అవును ఇంతకీ గద్దర్ పెహచాన్ ఏమిటి? గుమ్మడి విఠల్‌రావు ఎట్లా గద్దర్ అయ్యిండు.గద్దర్ అస్తిత్వం ఏంది? ప్రస్తుతం నడుస్తున్నది అస్తిత్వాల కాలం కాబట్టి ఇది తెలుసుకోవాల్సిన అంశం. 1970వ దశకం ఆరంభంలో సుప్రసిద్ధ సినీ దర్శకులు బి.నరసింగరావు నేతృత్వంలో ఆల్వాల్‌లోని ‘ఆర్ట్ లవర్స్ అసోసియేషన్’నుంచి ప్రారంభమైన గద్దర్ తన కల, గళ ప్రయాణంలో ‘జన నాట్య మండలి’ ద్వారా ఎర్రజెండాను ఎత్తుకున్నాడు.
1973లో తన తొలి పాటల పుస్తకం ‘వీబీ గద్దర్ పాటలు’ పుస్తకం వెలువడింది. ఎమర్జెన్సీ తర్వాత విప్లవోద్యమంతో మమేకమైండు. చేస్తున్న బ్యాంకు ఉద్యోగాన్ని వదిలి గొంగడి భుజానేసుకొని దేశమంతటా అజ్ఞాతంగా తిరుగుతూ తన మాట, పాట, ఆట ద్వారా జనహృదయాల్లో స్థానం సంపాదించుకున్నడు. మావోయిస్టు సిద్ధాంతాన్ని నమ్మి, ఆచరించి ఉద్యమానికి ఊపిరులూదిండు. ఇంకా చెప్పాలంటే ‘జాలిమ్ కౌన్‌రే, ఉస్ కా జులుమ్ క్యా హైరే’ అంటూ దేశమంతటా విప్లవ భావజాలాన్ని వ్యాప్తిజేసిండు. ఆ ఉద్యమంలో ఉంటూనే దళితులపై మారణకాండకు కారణమైన కారంచేడు, చుండూరు సంఘటనలకు వ్యతిరేకంగా ‘దళిత పులులమ్మా’ అంటూ పాటలు పాడిండు. అయితే పక్కా బహుజన కాన్సెప్ట్‌తో పనిచేస్తున్న కాన్షీరామ్ నాడే ‘దళితులు’ నిజంగానే పులులైతే ఇట్లా వేటాడబడేవారు కారన్నాడు. ఇది నిజంగా మావోయిస్టులతో కలిసి నడుస్తున్న ‘దళితుల’కు హెచ్చరిక లాంటిది. ఈ హెచ్చరిక బాగానే పనిచేసిందని చెప్పవచ్చు. లేకుంటే శివసాగర్ లాంటివాళ్లు పార్టీని ప్రశ్నించేవారు కాదు. బయటికొచ్చేవారు కాదు. ఈ హెచ్చరిక గద్దర్‌పై కొంచెం ఆలస్యంగా ప్రభావం చూపించింది.
మరోవైపు పీపుల్స్‌వార్/ మావోయిస్టు పార్టీ జనసభ పేరిట తెలంగాణ డిమాండ్‌ను ముందుకు తీసుకువచ్చినపుడు అందులో ముందువరుసలో ఉండి తన పాట, ఆటను అంతర్లీనం చేసిండు. భువనగిరి, సూర్యాపేట, వరంగల్, హైదరాబాద్ ఇట్లా జనసభ ఎక్కడ తెలంగాణ సభలు ఏర్పాటుచేసినా ఇక్కడి ప్రజల గాయాలను గేయాలు చేసిండు. పాడి వినిపించి కార్యోన్ముఖులను చేసిండు. మావోయిస్టులతో మమేకమైనందుకు చంద్రబాబునాయుడు పాలనలో ముసుగు పోలీసులు ‘గ్రీన్ టైగర్స్’ ఆయన బాడీలో 1997 ఏప్రిల్ 6న తుపాకీ తూటాలు దింపిండ్రు. 25 ఏండ్లకు పైగా తూటాను బాడీలో మోసిండు. అట్లా తూటాను మోస్తూనే తెలంగాణ కోసం ఆయన ఎక్కని వేదిక లేదు. మొక్కని గడప లేదు. ‘పోరు తెలంగాణ’మైండు. ‘అమ్మా.. తెలంగాణమా’ అని గానమైండు ‘పొడుస్తున్న పొద్ద’యిండు. తెలంగాణ ప్రజాఫ్రంట్ చైర్మన్‌గా ఊరూరా తిరిగిండు. మూలకున్న చీపురు మొదలు ఢిల్లీలో రాజ్యాధికారం వరకు కొన్ని వేల పాటలు ఆయన కలం నుంచి జాలువారినయి. ‘ప్రజాకవి’గా తెలంగాణ ఉద్యమంతో పాటు దళితోద్యమాలతోనూ మమేకమైండు. ఎస్సీ వర్గీకరణను సమర్థించినా మాలలకు వ్యతిరేకంగా లేడు. భాగ్యరెడ్డి వర్మకు సముచితమైన స్థానం దక్కలేదు. అందుకు కొట్లాడాలే అనేటోడు. సస్తే మాలల శ్మశానం కూడా వేరే ఉంటుదనేటోడు.
ఇదే దశలో గద్దర్ కూడా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి క్రమంగా దళిత ఉద్యమాలవైపు వచ్చిండు. అట్లా సొంత గొంతుకను వినిపించినందుకు ఆయన పీపుల్స్‌వార్/ మావోయిస్టు పార్టీకి దూరమైండు. నిజానికిది ఆయనకు స్వేచ్ఛనిచ్చింది. పంజరం నుంచి విడిచిన పక్షిలాగా తాను అనుకున్నది ఆచరించిండు. కొత్తగా బుద్ధిజం, పూలే, అంబేద్కర్‌ను చదువుకున్నడు. కడసారి వరకు కర్రకు బుద్ధిజానికి సూచనగా రంగుల జెండా కట్టుకొని తిరిగిండు. ఇక నా బాట ‘అంబేద్కర్ మార్గమే’ అని కరాకండిగా తేల్చిచెప్పిండు. ఎన్నికల్లో పోటీ చేయాలని, పార్టీ పెట్టాలని కూడా ఆలోచించిండు. అంతేకాదు, ఆధ్యాత్మికం వైపు మళ్లీ రామానుజ విగ్రహం దగ్గర ఆయన అంటరానితనం గురించి, యాదగిరిగుట్టలో నరసింహస్వామి సమక్షంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీర్చిదిద్దిన గుడి గురించి పాడిండు. ఇంద్రకీలాద్రి మొదలు భద్రకాళి వరకు అనేక గుళ్లకు తిరిగిండు. ఇట్లా గద్దర్‌కు బహుముఖ అస్తిత్వాలున్నాయి. కానీ అన్ని అస్తిత్వాలు కనుమరుగై ఒక్క మావోయిస్టు అస్తిత్వమే మిగలాలని కొందరు కోరుకుంటున్నారు. మరికొందరు ఒక్క తెలంగాణ అస్తిత్వమే మిగిలి మిగిలినవన్నీ రద్దుకావాలని కోరుకుంటున్నారు. ఈ కోరికలకు అనుగుణంగా మావోయిస్టు సానుభూతిపరులు లేదా తెలంగాణ ప్రభుత్వ శుద్ధ వ్యతిరేకులు గద్దర్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడాన్ని తప్పుపడుతున్నారు.
గద్దర్ చనిపోయిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరపాలని డిమాండ్ చేసినవారిలో నేనూ ఉన్నాను. దానికి కొందరు కాంగ్రెస్ వాదులు ఆ క్రెడిట్ బీఆర్ఎస్కు దక్కకుండా తుపాకీ తూటాలు దించిన పోలీసులే ఆయనకు గన్ సెల్యూట్ ఇవ్వడం కుదరదన్నారు. మరోవైపు మావోయిస్టు సానుభూతిపరులు ప్రజల మనిషిని ప్రభుత్వం పరంచేస్తే ఎట్లా అని దీర్ఘాలు తీస్తున్నారు. అవును గద్దర్ ప్రజల మనిషి కాబట్టే ఆయనకు ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని కోరుకున్న. ఆయన నిఖార్సయిన తెలంగాణ వాది. అంతిమంగా అంబేద్కరిజమే తన గమనం, గమ్యం అని తేల్చిచెప్పిండు. నడిచొచ్చిన తొవ్వ ముండ్లదారి అని తెలుసుకున్నడు. గద్దర్‌కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయవద్దనే పెద్దలు ఆయనను అయితే గియితే మా మావోయిస్టు శిబిరంలో కట్టెయాలె తప్ప. పలుపు లేకుండా ఎట్లా వదిలిపెడుతామన్నట్టుగా మాట్లాడుతున్నారు. వీళ్లే లేదా వీళ్లలో కొందరు ఈ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ప్రభుత్వం చేయకపోయి ఉంటే, దళితుడు కాబట్టే ఆయన్ని అగౌరవపరిచింది. రాజ్యసభలో తెలంగాణను వ్యతిరేకించిన హరికృష్ణకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపి నిఖార్సయిన తెలంగాణవాదికి నిరాకరించారని చెప్పేవారు. ఇది రెండు నాలుకల ధోరణి. నిజానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనది. ఇప్పటికీ ఎక్కడెక్కడో కుట్రకేసులు నమోదై ఉన్న సందర్భంలో ఈ అధికారిక అంత్యక్రియలు జరిగాయని గుర్తించాలి.
ఇంకా చెప్పాలంటే ఎటువంటి గుర్తింపునకు, శాశ్వత గౌరవానికి నోచుకోకుండా చనిపోయిన శివసాగర్, వంగపండు ప్రసాదరావు సరసన గద్దర్‌ను చేర్చి నివాళి అర్పించి ఆయన్ని మరిచిపోదామనుకున్న వారికి ఈ అధికారిక అంత్యక్రియలు పెద్దగా మింగుడు పడుతలేదు. శవాల మీద పేలాలేరుకునే రాజకీయాలను సోషల్ మీడియాలో వండి వారుస్తున్నారు. చావు కాలంలో వివిధ రాజకీయ నాయకులు నవ్వుతూ గద్దర్‌కు నివాళులర్పిస్తున్న ఫొటోలే ఇందుకు నిదర్శనం.
నిజానికి గద్దర్ అభిమానులుగా విర్రవీగే వారందరూ ఇప్పటివరకు ఆయన రాసిన పాటలన్నింటిని సమగ్ర సంకలనంగా ఒక్క దగ్గరికి ఎందుకు తీసుకురాలేకపోయిండ్రో చెప్పాలి. ఇప్పటికైనా ఈ బీరాలు పలికే శూరులు ఆయన సమగ్ర కవిత్వం/ పాటలు అచ్చువేయాలి. ఆయన గురించి ఎన్నడూ మంచి చెడ్డలు పట్టించుకోనివారు, ఆపదలో ఆయనకు అణాపైసా సహాయం చెయ్యని మారాజులు దేశ, విదేశాల్లో ఉండి సుద్దులు చెప్తున్నారు. వాళ్లందరికీ జోహార్లు.
ఇట్లా ఏది పడితే అది? నోటికి ఎంతొస్తే అంత నిందలు మాట్లాడే వారందరూ అబ్బురపడే విధంగా గద్దర్ సమగ్ర పాటలను తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించాలి. అట్లాగే ఏటా ఆయన జయంతి రోజున ఒక ‘తెలంగాణ ప్రజాకవి’కి గద్దర్ పురస్కారాన్ని ప్రభుత్వమే ప్రకటించి, ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలి. తెలంగాణ సంస్కృతిని నిలబెట్టే ఒక కట్టడానికి ఆయన పేరుంచాలి. లౌక్యం, లౌల్యం లేకుండా తెలంగాణ త్యాగనిరతిని ఈ తరానికి అందించిన ప్రజా యుద్ధనౌకకు అదే సరైన నివాళి.
201 7 జనవరి 16న ‘నమస్తే తెలంగాణ’తో గద్దర్ పంచుకున్న కొన్ని ముచ్చట్లు..
అమ్మ మాట నిలబెడ్తున్నా..
అమ్మ లచ్చుమమ్మ ఎప్పుడూ చెప్తుండేది.. తెలం గాణలో బిడ్డ పుట్టంగనే నీళ్లు చిలకరిస్తరట. నేను పుట్టిన వెంటనే చల్లిన నీటితో పెద్ద కేకతో ఏడ్సిన్నట. అప్పుడు పెట్టిన కేక.., నేను ఎత్తుకున్న పాటగా.. కొనసాగుతున్నదని అమ్మ అనేది. దాన్ని పానం పొయ్యేదాకా ఆపొద్దని చెప్పేది. అమ్మ మాట నిలబెడ్త. చివరి ఊపిరిదాకా సాంస్కృతిక సైనికునిగా పాటే ప్రాణంగా బతుకుతా.
తిట్టడానికే నోరు కాదు..ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రతిపక్షమంటే.. అధికార పక్షాన్ని తిట్టడమే కాదు. ప్రజల పరంగా మంచి చెడ్డలు మాట్లాడాలె. నోరున్నది తిట్టటానికే కాదు, దీవించటానికి కూడా…
సాంస్కృతిక సైనికుడంటే..
సాంస్కృతిక సైనికుడంటే.. తుపాకీ పట్టుకొని పాటలు పాడటం కాదు. సాయుధ పోరాటమంటే.. యాంత్రికంగా తుపాకులు పట్టుకోవటం కాదు. నిర్దిష్ట సమాజంలో ప్రజలు తమ జీవితాల మార్పుకోసం సమాజాన్ని మార్చుకోక తప్పదని తెలుసుకోవటం. మార్పుకోసం ప్రతి ఒక్కరూ తమదైన పద్ధతిలో ఉద్యమంలో భాగస్వాములవడం. ఈ అర్థంలో సాంస్కృతిక సైనికులు ప్రజల ఆలోచనలను సాయుధం చేయాలి.
మా చేతిల వేసినంకనే వారి నోట్లె..
ఓసారి దండకారణ్యంలో ఆదివాసులకు తీవ్రమైన మలేరియా జ్వరాలు చుట్టుముట్టినై. మేం డాక్టర్లను పిలిపించినం. వారు అవసరమైన మందులు తీసుకొచ్చిం డ్రు. నేరుగా డాక్టర్లు గోలీలిస్తే మింగడానికి బదులు మా ముందే పారేసిండ్రు. డాక్టర్లు తెచ్చిన మందుగోలీలను మొదట వారు మా చేతిలో వేసినంక, మేం వారికిస్తే మింగిండ్రు.
చెట్లకు కాసిన పాములు..
దండకారణ్యంలో ఆదివాసులకు పౌష్టికాహారం కోసం అక్క డ పండ్లతోటలతో పాటు, కూరగాయల తోటలు కూడా ఉద్య మం పెంచింది. ఒకచోట వంకాయ చెట్లు వేసిండ్రు. వాటికి మూరెడు పొడవైన గంజివంకాయలు కాసినై. వాటిని చూసి చెట్లకు పాములు కాసినై అని భయపడి గిరిజనులంతా ఊరిడిసి పారిపోయిండ్రు. విషయం తెలుసుకుంటే.. చెట్లకు పాముల కథ చెప్పిండ్రు. మేం ఆ వంకాయలను తెంపి, కోసి కూర వం డినం. వండిన తర్వాత దాన్ని మా పల్లెంలో వేసుకుంటుంటే.. ఆదివాసులు అడ్డుకున్నరు.. ఆ వంకాయ కూరను తమ గిన్నెల్లో వేసుకున్నరు..!
-డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్
98492 20321