పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీం కోర్టు విధించిన మూడు నెలల కౌంట్‌డౌన్ ఆగస్టు 1 నుంచి ప్రారంభమైంది. సదరు సభ్యులకు ఇటీవల స్పీకర్ నోటీసులు జారీచేశారు. పొంచి ఉన్న అనర్హత వేటును తప్పించుకోవడానికి 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు సరికొత్త నాటకాలకు తెరలేపుతున్నారు. డొంక తిరుగుడు సమాధానాలతో తప్పించుకోవాలని చూస్తున్నారు. కానీ, వారిపై అనర్హత వేటు ఖాయమని ప్రజలు భావిస్తున్నారు.
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించడంలో, ప్రజాస్వామ్య సంప్రదాయాలను పాతాళానికి తొక్కడంలో ఆరితేరిన కాంగ్రె స్ తెలంగాణలో పచ్చి అబద్ధాలకు తెగబడుతున్నది. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయమై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో బీఆర్ఎస్ తొలుత హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్పీకర్ తన విచక్షణాధికారాలతో నిరవధిక కాలయాపన చేయడానికి వీల్లేదని, నిర్ణయాన్ని ఒక నియమిత కాల పరిధిలో ప్రకటించాల్సి ఉంటుందని, ఫిరాయింపు వ్యవహారం మూడు నెలల్లో తేల్చాలని సుప్రీం ఆదేశించింది. పర్యవసానంగా ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. దాంతో అసలు కథ రసకందాయంలో పడింది. ఆ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరి కండువాలు కప్పుకొన్న దృశ్యాలను ప్రజలు చూశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ వేదికలపై వారు ప్రత్యక్షమయ్యారు. కరడుగట్టిన కాంగ్రెస్ నాయకులను తలదన్నేలా కాంగ్రెస్ అధిష్ఠానం పట్ల వినయ, విధేయతలు ప్రదర్శించారు. ఈ తతంగమంతా చూస్తున్న ప్రజలు వారంతా కాంగ్రెస్‌లో చేరారని నిర్ధారణకు ఎప్పుడో వచ్చారు. కానీ, ఫిరాయింపు ఎమ్మెల్యేలు నోటీసులు అందుకున్న తర్వాత బీఆర్ఎస్లోనే ఉన్నామని బుకాయిస్తూ నయవంచనకు పాల్పడుతున్నారు.
ఏం కాదులే అనుకున్న ఎమ్మెల్యేలంతా వ్యవహారం న్యాయస్థానాల దాకా వెళ్లడంతో మాట మార్చడం మొదలుపెట్టారు. ‘తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిశాం’ అని, ‘కప్పింది కాంగ్రెస్ కండువా కాదు శేష వస్త్రం’ అని, ‘కప్పింది జాతీయజెండా’ అని, ‘ముఖ్యమంత్రి కండువా కప్పితే కాదనగలమా’ అని, ‘అనుమతి లేకుండా కాంగ్రెస్ పార్టీ తన ఫొటోలు ఫ్లెక్సీల్లో పెట్టినందుకు పోలీస్ కైంప్లెంట్ కూడా ఇచ్చాం’ అని, ఏ పార్టీలో ఉన్నారని మీడియా అడిగితే ‘ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నాను’ అని, ‘తమ ఇంట్లో కేసీఆర్ ఫొటో ఉంది’ అని ఇలా రకరకాల పిల్లిమొగ్గలు వేస్తూ సభ్య సమాజాన్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. పదవి నిలుపుకోవాలన్న వారి తాపత్రయం వెనుక భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఇంతకాలం ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లోని తమ ఖాతాల్లో దర్జాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కండువా కప్పుతున్న ఫొటోలు, వీడియోలను పెట్టుకున్న వీరు ఆదరా బాదరాగా ఇప్పుడు వాటిని తొలగిస్తున్నారు. అసెంబ్లీ లెక్కల్లో బీఆర్ఎస్ సభ్యులు 38గా నమోదైందని, తమ జీతాల నుంచి నెలకు రూ. 5 వేల చొప్పున బీఆర్ఎస్ ఖాతాలో జమవుతున్నాయని మరో కొత్తవాదన ముందుకుతెచ్చారు. ఇంకా నయం ‘మా ఇంట్లో గులాబీ మొక్కలున్నాయి కాబట్టి, మేం బీఆర్ఎస్’ అని, ‘కార్లలో తిరుగుతున్నాం కాబట్టి మాది కారు గుర్తు’ అని అనడం లేదు. ఈ 10 మంది మాత్రమే తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అని చెప్పుకోవడానికి ఇన్ని సర్కస్ ఫీట్లు ఎందుకు చేయాల్సి వస్తుందంటే.. అనర్హత ప్రమాద ఘంటికలు వారి చెవుల్లో మార్మోగుతున్నాయి కాబట్టి.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘ఎవరికి ఏమీ కాదు, ఉప ఎన్నికలు రావు’ అని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చినప్పుడే, అవును వారంతా మా పార్టీలో చేరారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ ధ్రువీకరించినప్పుడే ఫిరాయింపు ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి ఏదో కపట మంత్రాంగం సిద్ధమైనట్టు విదితమైంది. అధినేతలు పాలన గాలికి వదిలేసి అదే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహానికి కేటాయించిన స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని నెలకొల్పి స్వామి భక్తిని చాటుకున్న రేవంత్ నిరంతర రాజీవ్ భజనలో తరిస్తూ ప్రధానిగా అదే రాజీవ్‌గాంధీ తెచ్చిన ఫిరాయింపు నిరోధక చట్టానికి తూట్లు పొడవడం విషాదం. గత అసెంబ్లీ ఎన్నికల సభలో ‘ఫిరాయింపుదారులను రాళ్లతో కొట్టండి మీ వెంట నేనుంటా’ అన్న రేవంత్‌రెడ్డి ఆ మాట మర్చిపోయారనుకోవాలా? రాహుల్‌గాంధీకి ఇదంతా తెలియదనుకోవాలా? లేక ఆయన కూడా తన తండ్రి ఆశయాలను అటకెక్కించారనుకోవాలా? 20 నెలలుగా జరుగుతున్న ఫిరాయింపుల వ్యవహారం వివాదం ఆసాంతం స్పీకర్‌కు తెలిసిందే. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా చరిత్రలో నిలిచిపోతుంది. అయితే అదెలా ఉండబోతున్నదన్నదే శేష ప్రశ్న. ఫిరాయింపుదారులపై స్పీకర్ అనర్హత వేటు వేసినా లేక రాహుల్‌గాంధీ వారిని వెంటనే పదవులకు రాజీనామా చేయాలని ఆదేశించినా కథ సుఖాంతమవుతుంది. గతంలో ఇలాంటి వివాదాలెన్నో తలెత్తినా సుప్రీంకోర్టు కన్నెర్ర చేసేంత తీవ్రస్థాయికి వెళ్లలేదు. రాజ్యాంగవేత్తలు, న్యాయశాస్త్ర కోవిదులు, చట్టసభల సభ్యులు, ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులు వెరసి దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పతాక సన్నివేశం ఇది.
-డాక్టర్ అయాచితం శ్రీధర్
98498 93238