మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’, కాంగ్రెస్ నాయకత్వంలోని ‘మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)’ కూటముల రాజకీయాలు కులాల చుట్టే తిరుగుతున్నాయి. ప్రత్యర్థి పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న సామాజికవర్గానికి వ్యతిరేకంగా ఉండే ఇతర కులాల ఓట్ల సమీకరణపై పార్టీలు దృష్టి సారించాయి. రాష్ట్రంలో రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న ఓబీసీ, మరాఠా సామాజిక వర్గాల కటాక్షం కోసం పార్టీలు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి.
హర్యానాలో జాట్ సామాజికవర్గం బీజేపీకి వ్యతిరేకంగా ఉండటంతో ఇటీవల జరిగిన ఆ రాష్ట్ర ఎన్నికల్లో కమలం పార్టీకి ఓటమి తప్పదని అందరూ భావించారు. కానీ, జాట్లకు వ్యతిరేకంగా ఓబీసీ సామాజికవర్గాన్ని ఏకం చేసిన బీజేపీ అనూహ్య విజయం సాధించింది. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములాను బీజేపీ ప్రయోగిస్తున్నది. 30 శాతానికిపైగా ఉన్న మరాఠాలు మరాఠా రిజర్వేషన్ల కోసం డిమాం డ్ చేస్తూ ఉద్యమాన్ని తెరపైకి తీసుకురావడంతో రాష్ట్ర రాజకీయాల్లో పలు మార్పులు సంభవించాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై హామీ ఇచ్చిన బీజేపీ మాట తప్పడంతో ఆగ్రహించిన వారు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని ఆదరించారు. దీంతో మరాఠాలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో 50 శాతానికిపైగా ఉన్న ఓబీసీ సామాజికవర్గం ఓట్లను గంపగుత్తగా దక్కించుకునేందుకు బీజేపీ విఫల యత్నం చేస్తున్నది.
రాష్ట్రంలో బీజేపీకి మొదటి నుంచి ఓబీసీల్లో ఆదరణ ఉన్నది. ‘మాధవ్’ ఫార్ములాతో ఓబీసీ సామాజికవర్గంలో అధికం గా ఉన్న మాలి, ధన్గర్, వంజరీ కులాల పై దృష్టిపెట్టిన బీజేపీ వారికి చేరువైంది. 2009 అసెంబ్లీ ఎన్నికల నుంచి 2024 పార్లమెంట్ వరకు ఓబీసీల ఓట్ల ను అత్యధికంగా దక్కించుకున్న బీజేపీ తన పట్టు ఇంకా సడలలేదని నిరూపించుకున్నది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారిపైనే భారీగా ఆశలు పెట్టుకున్నది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 స్థానాలకు గానూ మహాయుతి కూటమి 17 స్థానాల్లోనే గెలిచిన నేపథ్యం లో, ప్రత్యేకించి కమలం పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగానే సన్నాహక చర్యలు ప్రారంభించినట్టు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తున్న ‘పీపుల్స్ పల్స్’ బృందం గ్రహించింది. అందులో భాగంగా 175కు పైగా నియోజకవర్గాల్లో పెద్దఎత్తున మైక్రో ఓబీసీ మేనేజ్మెంట్ కార్యక్రమాలను బీజేపీ చేపట్టింది. ఓబీసీలోని మరిన్ని కులాలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఏడు కొత్త కులాలను ఓబీసీ జాబితాలో చేర్చడమే కాకుండా, క్రీమీలేయర్ సీలింగ్‌ను రూ.8 లక్షల నుం చి రూ.12 లక్షలకు పెంచింది. దీంతో లోధా, బడా గుజ్జర్, సుర్యవంశీ గుజ్జర్, దన్గరీ, రేవ్ గుజ్జర్, మున్నూర్ కాపు, తెలంగి కులాలకు లబ్ధి చేకూరింది.
దీంతో రాష్ట్ర రాజకీయాలు మరాఠా వర్సెస్ ఓబీసీలుగా మారాయి. అందుకు 62 స్థానాలున్న విదర్భనే ఉదాహరణ. ఈ ప్రాంతంలో కుంభి, దళిత, ముస్లిం ఓటు బ్యాంక్‌పై ఎంవీఏ ఆశలు పెట్టుకోగా.. తేలి, బంజార, బోవిర్, కోమిటి, సానార్, గోండ్లతో పాటు 24 ఓబీసీ కులాల ఓట్లపై మహాయుతి భరోసాతో ఉన్నది.
అయితే, ఓబీసీల్లోని అన్ని కులాల ఓట్లు బీజేపీకే పడే అవకాశాలు శూన్యం. ఎస్టీ హోదా ఇస్తామన్న మాట తప్పడం తో ఓబీసీలోని ధన్గర్ కులం బీజేపీపై గుర్రుగా ఉన్నది. విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉం డవచ్చు. ఓబీసీల్లో కుంబీలు, హిందూ యేతర సామాజికవర్గాలు బీజేపీకి సహకరిస్తాయా? అన్నది కూడా సందేహమే.
ప్రస్తుత పరిస్థితుల్లో మహా రాష్ట్రలో మరాఠా, ఓబీసీ ఓట్లు ఒకే కూటమికి పడే అవకాశాలు చాలా తక్కువ. మరాఠా ఉద్యమంతో ఇతర కులాలు వారిపై గుర్రుగా ఉన్నాయి. మరోవైపు ఎస్టీలో చేర్చాలని ధన్గర్ సామాజికవర్గం డిమాండ్ చేస్తుండగా, ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఒకరి మద్దతు తీసుకుంటే మరో వర్గం దూరమవుతుందనే ఆందోళన అన్ని పార్టీల్లోనూ నెలకొన్నది.
హిందూత్వ ఓటుబ్యాంక్‌పై ఆశలు పెట్టుకున్న బీజేపీ బ్రాహ్మణులు, రాజ్‌పుత్‌లు, లింగాయత్‌లు, అగారీలను ఏకం చేస్తుండగా.. దళితులు, ముస్లింలు, గిరిజనులపై కాంగ్రెస్ ఆధారపడుతున్నది. దీం తో పాటు బీజేపీపై ఆగ్రహంగా ఉన్న ఓబీసీలోని కొన్ని వర్గాలను, మరాఠాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఎంవీఏ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో నవంబర్ 20న జరుగనున్న ఎన్నికలపై ఆసక్తి నెలకొన్నది. ఈ ‘మహా’ సంగ్రామంలో సామాజికవర్గాలు, ప్రధానంగా మరాఠాలు, ఓబీసీలు ఎవరిని ఆదరిస్తాయన్నది నవంబర్ 23న వెలువడనున్న ఫలితాల్లో స్పష్టం కానున్నది.
(వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకులు, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ)
– ఐవీ మురళీకృష్ణ శర్మ