ఆశలు ఆవిరయ్యాయి. కలలు కల్లలయ్యాయి. వర్తమానమే కాదు, భవిష్యత్తు కూడా అంధకారమని అర్థమవుతున్నది. బాధ్యతలు రోజురోజుకూ బరువెక్కుతున్నాయి. ఆరోగ్యం అనుక్షణం హెచ్చరిస్తున్నది. జీవితంపై విరక్తి కలుగుతున్న పరిస్థితి నెలకొన్నది. మోసపోయి ఘోష పడుతున్నామన్న ఆవేదన. కనుచూపు మేరలో ఆశాకిరణం కనపడడం లేదు. ఇన్నాళ్ల నిస్వార్థ సేవకు ప్రతిఫలం ఇదేనా అని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు నిలదీస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం లేదు.
తాము వేసిన ఒక్కొక్క ఓటు తమ జీవితాలను కోలుకోకుండా దెబ్బ తీసింది అన్న ఆవేదన పెన్షనర్లను వేధిస్తున్నది. చేసిన తప్పును సరిదిద్దుకోలేని పరిస్థితి వారిది. ఇంకా ఎంతకాలం ఈ నిరీక్షణ? ఎదురుచూపులు ఎండమావులేనా అనే భయం వెన్నాడుతోంది. అవును 61 ఏండ్ల వయసు తరువాత పదవీ విరమణ చెందిన ఉద్యోగులు వారికి రావాల్సిన బకాయిల గురించి చెందుతున్న ఆందోళన వర్ణనాతీతం. ధర్నాలు చేస్తే ప్రభుత్వం అరెస్టులకు దిగుతున్నది. విజ్ఞాపనలు బుట్ట దాఖలవుతున్నాయి. ప్రాతినిధ్యాలు పని చేయడం లేదు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు పెన్షనర్ల బకాయిల చెల్లింపు గురించి అడిగినా, చివరకు హెచ్చరించినా ప్రభుత్వం మౌనముద్ర వహిస్తున్నది. నిరసనలకు, నిరాహారదీక్షలకు కనీస స్పందన లేదు. కోర్టు ఉత్తర్వులను కూడా ఖాతరు చేయని పరిస్థితి. అంటే పెన్షనర్ల పట్ల ప్రభుత్వం చాలా చులకన భావంతో ఉన్నట్లు స్పష్టమవుతున్నది. రెండేండ్ల క్రితం పెన్షనర్ల ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి కావాల్సి వచ్చింది. మళ్లీ ఐదేండ్లకు వారిని ఏదో విధంగా మభ్యపెట్టి వాళ్ల ఓట్లు దండుకోవచ్చునని దూ(దు)రాలోచన. నాడు కాళ్ళకు బలపాలు కట్టుకుని కాంగ్రెస్ కోసం ప్రచారం చేసిన మేధావి వర్గం నేడు ప్రభుత్వంతో చర్చిస్తాం అన్న ప్రకటనలకే పరిమితమైంది.
పదవీ విరమణ చేసిన ఉద్యోగులు సహజంగానే ప్రభుత్వాలకు బాసటగా నిలుస్తారు. ఏ ప్రభుత్వమైనా తమ ఉద్యోగుల బాగోగులు చూసుకోవడంలో రాజీ పడబోదు. 20 ఏండ్ల తర్వాత తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు, పెన్షనర్లకు హామీల వర్షం కురిపించింది.
అమలులో ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని, పెండింగ్ డీఏలు వెంటనే ప్రకటిస్తామని, ఆరు నెలల్లో పీఆర్సీ అమలు చేస్తామని, ఆరోగ్య కార్డులు ఇస్తామని, 317 జీవో బాధితులు తదితర అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని ఇచ్చిన హామీలను ఉద్యోగులు, పెన్షనర్లు అమాయకంగా నమ్మి తమ మద్దతు తెలిపారు. క్రమంగా ప్రభుత్వ వైఖరి బట్టబయలైంది. మోసపోయిన ఉద్యోగులు పెన్షనర్లకు రెండేండ్లకు ఒక్క డీఏ విదిల్చింది. పీఆర్సీ నివేదిక అందుకునే సాహసమే చేయడం లేదు. పాత పెన్షన్ విధానం గూర్చి మాట మాత్రమైనా పలకడం లేదు.ఆరోగ్య కార్డు పథకం రకరకాల కారణాలతో అటకెక్కింది. నెలకు రూ.500 కోట్లు విడుదల చేసి ఉద్యోగుల పెన్షనర్ల ఆర్థిక డిమాండ్లు నెరవేర్చుతామన్న ప్రభుత్వం పది నెలల్లో కేవలం మూడుసార్లు మాత్రమే విడుదల చేసింది. అందులో పెన్షనర్లకు దక్కింది 15% కూడా లేదు. విడుదల చేసిన దానిలో కేవలం మెడికల్ బిల్లులు మాత్రమే ఉన్నాయి.
సహనం నశించిన వారు కోర్టు నుండి ఉత్తర్వులు తెచ్చుకున్నా వారికి కూడా పెద్దగా చెల్లింపులు జరగడం లేదు. మరోవైపు బకాయిల చెల్లింపునకు ఆర్థిక శాఖలో మామూళ్ల పర్వానికి తెరలేపారు. మరణించిన వారి అంత్యక్రియలకు చెల్లించే రూ.30 వేలు కూడా విడుదల చేయకపోవడం దారుణం. మొత్తం పెన్షనర్లకు 21 నెలల కాలానికి రూ.13,500 కోట్లు విడుదల చేస్తే వారు రోడ్డెక్కే పరిస్థితి రానే రాదు. కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. రాష్ట్రంలో గత రెండేండ్లలో దాదాపు 40 మంది పెన్షనర్లు ఆర్థిక భారం భరించలేక ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ రకమైన పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కాని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కాని ఏర్పడలేదు. ప్రభుత్వానికి ఆర్థిక నియంత్రణ లోపించడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రాధాన్యతలు పక్కదారి పట్టడంతో ప్రభుత్వం జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. నాటి ఓడ మల్లయ్యలు నేడు బోడి మల్లయ్యలయ్యారు.‘ఆర్థిక స్థితి బాగాలేదు, అప్పు పుట్టడం లేదు, నన్ను కోసుకు తిన్నా పైసా రాదు, ఒకటవ తేదీనే జీతాలు ఇస్తున్నాం సంతోషించండి’ అంటూ పలికిన ముఖ్యమంత్రి అందాల పోటీలకు, గ్లోబల్ సమ్మిట్ పేరుతోనూ మనవడి సరదా కోసం ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఏ రకమైన ఆర్థిక స్థితిని తెలియజేస్తుంది? ఇందులో ప్రజలకైనా, రాష్ర్టానికైనా ఏం ఒరిగింది? ప్రభుత్వమే అప్రతిష్టపాలైంది. అయినా ఇంకా ఉద్యోగులను, పెన్షనర్లను సర్దుకుపొమ్మని సలహా ఇవ్వడం ఆశ్చర్యకరం.
ప్రజాసేవ చేస్తున్నామని చెప్పుకుంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ జీతభత్యాలను ఒక నెల త్యాగం చేస్తే వారికి ఉద్యోగ వర్గాల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఈతి బాధలు తెలుస్తాయి. కానీ ఉద్యోగులు సౌమ్యులు. ఇలాంటి డిమాండ్ ఏనాడూ చేయడం లేదు. తమ ఆరోగ్యం కోసం ఖర్చు చేసిన మెడికల్ బిల్లులు, తాము దాచుకున్న జీపీఎఫ్, జీఎల్ఐసీ సొమ్ము వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. పదవీ విరమణ పొందిన వారి హక్కు అయన గ్రాట్యుటీ, కమ్యుటేషన్ బకాయిలను విడుదల చేయమని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ప్రతిరోజు జిల్లాలలో పెన్షనర్లు ఆందోళన చేస్తున్నా, కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పిస్తున్నా ప్రభుత్వం చెవులు, కళ్లు మూసుకుంది.
ఐదు డీఏలు పెండింగ్ ఉన్న రాష్ట్రంగా దేశంలో రికార్డు సృష్టించింది తెలంగాణ. ఇంత బాధ్యతారహితమైన ప్రభుత్వాన్ని మొదటిసారిగా ప్రజలు ‘మార్పు’ పేరున తెచ్చుకున్నందుకు శిక్షను అనుభవించాల్సి వస్తున్నది. ‘ప్రజలకు ఇచ్చే ఏ సంక్షేమ పథకాన్ని అయినా నిలిపివేసి ఉద్యోగుల, పెన్షనర్ల బకాయిలు చెల్లించాలి’ అంటూ స్వయంగా ముఖ్యమంత్రి ప్రజలను వారికి వ్యతిరేకంగా రెచ్చగొట్టినట్లుగా
మాట్లాడడం రాజనీతి కాదు.
ప్రజలు విజ్ఞులు కాబట్టే ఆయన వ్యాఖ్యలకు అనుకూల స్పందన రాలేదు. ఎందుకంటే ఉద్యోగ పెన్షనర్లు ప్రజల్లో భాగమే. అందరూ నేటి ప్రభుత్వ బాధితులే. ఓపిక నశించిన పెన్షనర్లు రోడ్డెక్కడం లేదా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సంక్షేమం తమ మొదటి ప్రాధాన్యతగా చెప్పుకునే నేటి పాలకులు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంక్షేమం నిర్లక్ష్యం చేయడాన్ని సదరు వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఎనిమిది వారాల గడువిస్తూ పెన్షనర్ల సమస్యలను తీర్చాలని ఆదేశించింది. ఏమి అద్భుతాలు జరుగుతాయో వేచి చూద్దాం.మాటల్లోనూ, చేతల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వ డొల్లతనం బహిర్గతమైంది. ఇక ఇందుకు విరుగుడుగా ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచే దిశగా ఆలోచిస్తున్నట్లు, రహస్యంగా జీవో విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. పదవీ విరమణ వయసును పెంచితే భవిష్యత్తులో బకాయిలు మరింత పేరుకుపోయి ప్రభుత్వం చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం మాత్రం కనుచూపుమేరలో లేదు. మరి అదే నిజమైతే నాడు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు తప్పు, అబద్ధం అని ప్రజల సాక్షిగా ఒప్పుకున్నట్లే. అదేవిధంగా పదవీ విరమణ వయస్సు పెంపు విషయంలో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లే అవుతుంది. వారి జీవితాలతో ఆడుకున్నట్లే అవుతుంది.
నోటిఫికేషన్లు ఇచ్చి వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఎన్ని నియామకాలు చేపట్టిందో మనకు తెలుసు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు తతంగం పూర్తయిన తర్వాత కేవలం నియామక పత్రాలను అట్టహాసంగా ఇచ్చి తామే చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు. రెండేండ్లు గడిచినా నేటి వరకు నోటిఫికేషన్లు ఇచ్చింది లేదు, పోస్టులు నింపింది లేదు! ఇప్పుడు నిరుద్యోగులను కూడా దగా చేసే ప్రయత్నం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లతో ఈ విధంగా ఆడుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం కూడా తానేమీ తక్కువ తినలేదు అన్నట్లు ప్రవర్తిస్తున్నది. వారి నెత్తిన పిడుగు పడవేయడానికి సిద్ధంగా ఉన్నది. వ్యాలిడేషన్ చట్టం పేరుతో 1982 జస్టిస్ నకారా తీర్పునకు వ్యతిరేకంగా గత పెన్షన్ చట్టాలన్నింటినీ రద్దు చేస్తూ పెన్షనర్లకు భవిష్యత్తులో పెంచబోయే డీఏ కాని, పీఆర్సీలు కాని వర్తించబోవు అనే బాంబు పేల్చింది. అంటే పెన్షనర్ల జీవితంలో ఇకపై మార్పు ఉండబోదు.
వారి జీవితకాలం అదే పెన్షన్ తీసుకుంటారు. దీనికి వ్యతిరేకంగా కొత్త ఢిల్లీలో జాతీయస్థాయిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలు నిరసన తలపెట్టాయి. అంటే ప్రభుత్వాలు పోటీపడి ఉద్యోగులను, పెన్షనర్లను వేధిస్తున్నాయి. వారిని తమకు భారంగా భావిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. వారి సేవలు కావాలి కానీ వారి సంక్షేమం ప్రభుత్వాలకు పట్టదన్నమాట.
రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లను పెనం మీద ఉంచగా కేంద్రం వారిని పొయ్యిలోకి వేయబోతున్నదని తెలుస్తోంది. అంటే ఇంతకాలం ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ప్రజాసేవ చేయడానికి ఒక సంతృప్తికరమైన మార్గంగా భావించారు. కానీ ఆ భ్రమ తొలగిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇక ప్రైవేటు ఉద్యోగాలే మేలు అనే భావన బలవంతంగా కల్పిస్తున్నారు. ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వాలే తెలివిగా నిర్వీర్యం చేస్తున్నాయన్న మాట. రాష్ట్రంలోని మూడు లక్షల పెన్షనర్లు తమ తమ సమస్యలతో కునారిల్లుతుండగా ఉద్యోగ సంఘాల ఉదాసీనత కూడా ప్రమాదకరంగా ఉంది. ‘ప్రతి ఉద్యోగి రేపటి పెన్షనర్” అన్న విషయాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు అంతా గ్రహించి ఐక్య పోరాటాలకు దిగడమే ఈ సమస్యకు తగిన పరిష్కారంగా భావించాలి.
-శ్రీ శ్రీ కుమార్