స్వాతంత్య్రానంతరం.. నాటినుంచీ నేటిదాకా జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాల నాయకులు, వక్తలు, మేధావులు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను, ప్రభుత్వాల్లోని లొసుగులను ఎత్తిచూపుతూ, విమర్శిస్తూ తమను గెలిపించాల్సిందిగా, తమకు అవకాశం కల్పించవలసిందిగా కోరారు. కానీ, దేశాన్ని, మానవ, ప్రకృతి వనరులను సద్వినియోగపరుచుకునేందుకు ఎలాంటి ఆచరణాత్మక, సంక్షేమ భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించలేదు. అంతేకాకుండా ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు తమ ఎన్నికల మ్యానిఫెస్టోను ఆచరణాత్మకంగా రూపొందించి అమలుచేయలేదు.
భవిష్యత్తు ప్రణాళిక, దూరదృష్టి లేకుండానే అధికార దాహంతో ఒకరిపై ఒకరు బాధ్యతారహితంగా విమర్శించుకున్నారు. గెలుపే ప్రధాన ధ్యేయంగా వారు సమావేశాలు నిర్వహించుకోవటం, కుల, మత, జాతి, వర్గ, ప్రాంత, భేదాల్ని సృష్టిస్తూ.. ‘విభజించు-పాలించు’ అనే రాజనీతితో ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. నల్లడబ్బును విచ్చలవిడిగా ఓటర్లకు పంచటం, హింసాత్మక ధోరణులు సృష్టించటం ప్రధాన ధ్యేయంగా ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆకాంక్షతో ఉండేవాళ్లు నేటితరం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ పరిపక్వత పైవాటికి భిన్నమైనది. జల, ప్రకృతి, మానవ వనరులను సంపూర్ణంగా సద్వినియోగపరుచుకునే విధంగా ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాల రూపకల్పన చేయటంలో ఆయన దిట్ట. రాష్ట్రంలో నిరంతరం విద్యుత్తు సౌకర్యాన్ని కల్పిస్తూ డబ్బు శాతానికి పైగా ఉన్న గ్రామీణ వ్యవసాయరంగాన్ని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను స్థాపించి ప్రజలకు కనీస అవసరాలైన మంచినీరు, తాగునీరు, సాగునీరందించి భూ, జల వనరులన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో పంపిణీ చేసి సస్యశ్యామలం చేసేందుకు తపన పడుతున్న మన కేసీఆర్ మరో భగీరథుడే.
మన దేశ చరిత్రలో ఇలాంటి విజన్‌తో ఉన్న నాయకులు ఎంతమంది? రైతు సంక్షేమం, భద్రత, వ్యవసాయరంగాభివృద్ధి, శాస్త్ర, సాంకేతిక రంగాభివృద్ధి ప్రధాన ధ్యేయంగా నిరంతరం విద్యుత్తు సౌకర్యాన్ని కల్పిస్తూ గ్రామీణ, పట్టణ పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతున్న నాయకులెందరు? మహిళాభ్యదుయానికి, సహకార రంగాభివృద్ధికి, ప్రజలకు నిరంతరం రక్షణ కల్పిస్తూ జాతీయ సమైక్యతతో అన్ని కుల, మత, ప్రాంత ప్రజల సౌకర్యార్థం శాంతియుత వాతావరణంలో జీవనం కొనసాగించేందుకు నిరంతరం శాంతి భద్రతలను పటిష్ఠంగా అమలుపరిచేందుకు పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రులెందరు? ఒక్క మన కేసీఆర్ తప్ప.
నాడు ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజపేయి, వీపీ సింగ్, చరణ్‌సింగ్, పీవీ నరసింహారావు లాంటి నాయకుల వల్ల, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కల్పించిన మార్గదర్శకత్వం వల్ల భారతదేశం కొంత అభివృద్ధి చెందింది. దేశంలో ఆర్థిక సంస్కరణలకు, రాజ్యాంగ సవరణలకు శ్రీకారం చుట్టబడింది. నాటి నుంచి మన దేశంలో నేటితరంలో ఒక భవిష్యత్తు విజన్ ఉన్న మేధావి, కార్యదీక్షాపరుడు, సాహసి, ధైర్యం, దమ్మున్న యుగ పురుషుడు, ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో 32 రాజకీయ పార్టీల మద్దతు పొంది అహింసా విధానంలో మహాత్మాగాంధీ మార్గదర్శకత్వ విధానాల అమలు వల్ల పదిహేనేండ్ల నిర్విరామ అవిశ్రాంత కృషి, పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత మన కేసీఆర్, తెలంగాణకు ఆహుతైన అమరులది.
రాష్ట్రంలోని మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, యువకులు, స్త్రీ, పురుషులు రాజకీయాలకతీతంగా గతంలో కేసీఆర్‌కు, పదేండ్ల పాలనకు మద్దతునిచ్చినట్టే నేటి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతునిచ్చేందుకు ముందుకువస్తుండటం ముదావహం. శాంతిభద్రతల పరిరక్షణలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాభివృద్ధిలో, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో విద్య, వైద్య సదుపాయాలను కల్పించి ప్రజలందరికీ సుపరిపాలనను అందించడంలో నిరంతరం కృషిచేస్తోన్న దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉండేందుకు తపిస్తోన్న మన కేసీఆర్‌కు వారి మద్దతు లభిస్తుండటం అభినందనీయం.
ఆయన మార్గదర్శకత్వంలో భారతదేశానికి వన్నె తెచ్చే విధంగా భవిష్యత్తు నాయకుడిగా ఎదుగుతూ నిర్విరామకృషితో దేశాభ్యుదయానికి, తెలంగాణ పారిశ్రామికరంగానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించటంలో కృషిచేస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డైనమిక్ యంగ్ లీడర్ కేటీఆర్‌కు మనమంతా మద్దతునిచ్చి ప్రోత్సహించి మరోమారు తెలంగాణలో బీఆర్ఎస్కు అవకాశం వచ్చేలా చేయవలసిన అవసరం ఉన్నది. సంకుచిత జాతీయ పార్టీలను, తెలంగాణాభివృద్ధిని నిర్వీర్యం చేస్తున్న తెలంగాణ వ్యతిరేకశక్తులను తరిమికొట్టి డిపాజిట్ గల్లంతయ్యేలా జాగరూకతగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ఇదే నేటి రాష్ట్ర పౌరుల విధి, ఎన్నికల్లో అత్యధికంగా ఓటింగ్‌లో పాల్గొని ప్రగతిని కాంక్షించే పార్టీకి మద్దతునివ్వటం పౌరులుగా మన బాధ్యత.
డాక్టర్ అనభేరి రాజేశ్వర్‌రావు
77022 97068