విద్వేష ప్రసంగాలు, ద్వేషపూరిత నేరాలు, వ్యక్తులు లేదా సమూహాల మధ్య అశాంతిని రెచ్చగొట్టే ప్రసంగాలు, ముద్రణ లేదా ఆన్లైన్ ప్రచురణను అరికట్టే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపింది. ఈ బిల్లు చట్టం రూపంలోకి రావటానికి కొద్దిరోజులు పట్టవచ్చు.
గత సంవత్సరం కర్ణాటక శాసనసభ తొలుత ఇటువంటి బిల్లును ఆమోదించింది. దాదాపు అదే రీతిలో తెలంగాణ బిల్లు కూడా ఉంటుందని తెలుస్తున్నది. దీనిపై రాజకీయ పార్టీలు, మేధావుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ద్వేషపూరిత ప్రసంగం లేదా ద్వేషపూరిత వ్యాఖ్యలు అనే దానిని బిల్లు నిర్వచించింది. ఈ చట్టం భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తుందని ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారి దృఢ అభిప్రాయం. ఇంటర్నెట్లో కార్చిచ్చులా ఎవరికి తోచిన విధంగా వారు విద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడాన్ని అరికట్టడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని పాలకులను సమర్ధించేవారి అభిప్రాయం. విద్వేషపూరిత ప్రసంగం లేదా విద్వేషపూరిత వ్యాఖ్యలు అనే దానికి బిల్లులో సరియైన నిర్వచనం లేదు.
అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన చట్టసభ సభ్యుల ఏకాభిప్రాయం, న్యాయకోవిదుల అభిప్రాయం కోరకుండానే కక్షసాధింపు చర్యల కోసం, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారిని కట్టడి చేయడం కోసం సర్కార్ ఏకపక్షంగా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిందని వ్యతిరేక వర్గాల వాదన.
కర్ణాటక రాష్ట్ర బిల్లులో ఒక క్లాజు ప్రకారం, ఏదైనా పుస్తకం, కరపత్రం, ఎలక్ట్రానిక్ రూపంలోని మెటీరియల్ ప్రచురితమై, అది ప్రజా శ్రేయస్సు దృష్ట్యా సమర్ధనీయమని నిరూపణ అయితే లేదా మతపరమైన ప్రయోజనాలకోసం వినియోగిస్తున్నారని రుజువైతే, అటువంటి ప్రచురణ ఈ చట్టం పరిధిలోకి రాదు. కులాలు, మతాలు, మత గ్రంథాలను తీవ్రంగా విద్వేషిస్తూ గతంలో కొంతమంది బాహాటంగా పుస్తకాలను ప్రచురించటమే కాకుండా, సమావేశాల్లో వాటిపై చర్చలు నిర్వహించారు. అటువంటివారు ఈ చట్టం పరిధిలోకి వస్తారా లేదా అనేది తెలియాల్సి ఉన్నది. ఈ చట్టం అమల్లోకి వస్తే ఇప్పటికిప్పుడు విద్వేష పూరిత ప్రసంగాలు, వ్యాఖ్యలు మానుకుంటారని అనుకోలేం. ముఖ్యంగా అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల నోటి నుంచి చట్టసభలు, బహిరంగ సభల్లో కులాలు, మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు వింటున్నాం. బహిరంగంగా విద్వేషాలు రెచ్చగొడితే ప్రతి ఒక్కరూ ఈ చట్టం కింద శిక్షార్హులే. కానీ చట్టసభల్లో రెచ్చగొట్టే విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే సభ్యులపై ఎవరు చర్యలు తీసుకోవాలి? ఎక్కువలో ఎక్కువగా సభాపతి అటువంటి వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగిస్తారేమో. కానీ అప్పటికే ప్రజల్లోకి చేరుకున్న ఆ వ్యాఖ్యల ప్రభావం మాసిపోదు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని ఇటువంటి చట్టం మొదటగా కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశపెట్టగా, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం శాసనసభ ఆమోదానికి పెట్టబోతున్నది. ఈ చట్టంలోని నేరాలు ఇంతకుముందే భారతీయ శిక్షాస్మృతిలో సెక్షన్లు 295, 296, 298, 505గా, భారతీయ న్యాయ సంహితలో సెక్షన్లు 298, 299, 301, 353గా గుర్తింపు పొందాయి.
మనమంతా గమనించే మోటారు వాహనాల చట్టం ఏ మాత్రం అమలవుతున్నది? రోజులో కొన్ని వేలాది మంది హెల్మెట్లు లేకుండా, లైసెన్సు లేకుండా, రాంగ్ రూట్లలో తిరుగుతున్నా, అక్రమ పార్కింగులు చేస్తున్నా శిక్ష పడేది కేవలం వందల్లో ఉంటాయి. దేనికైనా ప్రభుత్వానికి ఒక నిబద్ధత ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చే సరికొత్త చట్టం ప్రస్తుతానికి ఉన్న చట్టాలను మించి ప్రత్యేకత ఉంటుందని భావించలేం.