విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా?
విద్యార్థులు పరీక్ష రాస్తున్న సమయంలోనే ప్రశ్నాపత్రాన్ని ఏదోరకంగా బయటకు తెచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టించడంలో ఆంతర్యమేమిటనే విషయాన్ని విజ్ఞులందరూ గ్రహించాలి.
ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడిగా కాకుండా 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని తండ్రిగా నా ఆవేదనను తెలియపరుస్తున్నా… పరీక్ష పేపరు లీకయిందంటూ చేసే ప్రకటనలు నిలిపివేయండి. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వ్యక్తులకూ నా విజ్ఞప్తి. రేపు రాయబోయే పరీక్ష పేపరు ఈ రోజు బయటికి వస్తే దాన్ని లీకేజీ అనొచ్చు. కానీ విద్యార్థులందరూ పరీక్ష కేంద్రానికి వెళ్లి తరగతిగదిలో కూర్చున్న తర్వాత ప్రశ్నాపత్రం బయటికి వస్తే దానివల్ల ఎవరికి ఉపయోగం? దాన్ని లీకేజీ అని ఎలా అంటారు?
విద్యార్థులు పరీక్ష రాస్తున్న సమయంలోనే ప్రశ్నాపత్రాన్ని ఏదోరకంగా బయటకు తెచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టించడంలో ఆంతర్యమేమిటనే విషయాన్ని విజ్ఞులందరూ గ్రహించాలి. రాష్ట్ర వ్యాప్తంగా 2,652 పరీక్షా కేంద్రాలుండగా అందులో 34 వేలకు పైగా ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తున్నా రు. 4,94,620 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఇంత పెద్ద వ్యవస్థలో ఒక కేంద్రంలో జరిగిన పొరపాటును మొత్తం వ్యవస్థకు ఆపాదించడం సరైంది కాదు. పైగా పరీక్ష ప్రారంభమైన తర్వాత ప్రశ్నాపత్రం బయటకు వచ్చినా దానివల్ల ఒనగూడే ప్రయోజనం ఎమిటో నాకైతే అర్థం కావడం లేదు.
ప్రస్తుతం 10వ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులందరూ 15 ఏండ్ల వయస్సు కలిగిన పిల్లలే. మనోవిజ్ఞానశాస్త్రం నిబంధనల ప్రకారం పరీక్షలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాలి. పరీక్షలు జరుగుతున్న ఈ సందర్భంలో పేపర్ లీకేజీ వార్తలను ప్రచారం చేయడం వల్ల విద్యార్థుల మనసులు గాయపడుతున్నాయి. వారు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. తాము రాసిన పరీక్ష ఎక్కడ రద్దవుతుందో, మళ్లీ పరీక్ష తిరిగి రాయవలసి వస్తుందేమోననే భయానికి లోనవుతున్నారు. ఇలాంటి సందర్భంలో బాధ్యతగా మెలగవలసిన పెద్దలు దీన్ని కేవలం ప్రభుత్వ తప్పిదంగా సమాజానికి చూపెట్టడానికి దిగజారుడు రాజకీయం చేయడం మంచి పరిణామం కాదు.
పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరూ 7, 8 తరగతులలో కరోనా మహమ్మారి వల్ల విధించిన లాక్డౌన్ కారణంగా పూర్తిగా పాఠశాలకు, ప్రత్యక్ష బోధనాభ్యసన ప్రక్రియకు దూరమయ్యారు. ఆ రెండేండ్లలో వార్షిక పరీక్షల నిర్వహణ కూడా జరుగలేదు. ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న విద్యావ్యవస్థలో ఇలాంటి సంఘటనలు విద్యార్థుల మానసిక స్థితులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత, ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు లాక్డౌన్ వల్ల జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 10వ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి 11 పేపర్లను 7 పేపర్లకు తగ్గిస్తూ సిలబస్‌ను కూడా తగ్గించి పరీక్షలు నిర్వహిస్తున్నది. ఇలాంటి సందర్భాల్లో వారిని ప్రోత్సహించాల్సింది పోయి, సమాజంలోని పెద్దలు తమ బాధ్యతను మరిచిపోతున్నారు. పైగా ప్రశ్నా పత్రాలను సామాజిక మాధ్యమాల్లో అబద్ధాలను విస్తృతం చేయడం దురదృష్టకరం.
ఇక రెండవరోజు హన్మకొండ జిల్లాలో జరిగిన సంఘటన పూర్తిగా విచిత్రమైంది. గ్రామంలోని ఒక వ్యక్తి పాఠశాల ప్రహరీ సమీపంలో ఉన్న చెట్టు ఎక్కి, ఆ చెట్టు పైనుంచి పాఠశాల మొదటి అంతస్తులోకి ప్రవేశించారు. కిటికీ పక్కనుంచి ఒక విద్యార్థి సహాయంతో ప్రశ్నాపత్రాన్ని సెల్ఫోన్లో ఫొటో తీసి బయటకు వచ్చాడు. ఆ ఫొటోను తనకు తెలిసిన వ్యక్తులకు, తనకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లన్నింటిలో షేర్ చేయడం విడ్డూరం. వ్యవహారం పూర్తిగా వ్యవస్థను అప్రతిష్ఠపాలు చేయడానికి మాత్రమే జరిగిన చర్యగా అవగతమవుతున్నది.
పైగా ఈ వ్యవహారానికి సంబంధించి రాజకీయ నాయకులు కనీస అవగాహన లేకుండా రెండుగంటల తర్వాత విద్యార్థులు బయటకువచ్చే అవకాశం ఉన్నదని సమర్థించుకుంటున్నారు. పరీక్ష పూర్తి సమయం మూడు గంటల తర్వాతనే విద్యార్థిని పరీక్షా కేంద్రం నుంచి బయటకు పంపిస్తారు. ఈ నిబంధన తెలియనివారు కూడా వ్యవస్థను ప్రశ్నించడం శోచనీయం. సోషల్ మీడియా ద్వారా విద్యావ్యవస్థను కించపరిచే విధంగా రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఈ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నవారు విద్యార్థులకు, వారి భవిష్యత్ మీద కోటి ఆశలు పెట్టుకున్న నా లాంటి తల్లిదండ్రులకు మీరు సమాధానం చెప్పాల్సిన అంశాలు.
ప్రస్తుతం మీరు భావిస్తున్న లీకేజీ వల్ల విద్యార్థులకు ఎవరికైనా నష్టం జరుగుతుందా? లేక ప్రతి అంశాన్ని రాజకీయం చేసేవారికి లాభం జరుగుతుందా?
10వ తరగతి రాస్తున్న విద్యార్థులకు సంబంధం లేని విషయాన్ని లీకేజీగా చిత్రీకరిస్తూ ప్రస్తుతం ఎన్నో పరీక్షలకు సిద్ధమవుతున్న డిగ్రీ, బీటెక్ విద్యార్థులను రోడ్ల మీదికి తీసుకురావడంలో ఆంతర్యమేమిటి? కమలాపూర్‌లో ఒక వ్యక్తి పేపర్ లీకైందని ఒక పార్టీ అధ్యక్షునికి పేపర్ పంపాల్సిన అవసరం ఏమిటి?
ప్రశ్నాపత్రాల తయారీ, జిల్లా కేంద్రాలకు, అక్కడినుంచి కస్టోడియన్ ద్వారా పరీక్షా కేంద్రాలకు చేరవేస్తున్న పకడ్బందీ విధానాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి వెళ్లిన తర్వాత కొందరు ఆకతాయిలు చేసిన తప్పిదానికి బలవుతున్న ఉపాధ్యాయుల కుటుంబాల పరిస్థితి గురించి ప్రస్తావించాలి.
విద్య భవిష్యత్తరానికి పెట్టుబడి. నేటి విద్యార్థులే రేపటి బాధ్యత కలిగిన పౌరులు. సమాజంలో అడుగుపెట్టడానికి సంసిద్ధమవుతున్న ఆ విద్యార్థుల భవిష్యత్తును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదు. ఉద్దేశపూర్వకంగా ఎవరు తప్పుచేసినా బాధ్యతాయుతమైన వ్యక్తులుగా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి తప్పుచేసిన వారికి శిక్షపడేవిధంగా చూడాలి. అంతేకానీ ప్రతిదీ రాజకీయాంశం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.
(వ్యాసకర్త: పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు)
-పింగిలి శ్రీపాల్ రెడ్డి
94417 71881
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

