కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో రైతు డిక్లరేషన్ పేర వరంగల్‌లో సభ నిర్వహించి వడ్లకు 500 బోనస్, రైతు పండించిన పంట మొత్తం కొంటామంటూ బీరాలు పలికారు. తాలుతీయబోమంటూ డంబాచారాలు పలికారు. తీరా మక్క రైతులకు తీవ్ర వివక్షను చూపుతున్నారు. నిబంధనల పేర రైతుల నడ్డి విధిస్తున్నారు. సహజంగా మక్క ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ప్రభుత్వ మాత్రం 26.5 క్వింటాళ్ల వరకే కొంటామని నిబంధన విధించడం రైతులను మోసం చేయడమే. కొనుగోలు కేంద్రాల వద్ద ఇప్పటికే లక్షల క్వింటాళ్ల మక్కలు ఉన్నాయి. యాసంగి వడ్లు కూడా కల్లాలలోకి చేరింది. మక్క పంటను కొనుగోలు చేయడంలో తీవ్ర ఆలస్యం చేయడంతో నెలల పాటు రైతులు కల్లాల వద్ద వేచి చూస్తూ ప్రాణాలు వదులుతున్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో గాలి వానల బీభత్సాలకు పండిన పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కల్లాల్లో రైతులు అరిగోసలు పడుతుంటే ముఖ్యమంత్రి ఢిల్లీకి పర్యటనలు, ఎన్నికల ప్రచారాలకు వెళ్తూ రైతులను గాలికి వదిలేశారు. ఇది కాంగ్రెస్ పరిపాలన వైఫల్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
ఎన్నికలకు ముందు కేసీఆర్ పలు ప్రచార వేదికలపై ఒక మాట చెప్పారు ‘మోసపోతే గోసపడతాం, కూర్పు చెడిపోతే మళ్లీ పాత తెలంగాణ లాగే పరిస్థితులు దాపురిస్తాయి. కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దు.. మన తెలంగాణను ఆగం చేసుకోవద్దు’ అని ఒకటికి పది సార్లు ప్రజలకు చెప్పారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మి ప్రజలు వారికి పట్టం కడితే దాని ఫలితాన్ని కాంగ్రెస్ చూపిస్తున్నది. నేడు కల్లాల వద్ద రైతన్నలు కన్నీళ్లు పెట్టుకుంటూ ‘కేసీఆర్ పాలన ఉంటే మాకు ఈ పరిస్థితి దాపరించేది కాదు’ అని నిత్యం తలుచుకుంటున్నారు.
కేసీఆర్ నాయకత్వంలో రైతుల ధాన్యాన్ని చివరిగింజ వరకు ప్రభుత్వం షరతులు లేకుండా కొనుగోలు చేసింది. గ్రామాల్లోనే ఐకేపీ సెంటర్లు పెట్టి ఆలస్యం చేయకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసింది. రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బులను జమ చేసింది. ధాన్యానికి సరిపడా గోదాములను ఏర్పాటు చేసి, అధికారులను సమన్వయ పరుస్తూ నిత్యం సమీక్షా సమావేశాలు పెడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశారు కేసీఆర్. సకాలంలో రైతుబంధు, సమయానికి ఎరువులు, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు, ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందించి పండిన పంటను కొనుగోలు చేశారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొన్న చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిది.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోసలు పెడుతున్నది. నేడు రైతులు పడుతున్న ఇబ్బందులే ఇందుకు నిదర్శనం.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రైతుల కన్నా తన స్వప్రయోజనాలే ముఖ్యంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు కనీసం సమీక్షలు పెట్టిన పాపాన పోలేదు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పాలన సాగుతున్నది. భూములను కొల్లగొట్టడం, ఢిల్లీకి ముడుపులు పంపడం, నోరు తెరిస్తే బూతులు… ఇదీ పాలక పెద్దల తీరు. ఒక ప్రణాళిక లేని పరిపాలన, అవగాహన రాహిత్యం, అనుభవ లేమి వెరసి రైతన్న పాలిట శాపంగా మారాయి. ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బందులు పెడుతుంది.
మార్పు పేరుతో ఏమార్చి, రైతుల ప్రాణాలు తీస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పరిస్థితులను రైతన్న గమనించాలి, కేసీఆర్ నాయకత్వంలో రైతులు పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి. రైతు గోస పట్టని రాజ్యాన్ని అంతమొందించేందుకు రైతు కంకణం కట్టుకుని కదం తొక్కాలి. కేసీఆర్ నాయకత్వమే రైతులకు శ్రీరామరక్ష. రైతు రాజ్య స్థాపనకై అందరం నడుం బిగిద్దాం.
-తెలంగాణ విజయ్
9491998702