Kaleshwaram Project | కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏం జరిగిందో తెలియాలంటే పాత రోజులకు వెళ్లాల్సిందే. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని గోదావరి నదికి పలు ఉప నదులున్నాయి. ఇందులో ప్రాణహిత జల ధారను మినహాయిస్తే గోదావరికి కుడివైపు నుంచి వచ్చి చేరే మరో ప్రముఖమైన ఉప నది మంజీర. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మునుపు మంజీర బోసిపోయి ఎడారి ప్రాంతాన్ని తలపించేది. ఎగువ కర్ణాటకలో ఆనకట్టల నిర్మాణం మూలంగా వానకాలంలోనూ నీటి లభ్యత గగనమైన దుర్భర పరిస్థితులను కండ్లారా చూసింది. అంతటి అవస్థలో గోదావరికి ఉపనదిగా గుర్తింపు పొందిన మంజీరా నదికి కేసీఆర్ పాలనలో మళ్లీ ప్రాణం వచ్చింది.
ఎప్పుడో ఒకసారి వచ్చే వరద నీటితోనే కాకుండా కాలంతో సంబంధం లేకుండా ఉరకలేసిన జల ప్రవాహం గత పాలనలో కండ్లారా చూశాం. మేడిగడ్డ వద్ద ఎత్తిపోసిన గోదావరి జలాలు ఎగుడు దిగుడులను దాటుకొని భూగర్భం గుండా భూ ఉపరితలం మీదుగా అనేక వాగులు, వంకలతో రిజర్వాయర్ల ద్వారా ప్రవాహాన్ని అందుకొని నిజాంసాగర్‌కు చేరడం తెలంగాణకు అమరిన జల కంఠాభరాణాన్ని తలపించిందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే భౌగోళిక తెలంగాణలో కందకుర్తి నుంచి గోదావరి ప్రస్థానం మొదలవుతుంది. మంజీరా, హరిద్రా, గోదావరి నదుల కలయికతో త్రివేణి సంగమం పోటెత్తుతుంది. ఇక్కడినుంచి దిగువకు మేడిగడ్డ వద్ద నిలువరించిన నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తిరిగి నిజాంసాగర్‌కు చేరి, ఆ నీళ్లు వరద వచ్చినప్పుడు తిరిగి మంజీరాలో దిగి కందకుర్తికి చేరడం ద్వారా జల ఆవర్తనం కండ్ల ముందే గోచరించింది. ఈ ప్రవాహ తాండవాన్ని మనసు పెట్టి అర్థం చేసుకుంటే జీవనదికి జల కంఠాభరణంగానే కనిపించడం తథ్యం. ఒక స్త్రీకి కంఠాభరణం ఎంతటి శోభను తీసుకు వస్తుందో అచ్చంగా తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జల కంఠాభరణం సాక్షాత్కరించింది. అలాంటి సొగసులు అద్దుకున్న జీవనది పరిస్థితి ఇప్పుడు తెగిన కంఠాభరణంలా మారింది.
ఎస్సారెస్పీకి అటూ, ఇటూ…: కాళేశ్వరం పథకంలో భాగమైన ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం గోదావరి నదికి జీవం పోసింది. దిగువకు నీళ్లను పంపేందుకు తవ్విన కాలువ ద్వారానే ఎగువకు నీళ్లను ఎక్కించి ప్రాజెక్టును నింపడమే ఈ పథకం ముఖ్యోద్దేశం. వరద కాలువ ద్వారా వేల క్యూసెక్కుల ప్రవాహంతో మండుటెండల్లోనూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 40 టీఎంసీల మేర నీటి నిల్వతో తటస్థంగా ఉండటానికి గత పాలకుల ముందు చూపు, వారి దార్శనికతకు నిలువుటద్దంలా మారింది. అలాంటి పోచంపాడ్ ప్రాజెక్టు ఇప్పుడు కేవలం 12 టీఎంసీలతో డెడ్ స్టోరేజీకి చేరువలో కళావిహీనమై కనిపిస్తున్నది. 40 టీఎంసీల నీటి నిల్వకు ఎస్సారెస్పీ చేరితే ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పశ్చిమ వైపునకు తన్నుకురావడం ద్వారా బాసర, కందకుర్తి వరకు జల కాంతులు దర్శనం ఇచ్చేవి. కానీ ఇప్పుడు పోచంపాడ్‌లో ఏర్పడిన నీటి కొరతతో తెలంగాణ ఏర్పాటుకు మునుపు సమైక్య పాలనలో ఎదురైన దుర్భర పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎటు చూసినా ఎడారి మాదిరిగా పోచంపాడ్ ప్రాజెక్టు నిలవడం, కందకుర్తి త్రివేణి సంగమం పైకి తేలిపోయి ప్రవాహమే లేక పాయలా మారడం చూస్తుంటే దశాబ్దన్నర కిందటి దృష్టాంతాలు సాక్షాత్కరిస్తున్నాయి. ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఎగువ, దిగువ ఎటు చూసినా నీటి కొరతతో గోదావరి నదిలో బండరాళ్లు, ఎండిపోయిన పిచ్చి మొక్కలే తప్ప నీటి జాడ లేకపోవడంతో రైతన్నల్లో దిగులు ఏర్పడింది
సరిగ్గా నాలుగు నెలల కిందటి వరకు ఎండకాలానికి, వానకాలానికి సంబంధం లేకుండా జల ప్రవాహాలు కానరాగా వరద కాలువతో పాటు చెరువులను కలిపే పిల్ల కాలువలు సైతం ఇప్పుడు ఎండిపోయి వెలవెలబోతున్నాయి. వానకాలం ఆరంభానికి ఇంకా నెలన్నర రోజులుంది. ఒకవేళ వాతావరణ పరిస్థితులు సానుకూలిస్తే అంతా ఓకే. వానలు ఆలస్యమైతే రైతుల పరిస్థితి అగమ్యగోచరమే. పుటం మడులు పోసుకునేందుకు కూడా నీటి లభ్యత కష్టమే. ఓ వైపు భూగర్భ జలం కొరత, మరోవైపు నీటి వనరుల లేమితో రైతన్నలు నెత్తినోరు కొట్టుకోవాల్సి వస్తున్నది.
అనాలోచిత నిర్ణయాలు, రాజకీయ కక్షసాధింపు చర్యల మూలంగా జల సౌభాగ్యం కానరాకుండా పోయింది. పదేండ్ల తెలంగాణలో గోదావరికి జల జీవం పోసిన ఘనత ఒకరిది కాగా… అదే జీవనది ఊపిరి తీసిన ఘనత ఇప్పటి పరిపాలకులది. కందకుర్తి నుంచి మొదలవుతోన్న త్రివేణి సంగమ క్షేత్రం ఎడారిబారుతున్నప్పటికీ స్పందన కరువై కేవలం రాజకీయ ఎజెండానే పరమావధిగా నడుస్తోన్న ఈ పాలనలో ఇంతకంటే మంచిని ఆశించడమే మన తప్పు కాక మరేమిటి? అన్న ప్రశ్నలు సామాన్య జనాల్లో ఉత్పన్నమవుతున్నాయి.
(వ్యాసకర్త: నమస్తే తెలంగాణ బ్యూరో చీఫ్, ఉమ్మడి నిజామాబాద్)
జూపల్లి రమేష్‌రావు
94925 70992