భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించే నాటికి దేశ పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. పేదరికం, ఆకలి, అవిద్య, అనారోగ్యాలు.. ఇట్లా ఏ ప్రజా జీవనరంగం తీసుకున్నా చాలా వెనుకబడి ఉన్న స్థితి. 70 శాతం జనాభా వ్యవసాయరంగం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయరంగాన్ని మొదట గాడిలో పెడితే తప్ప ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించలేమని ప్రధానమంత్రి నెహ్రూకు అవగాహన ఉన్నది. అందుకే తొలి మూడు పంచవర్ష ప్రణాళికల్లో ఆయన సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యాన్నిచ్చాడు. దేశవ్యాప్తంగా ప్రధాన నదులపై భారీ మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణానికి పునాదులు వేశాడు. భాక్రానంగల్, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, హీరాకుడ్, దామోదర్‌వ్యాలీ… తదితర ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రోత్సాహకాలు అందించాడు. వీటిని ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించాడు. ఈ ప్రాజెక్టులన్నీ నిర్మాణం పూర్తిచేసుకొని సాగునీరు అందించడంతో 1975 నాటికల్లా దేశం ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి దేశంలో సరిగ్గా ఇటువంటి పరిస్థితులే నెలకొని ఉండేవి. ఒక స్పష్టమైన విజన్‌తో సాగునీటి వసతుల కల్పనతో పదేండ్లలో వ్యవసాయరంగంలో ఒక అనూహ్యమైన మార్పు సాధ్యమైంది.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సాగునీటిరంగంలో గుణాత్మకమైన అభివృద్ధి నమోదైంది. వాటి ఫలితాలు తెలంగాణ ప్రజల అనుభవంలోకి వచ్చాయి. ప్రధానమంత్రి నెహ్రూలాగానే హరిత తెలంగాణ నిర్మాణంలో సాగునీటి కల్పనే ప్రధాన చోదక శక్తి అని కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సాగునీటి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రణాళికలు తయారు చేసుకున్నది. వృథాగా సముద్రం పాలవుతున్న గోదావరి, కృష్ణా జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించడానికి చర్యలు తీసుకున్నది. రాష్ట్రం మొత్తంలో సుమారు 125 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని, రాజకీయాలకతీతంగా అన్ని గ్రా మీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సకల మార్గాల ద్వారా కనీసం కోటి ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలిగించాలని సంకల్పించింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం బహుళ అంచెల వ్యూహాన్ని అనుసరించింది.
1. తెలంగాణ గ్రామీణ సామాజిక ఆర్థిక వ్యవస్థకు అనాది ఆధారాలుగా ఉన్న చెరువులను దశలవారీగా పునరుద్ధరించడం. 2. గత ప్రభుత్వాలు ప్రారంభించి అనేక కారణాల వల్ల పూర్తికాకుండా పెండింగ్‌లో పడిపోయిన ప్రాజెక్టులను పూర్తిచేసుకోవడం, వాటిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి, ఇందిరమ్మ వరద కాలువ, రాజీవ్ దుమ్ముగూడెం ఇందిరా రుద్రంకోట ఎత్తిపోతల పథకాలు, దేవాదుల, కాంతనపల్లి ప్రాజెక్టులను, శ్రీరాంసాగర్ వరద కాలువ తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీ ఇంజినీరింగ్ చేసుకొని పూర్తిచేసుకోవడం. 3. గత ప్రభుత్వాలు ఆమోదించి అటకెక్కించిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను సమీక్షించి తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీ ఇంజినీరింగ్ చేసుకోవడం, ఈ ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసి నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించడం. 4.గత ప్రభుత్వాల కాలంలో నిధులు లేక, నిర్వహణ లేక నిర్లక్ష్యానికి గురికాబడి శిథిలమైపోయిన పాత సాగునీటి ప్రాజెక్టుల కాలువల వ్యవస్థను ఆధునికీకరించి పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించడం. 5. వాగుల పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉపనదులు, పెద్ద వాగులపై చెక్‌డ్యాంల నిర్మాణం, చెరువులను మేజర్, మీడి యం ప్రాజెక్టుల కాల్వలతో అనుసంధానం చేయడం.
గడిచిన పదేండ్ల కాలంలో ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా వ్యవసాయ రంగంలో పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగిపోయి రాష్ట్ర జీడీపీ పెరుగుదలకు దోహదం చేసింది. సాగునీటి సౌకర్యాల కల్పనతో పాటు రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంటు, రైతు భరోసా, రైతు బీమా, పంటల కొనుగోళ్లకు పటిష్ఠమైన మార్కెటింగ్ వ్యవస్థ, పంటలకు గిట్టుబాటు ధరలు, సమయానికి ఎరువుల సరఫరా… ఇట్లా వ్యవసాయ రంగానికి అన్నిరకాల ప్రోత్సాహం లభించడంతో వ్యవసాయరంగం నుంచి ఆదాయం పొందే రాష్ర్టాలలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ రాష్ర్టాన్ని అధిగమించింది. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల తరబడి కొనసాగిన వ్యవసాయ సంక్షోభం సమసిపోయింది. రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిపోయాయని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో వారి గణాంకాలు తేల్చాయి. గ్రామాలలోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పట్టణాలకు, ఇతర రాష్ర్టాలకు ప్రజల వలసలు తగ్గిపోయాయి. వలసపోయిన ప్రజలు తిరిగి గ్రామాలకు చేరుకున్నారు.
తెలంగాణలో వ్యవసాయం దండుగ అన్న స్థితి నుంచి వ్యవసాయం పండుగ అన్న స్థితికి ఎదిగింది. ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రతీఘాత శక్తులు ఎన్ని అడ్డంకులు కల్పించినా వాటిని అధిగమించి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేసింది. వాటి ఫలితాలు వ్యవసాయం, తాగునీరు, పశువుల పెంపకం, మత్స్య పరిశ్రమ, ఉద్యానవనాలు, పర్యాటకం, అటవీ పర్యావరణ పునరుద్ధరణ తదితర అనుబంధ రంగాలలో ప్రతిఫలిస్తున్నది. మొత్తంగా రాష్ట్ర ఆర్థిక, సామాజిక వికాసానికి దోహదం చేస్తున్నది.
ఈ ఉజ్వల ప్రస్థానానికి 2023 డిసెంబర్లో జరిగిన అధికార మార్పిడి తర్వాత ఒక్కసారిగా బ్రేక్ పడింది. గత ప్రభుత్వం పూర్తిచేసిన ప్రాజెక్టుల నిర్వాహణ కుంటుపడింది. చెరువులు, చెక్‌డ్యాంల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్టుల పురోగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మిగిలిపోయింది. పాలమూరు- రంగారెడ్డి, డిండి, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులో పురోగతి శూన్యం. ప్రకృతి వైపరీత్యం వల్లనో, కుట్రల వల్లనో కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ రెండేండ్లు అయినా ముందుకుసాగలేదు. ఈ కాలమంతా విచారణల పేరుతో ప్రస్తుత ప్రభుత్వం కాలయాపన చేసిందే తప్ప పునరుద్ధరణకు పక్కా చర్యలు తీసుకున్నది లేదు. తుమ్మిడిహట్టి బ్యారేజీ కట్టి తీరుతామని, గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీరు తరలిస్తామని, ఎన్నికలకు ముందు, అధికారం చేపట్టిన తర్వాత కూడా ప్రభుత్వ పెద్దలు అనేకసార్లు ప్రకటనలు చేశారు తప్ప బ్యారేజీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. వీటి సంగతులు మరింత వివరంగా విశ్లేషిద్దాం.
గత ప్రభుత్వం సాగునీటిరంగంలో సాధించిన అభివృద్ధినైనా కాపాడుకోగలిగితే అదే పది వేలు. ఈ రెండేండ్లలో సాగునీటి రంగంలో పురోగతి ఏమీ లేకపోగా వ్యవస్థలన్నీ ఆగమైపోతున్నట్టుగా స్పష్టమవుతున్నది. కృష్ణా జలాల్లో ఆంధ్రా నీటి దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నది. మొక్కుబడి లేఖలు తప్ప అడ్డుకునేవారు లేరు. 2023 నవంబర్ 29న పోలింగ్ రోజున ఆంధ్రా ప్రభుత్వం సాయుధ బలగాలతో డ్యాంను అక్రమంగా ఆక్రమించిన నాగార్జునసాగర్ డ్యాం ఇంకా తెలంగాణ స్వాధీనంలోకి రాలేదు. ప్రశ్నించవలసిన పౌరసమాజం మాత్రం మౌనం వహిస్తున్నది.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు: ఉమ్మడి రాష్ట్రంలో ఆమోదం ఉన్నప్పటికీ అటకెక్కిన ఈ ప్రాజెక్టు దస్ర్తాన్ని కేసీఆర్ ప్రభుత్వం కిందకు దించి దుమ్ము దులిపి తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీ ఇంజినీరింగ్ చేసి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. 90 టీఎంసీల నీటి వినియోగంతో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, వెయ్యికి పైగా గ్రామాలకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రాజెక్టు పనులు ప్రారంభమైనాయి. ప్రాజెక్టు పనులను ఆపడానికి దుష్టశక్తులు కోర్టుల్లో కేసులు వేశాయి.
ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి పొందకుండానే పనులు చేపట్టారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేసి స్టే ఆర్డర్ తీసుకొచ్చినారు. ప్రభుత్వం వ్యూహాత్మకంగా ప్రస్తుతం తాగునీటి కాంపోనెంట్ మాత్రమే చేపడుతున్నామని, పర్యావరణ అనుమతి పొందిన తర్వాతనే సాగునీటి కాంపోనెంట్ పనులు చేపడుతామని కోర్టుకు హామీ ఇచ్చి అనుమతి పొందింది. కాళేశ్వరం కార్పొరేషన్లో ప్రాజెక్టును చేర్చి నిధులు సమకూర్చింది. 2023, డిసెంబర్ నాటికి ప్రాజెక్టులో హెడ్‌వర్క్స్ దాదాపు 90 శాతం పూర్తిచేసింది. నార్లాపూర్ పంప్‌హౌజ్‌లో ఒక పంపును నడిపి ఏదుల జలాశయానికి నీటిని ఎత్తిపోసి ప్రాజెక్టు నుంచి నీరు వస్తుందన్న భరోసాను రైతాంగానికి ఇచ్చింది.
కోర్టుకు హామీ ఇచ్చినట్టు సాగునీటి పనులు చేపట్టాలంటే పర్యావరణ అనుమతులు సాధించాలి. అందుకు వీలుగా ప్రాజెక్టుకు 90 టీఎంసీల నికరజలాలను కేటాయిస్తూ జీవో జారీ చేసింది. డీపీఆర్ తయారుచేయించి కేంద్ర ప్రభుత్వానికి అనుమతుల కోసం పంపించింది. 2023, డిసెంబర్ నాటికి 7 కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనుమతులు జారీ చేశాయి. అందులో అతి ముఖ్యమైనది కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ నిపుణుల కమిటీ (ఈఏసీ) సిఫారసు. ఈఏసీ సిఫారసు ఉంటే పర్యావరణ అనుమతి జారీ చేయడం లాంచనమే. అయితే అధికార మార్పిడి జరిగిన వెంటనే కేంద్ర జలసంఘం 90 టీఎంసీల నీటి కేటాయింపులు చెల్లవని, అది ట్రిబ్యునల్ పరిధిలో ఉన్నదని సాకులు చెప్పి డీపీఆర్‌ను వాపస్ చేసింది.
ప్రాజెక్టుకు హైడ్రాలజీ అనుమతి లేదన్న సాకుతో పర్యావరణ అనుమతి ప్రక్రియ కూడా ఆగిపోయింది. దీనివెనుక చంద్రబాబు హస్తం ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టుపై మొదటి నుంచి కిరికిరి పెట్టిందే చంద్రబాబు ప్రభుత్వం. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని ఒత్తిడి పెట్టి పర్యావరణ అనుమతులు సాధించి కాలువల తవ్వకం పనులు చేపట్టాల్సింది పోయి ఇప్పుడు నీటి కేటాయింపులను 45 టీఎంసీలకు తగ్గిస్తాం అనుమతించండని ప్రాధేయపడుతున్నట్టు సమాచారం. ఇదే జరిగితే ప్రాజెక్టు ప్రయోజనాలు సగానికి తగ్గిపోతాయి. డిండి ఎత్తిపోతల పథకానికి నీరందే పరిస్థితి ఉండదు. అధికార మార్పిడి తర్వాత ప్రాజెక్టు పరిస్థితి ఇది. ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టయింది.
తుమ్మిడిహట్టి బ్యారేజీ: తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఉంటే గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాణహిత నీటిని తరలించగలిగేవాళ్లం. గ్రావిటీ ప్రాజెక్టును వదిలి కమీషన్ల కోసం బ్యారేజీని మేడిగడ్డకు తరలించి మూడు అదనపు లిఫ్ట్‌లు పెట్టారని గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశారు. అంతేకాదు, తాము అధికారంలోకి వస్తే తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించి గ్రావిటీ ద్వారా నీటిని ఎల్లంపల్లికి తరలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచాయి. బ్యారేజీ వద్ద తట్టెడు మట్టి తవ్వలేదు. గ్రావిటీ కాలువా తవ్వలేదు. ఇప్పుడేమో బ్యారేజీని 152 మీటర్లకు బదులు 150 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో నిర్మించి సుందిళ్ల బ్యారేజీకి నీటిని తరలిస్తామంటున్నారు. కాళేశ్వరం కూలిపోయిందంటున్న వారికి సుందిళ్ల బ్యారేజీ కాళేశ్వరంలో భాగం అని తెల్వదా?
సుందిళ్ల బాగుంటే అదేరకమైన డిజైన్‌తో నిర్మించిన అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు ఏం పాపం చేశాయి? 85 పిల్లర్లున్న మేడిగడ్డ బ్యారేజీలో కుంగినవి మూడు మాత్రమే. అన్నారం బ్యారేజీ సుందిళ్ల లెక్క సురక్షితంగా ఉన్నది. మేడిగడ్డను రిపేర్ చేసి ఉంటే మూడు బ్యారేజీలు ఇప్పటికే వినియోగంలోకి వచ్చి ఉండేవి. రెండేండ్లలో అటు తుమ్మిడిహట్టి కట్టలేదు. ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు నీరందివ్వలేదు. ఇటు మేడిగడ్డను రిపేర్ చేయలేదు. 150 మీటర్ల వద్ద తుమ్మిడిహట్టి బ్యారేజీని నిర్మిస్తామంటున్నారు. మరి ఈ ఎత్తుకు మహారాష్ట్రతో ఒప్పందం లేకుండా ముందుకుపోవడం సాధ్యమా? అట్లే బ్యారేజీకి ఎడమవైపున చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉన్నది. దానిలో అడుగుపెట్టాలంటే జాతీయ వన్యప్రాణి బోర్డు నుంచి ముందస్తు అనుమతి పొందాలి. ఈ దిశగా ప్రభుత్వం ఏమైనా ప్రయత్నాలు మొదలుపెట్టిందా?
సీతారామ ఎత్తిపోతల పథకం: ఈ ప్రాజెక్టు పనులు డిసెంబర్ 2023 తర్వాత ఎక్కడికిక్కడే ఆగిపోయినట్టు తెలుస్తున్నది. భూ సేకరణకు నిధులు విడుదల కాకపోవడంతో సత్తుపల్లి లింక్ కాలువ పనులు పూర్తికానే లేదు. ఈ కాలువ పూర్తయితే సుమారు ఒకటిన్నర లక్షల ఎకరాలకు సాగునీరు అంది ఉండేది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే కారణంగా సీతమ్మసాగర్ బ్యారేజీ పనులు ఆగిపోయాయి. ఈ రెండేండ్లలో జరిగిందేమంటే కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన మూడు పంప్‌హౌజ్‌ల ప్రారంభం మాత్రమే. వెట్న్ మాత్రమే. ఎత్తిపోసిన నీరు పారడానికి కాలువలు మాత్రం లేవు.
చనాఖ-కోరాటా: కేసిఆర్ ప్రభుత్వం పెన్‌గంగా నదిపై బ్యారేజీ నిర్మాణం పూర్తిచేసింది. పంప్‌హౌజ్ నిర్మాణం పూర్తిచేసింది. గ్రావిటీ మెయిన్ పూర్తిచేసింది. అయితే భూ సేకరణకు నిధులు విడుదల కాకపోవడంతో ఉపకాలువల నిర్మాణం ఆగిపోయింది. ప్రాజెక్టు ద్వారా 38 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా బ్యారేజీ, పంప్‌హౌజ్ పూర్తయినా ఒక్క ఎకరానికి నీరందని పరిస్థితి నెలకొన్నది.
కాళేశ్వరం ప్రాజెక్టు: కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ వదిలేసిందో అక్కడే ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. కాలువలు తవ్వి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాల్సిన ప్రభుత్వం అది వదిలేసి విచారణల పేరుతో కాలయాపన చేయడం మనం చూశాం. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు ఎన్డీఎస్ఏ సిఫారసులను అమలు చేయడానికి ప్రభుత్వానికి సమయం చిక్కడం లేదు. పీసీ ఘోష్ కమిషన్ విచారణ కూడా మరో శ్రీకృష్ణ కమిటీ ప్రహసనంగా తేలిపోయింది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నది కనుక ఇక్కడితో వదిలేయడం ఉత్తమం. మరెప్పుడైనా ఈ అంశంపై చర్చ చేయవచ్చు. నిర్మల్ జిల్లా ప్యాకేజీ 27, 28 పనులు ఆగిపోయాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్యాకేజీ 20, 21, 22 ఆగిపోయాయి. కేసీఆర్ హయాంలో ఈ ప్యాకేజిల్లో హెడ్ వర్క్స్ దాదాపు పూర్తయిన దశలో ఉన్నాయి. భూ సేకరణకు నిధులు సమకూరిస్తే ఈ పనులు పూర్తయి సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అంది ఉండేది. అది జరుగలేదు. కాళేశ్వరంలో ఒక్క ఎకరానికి కొత్తగా సాగునీరు అందలేదు.
సదర్మాట్ బ్యారేజీ: నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ వద్ద 1.5 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో సదర్మాట్ బ్యారేజీని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. 95 శాతానికి పైగా పనులు కేసీఆర్ పాలనలోనే పూర్తయ్యాయి. బ్యారేజీకి వెళ్లే రోడ్డు పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. 55 గేట్లు అమర్చడం పూర్తయింది. వెట్న్ టెస్ట్ ప్రోగ్రెస్‌లో ఉన్నది. బ్యారేజీ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. ఇది పూర్తయితే నిర్మల్ జిల్లాలో 13,120 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో మరో 5 వేల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం కలుగనున్నది. 95 శాతం పూర్తయిన ప్రాజెక్టును రెండేండ్లుగా పడావు పెట్టిందీ ప్రభుత్వం.
పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు: పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు తెలంగాణ సమాజం నుంచి, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కూడా ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్రానికి ఫిర్యాదులు చేసింది. అదే సమయంలో కేంద్ర సంస్థలైన కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు, పర్యావరణ మంత్రిత్వ శాఖలు బోలెడన్ని అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖలు రాశాయి. ఇదంతా చూసి చంద్రబాబు ప్రభుత్వం గోదావరి నీటిని కొల్లగొట్టడానికి ప్రాజెక్టు పేరు మార్చి పోలవరం నల్లమల సాగర్ లింక్ అని కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఈ ప్రాజెక్టు డీపీఆర్ తయారీ కోసం టెండర్లు కూడా పిలిచింది.
ఇది కొత్త సీసాలో పాత సారా లాంటిదే. రెండింటి లక్ష్యం ఒక్కటే. గోదావరి జల దోపిడీ. పీబీ లింక్‌లో ఉన్న రెండు స్టేజీల్లో ఏ మార్పు లేదు. 3వ స్టేజీలో బనకచర్లకు నీటిని ఎత్తిపోసే బదులు వెలిగొండ టన్నెల్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నల్లమలసాగర్‌కు ఎత్తిపోయనున్నారు. పీబీ లింక్ వలన ఏర్పడే తెలంగాణ జల హక్కుల విఘాతం ఈ కొత్త ప్రాజెక్టు వల్ల కూడా యథాతథంగా ఉండబోతున్నది. పైగా చంద్రబాబు ప్రయత్నం అంతా ఈ లింక్ ప్రాజెక్టును కేంద్రం చేపట్టిన గోదావరి-కావేరి లింక్ పథకంలో భాగం చేస్తే 80 శాతం కేంద్ర నిధులతో ప్రాజెక్టును పూర్తిచేసుకోవచ్చు. స్వామికార్యం, స్వకార్యం రెండూ నెరవేరుతాయి. కేంద్రం కూడా ఈ కొత్త రూపంలో వచ్చిన పాత ప్రాజెక్టు పట్ల సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే కొత్త ప్రాజెక్టు ప్రాథమిక నివేదికను కేంద్ర జల సంఘానికి సమర్పించినట్టు తెలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొక్కుబడిగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు జారీచేయవద్దని జల్‌శక్తి మంత్రిత్వ శాఖను కోరింది. ఈ విషయంలోనూ తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండక తప్పదు.
గత ప్రభుత్వం సాగునీటిరంగంలో సాధించిన అభివృద్ధినైనా కాపాడుకోగలిగితే అదే పది వేలు. ఈ రెండేండ్లలో సాగునీటి రంగంలో పురోగతి ఏమీ లేకపోగా వ్యవస్థలన్నీ ఆగమైపోతున్నట్టుగా స్పష్టమవుతున్నది. కృష్ణా జలాల్లో ఆంధ్రా నీటి దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నది. మొక్కుబడి లేఖలు తప్ప అడ్డుకునేవారు లేరు. 2023 నవంబర్ 29న పోలింగ్ రోజున ఆంధ్రా ప్రభుత్వం సాయుధ బలగాలతో డ్యాంను అక్రమంగా ఆక్రమించిన నాగార్జునసాగర్ డ్యాం ఇంకా తెలంగాణ స్వాధీనంలోకి రాలేదు. ప్రశ్నించవలసిన పౌరసమాజం మాత్రం మౌనం వహిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్మిన ఈ మేధావి వర్గం ఇప్పుడు జరుగుతున్న నష్టం పట్ల నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది.
తుమ్మిడిహట్టి బ్యారేజీని కట్టమని అడిగే బదులు ఇంకా కాళేశ్వరం మీదనే దుమ్మెత్తిపోస్తున్నారు. ‘తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు’ అన్న ఆకర్షణీయమైన నినాదం వల్లె వేయడం తప్ప ఆ నినాదాన్ని నిజం చేయడం లేదు. మరోవైపు కేంద్ర పాలకులు తమ పన్నెండేండ్ల పాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ నెహ్రూనే బాధ్యుడిని చేస్తూ ప్రసంగాలు చేస్తున్నట్టే ఇక్కడ రాష్ట్ర పాలకులు కూడా పదేండ్లలో రాష్ర్టాన్ని సాగునీటి రంగంలో దేశంలో అగ్రగామిగా నిలిపినందుకు కేసీఆర్‌పై అధికారం చేపట్టి రెండేండ్లు పూర్తయినా విమర్శలు మానడం లేదు. సాగునీటిరంగం మరింత నిర్వీర్యమై మరో వ్యవసాయ సంక్షోభానికి దారి తీయకముందే తెలంగాణ సమాజం కండ్లు తెరిచి నిశితంగా గమనించవలసి ఉన్నది. గట్టిగా ప్రశ్నించవలసి ఉన్నది.
వార్షిక బడ్జెట్ ప్రసంగంలో తుది దశలో ఉన్న 6 ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో, మరో 12 ప్రాజెక్టులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తిచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అదే ఏడాది (2024-25) ఔట్ కం బడ్జెట్లో 2024-25కు గాను 6,55,895 ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి చేస్తామన్నారు. 2025-26కు గాను 9,42,778 ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి చేస్తామన్నారు. 2025-26 ఔట్‌కం బడ్జెట్లో 2025-26కు అభివృద్ధి చేసే ఆయకట్టును 5,05,000 ఎకరాలకు తగ్గించారు. అంటే మొదటి రెండేండ్లలో 11,60,895 ఎకరాల ఆయకట్టు అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ప్రజలకు వాగ్దానం చేసింది. రెండేండ్లలో ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు, ఒక్క చెరువు గాని, చెక్‌డ్యాం గాని పూర్తిచేసింది లేదు. మరి 11.60 లక్షల ఎకరాలు ఎట్లా సాధ్యమవుతుంది? దీన్నిబట్టి ఈ రెండేండ్లలో ఒక్క ఎకరానికి కొత్తగా నీరివ్వలేదని అర్థమవుతున్నది. కొత్తగా చెక్‌డ్యాంలు నిర్మించకపోగా ఉన్నవాటిని ఇసుక మాఫియా పేల్చివేస్తుంటే నిరోధించలేకపోతున్నది.
– (వ్యాసకర్త: విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజినీర్)
శ్రీధర్‌రావు దేశ్‌పాండే