుతం. కానీ, జానపదులు వీటితో పాటు మరో రసం కూడా కథలో చేర్చుకున్నారు. అదే వీర రసం.
ఒక రకంగా చెప్పాలంటే అదే వారి కథల్లో ప్రధానాంశం. సమాజంలో ఉన్న అన్యాయాన్ని ఎదిరించినవారిని, మంచి కోసం, సమాజం కోసం, జన్మభూమి కోసం ప్రాణాలు సైతం లెక్కచేయక పోరాడిన వీరులను దేవుళ్లుగా అభివర్ణిస్తూ, వారి సాహసాలను, పోరాటాలను, పూర్తి జీవితాన్ని ఒక కథగా కూర్చుతూ, భవిష్యత్తు తరాలకు ఉగ్గు పాలతో నేర్పిస్తారు. అవే వీరగాథలు. ఉదాహరణకు పండుగ సాయన్న మియ్యసాబ్ కథలు. వీరు ఆ వీరుల త్యాగాలను, స్ఫూర్తిని మరుగున పడకుండా, వారు చూపిన ధైర్య సాహసాలను భావితరాలు అలవర్చుకోవాలని వాటిని గానం కట్టి పాటలుగా పాడుతారు, అవే వీరగాథ గేయాలు. తర్వాత వాటిని ప్రదర్శన రూపాలుగా మలిచి, రంగస్థలంపై కూడా ప్రదర్శించసాగారు. ఆ వీరగాథ ప్రదర్శన కళారూపమే బుర్రకథ.
ప్రాచీనకాలంలో వర్ణన ప్రధానంగా సాగిన సాహిత్యం తర్వాతికాలంలో భావ ప్రధానంగా పరిణామం చెందింది. అలాగే వర్ణన ప్రధానంగా ఉన్న కథ కూడా నవల రూపేణా విషయ ప్రధానంగా మారి, కథానికగా పరిణతి చెందింది. నాటి అద్భుత, వీర సమన్వయ గర్భిత కాలం నుంచి నేటి విషయ వ్యక్తీకరణ కాలం వరకు కథ భౌతిక రూపంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ రచన, కూర్పు, వ్యక్తీకరణ, పాఠక ఆకర్షణ మొదలైన అంశాల సఫలత అనేది మనసు (అనుభూతులు)- మెదడు (ఆలోచనలు)లతో పెనవేసుకున్న అవినాభావ సంబంధాన్ని మాత్రం అవిరళంగా కొనసాగిస్తూనే ఉన్నది.
– (వ్యాసకర్త: ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కొల్లాపూర్)
కురుమయ్య యాదవ్ మేనుగొండ 77995 53493