చాలా మంది మిత్రుల ఆవేదన.. ‘ఇటువంటి ప్రతిస్పందనకు పదేండ్లు ఆలస్యమైంది’ అని? లేదు, ఆలస్యమేమీ కాలేదు. పదేండ్లపాటు అధికారమనే బాధ్యత, హైదరాబాద్ మీద ఉమ్మడి రాజధాని పేరిట ‘సెక్షన్ 8’ అనే మెడ మీద కత్తి అడ్డం పడ్డయ్. చాలా బాధను కడుపులో దాచుకుని చూసీచూడనట్లు బాధ్యతతో అధికారం మెదగాల్సి వచ్చింది.
గత పదేండ్లలో కూడా నోటికొచ్చిన కూతలు కూసిన చానళ్లు ఉన్నయి. స్క్రీన్లు పెట్టుకుని వ్యక్తిత్వ హననం చేసిన కవ్వింపు ఉదంతాలెన్నో ఉన్నయి. అయినా ‘ఔట్ ఆఫ్ ది లా’ కేసీఆర్ ప్రభుత్వం పోలేదు. తెలంగాణ గడ్డ మీద పని చేసే మీడియా తెలంగాణ ప్రజల కోణంలో ఉండాలని పదే పదే ప్రకటించారు. తొలి తెలంగాణ శాసనసభ్యుల పట్ల జుగుప్సాకరమైన కథనాలు నడిపినా ఎవ్వరూ దాడి చేయలేదు. పదేండ్ల పాలనలో శాంతిభద్రతల పరిస్థితి ఏందో ప్రజల అనుభవంలో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు. హైదరాబాద్‌పై పేచీ లేదు. పదేండ్ల గడువు తీరింది. సీఎం రేవంత్‌రెడ్డి అన్నట్టు పెద్దన్న మోదీ సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశాంతంగా పని చేసుకునే అవకాశం దక్కింది. అయినా ఇంకా వార్తలన్నీ కేసీఆర్, కేటీఆర్ చుట్టే తిరుగుతున్నయి.
వ్యక్తిత్వ హననంపైనే ఫోకస్‌గా కథనాలు ప్రసారం అవుతున్నయి. అధికారం కోసం అబద్ధపు ప్రచారాలెన్నో చేసి, అధికారం దక్కినంక పాలన చేతగాక, ఇచ్చిన హామీలు అమలు చేయలేక, మళ్లీ అసత్య ప్రచారాలతోనే డైవర్షన్ చేస్తున్నరు. అంతేతప్ప ఏముంది ఈ పాలనలో. అయితే, డైవర్షన్ కాస్త హద్దుమీరడంతో నిరసన వ్యక్తమైంది. గుర్తుంచుకోండి బీఆర్ఎస్కు తెలంగాణ రాష్ట్రమే మొదటి ప్రయారిటీ. ఆ తెలంగాణ ఇప్పుడు కాలపరిమితి విషయంలో సేఫ్. నెక్ట్స్ ఉన్నదల్లా సమకాలీన సమాజంలో, సమకాలీన రాజకీయాల్లో, సమకాలీన వ్యవస్థలతో, సమకాలీన రీతిలో, సమకాలీన పద్ధతుల్లో పోరాటమే. బీఆర్ఎస్కు ఐసీకి తైసీ మాత్రమే కాదు, ఐసీకి కైసే కేసేకి తైసీ కావాల్నో కూడా తెలుసు.
2001లో చంద్రబాబు అత్యంత బలవంతుడిగా ఉన్నప్పుడే, తెలంగాణ పదాన్ని పలికేందుకు కూడా ఎవరూ సాహసించని రోజుల్లోనే పుట్టిన పార్టీ బీఆర్ఎస్. 2004లో మావోయిస్టులతో శాంతి చర్చలు విఫలమై రక్తపాతం జరుగుతున్నప్పుడే.. ప్రభుత్వం, పోలీసుల వైఖరి అంత మొండిగా ఉన్నప్పుడే మంత్రి పదవులు విసిరేసి ప్రత్యక్ష పోరాటంలో దిగిన పార్టీ బీఆర్ఎస్.2014లో గమ్యాన్ని ముద్దాడి తెచ్చుకున్న తెలంగాణను ఒక రేవు చేర్చాలని పడిన కష్టంలో వచ్చిన ఫలితాల వల్ల, దొరికిన సంతృప్తి వల్ల ఇట్లాంటి చిల్లర వ్యక్తిత్వ హననం చేసే కథనాలపై, వ్యవహారాలపై అటెన్షన్ చూపలేదు. 2019లో ‘లోకేశ్ కా పితాజీ’ అని చంద్రబాబును ప్రధాని మోదీ ప్రస్తావిస్తే, బదులుగా మోదీ కుటుంబం గురించి చంద్రబాబు కూడా వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా కుటుంబాన్ని సైతం విమర్శించుకున్న వీళ్లిద్దరు ఇప్పుడు పరస్పర రాజకీయ లబ్ధి కోసం చెట్టాపట్టాల్ వేసుకుని సాగుతున్నారు. అదీ వాళ్ల రాజకీయం.
2014కు ముందు కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై జరిగిన దాడి కంటే, 2014 తర్వాత జరిగిన దాడి అంతకుమించి ఉంది. పిల్లలను సైతం వదల్లేదు. అయినా కేసీఆర్ గాని, బీఆర్ఎస్ నాయకులు గాని ఎన్నడూ ప్రత్యర్థుల కుటుంబ సభ్యుల గురించి, వారి వ్యక్తిగత విషయాల గురించి ఇంత జుగుప్సాకరంగా మాట్లాడలేదు. కనీసం స్పందించలేదు. తమపై జరిగే మాటల దాడిని పట్టించుకోలేదు. తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటి వాటికి చోటుండకూడదనేలా వ్యవహరించారు.
ఇప్పుడు తెలంగాణ పరిస్థితి వేరు. పని గట్టుకుని మరీ అసత్య కథనాలు, వ్యక్తిత్వ హననాలకు పాల్పడితే తగిన వేదికల్లో సమకాలీన రాజకీయ ప్రజలకు అర్థమయ్యే రాజ్యాంగ పద్ధతిలోనే ఉంటాయ్ అన్నీ. జై తెలంగాణ అనేది రాష్ర్టాన్ని సాధించిన నినాదమే కాదు, ఆత్మగౌరవ నినాదం.. ఈ గడ్డ పోరాటాన్ని స్పృశించే నినాదం..ఏ గడ్డపై ఉంటే ఆ గడ్డను గౌరవించాలనే నినాదం. అటువంటి జై తెలంగాణ నినాదాన్ని అణువణువునా నింపుకొన్న సమాజంలో ఇటువంటి వేషాలకు ఎటువంటి సమాధానాలొస్తాయో ఇక పరిశోధన చేసి తెలుసుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. తిండి పెట్టే గడ్డను ప్రేమించండి, గౌరవించండి.ఆధారాలతో విమర్శ చేయండి, ఆరోపణలూ చేయండి. ముసుగులో కాదు, సాఫ్ సీదా రాజకీయంగా కొట్లాడండి.
జై తెలంగాణ!
-పాశం రఘునందన్‌రెడ్డి