పైకి ఎగబాకలేక, కిందకు దిగజారలేక నడుమన పడి నలిగేది అనే నిర్వచనం ఇప్పుడు మధ్యతరగతికి సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు దేశంలో వినిమయంలో ప్రధాన వాటా ఈ వర్గానిదే. ఆదాయంలో ఎంతోకొంత మిగులు ఉండే వర్గమిది. అయితే ఆ ఆదాయానికి మించిన కోరికల వల్ల విలాస వస్తువులు, విదేశీ విహారాలతోపాటు రియల్ ఎస్టేట్ మోజులో మధ్యతరగతి పరుగులు పెడుతున్నది. దీనికితోడు సులభరుణాలు, క్రెడిట్ కార్డులు కొనుగోళ్ల జోరును పెంచుతున్నాయి. వినోదం, విహారం, సరదా ఆహారం వంటి అత్యవసరం కాని వ్యయాల్లో మధ్యతరగతి వాటా మూడోవంతు దాకా ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
మొత్తం మీద మధ్యతరగతి వినిమయం పెరిగిందన్నది వాస్తవం. అయితే ఈ వ్యయ విస్తరణలో ఓ సమతూకం, హేతుబద్ధత అనేవి లోపిస్తున్నాయి. పచారీ సరుకుల కొనుగోలులో కనిపించే పొదుపు ఆలోచన కారు కొనుగోలులో కనిపించదు. ఎలక్ట్రీషియన్‌ను పిలిస్తే ఎంత ఖర్చవుతుందోనని మల్లగుల్లాలు పడేవారు విదేశీ ప్రయాణాల విషయంలో మాత్రం ఖర్చుకు వెనుకాడరు. ఆదాయాలు పెద్దగా పెరగకపోయినా సులభరుణాలు, వాయిదా పద్ధతులు ఈ ధోరణికి ఆజ్యం పోస్తున్నాయి.
నిజానికి గత పదేండ్లుగా మధ్యతరగతి ఆదాయాలు ఎదుగూబొదుగూ లేకుండా ఏడాదికి పదిన్నర లక్షల రూపాయల వద్ద కదలకుండా ఉండిపోయినట్టు ఇన్‌కమ్‌ట్యాక్స్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇక ద్రవ్యోల్బణం ప్రకారం చూస్తే ఆదాయాలు సగానికి పడిపోయాయని చెప్పవచ్చు. అంటే ఆదాయాలు పెరగకున్నా ఆకాంక్షలు పెరుగుతున్నా యి. ఈ విపరీత ధోరణి వల్ల అప్పులు గుట్టలుగా పెరుగుతున్నాయి. పొదుపు కొంత ఎదుగుదల సాధించినట్టు కనబడుతున్నా అప్పుల ముం దు అది దిగదుడుపే అవుతున్నది.
కుటుంబ రుణాల స్థాయి పెరుగుదల పట్ల ఆర్బీఐ కూడా ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. జీడీపీలో ఈ కుటుంబ రుణాల వాటా 41 శాతం దాటేసింది. ఇందులో సింహభాగం, అంటే దాదాపు మూడో వంతు గృహరుణాలే. గృహేతర రుణాల వాటా కూడా భారీగా పెరుగుతుండటం గమనార్హం. ఇందులో విహారయాత్రలూ వచ్చిచేరాయి. కానీ, ఇప్పుడు ఈఎంఐల పుణ్యమా అని నచ్చిన దేశానికి వెళ్లి వస్తున్నారు.
ఒక వస్తువు అమ్మకపు ధర కన్నా దాని ఉపయోగ విలువకే ప్రాధాన్యమిచ్చే తత్వం మధ్యతరగతిలో పెరుగుతున్నది. తాహతు కన్నా సౌకర్యం, సౌలభ్యాలకే పెద్దపీట వేస్తున్నారు. విలాస వస్తువులు సంపన్నులకే అనేది పాత మాట. ఇప్పుడంతా అప్పుచేసి పప్పుకూడు విధానమే రాజ్యమేలుతున్నది. ఈ జిలుగువెలుగుల కింద సమస్యల నీడలూ, ఉద్రిక్తతల జాడలూ గోచరిస్తున్నాయి.
అభిలాషలు, ఆదాయాల మధ్య వ్యత్యాసాలు, పెరుగుతున్న అప్పులతో సతమతం అవుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పాలి. ఇంకోవైపు కృత్రిమమేధ (ఏఐ) వల్ల ఆదాయానికి ఆధారభూతమైన ఉద్యోగాలు సమస్యల్లో పడుతున్నాయి. అనేక కంపెనీలు కోతలు పెడుతున్నట్టు రోజువారీగా వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. నూతన సాంకేతిక యుగంలో చదువుల ప్రాసంగికత తగ్గిపోతున్నది. ఈ హెచ్చరికలను సకాలంలో గమనించి, నూతన ప్రావీణ్యాలను సంతరించుకోకపోతే మధ్యతరగతికి మరిన్ని సమస్యలు తప్పవు.