రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంక్షేమం కోసం ప్ర తిష్ఠాత్మకంగా తీసుకురానున్న కొత్త ‘ఎంప్లాయీస్ హెల్త్
కేర్ ట్రస్ట్’ డిజిటల్ హెల్త్ కార్డ్ స్కీమ్ రూపకల్పనలో దొర్లిన కొన్నిప్రాథమిక లోపాలు ఒక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయి. ముఖ్యంగా, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పరిధిలోకి వచ్చి, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పరిస్థితి ఈ కొత్త స్కీమ్‌లో
దిక్కుతోచని విధంగా ఉన్నది.
కొన్నేండ్లపాటు సేవలు అందించి, శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపాల్సిన రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వం ప్రతిపాదించిన సాంకేతిక, విధానపరమైన నిబంధనల వల్ల వైద్య హక్కును కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. ఈ అంశాన్ని ఒకసారి నిశితంగా పరిశీలిస్తే ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం, సాఫ్ట్వేర్ లోపాలు, ఒక వర్గం పట్ల చూపుతున్న వివక్ష స్పష్టమవుతున్నాయి.
ఈ పథకంలో రిటైర్డ్ ఉద్యోగులకు జరుగుతున్న ప్రధాన నష్టాన్ని విశ్లేషిస్తే..అత్యంత కీలకమైనది గుర్తింపు సమస్య. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద పదవీ విరమణ చేసిన వారికి ప్రభుత్వ ట్రెజరీ ద్వారా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నంబర్ కేటాయిస్తారు. ప్రభుత్వం కొత్త డిజిటల్ హెల్త్ కార్డుల నమోదు కోసం రూపొందించిన ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ పూర్తిగా ఈ పీపీవో నంబర్ ఆధారంగానే పనిచేస్తుంది. కానీ, సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వ అధికారిక పీపీవో నంబర్ ఉండదు. వారికి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పీఎఫ్ఆర్డీఏ ద్వారా శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం ఈ ప్రాన్ ఐడీని గుర్తించే విధంగా సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి మార్పులు చేయకపోవటం వల్ల, రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లుగా వివరాలను నమోదు చేసుకోవటానికి అర్హత లేనట్లుగా పోర్టల్ తిరస్కరిస్తున్నది. దశాబ్దాలపాటు ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను కేవలం ఒక సాఫ్ట్వేర్ కోడింగ్ లోపం కారణంగా పథకానికి దూరం పెట్టటం అనేది ప్రభుత్వ పరిపాలనా లోపానికి అద్దం పడుతున్నది.
మరో ప్రధాన సమస్య ఆర్థికపరమైనది. పాత పెన్షన్ విధానంలోని వారికి ప్రతి నెల వచ్చే పెన్షన్ నుంచి హెల్త్ కార్డ్ చందాను ప్రభుత్వం నేరుగా మినహాయించుకుంటున్నది. కానీ సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి నేరుగా పెన్షన్ రాదు. రిటైరైనప్పుడు వారి ఖాతాలో ఉన్న సొమ్ములో అరవై శాతం విత్‌డ్రా చేసుకుని, మిగిలిన నలభై శాతాన్ని ఎల్ఐసీ లేదా ఇతర ఇన్సూరెన్స్ కంపెనీల్లో డిపాజిట్ చేయటం ద్వారా నెలవారీ యాన్యుటీ (పెన్షన్) పొందుతారు. దీనివల్ల వారి నుంచి చందా ఎలా వసూలు చేయాలనే దానిపై ప్రభుత్వం వద్ద ఎటువంటి నిర్దిష్ట ప్రణాళిక లేదు.
ప్రభుత్వం తీసుకొచ్చే హెల్త్ కార్డ్ స్కీమ్ వారికి ఒక సంజీవనిలా మారాల్సిందిపోయి, సాంకేతిక కారణాల వల్ల మానసిక వేదనకు గురిచేస్తున్నది. గతంలో ఉన్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌లో కూడా ఇలాంటి లోపాల వల్లే సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులు కార్డులు పొందలేకపోయారు. ఇప్పుడు సరికొత్తగా తెస్తున్న ‘హెల్త్‌కేర్ ట్రస్ట్’లో కూడా పాత తప్పులనే పునరావృతం చేయటం అధికారుల అలసత్వాన్ని సూచిస్తున్నది.
ఈ తీవ్రమైన సమస్యను పరిష్కరించి, రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులకు పూర్తి న్యాయం చేయటానికి ప్రభుత్వం తక్షణమే కొన్ని ఆచరణాత్మక మార్గదర్శకాలు, పరిష్కార మార్గాలను అమలు చేయాలి. ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో కేవలం పీపీవో నంబర్ మాత్రమే కాకుండా, సీపీఎస్ ఉద్యోగుల పాన్ నంబర్ లేదా వారు రిటైరైనప్పుడు ట్రెజరీ జారీ చేసే ఎంప్లాయీ ఐడీని ఎంటర్ చేయటానికి వీలుగా సాఫ్ట్‌వేర్‌లో తక్షణమే మార్పులు చేయాలి.
దీనివల్ల వారు కూడా ఇతర పెన్షనర్ల మాదిరిగా సులభంగా డిజిటల్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అదేవిధంగా సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరించే వరకు నెలవారీ చందా వసూళ్ల కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగుల యాన్యుటీ పెన్షన్ వచ్చే బ్యాంక్ ఖాతాల నుంచి నేరుగా హెల్త్ ట్రస్ట్‌కు చందా జమయ్యేలా ఈసీఎస్ లేదా ఆటోడెబిట్ సౌకర్యం కల్పించవచ్చు. లేదా ఏటా ఒకేసారి నిర్ణీత హెల్త్ స్కీమ్ చందాను ఆన్లైన్ చలాన్ ద్వారా ప్రభుత్వ ఖాతాలో లేదా హెల్త్‌కేర్ ట్రస్ట్ ఖాతాలో స్వయంగా చెల్లించే వెసులుబాటు కల్పించాలి. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన కాంట్రిబ్యూషన్ సక్రమంగా అందటమే కాకుండా ఉద్యోగులకు కూడా వైద్యపరమైన భద్రత లభిస్తుంది. భవిష్యత్తులో విడుదల చేయబోయే హెల్త్‌కేర్ ట్రస్ట్ మార్గదర్శకాల్లో ‘పెన్షనర్లు’ అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇస్తూ, అందులో ఓపీఎస్, సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులు ఇద్దరూ భాగమేనని స్పష్టంగా పొందుపరచాలి. దీనివల్ల క్షేత్రస్థాయిలో అధికారుల మధ్య లేదా ఆసుపత్రుల యాజమాన్యాల వద్ద ఎలాంటి గందరగోళానికి తావుండదు. వ్యవస్థలో వచ్చే మార్పులు లేదా పెన్షన్ విధానాలు ఉద్యోగుల ప్రాథమిక హక్కు అయిన ‘ఆరోగ్య హక్కు‘ను కాలరాసే విధంగా ఉండకూడదు. ముఖ్యమంత్రి, ఆర్థిక, ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ఉద్యోగ సంఘాల డిమాండ్లను సానుకూలంగా పరిశీలించాలి. వెంటనే సాంకేతిక లోపాలను సరిదిద్ది, రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులను కూడా ‘ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్ట్’లో భాగస్వాములను చేయాలి.
(వ్యాసకర్త: తెలంగాణ టీచర్స్ యూనియన్ నాయకుడు)
-జే నారాయణ యాదవ్
94940 19270