భాగ్యసీమగా పేరున్న భారతదేశం పరాయి పాలకుల చేతుల్లో మగ్గుతున్న రోజులవి. ఒకవైపు దోపిడీ, మరోవైపు హరించబడుతున్న హక్కులు. జీవనం ఛిద్రమైపోయిన చిత్రంగా దేశం ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో గూడు చెదిరిన పక్షుల్లా బంజారాలు అడవుల్లో కాలం గడుపుతున్నారు. దానితో తమ బతుకులకు కొత్త నిర్వచనాలను రాసుకుంటూ, చెదిరిన తమ వారినందరిని ఏకం చేసుకుంటూ ప్రయాణం సాగించారు. ఈ ప్రయాణంలో వేగుచుక్కలా వెలుతురును పంచిన అసామాన్యుడు సేవాలాల్. బంజారాల్లో సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక చైతన్యాన్ని, దేశభక్తిని నింపి వారిని సరికొత్త మార్గంలో నడిపించారు.
సంత్ సేవాలాల్ 1739, ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా, గుత్తి సమీపంలో ఉన్న రాంజీనాయక్ తండాలో ధర్మణీబాయి-భీమానాయక్ దంపతులకు జన్మించారు. అన్యాయాలు, మూఢ నమ్మకాలను వ్యతిరేకించడం, సత్యం దిశగా ప్రజలను ఆలోచింపజేయడంలో ఆయన కృషిచేశారు. తన చివరిదశలో మహారాష్ట్రలోని పోహ్రాగఢ్లో క్రీ.శ.1806 డిసెంబర్ 9న సజీవ సమాధి అయ్యారు. నాటి నుంచి ఈ ప్రదేశం సంత్ సేవాలాల్ మహారాజ్ ఆధ్యాత్మిక దేవాలయం గా విలసిల్లుతున్నది. సేవాలాల్ మహారాజ్ జన్మించిన స్థలం గోర్ బంజారాల ఆధ్యాత్మిక ప్రదేశంగా మారి సేవాగఢ్గా పిలువబడుతున్నది. ఇక్కడ ఏటా ఫిబ్రవరి 15న జరిగే సేవాలాల్ మహారాజ్ పుట్టినరోజు వేడుకల్లో దేశ నలుమూలల నుంచి ప్రజలు హాజరవుతారు.
సంత్ సేవాలాల్ మహారాజ్ 18వ శతాబ్దంలోనే దేశం కోసం, తన జాతి జనుల కోసం జీవితాన్ని అంకితం చేశారు. బ్రిటిష్ పాలనలో జరుగుతున్న అరాచకాలకు, అన్యాయాలకు బలవుతున్న దేశవాసులకు తిరుగుబాటు ద్వారానే స్వేచ్ఛ లభిస్తుందని తెలియజేశారు. చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెల్లా చెదురైన బంజారాలను ఏకం చేశారు. వారికి పోరాట పటిమను నేర్పి పరాయి పాలకుల గుండె ల్లో రైళ్లు పరిగెత్తించారు. వీరుడిగా, సంఘ సంస్కర్త గా, దార్శనికుడిగా, వైతాళికుడిగా ప్రజల హృదయా ల్లో సజీవంగా నిలిచిపోయారు.
అమూల్యమైన తమ సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తూనే అంధ విశ్వాసాలను వదిలి అందరి సంక్షేమానికి తావునిచ్చే మార్గాన్ని బంజారాలకు చూపించారు సేవాలాల్. ఆయన బోధనలు అందుకు సాక్షాలుగా నిలుస్తున్నాయి. విసిరివేయబడిన తన సమాజాన్ని ఒక్క తాటిపైకి తీసుకొచ్చి వారిలో ఐకమత్యాన్ని పెంపొందించారు. ప్రత్యేకంగా పెద్దల కోసం ‘సీక్వాడి’ అనే సమ్మేళనాన్ని నిర్వహించేవారు. బంజారాలందరినీ ఒక్కతాటి మీదికి తెచ్చి ఐదు సూత్రాలను ప్రతిపాదించారు సేవాలాల్. వాటిని తప్పక పాటించాలని కర్తవ్యనిష్ఠులను చేశారు. బంజారాల హక్కుల పరిరక్షణకు, కార్వాన్ల కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకుగాను ‘ఫేరి’ ఉద్యమాన్ని లేవనెత్తాడు సేవాలాల్. ఇందులో భాగంగా సేవా దళాలను తయారుచేశారు. వీటిలో నాయక్, కార్బారి, డావ్సాణ్ ముఖ్య భూమికలను పోషించాయి. ఈ దళాలు అన్ని బిడారుల్లో తిరిగి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, వారి పాలనా విధానాలకు వ్యతిరేకంగా గోర్ సమాజాన్ని ఏకతాటి మీదకు తీసుకొచ్చాయి.
ఈ దళాల్లో మీటు భూక్యా లాల్యా సాద్, సేవ్య సాద్, లచ్మాసాద్, టేపా మసంద్, లింగా మసంద్, ఫకీరా సాద్. లోకా మసంద్, జంగి, భంగి, ధర్మిసాద్, రామచంద్ సాద్, ధన్రాజ్, ధన్సింగ్ మొదలైన బంజారా యోధులు తమ వీర పరాక్రమాలను చూపించి బ్రిటిష్ వారికి తమ పోరాటం ద్వారా ముచ్చెమటలు పట్టించారు. ఈ దళాలు ‘సేవా ఫేరి ఫర్రోచ్చ’ అన్న నినాదంతో బిడారులన్ని (తండా) సంచరిస్తూ గోవులను దానం చేస్తూ, వారి తండాల మీద వారికే అధికారాలను కలగజేస్తూ, బంజారా ధర్మాన్ని బోధిస్తూ భారతదేశం మొత్తం పర్యటించారు. ఫలితంగా బంజారాలు తమ అస్తిత్వ పతాకాన్ని ఎగురవేయగలిగారు. ‘ఫేరి ఉద్యమం’ ద్వారా భూమి హక్కుల సాధనకు పూనుకున్నారు సేవాలాల్. ఈ ఉద్యమ ఫలితంగా ప్రజలు తండా రాజ్యాన్ని పటిష్టపరుచుకోవడానికి సమాయత్తమయ్యారు.
బంజారా సమాజాన్ని దారితప్పకుండా చూసుకునేందుకు సేవాలాల్ ‘గురువ్యవస్థ’ను ఏర్పాటు చేశాడు. సచ్ఛీలతకు మారురూపమైన గురువుల అధీనంలో తండా సంస్కృతి, స్వయం పోషణ, శిష్టాచారాల రక్షణ జరగాలని బోధించారు. తండా న్యాయాన్ని రక్షించుకునేందుకు నాయక్ వ్యవస్థను పటిష్టపరిచారు. మహాత్మా బసవేశ్వరుడు, వార్కరి సంప్రదాయంలో పరిఢవిల్లిన సంత్ జ్ఞానదేవ్, తుకారం, నామదేవ్, ఏకనాథ్ వంటి సాధువుల సంస్కరణా భావాలను సైతం స్వాగతించి బంజారాల భక్తికి కొత్త జీవకళను అద్దాడు. బంజారాల జీవితాలను తీర్చిదిద్ది వారిని దేశభక్తులుగా, సంస్కృతీ పరిరక్షకులుగా తయారుచేసిన ఘనత సంత్ సేవాలాల్ది. జీవితాంతం బ్రహ్మచర్య దీక్షలో ఉంటూ బంధాలకు అనుబంధాలకు దూరంగా జాతిజనుల సేవకు తన జీవితాన్ని అర్పించిన సేవాలాల్ ధన్యు డు. ఆయన త్యాగానికి యావత్ బంజారా సమాజం రుణపడి ఉంటుంది. సేవాలాల్ తాను పుట్టిన జాతి కి, దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సేవాలాల్ కలలుగన్న తండా రాజ్యాన్ని సీఎం కేసీఆర్ నిజం చేశారు. స్వయంపాలన కోసం బంజారాలు సేవాలాల్ నేతృత్వంలో ‘ఫేరి’ ఉద్యమం చేశారు. సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతో ఆ కల సాకారమైంది. ఈ నిర్ణయంతో ఎందరో గిరిజన బిడ్డలు నాయకులుగా ఎదిగారు. తండా అభివృద్ధికి, సంస్కృతీ పరిరక్షణకు ఒక వేదిక లభించింది.
సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలకుగాను రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నిధులను కేటాయించ డం కేసీఆర్ మహోన్నత ఉదారతకు తార్కాణం. గిరిజన బిడ్డల కోసం ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలను, కళాశాలలను ఏర్పాటుచేసి ఉన్నత విద్యను వారికి చేరువ చేశారు. ఇప్పటివరకు గిరిజనుల కోసం ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదు. అయితే వారికోసం రాష్ట్ర ప్రభుత్వం బంజారాహిల్స్లో ‘సంత్ సేవాలాల్ బంజారాభవన్’ నిర్మించడం గిరిజనంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది.
(వ్యాసకర్త: ప్రొఫెసర్, తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం)
-ఆచార్య సూర్యా ధనంజయ్
98491 04187